వాషింగ్టన్: ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై నెలకొన్న విభేదాలను భారత్, కెనడా ప్రభుత్వం పరస్పరం చర్చించుకుంటే పరిష్కరించుకోవచ్చునని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. నిజ్జర్ హత్య కంటే ఉగ్రవాదాన్ని కెనడా ప్రభుత్వం ప్రోత్సహించడం అత్యంత తీవ్రమైన అంశంగా చూడాలని అన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాదానికి, హింసాత్మక కార్యక్రమాలకు ట్రూడో ప్రభుత్వం అనుమతులిస్తోందని వెంటనే వాటిని నివారించాల్సిన అవసరం ఉందన్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న జై శంకర్ వాషింగ్టన్‌లో శుక్రవారం భారతీయ జర్నలిస్టులతో మాట్లాడారు. నిజ్జర్ హత్య వెనుక భారతీయ ఏజెంట్లు ఉన్నారంటూ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల్ని భారత్ గట్టిగా తిప్పి కొట్టిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కచ్చితమైన ఆధారాలుంటే చూపించాలన్నారు. వాటిని పరిశీలించడానికి భారత్ సిద్ధంగా ఉందని జైశంకర్ చెప్పారు.
‘‘కెనడా ప్రభుత్వం నుంచి భారత్ చాలా కాలంగా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటోంది. ఉగ్రవాదం, హింసాత్మక కార్యకలాపాలపై వారి ఉదాసీన వైఖరే ఇందుకు కారణం. భారత్‌లో నేరాలు చేసిన ఎందరో కెనడాలో తలదాచుకుంటున్నారు. వారిని అప్పగించాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా కెనడా ప్రభుత్వం స్పందించడం లేదు. నిజ్జర్ హత్యపై ఆధారాలు ఇవ్వకుండా అభాండాలు వేస్తోంది. మేము నాలుగ్గోడల మధ్య లేము. ఏదైనా పరిశీలిస్తాం’’ అని జై శంకర్ మండిపడ్డారు. నిజ్జర్ హత్య కంటే కెనడా ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే అతి పెద్ద సమస్యని దానినే మొట్టమొదట పరిష్కరించుకోవాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment