భారత్‌ కెనడా వివాదం.. జైశంకర్‌ మరోసారి ఘాటు వ్యాఖ్యలు | No Need To Learn Freedom Of Speech From Others Says Jaishankar Amid India-canada Row - Sakshi
Sakshi News home page

India-Canada Row: భారత్‌ కెనడా వివాదం.. కేంద్రమంత్రి జైశంకర్‌ మరోసారి ఘాటు వ్యాఖ్యలు

Published Sat, Sep 30 2023 11:46 AM | Last Updated on Sat, Sep 30 2023 12:35 PM

No Need To Learn Freedom of speech from others Says Jaishankar - Sakshi

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్య విషయంలో భారత్‌ కెనడాల మధ్య రగులుతున్న దౌత్య వివాదం నేపథ్యంలో కేంద్ర విదేశాంగశాఖమంత్రి జైశంకర్‌ ఘాటుగా స్పందించారు. కెనడాలో హింస, తీవ్రవాదం గణనీయంగా పెరిగిపోయిందని మండిపడ్డారు. కెనడా తీవ్రవాద శక్తులు, వేర్పాటువాదులకు  ఆశ్రయం ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాలను సాధారణమైనవిగా చూడరాదని అన్నారు.

ఈ సందర్భంగా భారత్‌-కెనడా వివాదంపై జై శంకర్‌ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భావప్రకటనా స్వేచ్ఛ గురించి ఇతరుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం భారత్‌కు లేదని తెలిపారు. ‘మాది ప్రజాస్వామ్య దేశం, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటో మేము ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాక్ స్వాతంత్ర్యం హింసకు దారితీయకూడదని మేము చెబుతున్నాం. అది స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమే అవుతుంది. రక్షించడం కాదు అని జైశంకర్‌ పేర్కొన్నారు. 

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నెలకొన్న తరుణంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.  కెనాడా ఆరోపణలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దీనిని రెండు దేశాలు కలిసి పరిష్కరించుకోవాల్సిన అసవరం ఉందన్నారు.

ఆరోపణలకు సంబంధించి ఏదైనా సమాచారం మాతో పంచుకునేందుకు కెనడా సిద్ధంగా ఉంటే, మేము కూడా దానిని పరిగణలోకి తీసుకుని పరిష్కరించుకునేందుకు సిద్ధంగానే ఉన్నామన్నారు. అయితే భారత్‌కు వ్యతిరేకంగా హింస, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో భాగమైన కొందరు వ్యక్తులు, సంస్థలు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారని,  ఈ విషయంలో తమ అభర్ధనలకు కెనడా స్పందించలేదని అన్నారు. 
చదవండి: Trump Vs Biden: ఏడాది ముందే అగ్రరాజ్యంలో ఎన్నికల అగ్గి..

తన విధానాల ప్రకారం భారత్ ఇలాంటి చర్యలకు పాల్పడదని జైశంకర్ పేర్కొన్నారు. ట్రూడో చేసిన ఆరోపణలకు సంబంధించి తమకు ఇంతవరకు కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదన్న ఆయన.. ఒకవేళ నిజ్జర్ హత్యకు సంబంధించి తగిన సమాచారాన్ని అందిస్తే, భారత్ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కెనడాలో పరిస్థితుల కారణంగా భారత దౌత్యవేత్తలు ఎంబసీకి వెళ్లేందుకు కూడా వెనకాడుతున్నారని మంత్రి తెలిపారు. వారు బహిరంగంగా బెదిరింపులకు గురవుతుండటంతో కెనడా పౌరులకు భారత వీసాలు నిలిపివేయాల్సి వచ్చిందని వెల్లడించారు.

శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై దాడి, కెనడాలోని ఖలిస్తానీ బెదిరింపు పోస్టర్లపై ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘ మీరు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. ఒకవేళ మీ రాయబార కార్యలయాలు, మీ దౌత్యవేత్తలు, మీ దేశ ప్రజలకు బెదిరింపులు ఎదురైతే  మీరు ఎలా స్పందిస్తారని అడిగారు.  మేము మీ దేశంపై విమర్శలు చేసాం, మీ కాన్సులేట్‌లపై దాడులకు పాల్పడ్డం. పోస్టర్లు పెట్టాం. దీనిని మీరు సాధారణమైనవిగా భావిస్తారా? ఇదే వేరే దేశానికి జరిగితే మీరు ఎలా స్పందిస్తారు. కెనడాలో జరుగుతున్నది జనరల్‌గా చూడవద్దు. అక్కడ ఏం జరగుతుందో బయట ప్రపంచానికి తెలియడం చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు. 

‘ఉగ్రవాదం, తీవ్రవాదం, హింస మొదలైన విషయాల్లో కొన్నేళ్లుగా మాకు కెనడా, కెనడా ప్రభుత్వంతో సమస్యలు ఉన్నాయి. భారత్, కెనడాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్‌లతో చర్చించాం’ అని తెలిపారు. కాగా అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్‌, ఆదేశ విదేశాంగమంత్రి  ఆంటోనీ బ్లింకెన్‌తోనూ భేటీ అయ్యారు. భారత్‌- అమెరికా మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో విదేశాంగ ఇదరుదేశాల విదేశాంగ మంత్రులు విస్తృతంగా చర్చించారు.
చదవండి: సన్నిహిత సంబంధాలకే మొగ్గు: ట్రూడో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement