
భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఖలీస్థానీ సానుభూతిపరుడు హర్దిప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత్, కెనడా మధ్య చిచ్చు రాజేసిన విషయం తెలిసిందే. నిజ్జార్ హత్య వెనక భారత్ ప్రమేయం ఉండొచ్చుంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది.
కెనడా రక్షణశాఖ మంత్రి బిల్ బ్లెయిర్
తాజాగా కెనడా రక్షణశాఖ మంత్రి బిల్ బ్లెయిర్ మాట్లాడుతూ.. భారత్‌తో సంబంధాలు తమకు ముఖ్యమైనవని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కెనడా కోరుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో బ్లెయిర్ మాట్లాడుతూ.. నిజ్జార్ హత్య ఆరోపణల వ్యవహారం భారత్‌తో తమ బంధానికి సంబంధించి సవాలుతో కూడుకున్న సమస్యగా మారుతోందన్నారు.
అదే సమయంలో చట్టాన్ని, తమ పౌరులను రక్షించడం ముఖ్యమని అన్నారు. అందుకు ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజనిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఆరోపణలే నిజమని తేలితే.. కెనడా గడ్డపై, కెనడియన్ పౌరుడి హత్య విషయంలో తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినందుకు తీవ్ర ఆందోళన నెలకొంటుందని అన్నారు.
చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన
కెనడాకు ఉప్పందించింది అమెరికానే
నిజ్జర్ హత్య అనంతరం ఆ నిఘా సమాచారాన్ని అగ్రరాజ్యం అమెరికానే ఆ దేశానికి అందజేసిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. సదరు సమాచారాన్ని ఆధారంగా చేసుకునే కెనడా భారత్‌పై నేరుగా ఆరోపణలకు దిగినట్లు తెలుస్తోందని ఆ కథనం పేర్కొంది. తమ దేశంలోని భారత దౌత్యాధికారుల సంభాషణలను దొంగచాటుగా వినడం ద్వారా కెనడా నిఘా విభాగాలు ఇదే విషయాన్ని ధ్రువీకరించుకున్నట్లు కూడా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment