
వాషింగ్టన్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇక, ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న ముష్కరులకు అండగా ఉన్న పాకిస్థాన్‌ను భారత్ గట్టిగా హెచ్చరించింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ తరుణంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌పై పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ తాజాగా స్పందించారు. ఈ క్రమంలో మైఖేల్ రూబిన్.. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ఆల్‌ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు పెద్ద తేడా లేదని వ్యాఖ్యానించారు. బిన్ లాడెన్ అప్పుడు కలుగులో దాక్కుంటే ఇప్పుడు మునీర్ ప్యాలెస్‌లో జీవిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. పహల్గాం ఘటన నేపథ్యంలో అమెరికా పాక్‌ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా, మునీర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలని సూచించారు.
ఇదే సమయంలో.. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారతదేశానికి వెళ్ళినప్పుడు ఉగ్ర దాడి జరిగినట్లే, ఇప్పుడు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటన సందర్భంగా పాకిస్తాన్ దాడి చేసినట్టు కనిపిస్తోంది అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఇదిలా ఉండగా.. ఇప్పటి పహల్గాం ఉగ్ర దాడికి.. 2000 సంవత్సరంలో జరిగిన ఛత్తీసింగ్‌పొర నరమేధానికి పోలికలు కనిపిస్తున్నాయి. దేశంలో విదేశీ అగ్ర నేతల పర్యటనలు సాగుతున్న వేళే ఇవి చోటుచేసుకున్నాయి. దీనికి తోడు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం తర్వాతే దాడి జరగడం గమనార్హం. అసీం మునీర్‌కు.. భారత్‌పై తీవ్రమైన ద్వేషంతో ఉంటాడన్న పేరుంది. ఆయన ప్రకటనలూ ఉగ్ర దాడికి పురిగొల్పేలానే ఉంటాయి. దీనికి తోడు జమ్ము కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి విదేశీ అతిథుల పర్యటనను ఉగ్రవాదులు వాడుకుంటున్నారనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండటం.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో పహల్గాం దాడి చోటుచేసుకోవడం గమనార్హం.
పుల్వామా దాడి వేళ మునీరే..
2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ వాహనంపై దాడి జరిగినప్పుడు మునీర్ పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ అధిపతిగా ఉన్నారు. ఆ దాడి ఆయన కనుసన్నల్లోనే జరిగిందని చెబుతారు. ఇప్పుడు ఆయనే ఆర్మీ చీఫ్ కావడంతో భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకను ఉసిగొల్పుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇక, ప్రస్తుత పహల్గాం ఘటనకు సంబంధించిన కూడా ఆయనకు సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల అసీం మునీర్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగమే ఈ దాడికి పురిగొల్పిందనే వాదనలను బలపరిచే ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. ‘మన ఉద్దేశం స్పష్టం. కశ్మీర్ గతంలోనూ మన జీవనాడిలా ఉండేది. భవిష్యత్తులోనూ ఉంటుంది. దానిని మనం ఎప్పటికీ మరిచిపోలేం. మన కశ్మీరీ సోదరుల పోరాటంలో.. వారిని ఒంటరిగా వదిలేయం. మీరు మీ పిల్లలకు పాకిస్థాన్ కథ చెప్పండి. మన జీవితంలోని ప్రతి అంశంలోనూ హిందువుల కంటే భిన్నమని భావించిన మన పూర్వీకుల ఆలోచనలను అప్పుడే వారు గుర్తుంచుకుంటారు. మన మతాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు భిన్నమైనవి. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది. మనవి రెండు దేశాలు’ అని మునీర్ వ్యాఖ్యానించారు.