
హోం మంత్రి అమిత్ షా
పహల్గాం ఘటనాస్థలిని పరిశీలించిన మంత్రి
శ్రీనగర్/న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి భారత్ ఏనాడూ తలవంచదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అమాయక పర్యాటకులపై ఉగ్రపంజా విసిరిన వారిని వదిలిపెట్టేదిలేదని ఆయన స్పష్టంచేశారు. బుధవారం ఆయన బైసారన్ ఉగ్రదాడి మృతులకు శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద నివాళులర్పించారు. 26 మంది బాధితుల మృతదేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. అక్కడే ఉన్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు. దారుణదాడికి తెగబడిన వారిని చట్టం ముందు నిలబెడతామని వారికి హామీ ఇచ్చారు.
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం మృతులకు నివాళులర్పించారు. తర్వాత అమిత్‌షా అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య బోధనాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిసి పరామర్శించారు. తర్వాత అమిత్‌షా ఘటనాస్థలికి చేరుకుని అక్కడి పరిసరాలను పరిశీలించారు. దాడి జరిగిన తీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత కొద్దిసేపు హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూలో పాల్గొన్నారు. ‘‘పహల్గాంఉగ్రదాడి బాధితులకు భారమైన హృదయంతో తుది వీడ్కోలు పలికా. ఉగ్రవాదానికి భారత్ తలవంచదని పునరుద్ఘాటిస్తున్నా.
ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టబోమని బాధిత కుటుంబాలకు, యావత్ భారతావనికి మాట ఇస్తున్నా’’ అని తర్వాత తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో అమిత్‌షా ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘తమ వాళ్లను కోల్పోయిన బాధిత కుటుంబాల బాధను యావత్ భారతదేశం అనుభవిస్తోంది. ఇంతటి విషాదాన్ని మాటల్లో వర్ణించలేం’’ అని ఆయన మరో పోస్ట్ పెట్టారు. దాడి జరిగిన కొన్ని గంటల్లోపే అమిత్ షా కశ్మీర్‌కు చేరుకోగా జమ్మూకశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నళిని ప్రభాత్, ఆర్మీ 15 కోర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రశాంత్ శ్రీవాస్తవ తాజా పరిస్థితిని ఆయనకు వివరించారు. వెంటనే ఆయన లెఫ్టినెంట్ గవర్నర్‌తో కలిసి భద్రతా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
మృతుల కుటుంబాలకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు తలో రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1లక్ష పరిహారం ఇస్తున్నట్లు తెలిపింది. స్థానిక పోలీసులకు దర్యాప్తులో సాయపడేందుకు ఐజీ నేతృత్వంలోని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బృందం ఢిల్లీ నుంచి కశ్మీర్‌కు బయల్దేరింది. దారుణదాడిని మూకుమ్మడిగా ఖండిస్తూ సంతాప సూచికగా కశ్మీర్ లోయ అంతటా బంద్ పాటించారు. ఇలా కశ్మీర్ అంతటా బంద్ పాటించడం గత 35 ఏళ్లలో ఇదే తొలిసారి.
అధికార నేషనల్ కాన్ఫరెన్స్‌సçహా పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీలు ఈ బంద్‌కు పిలుపు నిచ్చాయి. కశ్మీర్‌లో ప్రచురితమయ్యే ప్రధాన దినపత్రికలన్నీ తమ ఫ్రంట్‌పేజీలను నల్లరంగులో ముద్రించాయి. అమానవీయ చర్యను వ్యా పార సంఘాలు, నేతలు, మీడియా సహా పౌర సమాజం మొత్తం ఖండిస్తోందంటూ పదునైన హెడ్డింగ్‌లతో పతాక శీర్షికలను ఎరుపు రంగులో ప్రింట్ చేశాయి. పలు చోట్ల శాంతియుత ర్యాలీలు జరిగాయి. దాడి నేపథ్యంలో కశ్మీర్ సందర్శనను పర్యాటకులు హఠాత్తుగా రద్దుచేసుకుని వెనుదిరిగే పక్షంలో శ్రీనగర్ రూట్‌లో విమానచార్జీలను ఒక్కసారిగా పెంచకూడదని విమానసంస్థలను పౌరవిమాన యాన శాఖ హెచ్చరించింది.