
వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్ వారసున్ని శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయం ప్రకారం ఎన్నుకుంటారు. అందుకు పెద్ద ప్రక్రియే ఉంటుంది. అది వాటికన్‌లోని సిస్టిన్ చాపెల్‌లో ఆద్యంతం అత్యంత గోప్యత నడుమ జరుగుతుంది. తుది ఫలితాన్నే తప్ప ప్రక్రియను ఎప్పటికీ బయటికి వెల్లడించరు. ఎంపిక ప్రక్రియ సందర్భంగా ఏం జరిగిందో బయటి ప్రపంచానికి చెప్పడం పూర్తిగా నిషిద్ధం. దీన్ని ఉల్లంఘించిన కార్డినల్స్‌ను తక్షణం వెలి వేసేలా నిబంధనలను పోప్ బెనెడిక్ట్–16 కఠినతరం చేశారు. 1996లో పోప్ జాన్‌పాల్–2 తిరగరాసిన పోప్ ఎన్నిక తాలూకు నియమ నిబంధనలను బెనెడిక్ట్ రెండుసార్లు సవరించారు.
→ పోప్ ఫ్రాన్సిస్ వారసున్ని ఎన్నుకునేదాకా రోజువారీ వ్యవహారాలను వాటికన్ కార్డినల్ కెవిన్ ఫారెల్ చాంబర్లెయిన్ హోదాలో లాంఛనంగా నిర్వర్తిస్తారు. ఈ దశలో కీలక నిర్ణయాలేవీ తీసుకోరు.
→ పోప్ మృతిని చాంబర్లెయిన్ అధికారికంగా ధ్రువీకరించాక పోప్ నివాసానికి సీల్ వేస్తారు.
→ పోప్ అస్తమయంతో ఒకరిద్దరు మినహా దాదాపుగా వాటికన్ అధికారులంతా మాజీలవుతారు.
→ ‘ఫిషర్‌మన్స్ రింగ్’గా పిలిచే పోప్ అధికారిక ముద్రను చాంబర్లెయిన్ ప్రత్యేక సుత్తెతో విరగ్గొడతారు. తద్వారా ప్రస్తుత పోప్ పాలనకు తెరపడిందని లాంఛనంగా ప్రకటిస్తారు.
→ త్వారత కార్డినల్స్ కాలేజీ సమావేశమై పోప్ అంత్యక్రియల ఏర్పాట్లను ఖరారు చేస్తుంది.
→ ఫ్రాన్సిస్ కోరిక మేరకు అంత్యక్రియలు ఆయనకెంతో ఇష్టమైన సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో సాదాసీదాగా జరుగుతాయి. సాధారణంగా పోప్ అంత్యక్రియలకు సైప్రస్, జింక్, ఇల్మ్‌తో కూడిన మూడు శవపేటికలను ఉపయోగిస్తారు. ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు మాత్రం ఆయన కోరిక మేరకు జింక్‌తో కూడిన ఒకే పేటికను వాడనున్నారు.
→ తర్వాత వాటికన్‌లో 9 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తారు. ఈ సమయంలో కార్డినల్స్ అంతా రోమ్‌కు విచ్చేస్తారు.
ప్రక్రియ ఇదీ..
→ పోప్ మరణించిన 15 నుంచి 20 రోజులకు ఆయన వారసుని ఎన్నిక ప్రక్రియ లాంఛనంగా మొదలవుతుంది.
→ కార్డినల్స్ అంతా సిస్టిన్ చాపెల్‌లో సమావేశమై పోప్‌ను ఎన్నుకుంటారు. 80 ఏళ్లలోపు వయసువారు మాత్రమే అందుకు అర్హులు. ప్రస్తుతం ఆలోపు వయసున్న కార్డినల్స్ 135 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం ఎలక్టర్ల సంఖ్య 120కు మించరాదు.
→ పోప్ ఎన్నిక దీర్ఘచతురస్రాకృతిలో ఉండే కాగితపు బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. దానిపై భాగంలో ‘సుప్రీం పాంటిఫ్‌గా నేను ఎన్నుకుంటున్నది’ అని రాసుంటుంది. పేరు రాసేందుకు వీలుగా పక్కన ఖాళీ వదులుతారు.
→ ఒక్కో కార్డినల్ దానిపై తనకిష్టమైన వారి పేరు రాసి సగానికి మడిచి ట్రేలో వేస్తారు. దాన్ని సరిగ్గా నింపిందీ లేనిదీ స్రు్కటినీర్స్‌గా పిలిచే ముగ్గురు కార్డినల్స్ సరిచూస్తారు.
→ తర్వాత ఒక్కో బ్యాలెట్ తెరిచి అందులో రాసిన పేరు బయటికి చదువుతూ లెక్కిస్తారు. ప్రతి రౌండ్ అనంతరం ఫలితాలను ప్రకటిస్తూ పోతారు.
→ కనీసం మూడింట రెండొంతుల ఓట్లు వచ్చిన వారే తదుపరి పోప్ అవుతారు. అందుకోసం ఇనిíÙయల్ మాస్‌గా పిలిచే లాంఛన కార్యక్రమం అనంతరం ఫస్ట్ బ్యాలెట్ నిర్వహిస్తారు. పోప్‌ను ఎన్నుకోలేకపోతే బ్యాలెట్లను సూది ద్వారా దారానికి గుచ్చి ట్రేలో వేస్తారు. తర్వాత వాటిని స్తూపాకారపు స్టౌలో కాల్చేస్తారు. దాని తాలూకు పొగ నల్ల రంగులో సిస్టిన్ చాపెల్ చిమ్నీ గుండా అందరికీ కన్పించేలా బయటికొస్తుంది. ఇంకా పోప్‌ను ఎన్నుకోలేదని దాని అర్థం. అలా పోప్‌ను ఎన్నుకునే దాకా ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అది పూర్తవగానే తెల్ల పొగ వెలువడుతుంది. చర్చి గంటలు మోగుతాయి.
→ అనంతరం కార్డినల్స్ ‘మనం పోప్‌ను ఎన్నుకున్నాం’ అని ప్రకటిస్తారు. నూతన పోప్ ఎంచుకున్న పేరును చదివి విన్పిస్తారు.
→ చివరికి కొత్త పోప్ సెయింట్ పీటర్స్ స్క్వేర్ నుంచి అందరికీ దర్శనమిచ్చి తన తొలి ఆశీర్వాదమిస్తారు.
→ పోప్ ఎన్నిక ప్రక్రియ పొడవునా కార్డినల్స్‌తో పాటు అందులో పాలుపంచుకునే వారికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలూ ఉండవు. వారు మొబైల్స్‌తో సహా ఎలాంటి ఆడియో, వీడియో పరికరాలూ వెంట ఉంచుకునేందుకు వీల్లేదు.
రేసులో వీరే
బాప్టిజం తీసుకున్న క్యాథిలిక్ పురుషుడెవరైనా పోప్ కావచ్చు. అయితే 1378 నుంచి కేవలం కార్డినల్స్ మాత్రమే పోప్‌గా ఎన్నికవుతూ వస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ వారసునిగా విన్పిస్తున్న కొన్ని పేర్లు...
→ ఇటలీకి చెందిన కార్డినల్ పియెట్రో పారోలిన్ (70). వాటికన్‌లో సీనియర్ దౌత్యాధికారి. ప్రస్తుత విదేశాంగ మంత్రి.
→ కెనడాకు చెందిన కార్డినల్ మార్క్ ఔలెట్ (80). 2010 నుంచి 2023 దాకా వాటికన్ బిషప్స్ హెడ్‌గా ఉన్నారు.
→ ఆ్రస్టియాకు చెందిన కార్డినల్ క్రిస్టోఫ్ షోన్‌బర్న్ (80). పోప్ బెనెడిక్ట్–16 దగ్గర శిష్యరికం చేశారు. సంప్రదాయవాదిగా పేరు.
→ ఫిలిప్పీన్స్‌కు చెందిన కార్డినల్ లూయిస్ టగ్లే (67. వాటికన్ మిషనరీ ఆఫీస్ సారథిగా ఫ్రాన్సిసే ఎంపిక చేశారు.
→ ఇటలీకి చెందిన కార్డినల్ మట్టెయో జుప్పీ (69). ఫ్రాన్సిస్‌కు బాగా ఇషు్టడు.
కార్డినల్స్‌లో నలుగురు భారతీయులు
పోప్‌ను ఎన్నుకునే 35 మందితో కూడిన కార్డినల్స్ కాలేజీలో నలుగురు భారతీయులున్నారు. వారు ఫిలిప్ నెరీ ఫెరారో, బాసెలియొస్ క్లీమిస్, ఆంథోనీ పూల, జార్జ్ జాకోబ్ కూవకాడ్.