Selection process
-
తెలుసుకున్నాకే ఫోన్ కొంటున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ ఇప్పుడు అత్యవసర వస్తువుల జాబితాలోకి వచ్చి చేరింది. పొద్దున లేవగానే, అలాగే పడుకునేప్పుడు ఫోన్ ముట్టుకోకుండా ఆ రోజు పూర్తి కాదంటే అతిశయోక్తి కాదేమో. మరి అంతటి ప్రత్యేకత కలిగిన ఫోన్ కొనుగోలు విషయంలో బడెŠజ్ట్ ఒక్కటే కాదు కోరుకునే ఫీచర్లనుబట్టి మోడల్ ఎంపిక జరుగుతోందట. స్తోమత లేనివారు, ఫోన్ వాడకం పెద్దగా అవసరం లేనివారు బేసిక్ ఫోన్లను వాడుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో 60 కోట్ల మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. బేసిక్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్ల వైపు వినియోగదార్లు మళ్లుతుండడం, 5జీ విస్తరణ కారణంగా 2023లో ఈ సంఖ్య 100 కోట్లను దాటుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ రంగంలో ధరల శ్రేణి, కోరుకుంటున్న ఫీచర్లు, వినియోగదార్ల అభిరుచులు వేటికవే ప్రత్యేకం. విలువ ఉండాల్సిందే.. ధర ప్రాధాన్యం కాదు.. డబ్బుకు తగ్గ విలువ ఉండాల్సిందేనన్నది భారతీయుల ఆలోచన. రూ.15 వేలల్లో ఫోన్ కొనాలని భావించిన కస్టమర్ ముందు ఎక్కువ ఫీచర్లున్న ఫోన్ రూ.18 వేలకు లభిస్తే ఖరీదుకు వెనుకాడడం లేదు. ఇక రూ.7 వేల లోపు, అలాగే రూ.30 వేలకుపైగా ఖరీదు చేసే ఫోన్ల ను 2–5 ఏళ్లు వాడుతున్నారట. అదే రూ.15–30 వేల సెగ్మెంట్లో ఆరు నెలలకే మార్చేస్తున్నారు. కారణం యువ కస్టమర్లు కావడం. ఆన్లైన్లో కొనుగోలు చేసే వినియోగదారులకే మొబైల్స్ పట్ల అవగాహన ఎక్కువ. రూ.15 వేల లోపు లభించే ఫోన్లే అధికంగా ఆఫ్‌లైన్‌లో అమ్ముడవుతున్నాయి. రూ.15–30 వేల ధరల శ్రేణి మోడళ్ల అమ్మకాల్లో ఆన్లైన్ వాటా ఎక్కువ. ప్రపంచంలోనే ముందంజ.. స్మార్ట్ఫోన్ల పట్ల అవగాహన ఉన్న కస్టమర్లు భారత్‌లోనే అత్యధికం. కొనుగోలు కంటే ముందే ఆన్లైన్లో మోడళ్ల ఫీచర్లు, రివ్యూలను చూస్తున్నారట. ఈ విధంగా ముందే అవగాహనకు వచ్చి ఫోన్లను చేజిక్కించుకోవడంలో ప్రపంచంలో భారత్ ముందంజలో ఉందని రియల్మీ గ్లోబల్ ప్రొడక్ట్ మేనేజర్ శ్రీ హరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘మొబైల్ కొనుగోలు నిర్ణయంలో యువత కీలకపాత్ర పోషిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు స్మార్ట్‌ఫోన్ కొనే ముందు వీరిని సంప్రదిస్తున్నారు. మార్కెట్లోకి వస్తున్న మోడళ్లు, ఫీచర్లు, రేటింగ్స్ వంటి విషయాలపై యువతకు ముందే అవగాహన ఉంటోంది’ అని వివరించారు. ధర పరంగా చూస్తే.. ► రూ.7,000 లోపు: ఈ విభాగంలో వినియోగదార్లకు కావాల్సింది ఏదైనా స్మార్ట్‌ఫోన్. వీరికి ఫీచర్లతో పనిలేదు. అత్యధికంగా ఫీచర్ ఫోన్ నుంచి ఇటువైపు మళ్లినవారే. ఇంకో విషయం ఏమంటే వినోదం కోసం పూర్తిగా వీళ్లు ఆధారపడేది ఈ స్మార్ట్ఫోన్పైనే. ► రూ.7–15 వేలు: స్మార్ట్‌ఫోన్ రంగంలో ఈ విభాగం వాటా ఏకంగా 50 శాతం ఉంది. అధిక బ్యాటరీ, 6.5 అంగుళాలు, ఆపైన సైజున్న డిస్ప్లే, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ కోరుకుంటున్నారు. ► రూ.15–30 వేలు: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఈ విభాగంలో పట్టణ కస్టమర్లు ఎక్కువ. ముఖ్యంగా యూత్ అధికంగా కొనుగోలు చేసే ధరల శ్రేణి ఇది. మంచి డిజైన్, రెండు లేదా ఎక్కువ కెమెరాలు, అధిక రిజొ ల్యూషన్, ఫుల్ హెచ్డీ, అమోలెడ్ డిస్ప్లే, కర్వ్, 5జీ, ఫాస్ట్ చార్జింగ్, తక్కువ మందం ఉండాల్సిందే. ► రూ.30 వేలు ఆపైన: ఇక్కడ ఫీచర్లు ప్రాధాన్యం కాదు. పెద్ద బ్రాండ్ అయి ఉండాలి. ఈ విభాగంలో కంపెనీలు ఎలాగూ ఒకదాన్ని మించి ఒకటి ఫీచర్లను జోడిస్తాయి అన్నది కస్టమర్ల మనోగతం. -
టెన్త్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఐదంకెల జీతం
శారీరకంగా ధృడంగా ఉండి.. దేశ సేవ చేయాలనే తపన కలిగిన యువతకు కేంద్ర పారామిలిటరీ దళాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఆయా భద్రతా దళాల్లో ఖాళీగా ఉన్న 25వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి పూర్తిచేసి కేంద్ర సాయుధ బలగాల్లో కొలువు సాధించాలని కలల కనే యువతకు చక్కటి అవకాశం.. ఎస్ఎస్సీ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఈ నేపథ్యంలో.. కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు అర్హతలు.. ఎంపిక విధానం.. సిలబస్.. ప్రిపరేషన్ టిప్స్... ► పోస్టు పేరు: కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) ► మొత్తం ఖాళీల సంఖ్య: 25,271 ► విభాగాల వారీగా పోస్టుల సంఖ్య: బీఎస్ఎఫ్–7545, సీఐఎస్ఎఫ్–8464, ఎస్ఎస్బీ–3806, ఐటీబీపీ–1431,ఏఆర్–3785,ఎస్ఎస్ఎఫ్–240 సీఏపీఎఫ్ ఆర్మీ, నేవీ ఎయిర్‌ఫోర్స్ మాదిరిగానే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్)లో ప్రతి ఏటా నియామకాలు జరుగుతున్నాయి. ఇందులో పలు విభాగాలున్నాయి. అవి.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్(సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎప్‌ఎస్‌ఎఫ్), అస్సాం రైఫిల్స్(ఏఆర్). వీటిల్లో ఉమ్మడి పరీక్ష ద్వారా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఆయా ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. అర్హతలు ► ఎస్ఎస్సీ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 2021, ఆగస్టు 1 నాటికి పదోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. మహిళలు కూడా దరఖాస్తుకు అర్హులే. ► వయసు: 2021, ఆగస్టు 1 నాటికి 18–23ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు్ల, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం ఎంపికైతే పే లెవెల్–3 ప్రకారం–రూ.21700–రూ.69100 వేతన శ్రేణి లభిస్తుంది. ఎంపిక విధానం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్(సీబీఈ),సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్) నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ ► తొలిదశలో సీబీఈ(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలకు–100 మార్కులకు ఈ టెస్ట్ ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. ► ఈ పరీక్షలోనాలుగు విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంగ్లిష్/హిందీల నుంచి 25ప్రశ్నలు–25 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ► జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో.. వెర్బల్, నాన్ వెర్బల్, అనలిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పజిల్స్, డిస్టన్స్ అండ్ డైరెక్షన్, నంబర్ సిరీస్ కంప్లిషన్, అనాలజీ, కౌంటింగ్ ఫిగర్,డైస్, సిలోజిజం తదితర అంశాలుంటాయి. ఇందులో మంచి మార్కులు సాధించేందుకు లాజికల్ థింకింగ్ ఉపయోగపడుతుంది. ► జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ విభాగంలో.. హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, పుస్తకాలు, రచయితలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగంలో అభ్యర్థికి సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు. కాబట్టి వర్తమాన అంశాలపై పట్టుకోసం నిత్యం దినపత్రికలు చదివి నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. ► ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లో..టైమ్ అండ్ డిస్టన్స్, బోట్ అండ్ స్ట్రీమ్, ఆల్జీబ్రా, జామెట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్ వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇది అభ్యర్థికి గణితంపై ఉన్న అవగాహనను పరీక్షించే విభాగం. కాబట్టి పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్ అంశాలపై గట్టి పట్టు సాధించాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. వేగం పెంచుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడం చాలా అవసరం. ► ఇంగ్లిష్/హిందీ: ఇందులో మంచి స్కోర్ సాధించేందుకు గ్రామర్‌తోపాటు వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. సెంటెన్స్ కరెక్షన్, సినానిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ ఎరేంజ్మెంట్, ఎర్రర్స్ ఫైండింగ్ తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. ఇంగ్లిష్ పుస్తకాలు, ఇంగ్లిష్ దినపత్రికలు, వ్యాసాలు చదవడం ద్వారా ఈ విభాగాన్ని సులువుగానే గట్టెక్కే అవకాశముంది. ► ఈ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గోవంతు(0.25) మార్కు తగ్గిస్తారు. ► ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ): ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల శారీరకంగా «ధృడంగా ఉండాలి. ఎత్తు: పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఉంటే సరిపోతుంది. ఛాతీ: పురుషులు 170 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. బరువు: ఎత్తుకు తగిన విధంగా ఉండాలి. ► ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ): ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల్లో భాగంగా పురుషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో; అలాగే 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6 1/2 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళలు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 8 1/2 నిమిషాల్లో, 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో పరుగెత్తాలి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ► ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ► తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ప్రిపరేషన్ టిప్స్ ► కానిస్టేబుల్ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల పరీక్ష విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సరైన స్టడీ ప్లాన్ సిద్దం చేసుకోవాలి. ► సిలబస్‌ను గురించిన అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన టాపిక్స్‌ను గుర్తించాలి. ► గత ప్రశ్నపత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ఆన్లైన్ మాక్‌టెస్టులు రాయాలి. దీనిద్వారా పరీక్షలో ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో తెలుస్తుంది. ► ఒత్తిడిని దూరం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. అప్పుడే పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు చివరి తేదీ: 31.08.2021 ► పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు ► వెబ్సైట్: https://ssc.nic.in -
ఈ రూల్స్ అప్పుడుంటే సచిన్, గంగూలీలకు అవకాశాలు వచ్చేవి కావు..
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో చాలామంది భారత క్రికటర్లు యోయో టెస్ట్‌లో(ఫిట్నెస్ టెస్ట్) విఫలమైన కారణంగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సువర్ణావకాశాన్ని కోల్పోయారని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. క్రికటర్ల ఎంపిక అనేది నైపుణ్యం ఆధారంగా జరగాలని, ఫిట్నెస్ టెస్ట్ కొలమానంగా కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. క్రికెటర్లు జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే యోయో టెస్ట్ తప్పనిసరి అన్న విధానంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది చాలదన్నట్టుగా బీసీసీఐ గత నెలలో యోయో టెస్ట్ నియమాలను మరింత కఠినతరం చేయడంపై ఆయన మండిపడ్డాడు. కనీస అర్హతను 16:1 నుండి 17:1 చేయడం, నిర్ణీత సమయంలో రెండు కిలోమీటర్ల పరుగును పూర్తి చేయడం వంటి సరికొత్త నిబంధనలపై ఆయన అసహనం వ్యక్తం చేశాడు. నైపుణ్యంతో ఏమాత్రం సంబంధంలేని ఈ ఫిట్నెస్ టెస్ట్ వల్ల అంబటి రాయుడు, సంజు సాంసన్, మహ్మద్ షమీ, తాజాగా రాహుల్ తెవాతియా, వరుణ్ చక్రవర్తి లాంటి ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలను తృటిలో చేజార్చుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశాడు. ఆటగాళ్లకు మొదటగా అవకాశాలు కల్పించి ఆతరువాత వారి ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని ఆయన బీసీసీఐకి సూచించారు. ఇలాంటి టెస్ట్‌లు తమ జమానాలో జరిగి ఉంటే సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లకు అసలు అవకాశాలే వచ్చేవి కావని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు ఫిట్‌గా ఉండి నైపుణ్యం లేకపోతే, అది జట్టుకు ఏమాత్రం ఉపయోగకరం కాదని ఆయన వాదించాడు. కాగా, ఆటగాళ్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే యోయో టెస్ట్ తప్పనిసరిగా క్లియర్ చేయాలన్న నియమాన్ని బీసీసీఐ 2018 నుంచి అమలులోకి తెచ్చింది. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ నూతన సారధిగా రిషబ్ పంత్ -
అమ్మకు పెట్టు‘బడి’
అటకమీద దాచిన అమ్మ పోపు డబ్బాకు కొత్త కళ రానుంది. చిన్నారి దాచుకుంటున్న ముంత గలగలమని సవ్వడి చేయనుంది. బుడ్డోడికి ప్యాంట్ చొక్కా కొనిచ్చే ఆర్థిక భరోసా తల్లులకు కలగనుంది. చెప్పిన దానికంటే ముందుగా.. మరింత మిన్నగా అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దింది. పారదర్శకంగా ఎంపికలు నిర్వహించిన తొలి జాబితాను ప్రకటించింది. సంక్రాంతిలో తుది జాబితా రూపొందించి తల్లుల ఖాతాలో అక్షరాలా రూ.15 వేలు జమ చేయనుంది. ఇది పేదరికపు కార్ఖానాలో మగ్గుతున్న పేద బిడ్డలను బడి బాట పట్టించి.. ప్రతి ఇంటా విద్యాదీపాన్ని వెలిగించనుంది. గుంటూరు ఎడ్యుకేషన్: పిల్లలను పాఠశాలలకు పంపుతున్న తల్లులకు మరి కొద్ది రోజుల్లో ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ‘జగనన్న అమ్మ ఒడి’ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. ఈ నెలాఖరుకల్లా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి జనవరి మొదటి వారంలో తుది జాబితాను ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సంక్రాంతి పండుగకు ముందే మాతృమూర్తుల బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేల చొప్పున నగదు జమ చేయనుంది. “జగనన్న అమ్మఒడి’ పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల తొలి విడత జాబితాను పాఠశాల విద్యాశాఖ శనివారం విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 57 మండలాల వారీగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతోపాటు జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల తల్లులతో కూడిన తొలి విడతజాబితాను ఎంఈవో కార్యాలయాలకు ఆన్లైన్లో పంపారు. ఈ జాబితాను పాఠశాలలు, కళాశాలల వారీగా పరిశీలించిన ఎంఈవోలు వాటిని ప్రింట్ తీసుకుని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శనకుగానూ వలంటీర్లకు అందజేశారు. ఒకటో తేదీ వరకూ జాబితాల ప్రదర్శన ప్రభుత్వం ప్రాథమికంగా విడుదల చేసిన అమ్మఒడి లబ్ధిదారుల జాబితాలను జనవరి ఒకటో తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాయాల్లో ప్రదర్శించనున్నారు. తల్లిదండ్రులు వీటిని పరిశీలించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ఎస్ గంగాభవాని శనివారం “్ఙసాక్షి’’తో చెప్పారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం శనివారం మూడు రకాలుగా జాబితాలను ఆన్లైన్లో ఎంఈవోలకు పంపినట్లు చెప్పారు. వీటిలో మొదటిది విద్యార్థి తల్లి పేరుతో ఎంపిక జాబితా కాగా, రెండోది అనర్హత, మూడోది వలంటీర్ల ద్వారా మరోసారి సర్వే చేసి ధ్రువీకరించాల్సి ఉందని వెల్లడించారు. జాబితాలో పేర్లు లేకున్నా, తప్పులు ఉన్నా ఆందోళన చెందకుండా ఎంఈవో కార్యాలయాలకు వెళ్లి సరి చేసుకోవచ్చన్నారు. ఇందు కోసం ఎంఈవో కార్యాలయాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ విభాగాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికీ పేర్లు నమోదు కాని, వివరాల్లో తప్పులు ఉన్న లబి్ధదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 7,85,259 మందితో జాబితాలు జిల్లా వ్యాప్తంగా 3,662 ప్రభుత్వ, 1200 ప్రైవేటు పాఠశాలల్లో 6,98,331 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 298 జూనియర్ కళాశాలల్లో 1,05,897 మంది చదువుతుండగా.. వీరిలో 86,928 మందిని ప్రాథమికంగా అర్హులుగా గుర్తించారు. మొత్తం 7,85,259 మందితో తొలి జాబితా రూపొందించారు. మొదటి వారంలో తుది జాబితా అమ్మ ఒడి పథకం కింద ప్రతి తల్లి ఖాతాలో ఏడాదికి రూ.15 వేలు జమ చేయనున్నారు. తొలి జాబితాలో మార్పులు, చేర్పులు చేసిన తరువాత తల్లి, తండ్రి, సంరక్షుల ఆధార్ సంఖ్యను ఆన్లైన్లో ర్యాండమ్‌గా పరిశీలించి, డబుల్ ఎంట్రీలను తొలిగిస్తారు. ఈ ప్రక్రియ అనంతరం లబి్ధదారుల తుది జాబితాను జనవరి మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. తుది జాబితాలో పేర్లు ఉన్న తల్లులందరికీ జనవరి 9వ తేదీ నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
ఆ బంతే... ఓ భూగోళం!
రెండున్నరేళ్ల పైగా సుదీర్ఘ సమయం... ఆరు ఖండాల్లో ఏకంగా 872 అర్హత మ్యాచ్‌లు... మొత్తం నమోదయ్యే గోల్స్ రెండు వేలపైనే... పది కోట్ల మందికి పైగా వీక్షకులు...! 210 దేశాల నుంచి పాల్గొనే జట్లు... చివరకు మిగిలేవి మాత్రం 31 జట్లే... ఇదీ ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఎంపిక ప్రక్రియ తీరు. సాక్షి క్రీడా విభాగం సాధారణంగా ఏదైనా పెద్ద టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్న దేశాల సంఖ్య ఏడాదో, ఆరు నెలల ముందో తేలిపోతుంది. కానీ, కప్పులందు ‘ఫిఫా’ కప్పు వేరయా అన్నట్లు... భూగోళంపై ఉన్న అన్ని దేశాలకూ ఓ అవకాశం ఇస్తూ, ఆతిథ్య దేశానికి తప్ప మిగతా వారెవరికీ స్థానం పక్కా అని చెప్పలేనంతటి స్థాయిలో సాగే పోటీలో నెగ్గుకొచ్చి, ప్రపంచ సమరంలో తలపడే జట్లేవో తేలేందుకు రెండేళ్లు పైనే పట్టడంలో ఆశ్చర్యమేముంది? అందుకే దీనిని మహా సంగ్రామాల్లో కెల్లా మహా సంగ్రామంగా అభివర్ణిస్తారు. చిత్రమేమంటే... ప్రపంచ కప్ ముగిసిన సంవత్సరంలోపే ‘అర్హత పోరాటం’ ప్రారంభమవుతుంది. చరిత్రలో తొలిసారిగా... ప్రస్తుత ప్రపంచకప్ బరిలో ఉన్న దేశాలు 32. వీటిలో ఆతిథ్య రష్యాను తీసివేస్తే మిగతా 31 స్థానాలకు పోటీ పడేందుకు ఫిఫా సభ్యత్వం ఉన్న 210 దేశాలూ అర్హత ఉన్నవే. అయితే, ఇవి ఆయా దశల క్వాలిఫయింగ్ రౌండ్లను అధిగమించాల్సి ఉంటుంది. విశేషమేమంటే... కప్ చరిత్రలోనే తొలిసారిగా ఈసారి అన్ని జాతీయ జట్లు ప్రాథమిక దశ పోటీల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నాయి. భూటాన్, దక్షిణ సూడాన్, జిబ్రాల్టర్, కొసావో వంటి చిన్న దేశాలూ ఇందులో ఉన్నాయి. వేర్వేరు కారణాలతో జింబాబ్వే, ఇండోనేసియాలను ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే తప్పించారు. గత ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ పోటీల సందర్భంగా అభిమానుల దురుసుతనంతో నిషేధం ఎదుర్కొన్న మయన్మార్... దానిని ఎత్తివేయించుకుని మరీ దేశం బయట మ్యాచ్‌లు ఆడింది. యూరప్‌కే ఎక్కువ స్లాట్లు... దేశాల సంఖ్య ప్రాతిపదికన ఫిఫా... ఖండాల వారీగా క్వాలిఫయింగ్ స్లాట్లను కేటాయిస్తుంది. దేశాలు ఎక్కువగా ఉన్నందున ఇందులో సహజంగా యూరప్‌కే ఎక్కువ స్లాట్లు (13) దక్కుతాయి. వాస్తవానికి దక్షిణ అమెరికా ఖండవాసులు ఫుట్‌బాల్‌కు ప్రాణమిస్తారు. కానీ అక్కడ దేశాల సంఖ్య తక్కువ కాబట్టి ఇచ్చే స్లాట్ 4.5 మాత్రమే. ఈ పరిమిత స్థానాలను దక్కించుకునేందుకే బ్రెజిల్, అర్జెంటీనా వంటి జట్లు పోటీ పడతాయి. సంచలన ఫలితాలతో ఈ సమీకరణం ఒక్కోసారి దిగ్గజ జట్ల ప్రపంచకప్ అర్హతకే ముప్పుగా మారిన సందర్భాలున్నాయి. ఇలాంటి అనుభవమే ఈసారి ఇటలీకి ఎదురైంది. అసలు సమరం నెల... దాని వెనుక ఏళ్లు... క్వాలిఫయింగ్ పోటీలను ఖండాల్లోని దేశాల మధ్య లీగ్, నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు. రెండుకు పైగా దేశాలతో గ్రూప్‌లను ఏర్పాటు చేసి వాటి మధ్య రౌండ్ రాబిన్ పద్ధతిలో ఇంటా– బయట లీగ్ మ్యాచ్‌లు ఆడిస్తారు. నాకౌట్లోనూ ఇదే తీరును కొనసాగించినా, అక్కడ రెండు దశల మ్యాచ్‌లుంటాయి. ఇక్కడ చెరో మ్యాచ్ గెలిచి జట్లు సమంగా నిలిస్తే... గోల్స్ సంఖ్య ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. కొన్నిసార్లు ఇందుకు ‘డ్రా’ను కూడా ఆశ్రయిస్తారు. జట్లు ఎక్కువగా ఉంటే పరిస్థితులరీత్యా నాకౌట్ పోటీలు, ప్లే ఆఫ్స్ కూడా ఆడాల్సి వస్తుంది. మ్యాచ్ విజేతకు 3, ‘డ్రా’కు 1, ఓటమికి 0 చొప్పున లీగ్‌లో పాయింట్ల కేటాయింపు ఉంటుంది. దీంతోపాటు మొత్తం చేసిన గోల్స్, గోల్స్ సంఖ్యలో తేడా, ఫెయిర్ ప్లే వంటి 8 అంశాల వారీగా జట్లకు ర్యాంకులు ఇస్తారు. వేర్వేరు గ్రూప్‌లలోని జట్లు సమంగా పాయింట్లు సాధిస్తే... ఆ ఖండానికి కేటాయించిన స్లాట్ల ప్రకారం ఏ జట్టును ఎంపిక చేయాలనేది ఫిఫా అనుమతితో నిర్ణయిస్తారు. ఇక నాకౌట్లో రెండు దశల మ్యాచ్‌ల్లోనూ అత్యధిక గోల్స్ చేసిన జట్టు ముందంజ వేస్తుంది. ఈ సంఖ్య సమమైతే, విదేశంలో ఎక్కువ గోల్స్ చేసిన జట్టే విజేత అవుతుంది. అప్పటికీ తేలకుంటే 30 నిమిషాల అదనపు సమయాన్ని 15 నిమిషాల లెక్కన రెండుగా విడగొట్టి మరోసారి ‘విదేశంలో ఎక్కువ గోల్స్’ సూత్రాన్ని వర్తింపజేస్తారు. ఇటలీకి ఇలా ఎందుకైంది... 60 ఏళ్ల తర్వాత ఇటలీ లేకుండా ప్రపంచకప్ జరుగుతోంది. రెండుసార్లు ఆతిథ్యమిచ్చి, నాలుగుసార్లు విజేతగా నిలిచి, బాజియో, బఫన్ వంటి ఎందరో మేటి ఆటగాళ్లను ప్రపంచానికి అందించిన ఆ దేశం బాధ ఇప్పుడు చెప్పనలవి కానట్లుంది. రష్యా పోగా మిగిలిన 13 స్థానాల స్లాట్‌కు యూరప్ నుంచి 52 దేశాలు పోటీపడ్డాయి. దీంతో 9 గ్రూప్‌లుగా (6 జట్లతో 7 గ్రూప్‌లు, 5 జట్లతో 2 గ్రూప్‌లు) విభజించి అర్హత మ్యాచ్‌లు ఆడించారు. గ్రూప్ ‘జి’లో పడిన ఇటలీ... స్పెయిన్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. గ్రూప్‌లలో రన్నరప్‌గా మిగిలిన 8 జట్లను రెండుగా విడదీసి, మళ్లీ వాటి మధ్య రెండు అంచెల నాకౌట్ నిర్వహించారు. ఇక్కడ ఇటలీకి స్వీడన్ ఎదురుపడింది. తొలి మ్యాచ్‌లో 1–0 తేడాతో ఇటలీని ఓడించిన స్వీడన్... రెండో దానిని 0–0తో డ్రా చేసుకుంది. ఇలా... గోల్స్ సగటు లెక్కల్లో ఒక్క గోల్ తేడా 21వ ఫిఫా కప్‌నకు ఇటలీని దూరం చేసి తీరని వేదన మిగిల్చింది. ఈసారి ఎవరెవరు అర్హత సాధించారంటే... రష్యా (ఆతిథ్య దేశం), బెల్జియం, జర్మనీ, ఇంగ్లండ్, స్పెయిన్, పోలాండ్, ఐస్లాండ్, సెర్బియా, ఫ్రాన్స్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, క్రొయేషియా, స్వీడన్, డెన్మార్క్, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, నైజీరియా, ఈజిప్ట్, సెనెగల్, ట్యూనిషియా, మొరాకో, మెక్సికో, కోస్టారికా, పనామా, బ్రెజిల్, ఉరుగ్వే, అర్జెంటీనా, కొలంబియా, పెరూ. -
ట్రిపుల్ ఐటీలో ఎంపిక విధానాన్ని మార్చలేం
వేంపల్లె (కడప) : గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలన్న ఉద్దేశంతో ట్రిపుల్ ఐటీలను నెలకొల్పామని ఆర్జీయూకేటీ చాన్స్‌లర్ ఆచార్య రాజిరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో డైరెక్టర్ ఆచార్య భగవన్నారాయణ, ఏవో ఆచార్య విశ్వనాథరెడ్డి, అకడమిక్ డీన్ వేణుగోపాల్‌రెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఎంపిక విధానాన్ని నేరుగా కాకుండా పోటీ పరీక్ష నిర్వహించి తీసుకోవాలని వస్తున్న అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోబోమన్నారు. అలా చేస్తే పట్టణ ప్రాంత విద్యార్థులకు ఎక్కువ సీట్లు వస్తాయని, అందువల్ల ఎంపిక విధానాన్ని మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది రాయలసీమకు సంబంధించి అనంతపురంలో కొత్త ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి మండలానికి నాలుగు సీట్లు దక్కే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
అవకాశం కల్పించరూ...!
అర్హత పరీక్షలకు గైర్హాజర్ అయిన ఎస్సై అభ్యర్థుల వేడుకోలు కొంత మందికే అవకాశం ఇవ్వడంపై అసంతృప్తి వరంగల్ : వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఎస్సై పోస్టుల భర్తీ కోసం ఇటీవల నిర్వహించిన ఎంపికల ప్రక్రియలో సాంకేతిక కారణాల వల్ల గైర్హాజర్ అయిన అభ్యర్థులు తమకు అవకాశం కల్పించాలని నగర కమిషనర్ జి.సుధీర్‌బాబు ను అభ్యర్థిస్తున్నారు. ఈనెల 4వ తేదీన జేఎన్ఎ స్ స్టేడియంలో ఎస్సై పోస్టుల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరిగింది. ఆ రోజున నంబర్ల ప్రకారం పిలిచి ధ్రువీకరణ పత్రాలను పరిశీలి స్తారని భావించిన చివరి నంబర్లలో ఉన్న అభ్యర్థులు తమ పనులపై వెళ్లారు. అదే సమయంలో అభ్యర్థులను సీరియల్ నంబర్ల ప్రకారం పిలువకుండా అధికారులు జంబ్లింగ్ పద్ధతిలో పిలవడంతో పలువురు స్థానికంగా లేకపోవడం వల్ల గైర్హాజర్ అయ్యారు. పనులు ముగించుకొని వ చ్చిన వారికి ఈ విషయం తెలిసి షాక్‌కు గురయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి భర్తీ ప్రక్రియ కావడంతో పలువురు ఆశలు పెట్టుకున్నారు. ఇదే విషయాలను అక్కడి అధికారులకు తెలుపడంతో సీపీ దృష్టికి తీసుకుపోయారు. ఈ విషయంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పడంతో వీరు ఆశతో ఇళ్లకు వెళ్లిపోయినట్లు గైర్హాజర్ అయిన అభ్యర్థులు తెలిపారు. రంజాన్ పండుగ ఉన్నందున ఆ రోజున పరీక్షల కు హాజరయ్యే ముస్లిం అభ్యర్థులకు మరో రోజు న ఎంపికలు నిర్వహిస్తామని చెప్పడంతో గైర్హాజ ర్ అయిన అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. రంజాన్ రోజున రాని వారికి 9వ తేదీన పరీక్షలు నిర్వహిస్తుండడంతో వీరు వెళ్లి నగర పోలీస్ క మిషనర్‌ను కలిసినట్లు తెలిపారు. కేవలం రం జాన్ రోజున గైర్హాజర్ అయిన వారికే అవకాశం ఇస్తున్నట్లు ఆయన చెప్పడంతో వీరు సీపీని ప్రా దేయపడ్డినట్లు తెలిసింది. రూరల్ పరిధిలో ఇ లాంటి సమస్యలతో గైర్హాజర్ అయిన వారికి రూరల్ ఎస్పీ అవకాశం కల్పించినట్లు సమాచా రం. అయినప్పటికి సీపీ కుదరదని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగినట్లు అభ్యర్థులు వాపోతున్నారు. ఇదే విషయంపై పోలీసు రిక్రూట్మెంట్ చైర్మన్‌ను జంబ్లింగ్‌తో గైర్హాజర్ అయిన అభ్యర్థులు కలిసి ప్రాధేయపడగా ఎంపిక ప్రక్రియ జిల్లా స్థాయిలోనే జరుగుతున్నందున వారే ని ర్ణయం తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. దీంతో మరోసారి సీపీని కలిసి అభ్యర్థులు విన్నవించినా ఆయన సమ్మతించలేదని తెలిసింది. ఈ పరీక్షల్లో కానిస్టేబుళ్లగా పనిచేస్తున్న కొంత మంది అభ్యర్థులు ఇదే కారణాలతో హాజరుకాలేకపోయినట్లు తెలిసింది.గైర్హాజరైన అభ్యర్థులు తమకు అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు. -
గెలుపు కోసం.. కొలువు కోసం పరుగు
♦ పోలీస్ ‘పరీక్ష’కు సిద్ధం కిటకిటలాడిన పరేడ్‌గ్రౌండ్ ♦ ఉదయం 4 గంటల నుంచే క్యూ నాలుగేళ్ల తర్వాత నోటిఫికేషన్ ♦ జిల్లాలో తొలిసారిగా ఎస్ఐల సెలక్షన్ ♦ 800 మీటర్ల పరుగులో వెనుదిరుగుతున్న అభ్యర్థులు ♦ ఆలస్యమైనందున నీరసించినట్టు ఆరోపించిన అభ్యర్థులు సంగారెడ్డి టౌన్: తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ప్రభుత్వం తొలిసారి పోలీసు శాఖలో ఎస్ఐ పోస్టుల భర్తీ నిర్వహిస్తున్న ఎంపిక ప్రక్రియకు భారీ స్పందన లభిస్తోంది. జిల్లాలో వేలాది మంది యువత పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొన్నారు. ఎస్సై ప్రాథమిక అర్హత పరీక్షలో 3600 మంది ఉత్తీర్ణులయ్యారు. వారికి సంగారెడ్డిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో దేహదారుఢ్య , ఈవెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగిన దేహదారుఢ్య పరీక్షలకు సుమారు 1200 మంది అభ్యర్థులు హాజరైనట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. పోలీసు కళ్యాణమండపంలో అభ్యర్థుల విద్యార్హత ధృవపత్రాల పరిశీలన, బయోమెట్రిక్ హాజరు ప్రక్రియ నమోదు చేశారు. అక్కడి నుండి పోలీస్ పరేడ్ మైదానంలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల ఎత్తు, ఛాతీ చుట్టు కొలత, బరువు తదితర పరీక్షలు నిర్వహించారు. ఇందులో అర్హులకు బ్యాచ్‌ల వారీగా 800 మీటర్ల రన్నింగ్ పరీక్షను చేపట్టారు. కచ్చితంగా అర్హత సాధించాల్సిన ఈ 800 మీటర్ల రన్నింగ్‌లో అర్హులకు మిగతా ఈవెంట్స్ అయిన హై జంప్, లాంగ్ జంప్, షార్ట్‌పుట్, 100 మీటర్ల రన్నింగ్‌ను నిర్వహించారు. సర్టిఫికెట్లతో తంటాలు... కొన్ని ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీలు పూర్తిచేసిన కొంతమంది అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు. సంబంధిత కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వం విడుదల చేసే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాకే అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇస్తామని చెప్పడంతోవిద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు వారిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించలేదు. దీంతో కొంతమంది అభ్యర్థులు దేహ దారుఢ్య పరీక్షల్లో పాల్గొనకుండానే సర్టిఫికెట్లు తెస్తామంటూ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అనుమతితో వెనుదిరిగారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేనివారికి మరో రెండు రోజుల గడువును ఇచ్చారు. ఉదయం నుంచి క్యూలో అభ్యర్థులు.. తెల్లవారుజామున 4 గంటల నుంచే అభ్యర్థులు క్యూలో నిల్చున్నారు. ఉదయం 8 గంటలకు పోలీసు అధికారులు ప్రక్రియ మొదలు పెట్టారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫాం, ఇంటిమేషన్ లెటర్, హాల్‌టికెట్ తదితర ధృవపత్రాలు లేక కొందరు అభ్యర్థులు సమీప నెట్‌సెంటర్లకు పరుగులు తీశారు. ఉదయం నుండి వరులో నిలుచున్నామని, ఈవెంట్లు వచ్చేవరకు మధ్యాహ్నం కావడంతో అలసిపోయి రన్నింగ్ చేయలేకపోయామని కొందరు అభ్యర్థులు కన్నీరుమున్నిరయ్యారు. చాలా మంది అభ్యర్థులు 800 మీటర్ల పరుగులోనే వెనుదిరగడం గమనార్హం. నాలుగు రౌండ్లు... ఈవెంట్లో పాల్గొన్న అభ్యర్థులు 800 మీటర్ల పరుగు పందెం చేసేందుకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ ట్రాక్ కేవలం 200 మీటర్లు ఉండడంతో అభ్యర్థులు నాలుగు రౌండ్లు పరుగు తీయాల్సి వస్తోంది. ట్రాక్ పెద్దగా ఉన్నట్లయితే పరుగు సులభతరంగా ఉండేదని పలువురు అభ్యర్థులు పేర్కొంటున్నారు. ట్రాక్ చిన్నగా ఉండడంతో ఎంట్రెన్స్‌లో క్వాలిఫై అయిన సగం మంది పరుగు పందెంలో రాణించలేక ఇంటిముఖం పడుతున్నారు. 5 కేను తొలగించిన ప్రభుత్వం... గత ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు రిక్రూట్మెంటులో ముఖ్యంగా 5 కిలోమీటర్ల పరుగు 25 నిమిషాల్లో పరిగిత్తాల్సి ఉండేది. ఈ పరుగు గతంలో అనేకమంది అభ్యర్థులు గమ్యం చేరకుండానే గుండెపోటుతో హఠన్మరణం చెందిన సంఘటనలు జరిగిన విషయం విధితమే. కాగా, ఈ 5 కేఎంను తొలగించడంతో పోలీసు శాఖలో ఉద్యోగం కోసం ఆరటపడుతున్న అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. అప్పట్లో పోలీసు రిక్రూట్మెంటులో చదువు కంటే కూడా దేహ దారుఢ్యానికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం ఐదు కేఎంను తొలగించి మిగతా ఈవెంట్లన్నింటినీ యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ ఐదు ఈవెంట్లలో 800 మీటర్లు తప్పని సరి క్వాలీఫై అవ్వాల్సి ఉంటుంది. లేనిచో వెనుదిరగాల్సిందే. ఇందులో క్వాలీఫై అయిన వారికి మిగతా నాలుగు ఈవెంట్స్‌లలో 100 మీటర్లు, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్‌పుట్‌లలో ఏవేని రెండు ఈవెంట్లలో అర్హత సాధించినా వారు అర్హులుగా నిర్ణయిస్తారు. జిల్లాలో ఇదే మొదటిసారి... ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటివరకు ఎస్సైల రిక్రూట్‌మెంటును హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో గల గోషామహల్ స్టేడియంలో నిర్వహించేవారు. కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ జోన్ పరిధిలోని 539 ఎస్సై పోస్టులను తెలంగాణ 5వ జోన్లో చూపింది. దీంతో ఎంట్రెన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను సంగారెడ్డిలోని పరేడ్ గ్రౌండ్లో మొట్టమొదటి సారిగా ఎస్సై అభ్యర్థుల దేహాధారుఢ్యం, ఈవెంట్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
ఆలోచన వచ్చింది.. మరుగుదొడ్డే రాలే!
♦ జిల్లాలో నత్తనడకన ‘స్వచ్ఛ్భారత్ మిషన్’ ♦ ఇప్పటికీ పూర్తికాని ఎంపిక ప్రక్రియ ♦ పథకాన్ని నీరుగారుస్తున్న ‘ప్రత్యేకాధికారులు’ ‘ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుంది’.. ఇదీ స్వచ్ఛ భారత్ మిషన్ సరికొత్త నినాదం. ఈ మిషన్‌లో భాగంగా సంపూర్ణ పారిశుద్ధ్యం కింద కేంద్ర ప్రభుత్వం వేలకొద్ది మరుగుదొడ్లు మంజూరు చేసింది. నిర్మాణ బాధ్యతల్ని అధికారులకు కట్టబెట్టింది. కానీ వారిలో చిత్తశుద్ధిలోపం కారణంగా జిల్లాలో ఈ పథకం నత్త కంటే నెమ్మదిగా సాగుతోంది. 2015- 16 వార్షిక సంవత్సరంలో జిల్లాకు 25,210 మరుగుదొడ్లు మంజూరు కాగా.. వీటిలో ఇప్పటివరకు 1,428 మాత్రమే పూర్తికావడం అధికారుల పనితీరుకు అద్దంపడుతోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: పారిశుద్ధ్యం అందరి బాధ్యత అంటూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన స్వచ్ఛ్భారత్ మిషన్ (ఎస్‌బీఎమ్) జిల్లాలో నత్తనడకన సాగుతోంది.ఈ మిషన్ కింద పేదలకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం రాయితీలు కేటాయించింది. అర్హులైన నిరుపేదలు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకుంటే ప్రభుత్వం రూ.12వేలు సదరు లబ్ధిదారుడికి చెల్లిస్తుంది. ఈ మరుగుదొడ్ల నిర్మాణాలను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయడంతోపాటు గ్రామీణ నీటి సరఫరా విభాగానికి కూడా బాధ్యతల్ని అప్పగించింది. ఈ క్రమంలో జిల్లాకు 25,210 మరుగుదొడ్ల యూనిట్లు మంజూరయ్యాయి. కానీ వీటి నిర్మాణంపై అధికారులు దృష్టి సారించకపోవడంతో జిల్లాలో గత నెలాఖరునాటికి కేవలం 1,428 మరుగుదొడ్లు మాత్రమే పూర్తయ్యాయి. మరో 682 యూనిట్లు వివిధ దశల్లో ఉండగా.. 23,100 మరుగుదొడ్ల నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కొలిక్కిరాని ఎంపిక ప్రక్రియ.. స్వచ్ఛ్భారత్ మిషన్ కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ కార్యక్రమం కింద గతేడాది నవంబర్‌లో మరుగుదొడ్లు మంజూరయ్యాయి. జిల్లాలో 32 మండలాలను ఈ పథకం కింద ఎంపిక చేసిన యంత్రాంగం.. ఒక్కో మండలంలో ఐదు నుంచి ఆరు గ్రామాలను తీసుకుని ఆ మేరకు లక్ష్యాల్ని పూర్తి చేయాలని భావించింది. ఇందుకుగాను ప్రత్యేకాధికారులను సైతం నియమించింది. అయితే అప్పటినుంచి వరుసగా నవాబ్‌పేట జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ ఎన్నికలు.. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి. దీంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆదిలోనే నిలిచిపోయింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేసి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేస్తామని అధికారవర్గాలు చెబుతున్నాయి. లక్ష్యదూరంలో ఎన్బీఏ.. స్వచ్ఛ భారత్ మిషన్‌కు ముందు నిర్మల్ భారత్ అభియాన్(ఎన్బీఏ) కింద గత ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టింది. ఇందులో భాగంగా 2013-14 సంవత్సరంలో జిల్లాకు 25,760 మరుగుదొడ్లు జిల్లాకు మంజూరయ్యాయి. వీటికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ నిర్మాణాలకు సంబంధించి బిల్లుల చెల్లింపుల్లో అధికారులు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో అప్పటి లక్ష్యాలు సైతం పూర్తికాలేదు. మంజూరైన వాటిలో కేవలం 16,200 మరుగుదొడ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 9,270 మరుగుదొడ్ల నిర్మాణాలు అతీగతీలేకుండా పోయాయి. రెండేళ్ల కిత్రం నాటి లక్ష్యాల్నే సాధించని అధికారులు.. తాజాగా మంజూరైన వాటిని రెండు నెలల్లో ఎలా పూర్తి చేస్తారో చూడాలి. -
‘అవుట్ సోర్సింగ్’కు రాజకీయ గ్రహణం?
- ఏజెన్సీ ఎంపిక టెండరు ప్రక్రియకు తాత్కాలిక బ్రేకు - పని ఒత్తిడే కారణ మంటున్న అధికారులు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల కార్యాలయాల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక ప్రక్రియ తాత్కాలికంగా నిలిచింది. ఈ ఏజెన్సీల నియామకం కోసం చేపట్టిన టెండరు ప్రక్రియకు ప్రస్తుతానికి బ్రేకు పడింది. ఇందుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమకు అనుకూలమైన ఏజెన్సీలకు ఈ కాంట్రాక్టు దక్కేలా కొందరు నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2014- 15 ఆర్థిక సంవత్సరంలో అవుట్సోర్సింగ్ పద్ధతిపై ఉద్యోగులను సరఫరా చేసే ఏజెన్సీ ఎంపిక నిమిత్తం జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆగస్టు 8న టెండరు నోటిఫికేషన్ జారీ చేసింది. టెండర్లు దాఖలు చేసేందుకు ఆగస్టు 20 వరకు గడువిచ్చారు. సుమారు 25 ఏజెన్సీలు ఈ టెండరు ప్రక్రియలో పాల్గొన్నాయి. ఈ టెండర్లను అదేరోజు తెరవాల్సి ఉండగా, అధికారులు ఈ ప్రక్రియను వాయిదా వేశారు. సమగ్ర కుటుంబ సర్వే తదితర ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో ఈ టెండర్లను తెరువలేకపోయాని అధికారులు చెబుతున్నారు. కానీ రాజకీయ ఒత్తిళ్లే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.కోట్ల టర్నోవర్ జిల్లాలోని అన్ని కార్యాలయాలు, 104 వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు వెయ్యికి పైగా ఉద్యోగులు, సిబ్బంది అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా పనిచేస్తున్నారు. కం ప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, జూనియర్ అసిసెం ట్లు వంటి పోస్టుల్లో ఉన్నారు. వీరికి ఎంపిక చేసిన అవు ట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వం జీతభత్యాలు చెల్లిస్తుంది. ఈ ఏజెన్సీ ఎంపిక కోసం కలెక్టర్ జగన్మోహన్ జిల్లా అవుట్ సోర్సింగ్ కమిటీని నియమించారు. అదనపు జాయింట్ కలెక్టర్ ఈ కమిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, జిల్లా ఉపాధి కల్పనాధికారి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కార్మిక శాఖ జిల్లా ఉన్నతాధికారి, డీటీవో వంటి అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ టెండర్లు వేసిన ఏజెన్సీల అర్హతలను పరిశీలించి ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతినెలా ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అలవెన్సుల రూపంలో రూ.కోట్లలో టర్నోవర్ ఉండటంతో నేతల కన్ను ఈ ఏజెన్సీలపై పడుతోంది. ఏజెన్సీల ఆగడాలు ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు గతంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాయి. ఆయా ఏజెన్సీల నిర్వాహకులు కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రతినెలా చెల్లించాల్సిన వేతనాల్లో కోత పెట్టేవారు. నిరుద్యోగ యువత నెలం తా పనిచేస్తే వచ్చే చాలీ చాలని వేతనంలో ఇలా కోత వి దించడంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఎక్కడ తమ ఉద్యోగం పోతుందోననే భయంతో కాం ట్రాక్టు ఉద్యోగులు ఏజెన్సీ నిర్వాహకులను గట్టిగా ప్ర శ్నించలేక పోయారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఆయా ఏజెన్సీల నిర్వాహకులు ప్రతినెలా లక్షలు దండుకున్నా రు. అలాగే ఉద్యోగుల భవిష్య నిధి(ప్రావిడెంట్ ఫండ్) విషయంలోనూ చేతివాటం ప్రదర్శించారు. ఉద్యోగుల వేతనాల్లోంచి కోత విధించిన పీఎఫ్ మొత్తంలో కొంత మొత్తాన్ని జేబులో వేసుకున్నారు. దీంతో ఆయా ఉద్యోగులకు పీఎఫ్ ఖాతాలో జమ కావాల్సిన మొత్తం తగ్గిపోవడంతో చిరు ఉద్యోగులు ఆవేదనకు లోనయ్యారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రతినెలా చెల్లించే వేతనాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉండగా, కొన్ని ఏజెన్సీలు అలా చేయకుండా ఉద్యోగికి ఇచ్చి అందులో చేతివాటం ప్రదర్శించారు. ఇప్పుడు కొత్తగా నియామకమైన అవుట్సోర్సింగ్ కమిటీ అధికారులు ఆయా ఏజెన్సీల ట్రాక్ రికార్డును క్షుణ్ణంగా పరిశీలించి ఎంపిక చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఈ చిరుద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది. పని ఒత్తిడే కారణం - ఎం.ఏ.గఫార్, జిల్లా ఉపాధి కల్పనాధికారి పని ఒత్తిడి కారణంగానే టెండర్లు తెరువలేకపోయాము. నోటిఫికేషన్లో పేర్కొన్నట్లుగా ఆగస్టు 20నే ఈ టెండర్లు తెరవాల్సి ఉండగా, సమగ్ర కుటుంబసర్వే, ఇతర పని ఒత్తిడి కారణంగా ఈ టెండర్లను తెరువలేక పోయాము. అంతేకానీ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు. త్వరలోనే తేదిని ప్రకటించి ఈ టెండర్లను తెరిచేందుకు చర్యలు తీసుకుంటాము.