ఇటలీ ప్లేయర్‌కు స్వీడన్ క్రీడాకారుడి ఓదార్పు (ఫైల్)
రెండున్నరేళ్ల పైగా సుదీర్ఘ సమయం... ఆరు ఖండాల్లో ఏకంగా 872 అర్హత మ్యాచ్‌లు... మొత్తం నమోదయ్యే గోల్స్ రెండు వేలపైనే... పది కోట్ల మందికి పైగా వీక్షకులు...! 210 దేశాల నుంచి పాల్గొనే జట్లు... చివరకు మిగిలేవి మాత్రం 31 జట్లే... ఇదీ ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఎంపిక ప్రక్రియ తీరు.
సాక్షి క్రీడా విభాగం
సాధారణంగా ఏదైనా పెద్ద టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్న దేశాల సంఖ్య ఏడాదో, ఆరు నెలల ముందో తేలిపోతుంది. కానీ, కప్పులందు ‘ఫిఫా’ కప్పు వేరయా అన్నట్లు... భూగోళంపై ఉన్న అన్ని దేశాలకూ ఓ అవకాశం ఇస్తూ, ఆతిథ్య దేశానికి తప్ప మిగతా వారెవరికీ స్థానం పక్కా అని చెప్పలేనంతటి స్థాయిలో సాగే పోటీలో నెగ్గుకొచ్చి, ప్రపంచ సమరంలో తలపడే జట్లేవో తేలేందుకు రెండేళ్లు పైనే పట్టడంలో ఆశ్చర్యమేముంది? అందుకే దీనిని మహా సంగ్రామాల్లో కెల్లా మహా సంగ్రామంగా అభివర్ణిస్తారు. చిత్రమేమంటే... ప్రపంచ కప్ ముగిసిన సంవత్సరంలోపే ‘అర్హత పోరాటం’ ప్రారంభమవుతుంది.
చరిత్రలో తొలిసారిగా...
ప్రస్తుత ప్రపంచకప్ బరిలో ఉన్న దేశాలు 32. వీటిలో ఆతిథ్య రష్యాను తీసివేస్తే మిగతా 31 స్థానాలకు పోటీ పడేందుకు ఫిఫా సభ్యత్వం ఉన్న 210 దేశాలూ అర్హత ఉన్నవే. అయితే, ఇవి ఆయా దశల క్వాలిఫయింగ్ రౌండ్లను అధిగమించాల్సి ఉంటుంది. విశేషమేమంటే... కప్ చరిత్రలోనే తొలిసారిగా ఈసారి అన్ని జాతీయ జట్లు ప్రాథమిక దశ పోటీల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నాయి. భూటాన్, దక్షిణ సూడాన్, జిబ్రాల్టర్, కొసావో వంటి చిన్న దేశాలూ ఇందులో ఉన్నాయి. వేర్వేరు కారణాలతో జింబాబ్వే, ఇండోనేసియాలను ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే తప్పించారు. గత ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ పోటీల సందర్భంగా అభిమానుల దురుసుతనంతో నిషేధం ఎదుర్కొన్న మయన్మార్... దానిని ఎత్తివేయించుకుని మరీ దేశం బయట మ్యాచ్‌లు ఆడింది.
యూరప్‌కే ఎక్కువ స్లాట్‌లు...
దేశాల సంఖ్య ప్రాతిపదికన ఫిఫా... ఖండాల వారీగా క్వాలిఫయింగ్ స్లాట్‌లను కేటాయిస్తుంది. దేశాలు ఎక్కువగా ఉన్నందున ఇందులో సహజంగా యూరప్‌కే ఎక్కువ స్లాట్లు (13) దక్కుతాయి. వాస్తవానికి దక్షిణ అమెరికా ఖండవాసులు ఫుట్‌బాల్‌కు ప్రాణమిస్తారు. కానీ అక్కడ దేశాల సంఖ్య తక్కువ కాబట్టి ఇచ్చే స్లాట్ 4.5 మాత్రమే. ఈ పరిమిత స్థానాలను దక్కించుకునేందుకే బ్రెజిల్, అర్జెంటీనా వంటి జట్లు పోటీ పడతాయి. సంచలన ఫలితాలతో ఈ సమీకరణం ఒక్కోసారి దిగ్గజ జట్ల ప్రపంచకప్ అర్హతకే ముప్పుగా మారిన సందర్భాలున్నాయి. ఇలాంటి అనుభవమే ఈసారి ఇటలీకి ఎదురైంది.
అసలు సమరం నెల... దాని వెనుక ఏళ్లు...
క్వాలిఫయింగ్ పోటీలను ఖండాల్లోని దేశాల మధ్య లీగ్, నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు. రెండుకు పైగా దేశాలతో గ్రూప్‌లను ఏర్పాటు చేసి వాటి మధ్య రౌండ్ రాబిన్ పద్ధతిలో ఇంటా– బయట లీగ్ మ్యాచ్‌లు ఆడిస్తారు. నాకౌట్‌లోనూ ఇదే తీరును కొనసాగించినా, అక్కడ రెండు దశల మ్యాచ్‌లుంటాయి. ఇక్కడ చెరో మ్యాచ్ గెలిచి జట్లు సమంగా నిలిస్తే... గోల్స్ సంఖ్య ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. కొన్నిసార్లు ఇందుకు ‘డ్రా’ను కూడా ఆశ్రయిస్తారు. జట్లు ఎక్కువగా ఉంటే పరిస్థితులరీత్యా నాకౌట్ పోటీలు, ప్లే ఆఫ్స్ కూడా ఆడాల్సి వస్తుంది.
మ్యాచ్ విజేతకు 3, ‘డ్రా’కు 1, ఓటమికి 0 చొప్పున లీగ్‌లో పాయింట్ల కేటాయింపు ఉంటుంది. దీంతోపాటు మొత్తం చేసిన గోల్స్, గోల్స్ సంఖ్యలో తేడా, ఫెయిర్ ప్లే వంటి 8 అంశాల వారీగా జట్లకు ర్యాంకులు ఇస్తారు. వేర్వేరు గ్రూప్‌లలోని జట్లు సమంగా పాయింట్లు సాధిస్తే... ఆ ఖండానికి కేటాయించిన స్లాట్‌ల ప్రకారం ఏ జట్టును ఎంపిక చేయాలనేది ఫిఫా అనుమతితో నిర్ణయిస్తారు. ఇక నాకౌట్‌లో రెండు దశల మ్యాచ్‌ల్లోనూ అత్యధిక గోల్స్ చేసిన జట్టు ముందంజ వేస్తుంది. ఈ సంఖ్య సమమైతే, విదేశంలో ఎక్కువ గోల్స్ చేసిన జట్టే విజేత అవుతుంది. అప్పటికీ తేలకుంటే 30 నిమిషాల అదనపు సమయాన్ని 15 నిమిషాల లెక్కన రెండుగా విడగొట్టి మరోసారి ‘విదేశంలో ఎక్కువ గోల్స్’ సూత్రాన్ని వర్తింపజేస్తారు.
ఇటలీకి ఇలా ఎందుకైంది...
60 ఏళ్ల తర్వాత ఇటలీ లేకుండా ప్రపంచకప్ జరుగుతోంది. రెండుసార్లు ఆతిథ్యమిచ్చి, నాలుగుసార్లు విజేతగా నిలిచి, బాజియో, బఫన్ వంటి ఎందరో మేటి ఆటగాళ్లను ప్రపంచానికి అందించిన ఆ దేశం బాధ ఇప్పుడు చెప్పనలవి కానట్లుంది. రష్యా పోగా మిగిలిన 13 స్థానాల స్లాట్‌కు యూరప్ నుంచి 52 దేశాలు పోటీపడ్డాయి. దీంతో 9 గ్రూప్‌లుగా (6 జట్లతో 7 గ్రూప్‌లు, 5 జట్లతో 2 గ్రూప్‌లు) విభజించి అర్హత మ్యాచ్‌లు ఆడించారు. గ్రూప్ ‘జి’లో పడిన ఇటలీ... స్పెయిన్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. గ్రూప్‌లలో రన్నరప్‌గా మిగిలిన 8 జట్లను రెండుగా విడదీసి, మళ్లీ వాటి మధ్య రెండు అంచెల నాకౌట్ నిర్వహించారు. ఇక్కడ ఇటలీకి స్వీడన్ ఎదురుపడింది. తొలి మ్యాచ్‌లో 1–0 తేడాతో ఇటలీని ఓడించిన స్వీడన్... రెండో దానిని 0–0తో డ్రా చేసుకుంది. ఇలా... గోల్స్ సగటు లెక్కల్లో ఒక్క గోల్ తేడా 21వ ఫిఫా కప్‌నకు ఇటలీని దూరం చేసి తీరని వేదన మిగిల్చింది.
ఈసారి ఎవరెవరు అర్హత సాధించారంటే...
రష్యా (ఆతిథ్య దేశం), బెల్జియం, జర్మనీ, ఇంగ్లండ్, స్పెయిన్, పోలాండ్, ఐస్‌లాండ్, సెర్బియా, ఫ్రాన్స్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, క్రొయేషియా, స్వీడన్, డెన్మార్క్, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, నైజీరియా, ఈజిప్ట్, సెనెగల్, ట్యూనిషియా, మొరాకో, మెక్సికో, కోస్టారికా, పనామా, బ్రెజిల్, ఉరుగ్వే, అర్జెంటీనా, కొలంబియా, పెరూ.
Comments
Please login to add a commentAdd a comment