... వచ్చేస్తోంది! దక్షిణ అమెరికా ఖండంలోని చిన్న దేశమైన ఉరుగ్వేలో పురుడు పోసుకుని... అక్కడినుంచి ఐరోపాను ఊపేసి... ఉత్తర అమెరికాను కదిలించి... చీకటి ఖండం ఆఫ్రికాలోనూ కాలిడి... చుట్టంలా ఆసియానూ పలకరించి... అభిమానులను ఆవహించేసి... ప్రపంచాన్నే తన చుట్టూ తిప్పుకొనే... సమ్మోహన క్రీడ మనల్ని మైమరిపించేందుకు వచ్చేస్తోంది...! ముప్పై రెండు గడుల (ప్యానెళ్లు) బంతితో ఆడే ఆ ఆటలో... పాటవం... పౌరుషం... కళ... కలగలిసి ఉంటాయి...! మరో 16 రోజులే... ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ సమరానికి!
► ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఫిఫా) ప్రపంచకప్‌నకు రష్యా ఆతిథ్యం ఇవ్వనుండటం ఇదే తొలిసారి. 2010 డిసెంబరులో ఈ మేరకు హక్కులు దక్కాయి. జూన్ 14న ప్రారంభమయ్యే పోటీలు జూలై 15న ఫైనల్‌తో ముగుస్తాయి.
► పుష్కర కాలం తర్వాత మళ్లీ యూరోప్ దేశంలో ప్రపంచకప్ జరగనుంది. 2006 ప్రపంచకప్‌కు జర్మనీ ఆతిథ్యమిచ్చాక 2010 ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో, 2014 ప్రపంచకప్ బ్రెజిల్‌లో జరిగాయి.
► 88 ఏళ్ల చరిత్రలో ఇది 21వ ఫుట్‌బాల్ ప్రపంచకప్. 1930లో ఉరుగ్వేలో తొలి ప్రపంచకప్ జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం కారణం గా 1942, 1946లలో పోటీలు నిర్వహించలేదు.
► ప్రపంచకప్ మస్కట్... ‘జబివాకా’ను రూపొందించినది రష్యా విద్యార్థి ఎకతెరీనా బొచరోవా. ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా దీనిని ఎంపిక చేశారు.
► బెల్జియం, నెదర్లాండ్స్, ఇంగ్లండ్, స్పెయిన్, పోర్చుగల్ దేశాలతో పోటీపడి 2018 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను రష్యా చేజిక్కించుకుంది.
► మొత్తం 32 దేశాలు తలపడుతున్న ఈ మెగా టోర్నీలో... ఐస్‌లాండ్, పనామా అరంగేట్రం చేస్తున్నాయి.
► ‘ఫిఫా’ ట్రోఫీ మౌలిక స్వరూపాన్ని మార్చకుండా ఆతిథ్య దేశం రష్యా నేపథ్యంతో ప్రపంచకప్ లోగోను రూపొందించారు. దీనిని 2014లో విడుదల చేశారు.
► ఫిఫా... క్వాలిఫయింగ్ పోటీల నుంచి జింబాబ్వేను బహిష్కరించగా, ఇండోనేసియాపై ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్‌సీ) నిషేధం విధించింది.
► రెండు సార్లు ఆతిథ్యమిచ్చి..., నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన ఇటలీ ఈ ప్రపంచ కప్‌నకు అర్హత సాధించలేకపోయింది. 60 ఏళ్లలో ఆ జట్టు పోటీలో లేకపోవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ప్రపంచకప్ గెలు పొందిన ఎనిమిది దేశాల్లో ఇటలీ మినహా మిగతావి ఈసారి బరిలో ఉన్నాయి.
► ప్రపంచకప్ మహా సంగ్రామం సందర్భంగా రష్యా వెళ్లేందుకు ఎలాంటి వీసా అవసరం లేకుండా నిబంధనలు సడలించారు.
► ఫుట్‌బాల్‌పై 32 గడులుంటాయి. (ప్యానెల్స్). వీటిలో 20 ఆరు గడులతో (హెక్సాగన్స్), 12 ఐదు గడుల (పెంటాగన్)తో ఉంటాయి. చిత్రమేమంటే... బంతిపై ఉన్న గడులకు ప్రతీకగా అన్నట్లు 1998 నుంచి ప్రపంచ కప్‌ను 32 దేశాలతో నిర్వహిస్తున్నారు. వీటిలో ఆతిథ్య దేశానికి నేరుగా ప్రవేశం లభిస్తుంది. మిగతా 31 దేశాలు అర్హత పోటీల్లో ఆడాల్సి ఉంటుంది.
► ప్రపంచ కప్‌లో ప్రాతినిధ్యం వహించే దేశాల సంఖ్యపై ఖండాలవారీగా ‘ఫిఫా’ స్లాట్‌లను కేటాయిస్తుంది. ఆ స్లాట్‌లు ఇలా... ఆఫ్రికా: 5, ఆసియా: 4.5, యూరోప్: 13, ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్: 3.5, ఓసియానియా: 0.5, దక్షిణ అమెరికా: 4.5.
Comments
Please login to add a commentAdd a comment