
మేఘావృతమైన చలచల్లని సాయంత్రం... ఆ దేశం ఈ దేశం అని కాకుండా వసుధైక కుటుంబంలా పోగైన అభిమాన గణం... మైదానమే బంతి ఆకృతిగా మారిన నేపథ్యం... మధ్యలో అదరహో అనేలా ప్రధాన వేదిక... మంత్రముగ్ధులను చేసిన కళాకారుల వైవిధ్య ప్రదర్శనలు... మిన్నంటే కరతాళ ధ్వనుల మధ్య మస్కట్ జబివాకాతో అడుగిడిన బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో... ఆ వెనుకే బ్రిటీష్ పాప్ స్టార్ రాబి విలియమ్స్... పక్షి ఆకార ఏర్పాటులో వేంచేసిన రష్యన్ గాయని ఐదా గార్ఫులినా!
మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో గురువారం ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ప్రారంభ కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి. మ్యాచ్ అధికారిక బంతిని మోడల్ విక్టోరియా లొపిరెవా జనంతో కిక్కిరిసిన స్టేడియంలోకి తీసుకురాగా, స్పెయిన్ మాజీ గోల్‌కీపర్ ఐకర్‌కాసిల్లాస్ ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించాడు. రాక్ డీజే శబ్దాల హోరులో ‘మిమ్మల్ని ఆనందింపజేయనివ్వండి (లెట్ మి ఎంటర్‌టైన్ యు)’ అంటూ రాబి విలియమ్స్ పాడిన పాట ఉర్రూతలూగించింది. మధ్యలో గార్ఫులినా అతడితో గళం కలిపింది. 800 మంది కళాకారులు పాల్గొన్న ఈ వేడుక, గతానికి భిన్నంగా అరగంట పాటే సాగింది. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగిస్తూ, ఫుట్‌బాల్ ప్రపంచకప్ మొదలైనట్లు ప్రకటించారు. ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాన్టినో ప్రసంగం ముగిశాక... మహా సంగ్రామానికి తెరలేచింది.
రాబి విలియమ్స్, ఐదా గార్ఫులినా
జబివాకాతో రొనాల్డో
Comments
Please login to add a commentAdd a comment