‘అవుట్ సోర్సింగ్’కు రాజకీయ గ్రహణం?
- ఏజెన్సీ ఎంపిక టెండరు ప్రక్రియకు తాత్కాలిక బ్రేకు
- పని ఒత్తిడే కారణ మంటున్న అధికారులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల కార్యాలయాల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక ప్రక్రియ తాత్కాలికంగా నిలిచింది. ఈ ఏజెన్సీల నియామకం కోసం చేపట్టిన టెండరు ప్రక్రియకు ప్రస్తుతానికి బ్రేకు పడింది. ఇందుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమకు అనుకూలమైన ఏజెన్సీలకు ఈ కాంట్రాక్టు దక్కేలా కొందరు నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2014- 15 ఆర్థిక సంవత్సరంలో అవుట్‌సోర్సింగ్ పద్ధతిపై ఉద్యోగులను సరఫరా చేసే ఏజెన్సీ ఎంపిక నిమిత్తం జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆగస్టు 8న టెండరు నోటిఫికేషన్ జారీ చేసింది.
టెండర్లు దాఖలు చేసేందుకు ఆగస్టు 20 వరకు గడువిచ్చారు. సుమారు 25 ఏజెన్సీలు ఈ టెండరు ప్రక్రియలో పాల్గొన్నాయి. ఈ టెండర్లను అదేరోజు తెరవాల్సి ఉండగా, అధికారులు ఈ ప్రక్రియను వాయిదా వేశారు. సమగ్ర కుటుంబ సర్వే తదితర ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో ఈ టెండర్లను తెరువలేకపోయాని అధికారులు చెబుతున్నారు. కానీ రాజకీయ ఒత్తిళ్లే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రూ.కోట్ల టర్నోవర్
జిల్లాలోని అన్ని కార్యాలయాలు, 104 వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు వెయ్యికి పైగా ఉద్యోగులు, సిబ్బంది అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా పనిచేస్తున్నారు. కం ప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, జూనియర్ అసిసెం ట్లు వంటి పోస్టుల్లో ఉన్నారు. వీరికి ఎంపిక చేసిన అవు ట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వం జీతభత్యాలు చెల్లిస్తుంది. ఈ ఏజెన్సీ ఎంపిక కోసం కలెక్టర్ జగన్మోహన్ జిల్లా అవుట్ సోర్సింగ్ కమిటీని నియమించారు. అదనపు జాయింట్ కలెక్టర్ ఈ కమిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, జిల్లా ఉపాధి కల్పనాధికారి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కార్మిక శాఖ జిల్లా ఉన్నతాధికారి, డీటీవో వంటి అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ టెండర్లు వేసిన ఏజెన్సీల అర్హతలను పరిశీలించి ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతినెలా ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అలవెన్సుల రూపంలో రూ.కోట్లలో టర్నోవర్ ఉండటంతో నేతల కన్ను ఈ ఏజెన్సీలపై పడుతోంది.
ఏజెన్సీల ఆగడాలు
ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు గతంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాయి. ఆయా ఏజెన్సీల నిర్వాహకులు కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రతినెలా చెల్లించాల్సిన వేతనాల్లో కోత పెట్టేవారు. నిరుద్యోగ యువత నెలం తా పనిచేస్తే వచ్చే చాలీ చాలని వేతనంలో ఇలా కోత వి దించడంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఎక్కడ తమ ఉద్యోగం పోతుందోననే భయంతో కాం ట్రాక్టు ఉద్యోగులు ఏజెన్సీ నిర్వాహకులను గట్టిగా ప్ర శ్నించలేక పోయారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఆయా ఏజెన్సీల నిర్వాహకులు ప్రతినెలా లక్షలు దండుకున్నా రు. అలాగే ఉద్యోగుల భవిష్య నిధి(ప్రావిడెంట్ ఫండ్) విషయంలోనూ చేతివాటం ప్రదర్శించారు.
ఉద్యోగుల వేతనాల్లోంచి కోత విధించిన పీఎఫ్ మొత్తంలో కొంత మొత్తాన్ని జేబులో వేసుకున్నారు. దీంతో ఆయా ఉద్యోగులకు పీఎఫ్ ఖాతాలో జమ కావాల్సిన మొత్తం తగ్గిపోవడంతో చిరు ఉద్యోగులు ఆవేదనకు లోనయ్యారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రతినెలా చెల్లించే వేతనాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉండగా, కొన్ని ఏజెన్సీలు అలా చేయకుండా ఉద్యోగికి ఇచ్చి అందులో చేతివాటం ప్రదర్శించారు. ఇప్పుడు కొత్తగా నియామకమైన అవుట్‌సోర్సింగ్ కమిటీ అధికారులు ఆయా ఏజెన్సీల ట్రాక్ రికార్డును క్షుణ్ణంగా పరిశీలించి ఎంపిక చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఈ చిరుద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది.
పని ఒత్తిడే కారణం
- ఎం.ఏ.గఫార్, జిల్లా ఉపాధి కల్పనాధికారి
పని ఒత్తిడి కారణంగానే టెండర్లు తెరువలేకపోయాము. నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా ఆగస్టు 20నే ఈ టెండర్లు తెరవాల్సి ఉండగా, సమగ్ర కుటుంబసర్వే, ఇతర పని ఒత్తిడి కారణంగా ఈ టెండర్లను తెరువలేక పోయాము. అంతేకానీ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు. త్వరలోనే తేదిని ప్రకటించి ఈ టెండర్లను తెరిచేందుకు చర్యలు తీసుకుంటాము.