![Contract Employees Regularized in YS Jagan Govt](/styles/webp/s3/article_images/2025/02/17/CONTRACT-LECTURERS.jpg.webp?itok=bz-Xl3g3)
రెగ్యులరైజేషన్ హామీని విస్మరించిన కూటమి ప్రభుత్వం
ఒత్తిడికి గురై రెండు నెలల్లో నలుగురు కాంట్రాక్టు లెక్చరర్లు మృతి
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేసిన వైఎస్ జగన్
ఈసీకి టీడీపీ ఫిర్యాదుతో కాంట్రాక్టు లెక్చరర్లపై ఆగిన ప్రక్రియ
ఐదు వేల మంది ఆర్తనాదాలను పట్టించుకోని విద్యాశాఖ మంత్రి లోకేశ్
‘కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధికరించి వారి సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత తీసుకుంటా..’ – 2024 ఏప్రిల్ 28న కోడుమూరు నియోజకవర్గం గూడూరు ప్రజాగళం సభలో బాబు హామీ!
ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను వాడుకుంటూ తీవ్ర అన్యాయం చేస్తోంది. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసేలా పోరాడతా’.. – 2017 డిసెంబర్‌లో కాంట్రాక్టు లెక్చరర్లతో ముఖాముఖీలో పవన్ కళ్యాణ్ హామీ!
సాక్షి, అమరావతి: తమ జీవితాలను మార్చే హామీని అమలు చేయాలని వేడుకుంటే.. ‘కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధికరణ మేనిఫెస్టోలో లేదు కాబట్టి అమలు చేయలేం’ అని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కుండ బద్ధలు కొడుతున్నారని కాంట్రాక్టు లెక్చరర్లు వాపోతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు వీలుగా గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని అయినా అమలు చేయాలని కోరితే.. ‘ఆ చట్టాన్ని తాము అమలు చేయాలన్న రూల్ లేదు’ అని లోకేశ్ తేల్చి చెబుతుండటంతో తీవ్ర మానసిక సంఘర్షణతో ఇటీవల నలుగురు కాంట్రాక్టు లెక్చరర్లు ప్రాణాలు విడిచారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక మృతుల కుటుంబాలు వీధిన పడ్డాయి. 2000లో ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 7 వేల మందిని డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లుగా నియమించగా తెలంగాణలో 2021లో కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించారు. ఒకే జీవో ద్వారా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా చేరిన వారు తెలంగాణలో రెండేళ్లుగా రెగ్యులర్ ఉద్యోగులుగా కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇంకా కాంట్రాక్ట్ సిబ్బందిగానే కొనసాగుతున్నారు. ఏపీలోనూ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు 2023 అక్టోబర్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది.
దీని ప్రకారం 2014 జూన్‌కు ముందు విధుల్లో చేరిన 10,117 మంది అర్హులను గుర్తించి క్రమబద్ధీకరించాలని జీవో 114 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో వైద్య, అటవీ, గిరిజన సంక్షేమ తదితర శాఖల్లో పని చేస్తున్న 3 వేల మంది రెగ్యులరైజ్ కావడంతోపాటు గతేడాది ఏప్రిల్ నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. మిగిలిన వారి క్రమబద్ధీకరణ మాత్రం ఎన్నికల కోడ్‌తో నిలిచిపోయింది. వీరిలో 20 ఏళ్లకు పైగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. అర్హులైన అందరి వివరాలు ఆర్థికశాఖ ‘నిధి పోర్టల్’లో ఉన్నా కూటమి ప్రభుత్వం తొక్కిపెడుతోంది.
కాంట్రాక్టు జేఎల్స్‌కు తీవ్ర అన్యాయం
గత ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించటాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఎన్నికలకు ముందు ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అధికారంలోకి వచ్చాక వారిని రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. కాంట్రాక్టు ఉద్యోగులపై గత ప్రభుత్వాలు వివిధ కమిటీలు, మంత్రివర్గ ఉపసంఘాలను నియమించినా వారి కల సాకారం కాలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వారి సమస్యలపై చర్చించి 30/23 చట్టం తెచ్చింది. దీని ప్రకారం మిగతా శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేశారు.
ప్రాణాలు పోతున్నా పట్టదా..!
తెలంగాణలో ఎలాంటి చిక్కులు లేకుండా విద్యాశాఖలో కాంట్రాక్ట్ లెక్చరర్లు రెండేళ్ల క్రితమే రెగ్యులర్ అయ్యారు. 30/23 ద్వారా ఏపీలోనూ రెగ్యులర్ కావాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం మాత్రం వారి పట్ల కక్షగట్టినట్టు ప్రవర్తిస్తోంది. ప్రభుత్వం అర్హులుగా గుర్తించిన 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో దాదాపు 5 వేల మందికి పైగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న వారే ఉన్నారు. ఇంటర్ విద్యలో 3,618 మంది, డిగ్రీ కాలేజీల్లో 695 మంది, పాలిటెక్నిక్ కళాశాలల్లో 309 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. మరణించిన కాంట్రాక్ట్ లెక్చరర్ల కుటుంబాలకు పరిహారం, మట్టి ఖర్చులు ఇవ్వాలని ఉత్తర్వుల్లో ఉన్నా అమలు కావడం లేదని బాధిత కుటుంబాలు కన్నీరు పెడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment