కోపం ఉంటే నాపై చూపండి
చంద్రబాబు అరాచక పాలనను ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో నిలదీసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తారు?
వైఎస్సార్‌సీపీ శ్రేణులు, సామాన్యులపై కక్ష సాధింపు చర్యలు ఎందుకు?
ఇది మానవత్వం అనిపించుకుంటుందా?
ఈ అరాచకాన్ని తెలియ జెప్పాలని అన్ని పార్టీలనూ ధర్నాకు ఆహ్వానించాం
దారుణకాండ ఫొటోలు, వీడియోలు చూసి మాకు మద్దతు ఇవ్వాలని కోరాం
ఎన్నికలప్పుడు చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అబద్ధాలు చెప్పారు.. ఇప్పుడు ఆ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అరాచకం
సాక్షి, అమరావతి: ‘ఏదైనా ఉంటే నాతో తేల్చుకోవాలి.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, మీకు ఓట్లు వేయని సామాన్య ప్రజలపై ఎందుకు దాడులు చేస్తున్నారు? ఇది మానవత్వం అనిపించుకుంటుందా?’ అని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ‘కోపం ఉంటే నాపై చూపండి.. నన్ను చంపాలనుకుంటే చంపేయండి.. నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తారు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి సాగిస్తున్న నరమేధాన్ని యావత్ దేశానికి చాటి చెప్పేలా బుధవారం ఢిల్లీలో వైఎస్ జగన్ భారీ ఎత్తున ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు జాతీయ మీడియా ఛానల్స్ ప్రతినిధులు వైఎస్ జగన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఎన్డీటీవీ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
ఎన్డీటీవీ ప్రతినిధి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణకాండను నిరసిస్తూ మీరు చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వచ్చారు. ఆయన ఇండియా కూటమిలో భాగస్వామి. ఆయన మీకు సంఘీభావం తెలపడాన్ని బట్టి చూస్తే రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని అనుకోవచ్చా?
వైఎస్ జగన్: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసాలు యథేచ్ఛగా కొనసాగిస్తోంది. సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్‌లు పెట్టి.. ఆ హోర్డింగ్‌ల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారుల పేర్లు ప్రచురించి.. టీడీపీ శ్రేణులను దాడులకు పురిగొల్పుతున్నారు. ఆ దాడుల పట్ల చూసీ చూడనట్లు వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశిస్తున్నారు.
దాంతో టీడీపీ శ్రేణులు పెట్రేగిపోయి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, టీడీపీ కూటమికి ఓటు వేయని ప్రజలపై దాడులు చేస్తున్నాయి. హత్యలు చేస్తున్నాయి.. హత్యాయత్నాలకు తెగబడుతున్నాయి.. వాటికి సంబంధించి వీడియోలు, ఫొటోలు.. తదితర సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు.
నాగరిక సమాజం ఖండించాల్సిన ఈ దారుణకాండను యావత్ దేశం దృష్టికి తీసుకురావాలనే ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. టీడీపీ కూటమి ప్రభుత్వ హత్య, హత్యాయత్నాలు, దాడులకు సంబంధించి వీడియో, ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం. దీన్ని సందర్శించాలని అన్ని రాజకీయ పార్టీలనూ ఆహ్వానించాం. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌నూ ఆహ్వానించాం.
ఎన్డీటీవీ ప్రతినిధి: టీడీపీ ప్రభుత్వ దమనకాండపై ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రపతికి లేఖలు రాశారు కదా? వారు ఏమైనా స్పందించారా?
వైఎస్ జగన్: గత 45–50 రోజులుగా ఆంధ్రపదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అరాచక, ఆటవిక పాలనపై ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌షా, రాష్ట్రపతికి లేఖలు రాశాను. ఇదే రీతిలో అన్ని పార్టీలనూ ధర్నాకు ఆహ్వానించాను. టీడీపీ ప్రభుత్వ అరాచకాలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లు.. ఫొటోలు చూశాక.. ఆ దారుణకాండను ఖండించాలా? వద్దా? అన్నది నిర్ణయించుకోవాలని విజ్ఞప్తి చేశాను.
ప్రజాస్వామ్యం అంటే సమన్యాయం. సమన్యాయం లేకపోత అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలకు ఆస్కారమే ఇవ్వలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, టీడీపీకి ఓటు వేయని ప్రజలపై దాడులు చేస్తూ కొత్త ఒరవడి సృష్టిస్తోంది. ఇలాంటి అరాచకాలను ఖండించకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాధించదు.
ఎన్డీటీవీ ప్రతినిధి: మీ ప్రభుత్వ పాలనలో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తననే జైలు పాలు చేశారని సీఎం చంద్రబాబు అంటున్నారు కదా?
వైఎస్ జగన్: మేం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. టీడీపీ సానుభూతిపరులు, సామాన్యులపై దాడులు జరిగిన దాఖలాలే లేవు. అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. కోర్టు రిమాండ్‌పై చంద్రబాబు జైలుకెళ్లారు. ఇదెలా కక్ష సాధింపు అవుతుంది? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 1000కి పైగా దాడులు చేశారు.. 300 హత్యాయత్నాలు జరిగాయి.. 30కిపైగా హత్యలు చేశారు.
ఎన్డీటీవీ ప్రతినిధి: అఖిలేష్ యాదవ్ మీకు సంఘీభావం తెలిపి వెళ్లగానే.. ఇండియా కూటమిలో మరో భాగస్వామి మీకు సంఘీభావం తెలపడానికి వచ్చారు.. దీన్ని బట్టి చూస్తే ఇది రాజకీయ పునరేకీకరణ కాదా?
వైఎస్ జగన్: టీడీపీ అరాచక పాలనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చూసి.. ప్రజాస్వామ్య పరిరక్షణకు మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశాం. మా ఆహ్వానాన్ని అందుకున్న పార్టీలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మాకు సంఘీభావం తెలపడానికి ముందుకొస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ అరాచకాలను వివరించడానికి అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరాను. ప్రధాని అపాయింట్‌మెంట్ ఇస్తారనే ఆశిస్తున్నాను.
ఎన్డీటీవీ ప్రతినిధి: నిన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అమరావతికి రూ.15 వేల కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి సహకరిస్తామని హమీ ఇచ్చారు. వీటిని ఎలా చూస్తారు?
వైఎస్ జగన్: అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు అప్పు ఇవ్వడంలో ఏముంది? విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. చంద్రబాబు అరాచక పాలన ఎందుకు సాగిస్తున్నారంటే.. శాంతిభద్రతలను ఎందుకు గాలికొదిలేశారంటే.. ఎన్నికలకు ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అబద్ధపు హామీలు ఇచ్చారు. ఆ హామీలను అమలు చేయలేరు. దీన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే అరాచక పాలన సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment