ఉచిత ఇసుక ఎక్కడైనా దొరుకుతోందా?: వైఎస్‌ జగన్‌ | YS Jagan direct question to CM Chandrababu Free Sand | Sakshi
Sakshi News home page

ఉచిత ఇసుక ఎక్కడైనా దొరుకుతోందా?: వైఎస్‌ జగన్‌

Published Mon, Oct 14 2024 5:25 AM | Last Updated on Mon, Oct 14 2024 2:37 PM

YS Jagan direct question to CM Chandrababu Free Sand

సీఎం చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ సూటి ప్రశ్న

ఎన్నికల ముందు ఉచితం అంటూ ఊరూరా డప్పు కొట్టారు 

మా హయాంలో ఏటా రూ.750 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చేది   

ఇప్పుడు ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రాకపోగా ప్రజలకు రెండు, మూడు రెట్లు ధర ఎందుకు పెరిగింది? 

ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా? 

మేం నిల్వ ఉంచిన ఇసుకను టీడీపీ, కూటమి పార్టీల నేతలు దోచేయలేదా?

2014–19 మధ్య ఇసుకను కొల్లగొట్టి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారు.. ఇప్పుడు కూడా సేమ్‌ టు సేమ్‌ 

ప్రజలంతా దసరా పండుగలో ఉంటే, ఇసుక పాలసీ ప్రకటించకుండానే దొంగచాటుగా టెండర్లేమిటి?

సాక్షి, అమరావతి: ‘పక్క వీధిలో జరగకపోయినా ఓ దొంగతనం జరుగుతోందంటూ ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి.. ఆ తర్వాత ప్రజలంతా అటు వెళ్లగానే మొత్తం ఆ ఇళ్లలో దోపిడీకి దిగాడంట. ఇసుక దోపిడీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు తీరు కూడా ఇలాగే ఉంది. గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటి? అందుకే ఆయన్నే అడుగుతున్నా.. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? లభిస్తే ఎక్కడో చెప్పగలరా?’.. అంటూ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌) ద్వారా సూటిగా ప్రశ్నించారు. 

‘మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి.. ఇప్పుడు అదికూడా లేదు. అసలు ఇసుక కొందామంటే మా ప్రభుత్వంలో కన్నా రేటు రెండింతలు ఎక్కువగా ఉంది. ఎన్నికల్లో ఉచితంగా ఇసు­కను ఇస్తామంటూ ఊరూరా డప్పువేసిన విషయాన్ని మరిచిపోయారా? ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా? అధికార దుర్వినియోగంతో ఇసుక చుట్టూ ఒక మాఫియాను మీరు ఏర్పాటుచేయలేదా? భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా.. లేదా?’.. అంటూ వైఎస్‌ జగన్‌ ఆ ట్వీట్‌లో ప్రశ్నల పరంపర సంధించారు. ఆయన అందులో ఇంకా ఏం పేర్కొన్నారంటే..

వచ్చీ రాగానే ఇసుకను దోచేయలేదా?
ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి క్షణంలోనే టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా? వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్టాక్‌యార్డుల్లో ఉంచిన సుమారు 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక మీ ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవకముందే ఎక్కడికి పోయింది? ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే టీడీపీ, ఆ కూటమికి చెందిన పార్టీల నేతలు దోచేయలేదా? కొండల్లా ఉండే ఇసుక నిల్వలు కొన్నిరోజుల వ్యవధిలోనే మాయమైపోయాయన్నది నిజం కాదా? 

ఈ విధానానికి సృష్టికర్త, మూల పురుషుడు మీరే కదా?
2014–19 మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేసిన తీరు మళ్లీ ఇప్పుడు పునరావృతం అయ్యిందన్నది వాస్తవం కాదా? ఈ విధానానికి సృష్టికర్త, మూల­పురుషుడు మీరే కదా చంద్రబాబు! ఆ రోజుల్లో మీరు ఇసుక బాధ్యతలను మొదట ఏపీఎండీసీకి అప్పగించారు.. ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్లుగా బిల్డప్‌ ఇచ్చారు.. రెండునెలలు కాకుండానే దాన్ని రద్దుచేసి టెండర్లు నిర్వహిస్తా­మన్నారు. చివరికి.. ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకేఒక్క మెమో ఇచ్చి అప్ప­నంగా మీ మనుషులకు అప్పగించారు. 

మొత్తంగా ఆ ఐదేళ్లలో 19 జీఓలు ఇచ్చారు. ఆ నది, ఈ నది అని లేకుండా ప్రతిచోటా ఇసుకను కొల్లగొట్టి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఇప్పుడు కూడా జరుగుతున్నది సేమ్‌ టు సేమ్‌. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా ఇప్పటికీ స్పష్టమైన ఇసుక విధానంలేదు. పేరుకు ఉచితం అంటున్నారంతే. మొత్తం వ్యవహారం అంతా చంద్రబాబు.. ఆయన ముఠా వల్ల, ముఠా కొరకు, ముఠా చేతుల మీదుగా నడుస్తోంది. పాలసీని ప్రకటించకుండా ప్రజలంతా దసరా పండుగలో ఉంటే, దొంగచాటుగా టెండర్లు పిలవడం నిజం కాదా చంద్రబాబుగారూ? దేశంలో ఎక్కడా చూడని విధంగా ఉద్దేశపూర్వకంగా కేవలం రెండ్రోజులు మాత్రమే గడువు ఇచ్చింది మీ స్వార్థం కోసం కాదా? ఎవరినీ టెండర్లలో పాల్గొనకుండా దౌర్జన్యాలకు పాల్పడిన మాట వాస్తవం కాదా? 



గతంలో అత్యంత పారదర్శకంగా ఇసుక విధానం..
అదే గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇసుక విధా­నాన్ని అత్యంత పారదర్శకంగా అమలుచేసింది. దోపిడీలకు అడ్డుకట్టవేసి ఇటు ప్రభుత్వానికి ఆదా­యం వచ్చేలా, అటు వినియోగదారునికీ సరసమైన ధరకు అందించింది. అత్యంత పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్‌ఫాం మీద ఈ–టెండర్లు నిర్వహించింది. రీచ్‌ల వద్ద ఆపరేషన్‌ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను రూ.475కే సరఫరా చేసింది. ఇందులో రూ.375లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేలా చేసింది. రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికీ ఇసుక రేట్లను ప్రకటించింది.

ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?
ఇక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోసే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పార­దర్శకంగా రేట్లపై గత ప్రభు­త్వం ప్రకటనలు ఇచ్చింది. ప్రజ­లకు తక్కువ ధరకు ఒకవైపు ఇస్తూ మరోవైపు రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చేట్లుగా చేసింది. రేట్లపై ‘సెబ్‌’ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి తప్పులకు ఆస్కారంలేకుండా కఠిన చర్యలు తీసుకుంది. 

తద్వారా ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయాన్ని ఖజానాకు వచ్చేలా చేసింది. మరి మీ హయాంలో ప్రభుత్వానికి ఒక్క రూపాయి రావడంలేదన్నది వాస్త­వం కాదా? ప్రజలకూ ఉచితంగా అందడంలేదన్నది నిజం కాదా? ఇసుక ఉచి­తమే అయితే వైఎస్సార్‌సీపీ హయాంలో కన్నా రేట్లు ఎందుకు 2–3 రెట్లు పెరిగాయి? మరి ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది చంద్రబాబు?   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement