చినబాబు బ్యాచ్‌ చిత్రహింసలు! | Complaint by victim Paleti Rajkumar to Human Rights Commission | Sakshi
Sakshi News home page

చినబాబు బ్యాచ్‌ చిత్రహింసలు!

Published Sun, Jun 16 2024 5:23 AM | Last Updated on Sun, Jun 16 2024 1:54 PM

Complaint by victim Paleti Rajkumar to Human Rights Commission

మోకాళ్లపై మోకరిల్లి లోకేశ్‌ ఫ్లెక్సీ ఎదుట క్షమాపణ చెప్పాలని బెదిరించారు 

సీజేఐ, హైకోర్టు సీజే, మానవ హక్కుల కమిషన్‌కు బాధితుడు పాలేటి రాజ్‌కుమార్‌ ఫిర్యాదు 

నన్ను కిడ్నాప్‌ చేసి రాత్రంతా చిత్రహింసలకు గురి చేశారు 

ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేశారు 

స్కూల్‌లో చదివే నా పిల్లలు అవమాన భారంతో ఇంటికొస్తున్నారు 

పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు వెనక్కు తీసుకోకుంటే చంపుతామని బెదిరిస్తున్నారు 

వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై విచ్చలవిడిగా దాడులు 

మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని విన్నపం

సాక్షి, అమరావతి: మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేశ్‌ అనుచరులు ఈ నెల 9వ తేదీన తనను కిడ్నాప్‌ చేసి రాత్రంతా చిత్ర హింసలకు గురి చేసినట్లు పెదవడ్లపూడికి చెందిన బాధితుడు పాలేటి రాజ్‌కుమార్‌ సుప్రీం కోర్టు, హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. లోకేశ్‌ ఫ్లెక్సీ ఎదుట మోకాళ్లపై కూర్చోబెట్టి బెదిరించి క్షమాపణ చెప్పించి చిత్రీకరించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి తన కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నాడు.

వీటి ప్రభావంతో పాఠశాలలో చదువుతున్న తన పిల్లలు అవమానభారంతో ఇంటికొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నేతలు పదే పదే బెదిరింపులకు దిగుతున్నారని, తక్షణమే జోక్యం చేసుకుని అరికట్టకుంటే తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని విన్నవించుకున్నాడు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై చట్టప్రకారం పోలీసులతో విచారణ జరిపి వ్యక్తిగత, భావ ప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కులను పరిరక్షించాలని కోరాడు. ఫిర్యాదులో ముఖ్యాంశాలు ఇవీ.. 

మంగళగిరి నియోజకవర్గంలో 2019–24 మధ్య వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను మా కుటుంబంతో కలసి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశా. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులకు పాల్పడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. నారా లోకేశ్‌ అండదండలతో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు.  

 ఈ నెల 9వతేదీన సాయంత్రం 4.30 గంటల సమయంలో నారా లోకేశ్‌కు సన్నిహితుడైన జవ్వాడి కిరణ్‌చంద్‌ అనుచరులు నరేంద్ర, షేక్‌ బాజీ, జానీ తదితరులు నేను మా అత్త ఇంట్లో ఉన్న సమయంలో మారణాయుధాలతో దాడి చేశారు.  ఫరీ్నచర్‌ను ధ్వంసం చేశారు. ఏపీ 39 జీబీ 3333 వాహనంలో నన్ను కిడ్నాప్‌ చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించి రాత్రంతా చిత్రహింసలకు గురిచేశారు. నా చొక్కా  విప్పించి నారా లోకేశ్‌ ప్లెక్సీ ఎదుట మోకాళ్లపై మోకరిల్లి ముకుళిత హస్తాలతో క్షమాపణ చెప్పాలని బెదిరించి వీడియో చిత్రీకరించారు. ఈనెల 10వతేదీ తెల్లవారు జాము 4 గంటలకు బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై వదిలేసి వైఎస్సార్‌ సీపీకి మద్దతు పలికితే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.  

 నాపై దాడి చేసిన వారిపై అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు (ఎఫ్‌ఐఆర్‌ నెంబరు 78/2024) చేశా. ఫిర్యాదు వాపసు తీసుకోవాలంటూ టీడీపీ మద్దతుదారులు పదే పదే ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు నా ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.   

మానవ హక్కులను కాలరాయడంపై తక్షణమే జోక్యం చేసుకుని టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి నాకు, నా కుటుంబానికి రక్షణ కలి్పంచాలి. నా ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణకు ఆదేశించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నా.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement