కొందరు మోసపూరిత ధోరణి అనవచ్చు కానీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో మాత్రం ఇది నేర్పరితనమే. చేసిన వాగ్ధానాలతో నిమిత్తం లేకుండా ఆయన ప్రభుత్వ స్కూళ్లకే వెళ్లి విద్యార్థులకు.. వారి తల్లిదండ్రులకు సుద్దులు చెప్పి తిరిగి వచ్చారు. మెగా పేరెంట్స్, టీచర్స్ కమిటీల సమావేశాలతో రికార్డు సృష్టించామని ప్రకటించుకున్నారు కూడా. సహజంగానే ఆయన కుమారుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ఈ గొప్పలకు గొంతు కలిపారు.
తామేం చేయబోతున్నామో చెప్పి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇస్తే బాగుంటుంది కానీ.. ప్రచారం కోసం ఉత్తుత్తి మీటింగ్‌లు పెడితే ఏం లాభం? పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే కొన్ని రోజుల క్రితం ఒక్కరోజు గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించినట్లు గొప్పలు చెప్పుకున్నారు. బహుశా వీటికి పోటీగానే లోకేష్ పేరెంట్స్ మీటింగ్స్ పెట్టినట్లుంది. ఒకరికొకరు పోటాపోటీ సమావేశాలు నిర్వహించారన్నమాట!!
పవన్ ,లోకేష్‌కు మధ్య సాగుతున్న ఈ అంతర్గత పోరు రాజకీయంలో చంద్రబాబు కూడా తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని గతంలోనే చెప్పుకున్న చంద్రబాబు ఈ సారి మాత్రం ప్రభుత్వ స్కూళ్ల ఉద్ధరణకు సంకల్పం చెప్పుకున్నారు. కానీ ఎన్నికల హామీల్లో భాగంగా తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. ఊరకే సమావేశాలు పెట్టామని చెబితే వచ్చే ప్రయోజనం ఏమిటి? పైగా ఇవే సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని తప్పుడు ఆరోపణలు సైతం గుప్పించారు.
బాపట్లలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్, పేరెంట్స్‌తో భేటీ అయిన చంద్రబాబు, లోకేష్‌లకు అక్కడి పరిస్థితులను చూసిన వెంటనే జగన్ ప్రభుత్వం చేసిన మంచి కనిపించి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్‌బోర్డులు, మంచి బల్లలు, ఫ్యాన్లు, మంచినీటి వసతి, శుభ్రమైన మరుగుదొడ్లను చూసే ఉంటారు. స్కూల్ భవనాలు బాగుపడ్డ సంగతీ అర్థమై ఉంటుంది. అప్పటికే పవన్‌కళ్యాణ్ కూడా కొన్ని స్కూళ్లలో వచ్చిన మార్పులను ప్రత్యక్షంగా గమనించి ఆశ్చర్యపోయిన విషయం సోషల్‌మీడియాలోనూ విస్తృతంగా వ్యాప్తి చెందింది. అధికారం చేపట్టిన తరువాత ఈ ఆరునెలల్లో స్కూళ్లను ఉద్ధరించేందుకు చేసిందేమీ లేకపోయినా తామూ ఏదో చేస్తున్నామని అనిపించుకునేందుకు మాత్రమే ఈ సమావేశాలను నిర్హించినట్లు కనిపిస్తోంది.
నిజానికి ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశారన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. కర్నూలులో మంత్రి టీజీ భరత్ ఎదుట ఒక విద్యార్ధి తల్లి స్కూళ్లలో సమస్యలను వివరించిన ఉదంతమే అందుకు ఉదాహరణ అని చెప్పాలి. పారిశుద్ద్యం ఎలా కొరవడిందో, పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆమె చెబుతుంటే మంత్రి ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు తమ ప్రచారం కోసం స్కూళ్లకు వెళ్లినా, వారు ఏమి తప్పు చేస్తున్నది వారికి తెలియకుండా ఉంటుందా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్య, వైద్య రంగంలో చేపట్టిన సంస్కరణలు చాలా ముఖ్యమైనవి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాడునేడు పేరుతో అనేక కార్యక్రమాలు ప్లాన్ చేశారు. స్కూళ్ల రూపురేఖలను మార్చేశారు. ఇలా విద్యార్థులు, తల్లిదండ్రుల మనసుల్లో జగన్ వేసిన ముద్రను చెరిపేసేందుకు చంద్రబాబు బృందం చేయని ప్రయత్నం లేదు. జగన్ కంటే ఎక్కువ మంచి చేస్తే బాగుండేది కానీ.. ఒకపక్క ప్రభుత్వ స్కూళ్ల గురించి మాట్లాడుతూ, ఇంకోపక్క ప్రైవేటు స్కూళ్లకు ఉపయోగపడేలా వ్యవహరించడంతోనే వస్తుంది సమస్య.
జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో స్కూల్ తెరిచే జూన్ నెలలోనే తల్లుల ఖాతాలో రూ.15 వేల చొప్పున వేసేది. పిల్లలు స్కూళ్లు మానివేయకుండా ఉండడానికి చేసిన ఈ ప్రయత్నం జగన్‌కు పేరు తేవడంతో చంద్రబాబు అండ్ కో తాము అంతకంటే ఎక్కువ ఇస్తామని, ప్రతి విద్యార్దికి రూ.15 వేల చొప్పున వేస్తామని నమ్మబలికారు. ‘‘ఓపిక ఉంటే ఎంతమంది పిల్లలనైనా కనండి’’ అని వారి బాధ్యత తనదని బొంకిన నేత ఇప్పుడు అసలు తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు ఇచ్చేది చెప్పడం లేదు. అమ్మ ఒడి వల్ల జగన్ విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించి ఉంటే, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు తల్లికి వందనం పేరుతో పిల్లలందరికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎందుకు చెప్పారో వివరించాలి కదా?
రానున్న రోజుల్లో విద్యావ్యవస్థలో పెనుమార్పులు తెస్తామని చంద్రబాబు అన్నారు. అవేమిటో చెప్పాలి కదా? జగన్ ప్రభుత్వం పిల్లలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని రకరకాల ప్రయత్నాలు చేసింది. ఆ క్రమంలో ఏపీ ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే వరకు వెళ్లారు. విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించడమంటే ఇదే అని చంద్రబాబు చెబుతున్నారా? జగన్ టైమ్ లో పిల్లలు ఆంగ్ల మీడియంలో చదువుకుంటూ చక్కగా ఇంగ్లీష్‌లో మాట్లాడేలా ఎదిగారు. అందువల్ల విద్యా వ్యవస్థ భ్రస్టు పట్టిందని చంద్రబాబు అంటారా? అప్పట్లో ఇంగ్లీష్ మీడియం కు వ్యతిరేకంగా కూటమి నేతలంతా ప్రచారం చేశారు. వారి ప్రభుత్వం రాగానే ఆంగ్ల మీడియం ను నిరుత్సాహపరచే చర్యలు చేపట్టారు.
తద్వారా ప్రైవేటు స్కూళ్లకు మేలు చేయడానికి చంద్రబాబు తనదైన శైలిలో ప్రయత్నించారని అంటారు. ఇది కదా ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించడం అంటే! అలాగే సీబీఎస్‌ఈ, ఐబి కోర్స్, టోఫెల్ వంటి విన్నూత్నమైన, ఖరీదైన కోర్సులను పేదలకు ఉచితంగా అందేలా జగన్ చేశారు. చంద్రబాబు భావనలో ఇది విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించడమేమో చెప్పాలి. ప్రతి ఏటా పిల్లలకు టాబ్ లు అందచేయడం తప్పని అనుకుంటున్నారా? ఈనాడు మీడియా అప్పట్లో నీచంగా పిల్లల ట్యాబ్ లపై ప్రచారం చేసి తన ఫ్యూడల్ ధోరణిని బయటపెట్టుకుంది. చంద్రబాబు ప్రభుత్వం దానికి వత్తాసు పలుకుతోందేమో తెలియదు. స్కూళ్లలో పారిశుద్ద్యం, పిల్లకు భోజనం వంటి వాటిపై జగన్ ప్రభుత్వం అత్యంత శ్రద్ద వహించిందన్నది వాస్తవం.
ఫైవ్ స్టార్ హెటల్ స్థాయిలో టాయిలెట్లను ఏర్పాటు చేసి, వాటి నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించింది. ఇప్పుడు అవేమి అయిపోయాయో తెలియదు కాని, కర్నూలులో ఒక విద్యార్ధి తల్లి టాయిలెట్ల అధ్వాన్న పరిస్థితిపై వివరించడం వింటే ఎవరికైనా ఆవేదన కలుగుతుంది. జగన్ ఎన్ని సంస్కరణలు తీసుకు వచ్చినా వ్యతిరేకిస్తూ వికృతమైన కధనాలు రాసిన ఎల్లో మీడియా ఇప్పుడు విద్యా శాఖ నాలుగైదు రకాల బడులను ఏర్పాటు చేయబోతోందని చెబుతోంది. అంటే గత ప్రభుత్వ వ్యవస్థను దెబ్బ తీయడమే లక్ష్యంగా కనిపిస్తుంది.
ఈ ప్రభుత్వ తీరుతో రెండు లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్ల నుంచి వెళ్లిపోయారని కొన్ని వార్తా కథనాలు సూచిస్తున్నాయి. ఈ విషయాలన్నిటిని జగన్ ప్రస్తావించి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ ఆయనకు ఎవరూ సమాధానం ఇవ్వడం లేదు.పైగా బుకాయిస్తున్నారు. ఈ జనవరి నాటికి డీఎస్సీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వచ్చే జూన్ నాటికి కొత్త టీచర్లు వస్తారని చెబుతున్నారు. మంత్రి లోకేష్ ఒక మాట అన్నారు. పిల్లలంతా తన కుమారుడు దేవాన్ష్ లానే అనిపిస్తారని చెప్పారు. మంచి మాటే. కానీ దేవాన్ష్‌కు వస్తున్న చదువు స్టాండర్ట్ తను మంత్రిగా బాధ్యత వహిస్తున్న ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు తీసుకు రావడం లేదు. జగన్ పై ఉన్న ద్వేషంతో ఉన్న కోర్సులను ఎందుకు తీసివేశారు.?
ప్చ్... ఏంటో బాబు గారి మాటల అర్థం?
విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని అనుకుంటున్నాం అని చెబుతున్న లోకేష్ ఎన్నికలకు ముందు టీచర్లను ఎలా రెచ్చగొట్టింది తెలియదా? ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుతో పిల్లలకు నైతిక విలువల గురించి బోధిస్తామని చంద్రబాబు చెబుతున్నారు.మంచిదే! కానీ ముందుగా ప్రభుత్వానికి నైతిక విలువలు ఉండేలా ఏమి చర్యలు తీసుకుంటున్నారో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. నైతిక విలువలు నేర్పడం వరకు బాగానే ఉంటుంది. అదే సమయంలో మూఢ విశ్వాసాలు పెరిగేలా ఉపన్యాసాలు చెప్పకుండా ఉండడం కూడా అవసరమే.
చాగంటి నియామకాన్ని జనవిజ్ఞాన వేదికకు చెందిన పలువురు మేధావులు తప్పు పట్టారు. ఏది ఏమైనా జగన్ తీసుకు వచ్చిన విప్లవాత్మక మార్పులను ఒక వైపు ధ్వంసం చేస్తూ, మరో వైపు మెగా సమావేశాలు అంటూ కోటి ఇరవై లక్షల మందితో జరిగాయని చెబితే పిల్లలకు వచ్చే లాభం ఏమిటి? మీటింగ్ లతో తల్లికి వందనం చేసినట్లు అయిపోతుందా? అదేదో సామెత ఉంది. ఉత్తుత్తిగానే అన్నం పెట్టాం, కూర వేశాం.. మజ్జిగ వేశాం.. అంటూ పిల్లల ఆట మాదిరిగా విద్యావ్యవస్థను మేడిపండు చందంగా మార్చకుండా ఉంటే అదే పదివేలు!
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment