![Orders increasing bid capacity of contractors in tender process: Andhra pradesh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/cm-chandrababu.jpg.webp?itok=zpz36KVV)
అడిగినంత కమీషన్లు ఇచ్చే బడా కాంట్రాక్టర్లకే పెద్దపీట
కాంట్రాక్టర్ల బిడ్ కెపాసిటీని పెంచుతూ ఉత్తర్వులు
వారికే భారీగా పనులు కట్టబెట్టేలా నిబంధనల సడలింపు
బిడ్ కెపాసిటీ లెక్కింపు 2 ఏఎన్–బీ నుంచి 3 ఏఎన్–బీగా మార్పు
పనుల్లో జాప్యంతో భారీగా పెరిగిన అంచనా వ్యయం.. ఖజానాపై భారం
అయినా కాంట్రాక్టర్ సామర్థ్యాన్ని పెంచడంపై అధికారుల విస్మయం
మొబిలైజేషన్ అడ్వాన్సు ముట్టజెప్పి కమీషన్లు దండుకోవడమే ‘పెద్దల’ లక్ష్యం
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పనుల టెండర్లలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ వంటి పారదర్శక, అవినీతి రహిత విధానాలు రద్దయిపోయాయి. ఇష్టారీతిన నిబంధనల సడలింపులు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఖజానాను దోచి పెట్టి కమీషన్లు దండుకొనే పద్ధతులు వచ్చేశాయి. ఇందులో భాగంగా తాము కోరుకొనే బడా కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా తాజాగా నిబంధనలు రూపొందించారు.
కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో పనులు దక్కించుకునేలా బిడ్ సామర్థ్యం లెక్కింపు నిబంధనను 2 ఏఎన్–బీ నుంచి 3 ఏఎన్–బీగా సడలించే ప్రతిపాదనపై మంత్రివర్గంతో ఈనెల 6న ఆమోద ముద్ర వేయించారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2003 జూలై 1న జారీ చేసిన జీవో 94 ద్వారా రూపొందించిన టెండర్ విధానంలో బిడ్ కెపాసిటీని మార్చుతూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెంబరు 4) జారీ చేశారు.
విదేశీ రుణ సాయంతో చేపట్టిన ప్రాజెక్టుల పనులు మినహా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ), అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్), జల్‌జీవన్ మిషన్ సహా అన్ని శాఖల ద్వారా చేపట్టే పనులకు జారీ చేసే టెండర్ నోటిఫికేషన్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే కాంట్రాక్టర్లు దక్కించుకున్న పనులను ఆ టెండర్ నిబంధనల్లో నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయకపోవడం వల్ల వాటి అంచనా వ్యయం పెరిగి ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది.
అయినా అదే కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో మరిన్ని పనులు అప్పగించేలా నిబంధనలను సడలించడంపై ఇంజినీరింగ్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్లకే పనులు కట్టబెట్టడానికే బిడ్ సామర్థ్యం లెక్కించే ప్రతిపాదనను సడలించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
రూ.వేల కోట్ల పనులు కట్టబెట్టేందుకే..
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణం రూ.15 వేల కోట్లతో చేపట్టిన పనులకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. 2024 ఏప్రిల్ 1 నాటికి ఒప్పంద విలువలో 25 శాతం లోపు పూర్తయిన పనులను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్తవి చేపట్టేందుకు సిద్ధమైంది. జల వనరులు, పురపాలక పట్టణాభివృద్ధి, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు – మౌలిక సదుపాయాల కల్పన శాఖల పరిధిలో పలు పనులు చేపడుతోంది.
అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్లకే కట్టబెట్టి వాటి ఒప్పంద విలువలో ప్రభుత్వ ఖజానా నుంచి 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి, అందులో 8 శాతాన్ని కమీషన్‌గా రాబట్టుకోవడానికి స్కెచ్ వేశారు. ఈ క్రమంలోనే బిడ్ సామర్థ్యం లెక్కింపు నిబంధనను 3 ఏఎన్–బీగా మార్చారు. ఈ నిబంధనలో ‘ఏ’ అంటే గత ఐదేళ్లలో ఏదైనా ఒక ఏడాది గరిష్టంగా పనులు పూర్తి చేసి, పురోగతిలో ఉన్న పనుల విలువ. ‘ఎన్’ అంటే టెండర్ నోటిఫికేషన్‌లో ఆ పని పూర్తి చేయడానికి నిర్దేశించిన సమయం. ‘బీ’ అంటే ఆ కాంట్రాక్టర్ అప్పటికే దక్కించుకున్న పనుల్లో మిగిలిన పనుల విలువ.
ఉదాహరణకు ఓ కాంట్రాక్టర్ పదేళ్లలో ఒక ఏడాది గరిష్టంగా రూ.1000 కోట్ల విలువైన పనులు చేశారనుకుందాం. ప్రస్తుతం టెండర్ పిలిచిన పనిని రెండేళ్లలో పూర్తి చేయాలని నిబంధన పెట్టారనుకుందాం. అప్పటికే ఆ కాంట్రాక్టర్ దక్కించుకున్న పనుల్లో మిగిలిన పనుల విలువ రూ.500 కోట్లు అనుకుందాం. అప్పుడు 3 ఏఎన్–బీ కింద ఆ కాంట్రాక్టర్‌కు రూ.5,500 కోట్ల విలువైన పనులు దక్కించుకోవడానికి అర్హత వస్తుంది. అదే 2 ఏఎన్–బీ కింద అయితే ఆ కాంట్రాక్టర్‌కు రూ.3,500 కోట్ల విలువైన పనులకే అర్హత ఉంటుంది.
పనుల్లో జాప్యం.. ఖజానాపై తీవ్ర భారం
సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి పథకాలతోపాటు వివిధ విభాగాల్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు గడువులోగా పనులు పూర్తి చేయడంలేదు. తీవ్ర జాప్యం జరుగుతోంది. సిమెంట్, ఇనుము, పెట్రోల్, డీజిల్ తదితర ధరలు పెరగడం వల్ల అంచనా వ్యయం కూడా భారీగా పెరుగుతోంది. దీని వల్ల ఖజానాపై తీవ్రంగా భారం పడుతోంది. ప్రభుత్వ తాజా నిబంధన వల్ల రూ.వంద కోట్ల విలువైన పనులను రెండేళ్లలో పూర్తి చేయలేక చతికిలబడిన కాంట్రాక్టర్‌కే కొత్తగా రూ.వెయ్యి కోట్ల విలువైన పనులు దక్కుతాయి.
వీటినీ రెండేళ్లలో పూర్తి చేసేలా ప్రభుత్వం నిబంధనను సడలించింది. రూ.100 కోట్ల పనులకే వనరులు సమకూర్చుకోలేక, ఏళ్ల కొద్దీ జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లు.. అంతకంటే పదింతల పనిని ఎలా చేయగలుగుతారని ఇంజినీర్లు అంటున్నారు. ఫలితంగా ఆ పనుల ఫలితాలను ప్రజలకు అందించడంలో తీవ్ర జాప్యం జరగడంతోపాటు ప్రభుత్వ ఖజానాపై పెద్ద ఎత్తున భారం పడుతుందని, ఇది ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment