చంద్రబాబూ.. తొలి హెచ్చరిక | Former CM YS Jaganmohan Reddy fires on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. తొలి హెచ్చరిక

Published Thu, Mar 13 2025 5:44 AM | Last Updated on Thu, Mar 13 2025 8:08 AM

Former CM YS Jaganmohan Reddy fires on Chandrababu Naidu

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం 

‘యువత పోరు’ను పోలీసులతో అడ్డుకోవడానికి మీ ప్రభుత్వం కుటిల యత్నాలు 

వాటన్నింటినీ అధిగమించి మీ ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై విద్యార్థులు, నిరుద్యోగులు నిలదీశారు 

పలు సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలకు తోడుగా ఉంటాం    

అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను సైతం ఊడగొడుతున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ఏటా రూ.7,200 కోట్లు చొప్పున ఖర్చు చేయాలి. కానీ గతేడాది బడ్జెట్‌లో ఒక్క పైసా కేటాయింపూ లేదు. ఈ ఏడాదికి కూడా ఒక్క పైసా కేటాయించలేదు. 

రెండేళ్లలో ప్రతి నిరుద్యోగికీ రూ.72 వేల చొప్పున బకాయి పడ్డారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేస్తూ, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందకుండా అడ్డుకుంటూ.. పేద విద్యార్థులకు మెడికల్‌ విద్యను దూరం చేస్తున్నారు.

సాక్షి, అమరావతి: విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్‌సీపీ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘యువత పోరు’ కార్యక్రమాన్ని పలు చోట్ల పోలీసులతో అడ్డుకోవాలని యత్నించినా వాటన్నింటినీ అధిగమించి చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై నిలదీశారని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ‘చంద్రబాబూ..! నిరుద్యోగులు, విద్యార్థులు మీకు పంపిన తొలి హెచ్చరిక ఇది’ అని హెచ్చరించారు. 

‘యువత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. పలు సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులతో సహా అన్ని వర్గాలకూ పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని ‘ఎక్స్‌’ వేదికగా భరోసా ఇస్తూ తన ఖాతాలో వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

అందులో ఏమన్నారంటే..  
» చంద్రబాబూ..! పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా ‘‘యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నా. పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే యత్నాలను అధిగమించి సంవత్సరం కాలంగా మీ ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై నిలదీశారు. నిరుద్యోగులు, విద్యార్థులు మీకు పంపిన తొలి హెచ్చరిక ఇది. 

»   పేదరికం కారణంగా ఎవరూ పెద్ద చదువులకు దూరం కాకూడదన్న దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం విద్యాదీవెన ద్వారా సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన ద్వారా హాస్టల్, మెస్‌ ఛార్జీలను నేరుగా తల్లులు, ఆ పిల్లల ఖాతాలకే జమ చేస్తూ అమలు చేసిన ఈ పథకాలను మీ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. చంద్రబాబూ..! మీ గత పాలనలోని చీకటి రోజులనే మీరు మళ్లీ తెచ్చారు. 

»  2024 జనవరి – మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను ఏప్రిల్‌లో వెరిఫై చేసి మే నెలలో చెల్లించాల్సి ఉంది. అక్కడి నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద హాస్టల్‌ ఖర్చులకు మరో రూ.1,100 కోట్లు ఇవ్వాలి. ఈ రెండు పథకాలకు ప్రతి ఏడాదికి రూ.3,900 కోట్లు ఖర్చు చేయాలి. 

కానీ చంద్రబాబూ..! మీరిచ్చింది కేవలం రూ.700 కోట్లు మాత్రమే. అది కూడా ఇప్పటికీ పూర్తిగా పిల్లలందరికీ చేరలేదు. అంటే గతేడాది పిల్లలకు బాకీ పెట్టిన రూ.3,200 కోట్లు.. అది కాకుండా ఈ ఏడాది ఖర్చు చేయాల్సిన మరో రూ. 3,900 కోట్లు.. రెండూ కలిపితే మొత్తం రూ.7,100 కోట్లు ఈ సంవత్సరం ఖర్చు పెట్టాలి. 

కానీ ఈ బడ్జెట్‌లో మీరు ప్రవేశపెట్టింది కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే. అంటే దీని అర్థం.. పేద విద్యార్థుల చదువులు, వారి బాధ్యత విషయంలో మీరు తప్పించుకుంటున్నట్లే కదా? ఆ పిల్లల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నట్టే కదా? చదువుకుంటున్న పిల్లలకు ఇది మీరు చేస్తున్న ద్రోహం కాదా? విద్యార్థులను ఇంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబూ? 

» కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా కాకముందే మిమ్మల్ని ప్రశ్నిస్తూ నిరుద్యోగులు, ఇంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కడం ఎప్పుడైనా చూశారా చంద్రబాబూ? ప్రజల పక్షాన నిలుస్తూ, విద్యార్థుల సమస్యలపై చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ‘‘యువత పోరు’’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పిల్లలు, తల్లిదండ్రులు,  నిరుద్యోగులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలందర్నీ అభినందిస్తున్నా. విద్యార్థులతో సహా అన్ని వర్గాలకూ పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నా.  

అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను సైతం ఊడగొడుతున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ఏటా రూ.7,200 కోట్లు చొప్పున ఖర్చు చేయాలి. కానీ గతేడాది బడ్జెట్‌లో ఒక్క పైసా కేటాయింపూ లేదు. ఈ ఏడాదికి కూడా ఒక్క పైసా కేటాయించలేదు. 

రెండేళ్లలో ప్రతి నిరుద్యోగికీ రూ.72 వేల చొప్పున బకాయి పడ్డారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేస్తూ, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందకుండా అడ్డుకుంటూ.. పేద విద్యార్థులకు మెడికల్‌ విద్యను దూరం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement