ఇక మహా నగరానికి మరో 20 టీఎంసీల నీరు
గోదావరి జలాల తరలింపునకు టెండర్లు
రెండు, మూడో దశ పనులకు రూ.7,360 కోట్లు
ఈ నెల 15లోపు టెండర్ ప్రక్రియ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: మహానగర తాగునీటి అవసరాల కోసం మరో 20 టీఎంసీలను గోదావరి జలాలను మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి తరలించేందుకు టెండర్ ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి తాగునీటి సరఫరా పథకం 2, 3 దశ పనులు చేపట్టేందుకు సుమారు రూ.7,360 కోట్లను మంజూరు చేసింది. దీంతో ఈ నెల 15వ తేదీలోగా టెండర్లను ఆహ్వానించేందుకు జలమండలి కసరత్తు ప్రారంభించింది.
గోదావరి జలాల్లో హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా ఇప్పటికే గోదావరి మొదటి దశ కింద శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. తాజాగా రెండు, మూడో దశ కింద మిగిలిన 20 టీఎంసీలు తరలించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
నగర ప్రాజెక్టును హైబ్రీడ్ యాన్యూటీ మోడల్(హ్యామ్) చేపట్టనున్నారు. మొత్తం వ్యయంలో ప్రభుత్వ వాటా 40 శాతం, నిర్మాణ సంస్థ వాటా 60 శాతం భరించనున్నారు. ప్రభుత్వం తమ వాటా నిధులను హడ్కో వద్ద రుణం తీసుకోనుంది. ప్రాజెక్టు 24 నెలల్లో పూర్తిచేసే విధంగా కసరత్తు చేస్తున్నారు.
రెండు వరసల పైప్‌లైన్లతో..
కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను ఘన్‌పూర్ మీదుగా ఉస్మాన్‌సాగర్ వరకు తరలించనున్నారు. మొత్తం 20 టీఎంసీల్లో నగర తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు, మిగిలిన 5 టీఎంసీలను ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పునరుజ్జీవానికి వినియోగించనున్నారు.
రెండు పైప్‌లైన్ల ద్వారా 3000 ఎంఎం డయాతో 50 కిలోమీటర్లు, 2,200 ఎంఎం డయాతో 58 కిలో మీటర్ల వరకు పైప్‌లైన్ పనులు చేపట్టనున్నారు. ఘన్‌పూర్ వద్ద సుమారు 1170 ఎంఎల్‌డీల నీటిశుద్ధి ప్లాంట్ నిర్మించనున్నారు.
ఘన్‌పూర్ నుంచి ముత్తంగి జంక్షన్ వరకు 2400 ఎంఎం పైప్‌లైన్ 40 కిలోమీటర్ల వరకు, దాని వెంట 3000 ఎంఎం డయా రింగ్ మెయిన్‌ను కలుపుతూ పైప్‌లైన్ నిర్మాణం చేపడతారు. ఉస్మాన్‌సాగర్‌లో 120 ఎంఎల్‌డీ, హిమాయత్‌సాగర్‌లో 70 ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను నిర్మిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment