Mallanna Sagar reservoir
-
మొదట జనగామకే ‘మల్లన్న’
గజ్వేల్: ‘మల్లన్నసాగర్ భగీరథ పథకం’ సిద్ధమవుతోంది. రూ.1,100 కోట్లతో చేపడుతున్న ఈ పథకం ద్వారా జూన్ కల్లా జనగామ జిల్లాకు మంచినీటిని అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జనగామతో పాటు గ్రేటర్ హైదరాబాద్, సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి, మెదక్ జిల్లాలకూ మల్లన్నసాగర్ రిజర్వాయర్ నీరందించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ జిల్లాలకు ప్రస్తుతం ఏర్పడుతున్న నీటి కొరతను అధిగమించేందుకు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ వేసిన లైన్‌కు సమాంతరంగా మరో లైన్‌ను నిర్మించి జూన్‌లోపు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. నీటి కొరతను అధిగమించేందుకు.. జంటనగరాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పదేళ్ల క్రితం రూ.3,375 కోట్ల అంచనాతో గోదావరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టి పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి 10 టీఎంసీల నీటి తరలింపు లక్ష్యంగా 186 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఈ లైన్ ద్వారా నిత్యం 735 ఎంఎల్డీ నీటి సరఫరా జరుగుతుండగా సిద్దిపేట, జనగామ, యాదాద్రి, మేడ్చల్, మెదక్ జిల్లాల్లో అవసరాలకు సుమారుగా 300 ఎంఎల్‌డీలను పంపిణీ చేస్తున్నారు. మిగతా నీరు హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నారు. అయితే కొండపాక, ప్రజ్ఞాపూర్ వద్ద సిద్దిపేట, జనగామ జిల్లాల అవసరాల కోసం ఈ లైన్‌పై నీటిని ట్యాపింగ్ చేస్తుండటంతో హైదరాబాద్ నగరానికి నీటి కొరత ఏర్పడుతోంది. లైన్లో ఏదైనా సమస్య వస్తే జిల్లాలోని అన్ని ప్రాంతాల వారూ తాగునీటికి ఇబ్బంది పడేవారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు మల్లన్నసాగర్ భగీరథ పథకం ప్రారంభించారు. అంతా మల్లన్నసాగర్ నుంచే వాడుకునేలా.. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ తెలంగాణలోని పలు జిల్లాల్లో సాగుతో పాటు, తాగునీటికి ఏటా 10 టీఎంసీలు కేటాయించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రిజర్వాయర్‌లోని ఆఖరి టీఎంసీ నీటిని కూడా వాడుకునేలా డిజైన్ చేశారు. కొండపాక మండలం మం గోల్ వద్ద రాష్ట్రంలోనే అతి పెద్దదైన 540 ఎంఎల్డీ సామర్థ్యం గల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పను లు చేపట్టారు. జూన్‌లోపు హైదరాబాద్ లైన్‌పై ఉన్న ట్యాపింగ్‌లను మూసేసి మల్లన్నసాగర్ స్టోరేజీ నుంచే నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మల్లన్నసాగర్ నుంచి మొదటగా జనగామ జిల్లాకు నీటి సరఫరా జరగనుంది. నీటిని తరలించేందుకు కొమురవెల్లి కమాన్ వద్ద గల ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా 6.9 కిలోమీటర్ల మేర ప్రత్యేక లైన్ నిర్మించారు. -
మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ (ఫోటోలు)
-
ఆ దుర్మార్గులు కానిస్తరా అనుకున్నాం:సీఎం కేసీఆర్
-
కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కేసీఆర్
-
తెలంగాణ జన హృదయ సాగరం మల్లన్న సాగర్:సీఎం కేసీఆర్
-
తెలంగాణ జన హృదయ సాగరం మల్లన్నసాగర్
-
దేశం దారితప్పి పోతోంది.. దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోంది: సీఎం కేసీఆర్
సాక్షి, సిద్దిపేట: ‘దేశం దారి తప్పి పోతోంది, చాలా దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోంది. తప్పకుండా, ఆరునూరైనా సరే వందకు వంద శాతం ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు దేవుడు నాకిచ్చిన సర్వశక్తులు, సకల మేథో సంపత్తిని ఉపయోగిస్తా. చివరి రక్తపు బొట్టు వరకు ధారపోసి అయినా సరే ఈ దేశాన్ని చక్కదిద్దుతా..’అని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ‘మత కల్లోలాలను సహించకూడదు. అవి కేన్సర్‌లా విసర్తించకుండా చర్యలు చేపట్టాలి. ఈ దేశం నుంచి ఎక్కడికక్కడే తరిమికొట్టాలి. పిల్లలు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వెళ్లి చదువుకోవాలంటేనే భయపడుతున్నారు..’అని చెప్పారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ వద్ద శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను సీఎం బుధవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ జల హృదయ సాగరం ‘నూతన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన అతి భారీ జలాశయం మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక మల్లన్నసాగర్ కాదు.. తెలంగాణ జల హృదయ సాగరం.. తెలంగాణ జీవనాడి.. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం. సింగూరు ప్రాజెక్టును తలదన్నేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. సిద్దిపేటకే కాకుండా హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు. 20 లక్షల ఎకరాలను తన కడుపులో పెట్టుకుని కాపాడుకునే ప్రాజెక్టు. ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ «శిరస్సు వంచి సెల్యూట్ చేస్తున్నా. గోదావరి నదిలో 50 డిగ్రీల ఎండలో ఇంజనీర్లు పడ్డ కష్టం వృథా కాలేదు. భయంకరమైన కరువు నేలలో ప్రజలకు న్యాయం చేసేందుకు పోరాడాం. ప్రాజెక్టు నిర్వాసితులకు ఆసియాలో ఎక్కడా లేని విధంగా పునరావాసం కల్పించాం. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే అధికారులు వెంటనే వారికి న్యాయం చేయాలి. మంత్రి హరీశ్‌రావు నిర్వాసితులకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి. కొందరు దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రగతి నిరోధక శక్తులుగా మారారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంలో ఒక రోజు 58 వేల మంది కార్మికులు 14 రాష్ట్రాల నుంచి వచ్చి పని చేస్తున్న సమయంలో దుర్మార్గులు కోర్టుల్లో కేసులు వేశారు. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. అక్కడి నుంచే మన రాష్ట్ర చీఫ్ జస్టిస్‌కు ఫోన్ చేసి.. ఇది తెలంగాణ జీవనాడి.. ఉన్నతంగా ఆలోచించి ఈ ప్రాజెక్టును కాపాడాలని కోరా. దాదాపు 600 పైచిలుకు కేసులు వేయగా అన్నీ కొట్టేశారు. ప్రాజెక్టు గురించి కనీస అవగాహన లేనివారు, కొన్ని రాజకీయాల పార్టీల వారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు...’అని కేసీఆర్ అన్నారు. కరువు నుంచి కాపాడే కాళేశ్వరం ‘తెలంగాణలో పంటలు పండించే, కరువు రాకుండా కాపాడే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. గోదావరి నది పారే జిల్లాల్లో కరువు ఎలా ఉంటది? అని ఉద్యమ సమయంలో నేను ప్రశ్నించా. ఉద్యమ వేడిని చల్లార్చడానికి చంద్రబాబు దేవాదుల ప్రాజెక్టును తీసుకొచ్చారు. ప్రస్తుతం ఖమ్మం సీతారామ ప్రాజెక్టు ప్రాణం పోసుకుంటోంది. పాలమూరు జిల్లాలో కూడా ఇలాంటి ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే పంజాబ్ కంటే ఎక్కువ ధాన్యాన్ని పండిస్తున్నాం. ఏప్రిల్ నెలలో కూడా చెరువులు నీటితో తొణికిసలాడుతున్నాయి. ఆషామాషీగా, తెలివి లేక ఉచిత కరెంట్ ఇవ్వడం లేదు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతులు ఆత్మహత్యలు ఆగిపోవాలని రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నాం. ఇప్పటికైనా ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలి..’అని కోరారు. కేంద్రం సహకరించకున్నా అభివృద్ధి ‘హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగం చేసేవారు కూడా గ్రామాలకు వస్తున్నారు. అద్భుతమైన గ్రామీణ తెలంగాణ ఆవిష్కృతమవుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతోంది. కుక్కలు మొరుగుతున్నాయని మన పనిని ఆపొద్దు. కేంద్రం సహకరించకపోయినప్పటికీ బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నాం. తెలంగాణలో ఎక్కడకు పోయినా ఎకరా భూమి రూ.20 లక్షలకు పైగానే ఉండడంతో మన రైతులు ధనికులయ్యే పరిస్థితి ఉంది. రాష్ట్రానికి అద్భుతమైన పరిశ్రమలు వస్తున్నాయి. ఐటీ రంగంతో పాటు ఇతర రంగాల్లో ఉద్యోగ కల్పన జరుగుతోంది. భారతదేశంలో అతి తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ. బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారితే మన హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ నుంచి 1.50 లక్షల కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాలు 580 వరకు శంషాబాద్‌లో దిగుతున్నాయి..’అని ముఖ్యమంత్రి తెలిపారు. దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ ‘దేశానికే మార్గదర్శకంగా, గొప్ప రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుసుకుంది. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. దీంతో ఆదిలాబాద్‌లోని మారుమూల పల్లెల్లో అంటు రోగాలు మాయం అయ్యాయి. రాష్ట్రంలో మాతాశిశు మరణాలు తగ్గిపోయాయి. పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేశాం. కేసీఆర్ కిట్లు 10 లక్షల కుటుంబాలకు మించి పంపిణీ అయ్యాయి. ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతం అవుతోంది. అనేక రంగాల్లో బ్రహ్మాండమైన పురోగతితో ముందుకు పోతున్నాం..’అని చెప్పారు. రూ.1,500 కోట్లతో పర్యాటకాభివృద్ధి ‘అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్, ఏడుపాయల వనదుర్గామాత వద్ద టూరిజం అభివృద్ధికి రూ.1,500 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నా. ఈ ఐదు ప్రాంతాల్లో అద్భుతమైన టూరిజం అభివృద్ధి చేయాలి. ఇందుకు మంత్రి హరీశ్, శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రత్యేక చొరవ తీసుకుని ఏడాదిన్నరలో పూర్తి చేయాలి. హాలీవుడ్, హిందీ సినిమాల షూటింగ్‌లు ఇక్కడ జరిగేలా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు మధ్యలో దీవులు ఉన్నాయి. 7,500 ఎకరాల అటవీ సంపద ఉంది. ఔషధ మొక్కలు పెంచాలి. రిజర్వాయర్ వద్ద 100 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇరిగేషన్ కాంప్లెక్స్ నిర్మించాలి..’అని కేసీఆర్ ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డు కూడా రాబోతోంది కాబట్టి రెండు నాలుగు వరసల రోడ్లు ఈ ప్రాజెక్టు వరకు వేయాలని సీఎం సూచించారు. మంత్రి హరీశ్ డైనమిక్ లీడర్ ‘రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు డైనమిక్ లీడర్. చురుకైన మంత్రి. ఆయనకు మంచి శక్తియుక్తులు ఉన్నాయి. మొదటి టర్మ్‌లో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఎంతో క్రమశిక్షణతో, కడుపు మోపు కట్టుకుని, 100కు 100 శాతం పూర్తి అవినీతి రహితంగా ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేషన్‌తో ముందుకు సాగుతూ పనిచేస్తే అది ఈవేళ సాకారం అయింది..’అంటూ కేసీఆర్ అభినందించారు. ఐదు రిజర్వాయర్ల వద్ద పర్యాటకాభివృద్ధి పనులను ఏడాదిన్నరలో పూర్తి చేయాలని ఈ సందర్భంగా హరీశ్‌ను అదేశించారు. మల్లన్న జలాలతో అభిషేకం ప్రాజెక్టు ప్రారంభోత్సవం, సభ అనంతరం సీఎం మల్లన్నసాగర్ నీటిని ఐదు బిందెల్లో తీసుకుని కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయానికి వెళ్లారు. మల్లిఖార్జున స్వామికి మల్లన్న జలాలతో అభిషేకం నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. -
మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
సాక్షి, సిద్ధిపేట: తెలంగాణలో మరో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. సీఎం చేతుల మీదుగా నీటిని విడుదల చేసి మల్లన్న సాగర్‌ను జాతికి అంకితం చేశారు. 50 టీఎంసీలతో నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. దేశంలోనే తొలిసారి నదిలేని చోట ప్రాజెక్టు నిర్మాణం చేసింది ఇక్కడే. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా పది జిల్లాలకు తాగు, సాగు నీరు అందించనున్నారు. 2018లో మొదలు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలంలో 2018లో రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–4లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును తొలుత టీఎంసీ నీటి సామర్థ్యంతో నిర్మించాలనుకున్నా రీ డిజైన్ చేసి 50 టీఎంసీలకు పెంచారు. రూ.6,805 కోట్ల బడ్జెట్‌తో మూడున్నర ఏళ్లలోనే పూర్తి చేశారు. ప్రాజెక్టు కోసం 17,781 ఎకరాల భూమిని సేకరించారు. 8 పంచాయతీలతోపాటు మొత్తం 14 నివాస ప్రాంతాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. 10.5 కిలోమీటర్ల పొడవున్న గుట్టలను ఇరువైపులా కలుపుతూ 22.6 కిలోమీటర్ల కట్టను నిర్మించారు. 10 టీఎంసీలకు ఒక అంచె చొప్పున 5 అంచెల్లో 557 మీటర్ల ఎత్తు వరకు కట్టారు. 143 మీటర్ల పొడవున మత్తడి ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్ పంప్‌హౌస్‌కు చేరిన గోదావరి జలాలను బాహుబలి మోటార్ల ద్వారా ఈ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్ కింద లక్షా 65 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్లకు కూడా దీని ద్వారానే నీటిని పంపుతారు. దీంతో తాగు, సాగునీటి అవసరాలు తీరనున్నాయి. అలాగే నిజాంసాగర్, సింగూరు, ఘనపూర్ ఆయకట్టు స్థిరీకరణ కూడా మల్లన్నసాగర్‌పైనే ఆధారపడి ఉంది. మొత్తంగా 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు మల్లన్నసాగర్‌తో మేలు జరగనుంది. ప్రస్తుతం 10 టీఎంసీలు నిల్వ అతిపెద్ద ఎత్తిపోతల పథకం కావడంతో రిజర్వాయర్‌ను ఒకేసారి పూర్తిస్థాయిలో నింపకుండా విడతల వారీగా ఒక్కోస్థాయి వరకు నింపుతున్నారు. ప్రస్తుతం డ్యాంలో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 60 మీటర్ల ఎత్తైన మట్టికట్ట ఏ మేరకు పనిచేస్తుందో నీటిరంగ నిపుణులు ఎప్పటికప్పుడు పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ల కోసం 30 టీఎంసీలు వ్యవసాయ అవసరాలతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాల కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలు ఈ రిజర్వాయర్ నుంచి ఏడాది పొడవునా అందిస్తారు. ఈ రిజర్వాయర్‌లో నీరు ఉంటే వేసవిలోనూ అన్ని అవసరాలకు ఉపయోగపడనుంది. అందుకే మిడ్‌మానేరు నుంచి అన్నాపూర్, రంగనాయకసాగర్ రిజర్వాయర్ల మీదుగా ఎత్తిపోతలతోపాటు అదనపు టీఎంసీ కాలువకు సైతం శ్రీకారం చుట్టారు. వానాకాలంలో రోజుకు 2 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి, దీని పరిధిలోని రిజర్వాయర్లకు తరలిస్తారు. -
నదిలేని చోటుకు... ‘సాగరమే’ వచ్చింది!
సాక్షి, సిద్దిపేట: సాధారణంగా నదికి అనుసంధానంగా జలాశయాలు నిర్మిస్తారని, కానీ నది లేనిచోట దేశంలోనే అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్‌ను నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను బుధవారం సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ సందర్బంగా మంగళవారం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మల్లన్నసాగర్ ద్వారా తెలంగాణలోని ఏ ప్రాంతానికైనా నీటిని తీసుకెళ్లవచ్చని, రానున్న 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని తానే ఇంజనీర్‌గా సీఎం ఈ రిజర్వాయర్ రూపకల్పన చేశారని చెప్పారు. తక్కువ ముంపుతో మల్లన్నసాగర్ జలాశయం నిర్మాణం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిర్వాసితులకు గజ్వేల్ పట్టణం సమీపంలో ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణం చేసి ఇళ్లను అందించామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని, కానీ బీజేపీ నేతలు మాత్రం మతాల మధ్య చిచ్చుపెట్టి రక్తాన్ని పారించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చేతనైతే తెలంగాణకు రావాల్సిన హక్కులపై ఢిల్లీలో బీజేపీ నాయకులు నిలదీయాలని హితవు పలికారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డిలకు దమ్ముంటే తెలంగాణలోని ప్రాజెక్టులకు జాతీయ హోదాను తీసుకురావాలని హరీశ్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అతిపెద్ద జలాశయం మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. బుధవారం సీఎం కేసీఆర్ తుక్కాపూర్ వేదికగా ప్రారంభించి దీనిని జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే నీటి నిల్వ సామర్థ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు సీఎం చేతుల మీదుగా నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన ఇలా.. ► హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ తుక్కాపూర్‌కు చేరుకుంటారు. ► సొరంగ మార్గం ద్వారా భూగర్భంలో ఏర్పాటు చేసిన పంప్‌హౌస్ వద్దకు వెళ్లి మోటార్లను ఆన్ చేస్తారు. ► అనంతరం జలాశయంలో గోదావరి జలాలకు శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. ► తర్వాత జిల్లాకు చెందిన నాలుగు వేల మంది ప్రజా ప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశమవుతారు. -
మల్లన్నసాగర్‌ను పరిశీలించిన నిపుణుల కమిటీ
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను నిపుణుల కమిటీ శనివారం పరిశీలించింది. ప్రాజెక్టులో నీటిని నింపడంపై పలు సూచనలు చేసింది. రిజర్వాయర్ నిర్మాణ డిజైన్స్, డ్రాయింగ్స్, జియాలజిస్టులు ఇచ్చిన టెస్టు రిపోర్టులు, వివిధ ల్యాబ్‌ల నుంచి వచ్చిన రిపోర్టులు, నిర్మాణంలో అనుసరించిన టెక్నికల్ ప్రొసీజర్స్‌ను అధ్యయనం చేసి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. దీనిలో ఈఎన్సీ (జనరల్) మురళీధర్, ఈఎన్సీ (గజ్వేల్) హరిరాం, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ శ్రీధర్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్లు ఉమాశంకర్, శశిధర్ సభ్యులుగా ఉన్నారు. వీరు రిజర్వాయర్ నిర్మాణ పద్ధతులు, సీవోటీ కట్టింగ్, ప్రాజెక్టు నింపే టైంలో చేయాల్సిన టెస్టులు తదితర అంశాలను పరిశీలించారు. ఇప్పటికే రిజర్వాయర్‌లో 4.90 టీఎంసీలను నింపారు. ప్రాజెక్టు మినిమం డ్రా లెవల్ వరకు నెమ్మదిగా నీటిని నింపాలని వారు సూచించారు. కమిటీ వెంట ప్రాజెక్టు సీఈ చంద్రశేఖర్, ఎస్ఈ వేణు, ఇంజనీర్లు ఉన్నారు. -
‘భగీరథ’కు ‘మల్లన్న’ నీరు
గజ్వేల్: త్వరలో పూర్తి కానున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ సాగునీటికే కాదు మిషన్ భగీరథ ద్వారా అందించే తాగు నీటికి కూడా ఆధారం కానుంది. ఇక్కడి నుంచి ఏటా 10 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకోనున్నారు. సిద్దిపేటతో పాటు జనగామ, మేడ్చల్, యాదాద్రి, మెదక్ జిల్లాల్లో భగీరథ నీటి సరఫరాకు మల్లన్నసాగరే ప్రధాన వనరు కానుంది. ప్రస్తుతం ఆ జిల్లాలకు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్లే లైన్ నుంచి వాడుకుంటున్నారు. ఈ లైన్‌పై భారం తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోల్ వద్ద రాష్ట్రంలోనే అతి పెద్దదైన 540 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) సామర్థ్యం కలిగిన డబ్ల్యూటీపీ (వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మిస్తున్నారు. రూ.674 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు సాగుతున్నాయి. జంట నగరాల్లోని పలు ప్రాంతాలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గోదావరి సుజల స్రవంతి పథకాన్ని ఎనిమిదేళ్ల క్రితం రూ.3,375 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేశారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట సమీపంలోని ఘనపూర్ వద్ద నిర్మించిన డబ్ల్యూటీపీ ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రతినిత్యం ఈ లైన్ ద్వారా 735 ఎంఎల్డీ నీటి సరఫరా జరుగుతోంది. ఈ లైన్‌పై కొండపాక, ప్రజ్ఞాపూర్ వద్ద సిద్దిపేట, జనగామ జిల్లాల అవసరాల కోసం నీటిని ట్యాపింగ్ చేస్తున్నారు. ఘనపూర్ డబ్ల్యూటీపీ వద్ద నుంచి యాదాద్రి, మేడ్చల్ జిల్లాలకు పంపుతున్నారు. దీనివల్ల హైదరాబాద్ నగరానికి వెళ్లే నీటిలో అప్పుడప్పుడు కొరత ఏర్పడుతోంది. నీరు తక్కువగా వచ్చినప్పుడు ఆయా జిల్లాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి నీటి సరఫరా అంతరాయం ఏర్పడి తాగునీటికి అల్లాడే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే భవిష్యత్‌లో మిషన్ భగీరథ స్ఫూర్తికి అవరోధం ఏర్పడే అవకాశముంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలో మల్లన్నసాగర్ నీటిని మిషన్ భగీరథ కోసం వాడుకోవాలని నిర్ణయించారు. పూర్తయితే స్వయం ప్రతిపత్తే.. ఇందుకోసం రూ.674 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించి.. టెండర్ పూర్తయి పనులు కూడా ప్రారంభమయ్యాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ప్రస్తుతం 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తుండగా.. తెలంగాణలోని పలు జిల్లాల్లో సాగునీటి కొరత తీర్చబోతున్నది. అంతేకాకుండా ఇందులో ఏటా 10 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వాడుకుంటారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోల్ వద్ద రాష్ట్రంలోనే అతి పెద్దదిగా 540 ఎంఎల్డీ సామర్థ్యంతో డబ్ల్యూటీపీ పనులు ప్రారంభమయ్యాయి. మల్లన్నసాగర్ నుంచి నీటిని ఇందులో శుద్ధిచేసి ఆయా జిల్లాలకు సరఫరా చేస్తారు. పనులు పూర్తి కాగానే గతంలో హైదరాబాద్ లైన్‌పై ఉన్న ట్యాపింగ్‌లను మూసివేస్తారు. అందువల్ల హైదరాబాద్ లైన్‌పై ఎలాంటి అవరోధం లేకుండా నీరు పంపిణీ అవుతుంది. అలాగే సిద్దిపేటతో పాటు జనగామ, మేడ్చల్, యాదాద్రి, మెదక్ జిల్లాల భగీరథ పథకానికి స్వయం ప్రతిపత్తి ఏర్పడనుంది. కొత్తగా చేపడుతున్న పనుల వల్ల ఆయా జిల్లాల్లోని సిద్దిపేట, జనగామ, పాలకుర్తి, ఘనపూర్, గజ్వేల్, దుబ్బాక, ఆలేరు, భువనగిరి, మేడ్చల్ తదితర నియోజకవర్గాలకు ప్రయోజనం కలగనుంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న 16 మున్సిపాలిటీలకు కూడా మేలు జరగనుంది. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా.. సిద్దిపేటతో పాటు నాలుగ జిల్లాల్లో మిషన్ భగీరథ పథకం నీటి సరఫరాకు సంబంధించి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇందుకోసం మల్లన్నసాగర్‌ను ప్రధాన వనరుగా మార్చుకొని మంగోల్ వద్ద డబ్ల్యూటీపీ నిర్మాణం పూర్తి చేసి ఇక్కడి నుంచి ఆయా జిల్లాలకు నీటిని సరఫరా చేస్తాం. దీని ద్వారా హైదరాబాద్ లైన్‌పై ఎలాంటి భారం ఉండదు. అంతేకాకుండా ఈ జిల్లాల్లో మిషన్ భగీరథ పథకానికి స్వయం ప్రతిపత్తి రానుంది. ఇందుకోసం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. – రాజయ్య, మిషన్ భగీరథ ఈఈ, గజ్వేల్ -
మల్లన్నసాగర్‌కు రూ.4,600 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులకు రుణం ఇచ్చేందుకు నాబార్డ్ ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు ప్రాజెక్టు నిర్మాణం పనులను పూర్తి చేయడానికి రూ. 4,600 కోట్ల రుణం ఇవ్వనుంది. దీనిపై ప్రభుత్వం నాబార్డ్‌తో త్వరలోనే ఒప్పందం చేసుకోనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులను రూ.6,805 కోట్లతో ఆరంభించారు. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ పనుల్లో ఏకంగా 13 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి పని, 60 మీటర్ల ఎత్తుతో కట్ట నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ రిజర్వాయర్ కింద అన్ని ప్రధాన చానళ్ల ద్వారా మొత్తం 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రణాళిక ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. 9.2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు పూర్తయ్యాయి. -
భయపెట్టి అనంతగిరి భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో భాగమైన అనంతగిరి జలాశయం నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించేందుకు ప్రభుత్వాధికారులు వ్యవహరించిన తీరు చట్ట వ్యతిరేకంగా ఉందని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయకుండానే భూముల్ని సేకరిస్తున్నారంటూ దాఖలైన మూడు వేరువేరు వ్యాజ్యాలపై న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణలతో కూడిన ధర్మాసనం 52 పేజీల తీర్పును శుక్రవారం వెలువరించింది. హైకోర్టు 2016లో ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయని... సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి, ఆర్డీవో, భూసేకరణ అధికారి అనంతరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, చిన్నకొండూరు తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, పూర్వపు తహసీల్దార్ పరమేశ్వర్ల సర్వీస్ రికార్డుల్లో కోర్టు ఆదేశాలను ఉల్లఘించినట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నమోదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘ఉద్ధేశపూర్వకంగా హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయలేదు. భూసేకరణ చట్టాలను అమలు చేయకుండా రైతులను భయపెట్టి వారితో భూ విక్రయ ఒప్పందపత్రాలపై సంతకాలు చేయించారు. రాజ్యాంగంలోని 14వ అధికరణ స్ఫూర్తిని దెబ్బతీశారు. రాత్రి వేళ ఖాళీ చేయించిన వారిలో 11 మంది ఎస్సీలు ఉన్నారు. ఇలా చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు. దీనిపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలి. భూములకు ధరల్ని నిర్ణయించడంలోనూ పద్ధతి లేకుండా వ్యవహరించారు. 2019 జనవరి 15న రైతుల నుంచి తీసుకున్న భూములకు వాటి ధర ప్రకారం పరిహారాన్ని ఖరారు చేసే ముందు రైతుల వాదనలు తెలుసుకోవాలి. ఇప్పటికే ఇచ్చిన పరిహారాన్ని రైతుల నుంచి తీసుకోకుండా... మూడు నెలల్లోగా చెల్లించబోయే పరిహారంలో సర్దుబాటు చేయాలి. హైకోర్టును ఆశ్రయించిన 61 మంది రైతులకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.5 వేల చొప్పున చెల్లించాలి. 2016లో వ్యవసాయ భూములకు, ఈ ఏడాది పిటిషనర్ల ఇళ్లను సేకరించేందుకు నోటిఫికేషన్లు వేరువేరుగా ఇచ్చారు కాబట్టి వాటికి వేరువేరుగానే పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్ఆర్ ప్యాకేజీ) ఇవ్వాలి. ఆర్ఆర్ చట్టంలోని నిబంధన ప్రకారం 18 సంవత్సరాలు నిండిన పెళ్లి కాని వారిని మరో కుటుంబంగా పరిగణించి వారికి కూడా పరిహారం చెల్లించాలి’అని హైకోర్టు తీర్పు చెప్పింది. -
కొండ పోచమ్మకు గోదావరి జలాలు
సాక్షి, హైదరాబాద్ : గోదావరి జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది. ప్రతిష్టాత్మక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గుండెకాయ వంటి కొమురవెల్లి మలన్నసాగర్ నుంచి బుధవారం నీటి విడుదల మొదలైంది. 52 టీఎంసీల నీరు నిల్వ చేయగల సామర్ధ్యం కలిగిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ సర్జ్పూల్కు సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ నుంచి విడుదలైన గోదావరి జలాలు చేరాయి. ఈ పథకంలో ఇది మానవ నిర్మిత అతిపెద్ద కట్టడం. ఇక్కడి నుంచి ఈ జలాలను కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి విడుదల చేశారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ సహ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియోజకవర్గం గజ్వేల్ పరిధిలో కొండపోచమ్మ సాగర్ భారీ రిజర్వాయర్‌ను ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఎటువంటి ఆర్భాటం లేకుండా నేడు అధికారులు వెట్‌రన్ చేపట్టారు. వెట్రన్లో భాగంగా తొలుత ఒకటో నెంబర్ పంప్ నుంచి నీటి విడుదలను చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం, సూచనలకు అనుగుణంగా నీటిపారుదల రంగ నిపుణుల సలహా మేరకు ఎటువంటి అటంకాలు ఎదురవకుండా నిర్మాణపనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ చేపట్టింది. వాస్తవానికి మలన్నసాగర్ రిజర్వాయర్ నింపిన తర్వాతే కొండపోచమ్మ సాగర్‌కు నీరు విడుదల కావాలి. 52 టీఎంసీల సామర్ధ్యం కలిగిన భారీ కొమురవెల్లి మలన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో తుక్కాపూర్ పంప్‌హౌస్ నుంచి డెలివరీ సిస్టర్న్ ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. ఈ నీరు గజ్వేల్ మండలం అక్కారంలో నిర్మించిన పంప్‌హౌస్‌కి ఆ తర్వాత మర్కూక్ సమీపంలో నిర్మించిన మరో పంప్‌హౌస్‌కు అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ సర్జ్పూల్కు చేరుతాయి. మల్లన్న సాగర్ సర్జ్‌పూల్ నుంచి ఒక్కొక్కటి 43 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 8 మెషీన్లు నీటిని ఎత్తిపోస్తాయి. ఒక్కొ పంప్ 1100 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తాయి. ఇక్కడ గోదావరి జలాలు 103.88 మీటర్ల ఎత్తుకు చేరుతాయి. ఈ మార్గమధ్యలో 16.18 కి.మీ పొడవైన సొరంగం కూడా ఉంది. దాదాపు 119 కి.మీ పొడువైన 17 డిస్ట్రిబ్యూటరీ కాలువలు కూడా దీనికి అనుసంధానంగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు అందే ఆయకట్టులో ఎక్కువ శాతం మల్లన్నసాగర్ పరిధిలోనే ఉంది. ఈ రిజర్వాయర్ ద్వారా సిరిసిల్ల, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల పరిధిలో 1,25,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇక్కడి నుంచి సుదూరాన ఉన్న బస్వాపూర్ రిజర్వాయర్‌కు కూడా నీరు ఎత్తిపోయనున్నారు. అలాగే నల్లగొండ జిల్లాకు కూడా గోదావరి జలాలు మల్లన్నసాగర్ నుంచే అందుతాయి. ఇక్కడి నుంచి మరో స్వతంత్ర లింక్ ద్వారా నీరు సింగూరుకు చేరుతాయి. కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లే మార్గంలో ఉండే అన్ని చెరువులను గోదావరి జలాలతో నింపుతారు. -
‘మల్లన్న’ నుంచే సింగూరుకు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను సింగూరుకు ఎత్తిపోసే విషయంలో మళ్లీ సందిగ్ధత ఎదురవుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా నీటిని తరలించాలన్న ప్రతిపాదనను మార్చి కొండపోచమ్మ సాగర్ నుంచి తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేయగా మళ్లీ ఇప్పుడు మల్లన్నసాగర్ నుంచి తరలించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మల్లన్నసాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలించేందుకు టన్నెల్ పనుల్లో జాప్యం, లిఫ్ట్ అవసరాలు ఉండటంతో దాన్ని పక్కనపెట్టి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా తరలించాలని ప్రభుత్వం నిర్ణయించగా ప్రస్తుతం ఆ ప్రతిపాదన వద్దని మల్లన్నసాగర్ నుంచే నీటిని తరలించడం ఉత్తమమని రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించింది. మళ్లీ మొదటికి... గతంలోనే కాళేశ్వరం స్థిరీకరణ కింద నిర్ణయించిన ఆయకట్టుకు నీరివ్వాలంటే సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను సైతం కాళేశ్వరం నీటితో నింపేలా ప్రణాళిక వేశారు. మల్లన్నసాగర్‌కు వచ్చే నీటిని గ్రావిటీ పద్ధతిన సింగూరుకు తరలించి అటు నుంచి శ్రీరాంసాగర్ వరకు తరలించేలా ప్రణాళిక రచించారు. మల్లన్నసాగర్లో నీటిని తీసుకునే లెవల్ 557 మీటర్లు ఉండగా సింగూరు లెవల్ 530 మీటర్లుగా ఉంది. అయితే పూర్తిగా గ్రావిటీ పద్ధతిన నీటిని తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో మధ్యన 30 మీటర్ల లిఫ్టును ఏర్పాటు చేసి నీటిని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగూరుకు పంపాలనేది ఉద్దేశం. అయితే మధ్యలోని ప్యాకేజీ–17లోని 18 కి.మీల టన్నెల్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటం, ఆ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 627 మీటర్ల కొండపోచమ్మ లెవల్ నుంచి 530 మీటర్ల లెవల్ ఉన్న సింగూరుకు పూర్తి గ్రావిటీ ద్వారా నీటిని తరలించవచ్చని నిర్ణయించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేసింది. ఈ విధానం ద్వారా మరింత ఆయకట్టుకు నీరందించవచ్చని చెబుతూ దీనికి అనుగుణంగా కొండపోచమ్మ సాగర్ కింద కాల్వల నిర్మాణానికి, సంగారెడ్డి కాలువ వ్యవస్థ రూ. 1,330 కోట్లతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.ఈ కాల్వలను విస్తరించి సింగూరుకు నీటిని తరలించాలని నిర్ణయించారు. అయితే ఇటీవల గోదావరి పరీవాహకంలో పర్యటించిన రిటైర్డ్ ఇంజనీర్లు చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డిలతో కూడిన బృందం... కాళేశ్వరం జలాలను సింగూరుకు తరలించే అంశాలపై అధ్యయనం చేసింది. ఇందులో కొండపోచమ్మ సాగర్ నుంచి నీటి తరలింపుకన్నా మల్లన్నసాగర్ నుంచి నీటి తరలింపే ఉత్తమమని తేల్చింది. తాజా ప్రతిపాదనకు కారణాలివే... సింగూరుకు నీటిని తరలించే 96వ కి.మీ. నుంచి 150.59 కి.మీ వరకు ఉన్న అలైన్మెంట్ సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్, ఇస్నాపూర్ పారిశ్రామిక ప్రాంతం, గీతం యూనివర్సిటీ, కాశీపూర్, కంది గ్రామాల పరిధిలో ఉన్న పరిశ్రమలు, మల్కా పూర్లోని పెద్ద చెరువు మీదుగా వెళ్లాల్సి ఉందని, ఎన్‌హెచ్–65ని కూడా దాటాల్సి ఉంటుందని నివేదికలో రిటైర్డ్ ఇంజనీర్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఎకరా భూమి రూ. కోటికిపైగా ఉందని, దీన్ని చదరపు గజాల కింద విభజించి పరిహారిన్ని లెక్కిస్తే భూసేకరణకే భారీగా నిధులు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈ భూముల నుంచి కాల్వలను తవ్వే ప్రక్రియపై ఏవైనా కోర్టు కేసులు నమోదైనా, లిటిగేషన్లో ఉన్న వీటి పరిష్కారానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది.దీనికితోడు కొండపోచమ్మ సాగర్ నుంచి పైప్‌లైన్ ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న కేశవపూర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించాల్సి ఉంది. అదే జరిగితే సింగూరు జలాలపైనే ఆధారపడిన నిజాం సాగర్‌కు నీటి తరలింపు ఇబ్బందిగా ఉంటుంది. దీని బదులు మల్లన్నసాగర్ ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని హల్దీ వాగు ద్వారా సింగూరుకు, అటునుంచి నిజాంసాగర్‌కు తరలించడమే ఉత్తమం. ఇక మల్లన్నసాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలిస్తే విద్యుత్ ఖర్చు కేవలం రూ. 67 కోట్లు మాత్రమే అవుతుండగా అదే కొండపోచమ్మ ద్వారా అయితే రూ. 352 కోట్లు అవనుంది.ఇప్పటికే మల్లన్నసాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలించేందుకు గతంలోనూ ప్యాకేజీ–17, ప్యాకేజీ–18లో పనులు, భూసేకరణ అవసరాలకు రూ. 600 కోట్లు ఖర్చు చేయగా ప్రస్తుతం అలైన్మెంట్ మారిస్తే ఈ ఖర్చంతా వృధా అయ్యే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా ఆర్థిక, నిర్మాణ, నిర్వహణపరంగా మల్లన్నసాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలించడం ఉత్తమమని రిటైర్డ్ ఇంజనీర్లు తేల్చిచెప్పారు. -
రేపటికల్లా ‘మల్లన్న’ పరిహారం పంపిణీ పూర్తి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం గా నిర్మిస్తున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ పరిధి లోని ముంపు ప్రాంతాల నిర్వాసితులకు జరుగుతున్న పునరావాస సహాయ పంపిణీపై సీఎం కేసీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ, న్యాయ శాఖ, నీటి పారుదల శాఖల కీలక అధికారులంతా ఇందు లో పాల్గొన్నారు. ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, శింగారం, ఎర్రవల్లి, రాంపూర్, లక్ష్మాపూర్ తదితర గ్రామాల్లో నిర్వాసితులకు అందిస్తున్న చెక్కుల పంపిణీ కార్యక్రమంపై ఆరా తీశారు. ఈ నెల 13 నాటికి నిర్వాసితులకు పరిహారం అందించే ప్రక్రి యను ముగించాలని సూచించారు. నిర్వాసితులకు పరిహారం అందించే కార్యక్రమం, గ్రామాల వారీగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో జరుగుతున్న చెక్కుల పంపి ణీని అడిగి తెలుసుకున్నారు. హైకోర్టులో ఈ నెల 15 లోగా పునరావాస పంపిణీకి సంబంధించిన అఫిడవి ట్ను ప్రభుత్వం సమర్పించాల్సి ఉన్నందున ఇప్పటి వరకు జరిగిన పరిహారం పంపిణీ వివరాలతో హైకోర్టుకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పరిహారం తీసుకునేందుకు వెనకాడుతున్న నిర్వాసితుల అభిప్రాయాలను వీడియో తీసినందున వాటిని కోర్టు ముందుంచాలని సూచించినట్టు తెలిసింది. కార్యక్రమంలో ఆర్ అండ్ ఆర్ కమిషనర్ సోమేశ్‌కుమార్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్, అడిషనల్ ఏజీ రామచంద్రరావు, ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్ పాల్గొన్నారు. -
దేశంలోనే మెరుగైన పరిహారం
తొగుట (దుబ్బాక): బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పరిహారం చెక్కులు అందజేస్తోంది. బుధవారం ఈ మేరకు మండలంలోని బ్రాహ్మణ బంజేరుల్లి, రాంపురం, లక్ష్మాపురం, ఏటిగడ్డ కిష్టాపురం, వేములఘాట్, పల్లేపహాడ్ గ్రామాల్లో నిర్వాసితుల పునారావాస, ఉపాధి కల్పన (ఆర్అండ్ఆర్) ప్యాకేజీ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కో గ్రామంలో 14 కౌంటర్లు ఏర్పాటు చేసి పరిహారం చెక్కులు అందజేశారు. దీంతో ఆయా గ్రామా ల్లో పండుగ వాతావరణం నెలకొంది. చెక్కులు పంపి ణీ చేసేందుకు గ్రామాలకు వచ్చిన అధికారులకు మంగళహారతులు, మేళతాళాలతో నిర్వాసితులు స్వాగతం పలికారు. నిర్వాసితులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పరిహారం అందించిన సిద్దిపేట, సిరిసిల్ల కలెక్టర్లు కృష్ణభాస్కర్, వెంకట్రామిరెడ్డి, జేసీ పద్మాకర్, గడా అధికారి ముత్యంరెడ్డి, సీపీ జోయల్ డేవిస్, డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ నారాయణలను ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఘనంగా సన్మానించారు. జిల్లా అధికారులతోపాటు పక్క జిల్లాల రెవెన్యూ అధికారులు కూడా పరిహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెక్కుల పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కలెక్టర్లు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గరిష్టంగా రూ.కోటి పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇరు జిల్లాల కలెక్టర్లు మాట్లాడుతూ.. నిర్వాసితులకు మెరుగైన çపునరోపాధి, పునరావాసం ప్యాకేజీ అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ముంపు గ్రామాల్లో కోల్పోతు న్న వ్యవసాయ కొట్టాలు, పండ్ల తోటలు, బావు లు, బోరు బావులు, చెట్లు, పైప్లైన్లకు కూడా ప్రత్యేక పరిహారం అందజేశామన్నారు. నష్టపోయిన కుటుంబానికి రూ.7.50 లక్షలు, 250 గజా ల ఇంటి స్థలంతోపాటు ప్రతి కుటుంబానికి 6 రకాలుగా పరిహారం అందజేస్తున్నామన్నారు. దీంతో ఒక కుటుంబానికి గరిష్టంగా సుమారు రూ.కోటి పరిహారం అందుతుందని అధికారులు వివరిస్తున్నారు. దేశంలో ఇంత భారీ మొత్తంలో నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదని జిల్లా ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. -
త్యాగ‘ఫలం’
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా చేయాలనే సీఎం కేసీఆర్ సంకల్పం నుంచి జీవం పోసుకున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు. దీనిలో భాగంగానే సిద్దిపేట జిల్లాలో నిర్మించే కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న గ్రామస్తుల త్యాగాలను ప్రభుత్వం కొనియాడుతోంది. మీ త్యాగంతో బీడు బారిన తెలంగాణ భూములు జీవం పోసుకుంటున్నాయని.. త్యాగాలు చేసిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉం టుందని తెలిపింది. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం పంపిణీ కార్యక్రమం చేపట్టింది. గత వారం రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వా సితుల గ్రామాల్లో నిర్వహిస్తున్నా రు. తాము నష్టపోయినా పర్వాలేదు.. అన్నదాతల ఆకలి చావులు, రైతుల కష్టాలు తీర్చేందుకు తాము భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉందని నిర్వాసితులు చెబుతున్నారు. కుటుంబానికి రూ.7.5 లక్షల పరిహారం.. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన గ్రామస్తులకు పునర్ నివాసం, పునరోపాధి పథకం కింద ప్రభుత్వం ఆదుకుంటుంది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిధిలో రాంపూర్, లక్ష్మాపూర్, బ్రాహ్మణ బంజరుపల్లి, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లెపహాడ్, సింగారం, ఎర్రవల్లి గ్రామాల్లో సుమారు 5 వేల కుటుంబాలు ఉన్నాయి. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ముంపులో మామిడియాల, బైలాంపూర్, తానేదారుపల్లి గ్రామాల్లో 1,400 కుటుంబాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఒక్కో కుటుంబానికి రూ.7.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నారు. కుటుంబంలో 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు రూ.5 లక్షల చొప్పున అదనంగా అందిస్తున్నారు. వీటితోపాటు కుటుంబానికి 250 గజాల ఇంటి స్థలం కూడా ఇస్తున్నారు. పండుగ వాతావరణంలో పరిహారం పంపిణీ.. పండుగ వాతావరణం మధ్య పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల కలెక్టర్లు కృష్ణభాస్కర్, వెంకట్రామిరెడ్డిలతోపాటు ఆర్డీవోలు, తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు గ్రామాలకు వెళ్తున్నారు. భూములకు పరిహారంతోపాటు, ఇతర ఆర్థిక వనరులకు కూడా డబ్బులు చెల్లించడంతోపాటు గ్రామస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
పరిహారం సత్వరం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం సేకరించిన భూముల నిర్వాసితులకు ఉపాధి, పునరావాస సాయం పంపిణీని వంద శాతం యుద్ధప్రాతిపదికన పూర్తి చేయా లని సీఎం కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లింపు చాలావరకు పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కొద్దిరోజుల్లోనే పూర్తిచేసి ఈ నెల 11లోగా హైకోర్టుకు నివేదిక పంపాలని సూచించారు. పరిహారం చెల్లింపుపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం కేసీఆర్ శుక్రవారం ఉన్నతాధికారులతో మాట్లాడారు. నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకునే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో, అత్యంత మానవత్వంతో వ్యవహరిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అయినా కోర్టులు తరచూ జోక్యం చేసుకునే పరిస్థితులు రావ డంపట్ల సీఎం తీవ్ర అసహ నం వ్యక్తం చేశారు. నిర్వాసి తులకు పరిహారం అం దించే ప్రక్రియను వెంటనే ముగించేలా స్వయంగా పర్యవేక్షించాలని సీఎస్ ఎస్.కె.జోషికి సూచించారు. అలాగే పరిహారం పంపిణీని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యతను సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు సీఎం అప్పగించారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీని చేపట్టేందుకు గ్రామాలవారీగా శిబిరాలు నిర్వహించాలని, ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిహారానికి 800 కోట్లు ఖర్చు.. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయమై అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ‘‘లక్ష కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణలో 40 లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు అందించేందుకు అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. అందులో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నాం. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు మల్లన్నసాగర్ గుండె లాంటిది. ఇంత పెద్ద రిజర్వాయర్ నిర్మించే క్రమంలో కొద్ది మంది భూములు, ఇళ్లు కోల్పోతున్నారు. వారి విషయంలో ప్రభుత్వం ఎంతో సానుభూతితో, మానవత్వంతో వ్యవహరిస్తోంది. నిర్వాసితులు మెరుగైన పునరోపాధి, పునరావాసం పొందడానికి ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచే ప్యాకేజీని అందిస్తోంది. రూ. 800 కోట్లను మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం, పునరావాస కార్యక్రమాల కోసమే ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం ఇంత చేసినా, కొద్ది మందికి సాయం అందించే విషయంలో జరిగిన జాప్యం వల్ల కోర్టులు తరచూ జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. ఇది అత్యంత బాధాకరం. ఏనుగు ఎల్లింది, తోక మిగిలింది అనే చందంగా మొత్తం ప్రక్రియలో కొద్దిపాటి పరిహారం ఇవ్వడమే మిగిలింది. దీన్ని అలుసుగా తీసుకొని కొంత మంది వ్యక్తులు, ప్రగతి నిరోధక శక్తులు ప్రాజెక్టునే ఆపడానికి కుట్రలు చేస్తున్నారు. పరిహారం పంపిణీ ప్రక్రియలో మిగిలిన కొంచెం పనిని కూడా త్వరగా పూర్తి చేసి, చిల్లర పంచాయితీని వెంటనే ముగించాలి. పరిహారం పంపిణీని యుద్ధప్రాతిపదికన ముగించి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ మాదిరిగానే శరవేగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాలి. యుద్ధం జరుగుతుందా అన్నట్లుగా పనులు చేసి, ఆరేడు నెలల్లోనే మల్లన్నసాగర్ నిర్మాణం పూర్తి చేయాలి. వచ్చే ఏడాది జూన్‌లో రిజర్వాయర్‌లో నీళ్లు నింపాలి’’అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కదిలిన అధికార గణం... మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో అధికార యంత్రాగం కదిలింది. నీటిపారుదల శాఖను కూడా నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి తన అమెరికా పర్యటనను రద్దు చేసుకొని ఉన్నతాధికారులతో సమీక్షించారు. పరిహారం పంపిణీ ప్రక్రియను ముగించడానికి ప్రణాళిక రూపొందించారు. సిద్దిపేట కలెక్టర్ కృష్ణ భాస్కర్, సిద్దిపేటలో గతంలో విధులు నిర్వహించిన సిరిసిల్ల కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ సమావేశమయ్యారు. ఇప్పటివరకు అందిన పరిహారం వివరాలు తెలుసుకొని మిగిలి వారికి పరిహారం అందించే కార్యక్రమాన్ని ఖరారు చేశారు. మల్లన్నసాగర్ పరిధిలోని 8 గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి నిర్వాసితులకు పరిహారం అందించాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక అధికారులను నియమించారు. రాంపూర్, లక్ష్మాపూర్, బ్రాహ్మణ బంజెరుపల్లి గ్రామాలకు డీఆర్వో బి. చంద్రశేఖర్, సిద్దిపేట ఆర్డీఓ ఎం. జయచంద్రారెడ్డిలను, పల్లెపహాడ్ గ్రామానికి ‘గడా’స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ఎం. జయచంద్రారెడ్డి, హైదరాబాద్ ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డిలను, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి ‘గడా’స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ఎం. జయచంద్రారెడ్డి, సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్‌రావులను, వేములఘాట్ గ్రామానికి ‘గడా’స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ఎం. జయచంద్రారెడ్డి, సికింద్రాబాద్ ఆర్డీఓ రాజాగౌడ్, హుస్నాబాద్ ఆర్డీఓ కె. అనంతరెడ్డిలను, సింగారం గ్రామానికి గజ్వేల్ ఆర్డీఓ డి. విజయేందర్‌రెడ్డి, మల్కాజిగిరి ఆర్డీఓ మధుసూదన్‌లను, ఎర్రవల్లి గ్రామానికి గజ్వేల్ ఆర్డీఓ డి. విజయేందర్‌రెడ్డిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. పరిహారం పంపిణీ ప్రారంభం... సింగారం, రాంపూర్ గ్రామాల్లో 800 మంది నిర్వాసితులకు చెక్కుల ద్వారా పరిహారం పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. మిగతా గ్రామాల్లో ప్రత్యేకాధికారుల సమక్షంలో శనివారం నుంచి చెక్కుల పంపిణీ జరగనుంది. నిర్వాసితులెవరైనా చెక్కులు తీసుకోవడానికి విముఖత చూపితే వారి అభిప్రాయాన్ని వీడియో తీయాలని అధికారులు నిర్ణయించారు. నిర్వాసితులకు ప్రభుత్వం అందిస్తున్న సాయం.. ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి దేశంలోకెల్లా అత్యంత మెరుగైన పునరావాస ప్యాకేజీని ప్రభుత్వం అందించింది. రైతులు కోల్పోయిన భూములకు, వ్యవసాయ కొట్టాలకు, బావులకు, బోర్‌వెల్స్‌కు, చెట్లకు, తోటలకు, పైపులైన్లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పరిహారం అందించింది. పునరోపాధి, పునరావాస ప్యాకేజీ కింద ఇలా సాయం అందిస్తోంది. 1. కేంద్ర చట్టం ఒక్కో ఇంటికి రూ. 1.25 లక్షల వ్యయమయ్యే 60 గజాల స్థలంలో ఇందిరా ఆవాస్ యోజన ఇల్లు మంజూరు చేయాలని చెబుతుండగా రాష్ట్ర ప్రభుత్వం మల్లన్నసాగర్ నిర్వాసితులకు అంతకన్నా నాలుగు రెట్లు ఎక్కువగా, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఒక్కో ఇంటి కోసం రూ. 5.04 లక్షల విలువైన 560 అడుగుల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తోంది. ఈ ఇళ్లను కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాకుండా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎడ్యుకేషన్ హబ్ పక్కన 460 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వమే నిర్మించి ఇస్తోంది. ఇళ్లు వద్దనుకునే వారికి 250 గజాల ఇంటి స్థలం, రూ. 5.04 లక్షల నగదు అందిస్తోంది. 2. ప్రస్తుతం ఉన్న ముంపు గ్రామంలోని ఇంటి స్థలానికి గజం రూ. 1,600 చొప్పున లెక్కగట్టి పరిహారం చెల్లిస్తోంది. 3. కోల్పోయిన ఇంటికి కూడా శాస్త్రీయంగా లెక్కగట్టి పరిహారం చెల్లిస్తోంది. 4. ఒక్కో కుటుంబానికి రూ. 7.50 లక్షల పునరావాస ప్యాకేజీని అదనంగా అందిస్తోంది. 5. 18 సంవత్సరాలు దాటిన అవివాహితులకు కూడా రూ. 5 లక్షల పునరావాస సాయం, 250 గజాల ఇంటి స్థలం ఇస్తోంది. 6. పునరావాస ప్యాకేజీ కింద ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇంటికి ఆర్డీఓ సంతకంతో తహసీల్దార్ పట్టా జారీ చేస్తారు. అవసరమైన పక్షంలో ఈ ఇంటిని అమ్ముకోవడానికి, బహుమతిగా కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి అనుకూలంగా ఈ పట్టాలుంటాయి. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ప్రభుత్వం అందిస్తున్న పునరోపాధి, పునరావాస కార్యక్రమం కింద గరిష్టంగా దాదాపు రూ. కోటి వరకు సాయం అందుతోందని ప్రభుత్వం చెబుతోంది.ఆ పరిహారం ఇదీ.. ఒక్కో కుటుంబానికి అందే మొత్తం: రూ. 7.50 లక్షలు ఇద్దరు అవివాహిత పిల్లలుంటే అందే మొత్తం: రూ. 10 లక్షలు కుటుంబానికి, పెద్ద పిల్లలకు కలిపి అందే ప్లాట్ల విలువ: రూ.75 లక్షలు (3·250 గజాల ప్లాట్లకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం) కోల్పోయిన ఇంటికి, ఇంటి స్థలానికి పరిహారం: విస్తీర్ణాన్ని బట్టి -
పునరావాసం త్వరగా పూర్తి చేయండి: కేసీఆర్
హైదరాబాద్: మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూనిర్వాసితుల పునరోపాధి, పునరావాస సాయం పంపిణీ కార్యక్రమం వందకు వంద శాతం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చే కార్యక్రమం పూర్తయిందని, మిగిలిన కొద్దిపాటి ప్రక్రియను కొద్ది రోజుల్లోనే పూర్తి చేసి, ఈ నెల 11వ తేదీలోగా హైకోర్టుకు నివేదిక పంపాలని సీఎం సూచించారు. పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో నిర్వహించే బాధ్యతలను సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు ముఖ్యమంత్రి అప్పగించారు. ‘లక్ష కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణలో 40 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందివ్వడానికి అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. అందులో భాగంగా 50 టిఎంసిల సామర్థ్యం కలిగిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నాం. ఇంత పెద్ద రిజర్వాయర్ నిర్మించే క్రమంలో కొద్ది మంది భూములు, ఇండ్లు కోల్పోతున్నారు. నిర్వాసితులు మెరుగైన పునరోపాధి, పునరావాసం పొందడానికి ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచే ప్యాకేజీని అందిస్తున్నది. రూ.800 కోట్లను మల్లన్న సాగర్ నిర్వాసితులకు పరిహారం, పునరావాస కార్యక్రమాల కోసమే ప్రభుత్వం ఖర్చు చేస్తున్నద’ని సీఎం చెప్పారు. ‘ప్రభుత్వం ఇంత చేసినా, కొద్ది మందికి సాయం అందించే విషయంలో జరిగిన జాప్యం వల్ల కోర్టులు తరచూ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది.మొత్తం ప్రక్రియలో కొద్ది పాటి పరిహారం ఇవ్వడమే మిగిలింది. దీనిని అలుసుగా తీసుకుని కొంత మంది వ్యక్తులు, ప్రగతి నిరోధక శక్తులు ప్రాజెక్టునే ఆపడానికి కుట్రలు చేస్తున్నారు. పరిహారం పంపిణీ ప్రక్రియలో మిగిలిన కొంచెం పనిని కూడా త్వరగా పూర్తి చేసి, చిల్లర పంచాయితీని వెంటనే ముగించాల’ని సీఎం వ్యాఖ్యానించారు. సింగారం, రాంపూర్ గ్రామాల్లో 800 మంది నిర్వాసితులకు చెక్కుల ద్వారా పరిహారం పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమయింది. మిగతా గ్రామాల్లో ప్రత్యేకాధికారుల సమక్షంలో శనివారం నుంచి చెక్కుల పంపిణీ జరుగుతుంది. ఎవరైనా చెక్కులు తీసుకోవడానికి విముఖత చూపితే, వారి అభిప్రాయాన్ని వీడియో తీయాలని అధికారులు నిర్ణయించారు. నిర్వాసితులకు ప్రభుత్వం అందిస్తున్న సాయం 1. కేంద్ర చట్టం ఒక్కో ఇంటికి రూ.1.25 లక్షల వ్యయమయ్యే 60 గజాల స్థలంలో ఇందిరా ఆవాస్ యోజన ఇల్లు మంజూరు చేయాలని చెబుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మల్లన్న సాగర్ నిర్వాసితులకు అంతకన్నా నాలుగు రెట్లు ఎక్కువగా, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఒక్కో ఇంటికోసం రూ.5.04 లక్షల విలువైన 560 అడుగుల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తున్నది. ఈ ఇండ్లను కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాకుండా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎడ్యుకేషన్ హబ్ పక్కన 460 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వమే నిర్మించి ఇస్తున్నది. ఇల్లు వద్దు అనుకునే వారికి 250 గజాల ఇంటి స్థలం, రూ.5.04 లక్షల నగదు అందిస్తున్నది. 2. ప్రస్తుతం ఉన్న ముంపు గ్రామంలోని ఇంటి స్థలానికి గజం రూ. 1600 చొప్పున లెక్క గట్టి పరిహారం చెల్లిస్తున్నది. 3. కోల్పోయిన ఇంటికి కూడా శాస్త్రీయంగా లెక్కగట్టి పరిహారం చెల్లిస్తున్నది. 4.ఒక్కో కుటుంబానికి రూ.7.50 లక్షల పునరావాస ప్యాకేజీ అదనంగా అందిస్తున్నది. 5. 18 సంవత్సరాలు దాటిన అవివాహితులకు కూడా రూ.5 లక్షల పునరావాస సాయం, 250 గజాల ఇంటి స్థలం ఇస్తున్నది. 6. పునరావాస ప్యాకేజి కింద ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇంటికి ఆర్డీఓ సంతకంతో తహసీల్దార్ పట్టా జారీ చేస్తారు. అవసరమైన పక్షంలో ఈ ఇంటిని అమ్ముకోవడానికి, బహుమతిగా కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి అనుకూలంగా ఈ పట్టాలుంటాయి. మల్లన్న సాగర్ నిర్వాసితులకు ప్రభుత్వం అందిస్తున్న పునరోపాధి, పునరావాస కార్యక్రమం కింద గరిష్టంగా దాదాపు కోటి రూపాయల వరకు సాయం అందుతున్నది. ఒక్కో కుటుంబానికి అందే మొత్తం: రూ. 7.50 లక్షలు, ఇద్దరు పెద్ద పిల్లలుంటే అందే మొత్తం: రూ.10 లక్షలు, కుటుంబానికి, పెద్ద పిల్లలకు కలిపి వచ్చేవి మూడు ప్లాట్లు (750 గజాలు): రూ.75 లక్షలు. -
జనవరి కల్లా తరలింపు!
మల్లన్నసాగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టులకు భూ సేకరణ పూర్తిచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా నిర్వాసిత గ్రామాల తరలింపుపై దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది జనవరిలోగా అక్కడి ప్రజలను పునరావాస కాలనీలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిర్వాసితుల కోసం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మూడు గ్రామాలను ఎంపిక చేసి.. అక్కడ యుద్ధ ప్రాతిపదికన ఆర్అండ్ఆర్ కాలనీలు నిర్మిస్తున్నారు. తొలివిడతలో గజ్వేల్‌లోని ముట్రాజ్‌పల్లి, ఎల్లూరు.. ములుగు మండలంలోని తున్కి బొల్లారం గ్రామాల్లో 1,350 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. డిసెంబర్‌లోగా వాటిని పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ మధ్య వరకైనా కాళేశ్వరం నీళ్లను పంటలకు అందించాలని మంత్రి హరీశ్‌రావు పట్టుబట్టుతుండటంతో అధికారులు ఆ మేరకు పనులు చేస్తున్నారు. వేగంగా ఇళ్ల నిర్మాణం.. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లె పహాడ్, వేములఘాట్, బాపని బంజేరుపల్లి, లక్ష్మాపూర్, రాంపూర్.. కొండపాక మండలంలో ఎర్రవల్లి, సింగారం గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వేములఘాట్ గ్రామస్తులు మినహా మిగతా గ్రామాల వారు ఊరు వదిలి వెళ్లేందుకు అంగీకరించారు. ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో మొత్తం 2,779 కుటుంబాలు ఉన్నాయి. నిర్వాసితులకు మొదటి విడతలో ముట్రాజ్‌పల్లిలో 600 ఇళ్లు, ఎల్లూరులో 150 ఇళ్ల నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ప్రతి కుటుంబానికి 250 గజాల స్థలంలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తున్నారు. డిసెంబర్ చివరికల్లా ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి.. జనవరి లేదా ఫిబ్రవరిలో గృహ ప్రవేశం చేయించేందుకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి నేతృత్వంలోని అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇల్లు అవసరం లేదనుకున్న నిర్వాసితులకు ఖాళీ స్థలంతోపాటు డబుల్ బెడ్రూం పథకం కింద వచ్చే రూ.5.04 లక్షలను నగదుగా అందజేస్తున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌లో ములుగు మండలం మామిడ్యాల, తాందార్పల్లి, బహిలంపూర్ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇక్కడ 1,050 కుటుంబాలు ఇళ్లను కోల్పోతున్నాయి. వీరికోసం ములుగు మండలం తున్కి బోల్లారం గ్రామంలో 550 ఇళ్లు కడుతున్నారు. ఈ ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. రెండో దశలో మిగతా వారికి ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రెండు రోజులకోసారి మంత్రి సమీక్ష మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు, పునరావాస కాలనీల నిర్మాణంపై మంత్రి హరీశ్‌రావు రెండు రోజులకోసారి సమీక్షిస్తున్నారు. అనుకున్న గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు. అధికారులు కూడా పనులను వేగిరం చేశారు. కాల్వల నుంచి చెరువులకు నీళ్లు.. మల్లన్న సాగర్ రిజర్వాయర్ పూర్తి కాకున్నా.. కాళేశ్వరం నీటిని కాల్వల ద్వారా తరలించి నేరుగా చెరువులు నింపాలని మంత్రి హరీశ్‌రావు సంకల్పించారు. తొలుత నీటిని మిడ్ మానేరు నుంచి అనంతగిరి మీదుగా రంగనాయక సాగర్‌కు తరలించనున్నారు. అక్కడి నుంచి ప్రతిపాదిత మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రాంతానికి 16 కిలోమీటర్ల దూరం వరకు సొరంగ మార్గం ద్వారా తుక్కాపూర్ పంపుహౌజ్‌కు తరలించాలని నిర్ణయించారు. ఈ సొరంగం పనులు శరవేగంగా సాగుతున్నాయి. తుక్కాపూర్ పంపుహౌజ్ నుంచి కాల్వల ద్వారా నీటిని తరలించి చెరువులు నింపేలా ప్రణాళిక రూపొందించారు. కాల్వల నిర్మాణ పనులు కూడా 70 శాతానికి పైగా పూర్తయ్యాయి. కొండపోచమ్మ రిజర్వాయర్ కోసం కొడకండ్ల వంతెన వద్ద భారీ ఆనకట్ట నిర్మించి నీటిని వదులుతారు. తర్వాత కాల్వల ద్వారా గజ్వేల్ మండలం అక్కారం వరకు తరలిస్తారు. అక్కడి నుంచి సొరంగం ద్వారా మర్కూక్ మండలం భవానందాపూర్ వద్ద నిర్మించనున్న పంపుహౌజ్‌కు చేర్చి.. దాని నుంచి పైపుల ద్వారా కొండపోచమ్మ సాగర్ పరిధిలోని చెరువులను నింపేందుకు కసరత్తు చేస్తున్నారు. -
వేములఘాట్ ప్రజలు ధైర్యవంతులు
తొగుట (దుబ్బాక): ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. సాగుభూమి, ఊరిని కాపాడుకునేందుకు పోరాడుతున్న వేములఘాట్ ప్రజలు ధైర్యవంతులని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను వ్యతిరేకిస్తూ వేములఘాట్ గ్రామస్తులు చేపట్టిన దీక్షలు మంగళవారానికి 500 రోజులకు చేరాయి. దీక్షలకు సంఘీభావం ప్రకటించిన అనంతరం తమ్మినేని మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన 2013 చట్టాన్ని తుంగలో తొక్కి 123 జీఓ, 2016 చట్టంతో కేసీఆర్ సర్కార్ భూసేకరణ చేస్తోందన్నారు. 123 జీఓను హైకోర్టు కొట్టి వేసినా ప్రభుత్వానికి బుద్ధి రాలేదన్నారు. పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో 5 లక్షల ఎకరాల సాగు భూమి కాజేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నా రు. డిజైన్ ప్లానింగ్ రిపోర్టు లేకుండా ప్రాజెక్టును ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. -
మల్లన్నసాగర్ టెండర్లన్నీ ‘ఎక్సెస్’
రూ.6,803 కోట్ల పనులను 3 శాతం ఎక్సెస్‌కు దక్కించుకున్న ఆఫ్కాన్స్, ఎల్అండ్టీ, రాఘవ, హెచ్‌ఈఎస్ ► ఖజానాపై రూ.236 కోట్ల అదనపు భారం ► కొండపోచమ్మసాగర్‌కు లెస్ దాఖలు చేసిన ఏజెన్సీలు సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ టెండర్లన్నీ అధిక ధరల (ఎక్సెస్)కే దాఖలయ్యాయి. రిజర్వాయర్ పనులను నాలుగు రీచ్‌లుగా విభజించి నాలుగు ప్యాకేజీలకింద టెండర్లు పిలవగా నాలుగింటినీ కాంట్రాక్టు ఏజెన్సీలు ఎక్సెస్ ధరలతోనే దక్కించుకున్నాయి. దీంతో ప్రభుత్వంపై రూ.236 కోట్ల మేర అదనపు భారం పడుతోంది. ఇక కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్, దానికింద కన్వెయర్ వ్యవస్థల పనులకు సంబంధించిన నాలుగు ప్యాకేజీలకు మాత్రం లెస్తో టెండర్లు దాఖలయ్యాయి. ఎక్సెస్‌తో భారం.. కాళేశ్వరంలోని మల్లన్న, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్, వాటి కింది కాల్వల వ్యవస్థ నిర్మాణాలకు గత నెల 19న నీటి పారుదల శాఖ టెండర్లు పిలిచింది. మొత్తం రూ.10,843కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లను శనివారం రాత్రి పదకొండు గంటలకు తెరిచారు. ఇందులో 50 టీఎంసీల మల్లన్నసాగర్ పనులను మొత్తం రూ.6,803 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ పనుల్లో మొదటి రీచ్‌కు తొలి కిలోమీటర్ నుంచి 8.5 కిలోమీటర్ వరకు మట్టికట్ట పనులకు రూ.1,822 కోట్లతో టెండర్ పిలిచారు. దీన్ని 3.9శాతం ఎక్సెస్‌తో ఆఫ్కాన్స్ ఏజెన్సీ దక్కించుకుంది. ఇక 8.5 కిలోమీటర్ నుంచి 12.8 కిలోమీటర్ వరకు రూ.1,499 కోట్లతో టెండర్ పిలవగా, దీన్ని3.15 శాతం ఎక్సెస్‌తో ఎల్అండ్టీ, 12.8 కిలోమీటర్ నుంచి 16.7 కిలోమీటర్ వరకు రూ.2,046.64 కోట్లతో పిలవగా రాఘవ సంస్థ 3.5శాతం ఎక్సెస్‌తో, 16.7 కిలోమీటర్ నుంచి 22.9వ కిలోమీటర్ వరకు రూ.1,436.77 కోట్లతో పిలవగా దీన్ని3.2శాతం ఎక్సెస్‌తో హెచ్‌ఈఎస్ ఏజెన్సీలు దక్కించుకున్నాయి. మిగతావి లెస్.. ఇక కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని రెండు ప్యాకేజీలుగా విభజించి రూ.1,600 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇందులో 5.50 కిలోమీటర్ వరకు తొలి రీచ్‌గా నిర్ణయించి దానికి రూ.900.23 కోట్లతో టెండర్ పిలవగా దీన్ని 1.75 శాతం లెస్ ధరకు కేఎన్ఆర్ ఏజెన్సీ, రెండో రీచ్‌కు రూ.700 కోట్లతో టెండర్ పిలవగా, దాన్ని హెచ్‌ఈఎస్ ఏజెన్సీ దక్కించుకుంది. ఇక రిజర్వాయర్ కింద అప్రోచ్ చానల్, కాల్వలు, గ్రావిటీ కాల్వ, టన్నెల్, సర్జ్‌పూల్, పంప్‌హౌజ్ నిర్మాణాలకు సంబంధించి ప్యాకేజీ–14 పనులకు రూ.1,875 కోట్లతో టెండర్ పిలవగా, దాన్ని ఒక శాతం లెస్తో మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకోగా, ప్యాకేజీ–13కు చెందిన రూ.556.11 కోట్ల పనులను 1.25 శాతం లెస్తో సత్యఇన్ఫ్రా సంస్థ దక్కించుకుంది. ఈ టెండర్లకు సంబంధించిన డాక్యుమెంట్ల పరిశీలన సోమవారం నుంచి ప్రారంభం కానుంది. -
మల్లన్నసాగర్ టెండర్లపై పీటముడి
ప్యాకేజీలపై ఇంకా వీడని సందిగ్ధం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ టెండర్లపై సందిగ్ధత కొనసాగుతోంది. భారీ వ్యయంతో కూడుకున్న ఈ రిజర్వా యర్ పనులను ఎన్ని ప్యాకేజీలుగా విభజిం చాలన్న అంశం ఇంతవరకూ తేలలేదు. దీంతో నిర్మాణ పనుల ప్రారంభం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 5ప్రధాన రిజర్వాయర్లను మొత్తంగా రూ.10,876 కోట్లతో చేపట్టాలని నిర్ణయించగా, ఇందులో మల్లన్నసాగర్‌కు రూ.7,249.52 కోట్లను ఇప్పటికే నీటిపారు దల శాఖ ఓకే చేసింది. మిగతా నాలిగింటిలో రంగనాయకసాగర్ రూ.496.50కోట్లు, కొండ పోచమ్మ రూ.519.70కోట్లు, గంధమల రూ.860.25 కోట్లు, బస్వాపూర్ రిజర్వాయర్ కు రూ.1,751కోట్లకు అనుమతులిచ్చారు. ఇందులో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ మినహా మిగతా మూడు రిజర్వా యర్లకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. కొండపోచమ్మ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించడంతో దానికి ఇప్పట్లో టెండర్లు ఖరార య్యేలా కనిపించడం లేదు. కాగా మల్లన్నసాగర్‌కు ఎలాంటి ఆటంకాలు లేకున్నా ప్యాకేజీ లపై ఎటూ తేలడం లేదు. దీని వ్యయం భారీగా ఉండటంతో 4 ప్యాకేజీలుగా విభజిం చేందుకు సాంకేతిక అనుమతులివ్వాలని ప్రా జెక్టు అధికారులు మొదట ఉన్నతాధికా రుల కు విన్నవించారు. అయితే రిజర్వాయర్ నిర్మా ణాన్ని 2018 చివరికి పూర్తిచేయాలంటే ఎక్కు వ ప్యాకేజీలుగా విభజించి పనులు వేగిరం చే యాలని అధికారులు భావించి దీన్ని 5 ప్యాకే జీలు చేయాలని సూచించారు.ఇటీవల దీనిపై సమీక్షించిన ప్రభుత్వం తిరిగి 4ప్యాకేజీలకే మొగ్గుచూపింది. ఈ మేరకు అధికారులు ప్రతి పాదనలు పంపగా, తిరిగి ఉన్నతాధికారులు దీన్ని నిలిపివేసినట్లు తెలిసింది.