మల్లన్నసాగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టులకు భూ సేకరణ పూర్తిచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా నిర్వాసిత గ్రామాల తరలింపుపై దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది జనవరిలోగా అక్కడి ప్రజలను పునరావాస కాలనీలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిర్వాసితుల కోసం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మూడు గ్రామాలను ఎంపిక చేసి.. అక్కడ యుద్ధ ప్రాతిపదికన ఆర్‌అండ్‌ఆర్ కాలనీలు నిర్మిస్తున్నారు. తొలివిడతలో గజ్వేల్‌లోని ముట్రాజ్‌పల్లి, ఎల్లూరు.. ములుగు మండలంలోని తున్కి బొల్లారం గ్రామాల్లో 1,350 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. డిసెంబర్‌లోగా వాటిని పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ మధ్య వరకైనా కాళేశ్వరం నీళ్లను పంటలకు అందించాలని మంత్రి హరీశ్‌రావు పట్టుబట్టుతుండటంతో అధికారులు ఆ మేరకు పనులు చేస్తున్నారు.
వేగంగా ఇళ్ల నిర్మాణం..
మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లె పహాడ్, వేములఘాట్, బాపని బంజేరుపల్లి, లక్ష్మాపూర్, రాంపూర్.. కొండపాక మండలంలో ఎర్రవల్లి, సింగారం గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వేములఘాట్ గ్రామస్తులు మినహా మిగతా గ్రామాల వారు ఊరు వదిలి వెళ్లేందుకు అంగీకరించారు. ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో మొత్తం 2,779 కుటుంబాలు ఉన్నాయి.
నిర్వాసితులకు మొదటి విడతలో ముట్రాజ్‌పల్లిలో 600 ఇళ్లు, ఎల్లూరులో 150 ఇళ్ల నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ప్రతి కుటుంబానికి 250 గజాల స్థలంలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తున్నారు. డిసెంబర్ చివరికల్లా ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి.. జనవరి లేదా ఫిబ్రవరిలో గృహ ప్రవేశం చేయించేందుకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి నేతృత్వంలోని అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇల్లు అవసరం లేదనుకున్న నిర్వాసితులకు ఖాళీ స్థలంతోపాటు డబుల్ బెడ్రూం పథకం కింద వచ్చే రూ.5.04 లక్షలను నగదుగా అందజేస్తున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌లో ములుగు మండలం మామిడ్యాల, తాందార్‌పల్లి, బహిలంపూర్ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇక్కడ 1,050 కుటుంబాలు ఇళ్లను కోల్పోతున్నాయి. వీరికోసం ములుగు మండలం తున్కి బోల్లారం గ్రామంలో 550 ఇళ్లు కడుతున్నారు. ఈ ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. రెండో దశలో మిగతా వారికి ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
రెండు రోజులకోసారి మంత్రి సమీక్ష
మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు, పునరావాస కాలనీల నిర్మాణంపై మంత్రి హరీశ్‌రావు రెండు రోజులకోసారి సమీక్షిస్తున్నారు. అనుకున్న గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు. అధికారులు కూడా పనులను వేగిరం చేశారు.
కాల్వల నుంచి చెరువులకు నీళ్లు..
మల్లన్న సాగర్ రిజర్వాయర్ పూర్తి కాకున్నా.. కాళేశ్వరం నీటిని కాల్వల ద్వారా తరలించి నేరుగా చెరువులు నింపాలని మంత్రి హరీశ్‌రావు సంకల్పించారు. తొలుత నీటిని మిడ్ మానేరు నుంచి అనంతగిరి మీదుగా రంగనాయక సాగర్‌కు తరలించనున్నారు. అక్కడి నుంచి ప్రతిపాదిత మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రాంతానికి 16 కిలోమీటర్ల దూరం వరకు సొరంగ మార్గం ద్వారా తుక్కాపూర్ పంపుహౌజ్‌కు తరలించాలని నిర్ణయించారు. ఈ సొరంగం పనులు శరవేగంగా సాగుతున్నాయి. తుక్కాపూర్ పంపుహౌజ్ నుంచి కాల్వల ద్వారా నీటిని తరలించి చెరువులు నింపేలా ప్రణాళిక రూపొందించారు.
కాల్వల నిర్మాణ పనులు కూడా 70 శాతానికి పైగా పూర్తయ్యాయి. కొండపోచమ్మ రిజర్వాయర్ కోసం కొడకండ్ల వంతెన వద్ద భారీ ఆనకట్ట నిర్మించి నీటిని వదులుతారు. తర్వాత కాల్వల ద్వారా గజ్వేల్ మండలం అక్కారం వరకు తరలిస్తారు. అక్కడి నుంచి సొరంగం ద్వారా మర్కూక్ మండలం భవానందాపూర్ వద్ద నిర్మించనున్న పంపుహౌజ్‌కు చేర్చి.. దాని నుంచి పైపుల ద్వారా కొండపోచమ్మ సాగర్ పరిధిలోని చెరువులను నింపేందుకు కసరత్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment