మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో భగీరథ పథకం ఆఫ్‌టేక్ పాయింట్
గజ్వేల్: ‘మల్లన్నసాగర్ భగీరథ పథకం’ సిద్ధమవుతోంది. రూ.1,100 కోట్లతో చేపడుతున్న ఈ పథకం ద్వారా జూన్ కల్లా జనగామ జిల్లాకు మంచినీటిని అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జనగామతో పాటు గ్రేటర్ హైదరాబాద్, సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి, మెదక్ జిల్లాలకూ మల్లన్నసాగర్ రిజర్వాయర్ నీరందించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ జిల్లాలకు ప్రస్తుతం ఏర్పడుతున్న నీటి కొరతను అధిగమించేందుకు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ వేసిన లైన్‌కు సమాంతరంగా మరో లైన్‌ను నిర్మించి జూన్‌లోపు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.
నీటి కొరతను అధిగమించేందుకు..
జంటనగరాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పదేళ్ల క్రితం రూ.3,375 కోట్ల అంచనాతో గోదావరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టి పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి 10 టీఎంసీల నీటి తరలింపు లక్ష్యంగా 186 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఈ లైన్ ద్వారా నిత్యం 735 ఎంఎల్‌డీ నీటి సరఫరా జరుగుతుండగా సిద్దిపేట, జనగామ, యాదాద్రి, మేడ్చల్, మెదక్ జిల్లాల్లో అవసరాలకు సుమారుగా 300 ఎంఎల్‌డీలను పంపిణీ చేస్తున్నారు.
మిగతా నీరు హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నారు. అయితే కొండపాక, ప్రజ్ఞాపూర్ వద్ద సిద్దిపేట, జనగామ జిల్లాల అవసరాల కోసం ఈ లైన్‌పై నీటిని ట్యాపింగ్ చేస్తుండటంతో హైదరాబాద్ నగరానికి నీటి కొరత ఏర్పడుతోంది. లైన్‌లో ఏదైనా సమస్య వస్తే జిల్లాలోని అన్ని ప్రాంతాల వారూ తాగునీటికి ఇబ్బంది పడేవారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు మల్లన్నసాగర్ భగీరథ పథకం ప్రారంభించారు.
అంతా మల్లన్నసాగర్ నుంచే వాడుకునేలా..
50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ తెలంగాణలోని పలు జిల్లాల్లో సాగుతో పాటు, తాగునీటికి ఏటా 10 టీఎంసీలు కేటాయించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రిజర్వాయర్‌లోని ఆఖరి టీఎంసీ నీటిని కూడా వాడుకునేలా డిజైన్ చేశారు. కొండపాక మండలం మం గోల్ వద్ద రాష్ట్రంలోనే అతి పెద్దదైన 540 ఎంఎల్‌డీ సామర్థ్యం గల వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ పను లు చేపట్టారు.
జూన్‌లోపు హైదరాబాద్ లైన్‌పై ఉన్న ట్యాపింగ్‌లను మూసేసి మల్లన్నసాగర్ స్టోరేజీ నుంచే నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మల్లన్నసాగర్ నుంచి మొదటగా జనగామ జిల్లాకు నీటి సరఫరా జరగనుంది. నీటిని తరలించేందుకు కొమురవెల్లి కమాన్ వద్ద గల ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా 6.9 కిలోమీటర్ల మేర ప్రత్యేక లైన్ నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment