మనోహరాబాద్–గజ్వేల్– సిద్దిపేట రైల్వేమార్గంలో ప్రయాణికులు అంతంత మాత్రమే
రోజూ రెండు ట్రిప్పులున్నా.. వందమందికి మించడం లేదు
కొత్తపల్లి వరకు లింకు పూర్తయితేనే మహర్దశ
సిద్దిపేట టు సికింద్రాబాద్‌కు..బస్సులో 2 గంటలు.. రైలులో 3:30 గంటలు
గజ్వేల్: మనోహరాబాద్ మీదుగా సిద్దిపేటకు వచ్చే రైలు స్పీడ్ తక్కువగా ఉండటం, ప్రయాణానికి సమయం ఎక్కువ తీసుకోవడంతో ఈ రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పెద్ద ఆసక్తిగా చూపడం లేదు. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లడానికి రైలులో మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు సమయం పడితే...బస్సులో అయితే సుమారు రెండు గంటల సమయమే పడుతోంది. దీంతో మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట మార్గంలో ప్రయాణికులు లేక రైలు వెలవెలబోతోంది.
8 బోగీలతో నడుస్తున్న ఈ రైలులో ఒకటి గార్డు, ఇతర అవసరాలుపోగా, ఏడింటిలో మొత్తంగా ఒక్క ట్రిప్పులో 644 మంది ప్రయాణం చేయొచ్చు. రోజుకూ రెండు అప్ అండ్ డౌన్ ట్రిప్పులు నడుస్తున్నా, వందమందికి మించి ప్రయాణించడం లేదు. రైలు వేగం కేవలం 60 కిలోమీటర్లకే పరిమితమై సికింద్రాబాద్ వరకు ప్రయాణ సమయం 4 గంటలు పట్టడమే ఇందుకు ప్రధాన కారణం.
మనోహరాబాద్ టు కొత్తపల్లి
మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం జరుగుతుండగా, రూ. 1160.47 కోట్లు వెచి్చస్తున్నారు. 2017లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ లైన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్‌తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్‌కత్తా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్‌గా ఆవిర్భవించనున్నది. మనోహరాబాద్– కొత్తపల్లి రైల్వేలై¯Œన్ పూర్తయితే.. ప్రయాణికులకు దూరభారం తగ్గుతుంది. మొత్తానికి ఈలైన్‌తో ఉత్తర తెలంగాణలోని సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు భారీ ప్రయోజనం చేకూరుతుంది.
రోజుకు రెండు అప్ అండ్ డౌన్ ట్రిప్పులు
ప్రతి బుధవారం మినహా మిగిలిన ఆరు రోజుల్లో ప్యాసింజర్ రైలు రోజుకూ రెండు అప్ అండ్ డౌన్ టిప్పులు నడుస్తోంది. ఉదయం 6.45 గంటలకు సిద్దిపేటలో బయలుదేరి.. దుద్దెడ, లకుడారం, కొడకండ్ల, గజ్వేల్, అప్పాయిపల్లి, నాచారం, మేడ్చల్, బొల్లారం, కవల్‌రీ బ్యారేక్స్(అల్వాల్), మల్కాజిగిరి, సికింద్రాబాద్ వరకు ఉదయం 10.15 గంటలకు చేరుకుంటోంది. తిరిగి సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.35 గంటలకు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 నిమిషాలకు చేరుతుంది. అన్నీ సజావుగా సాగితే సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లాలన్నా అక్కడి నుంచి సిద్దిపేటకు రావాలన్నా 3.30 గంటల ప్రయాణం తప్పదు. కానీ ట్రైన్ లేటయినా, సిగ్నల్స్ సమస్య ఉత్సన్నమైనా ఆలస్యం అవుతోంది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు బస్సులో వెళితే కేవలం 2 గంటల సమయయే పడుతుంది. ఈ కారణం వల్ల ఈ రైలుపై ఆసక్తి చూపడంలేదు.
మనోహరాబాద్ టు సికింద్రాబాద్ వరకు రద్దీ..: ఇదే రైలు మనోహరాబాద్ స్టేషన్ వెళ్లగానే అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా, ఈ మార్గంలో రద్దీ భారీగానే ఉంటుంది. కేవలం మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు మాత్రమే అతి తక్కువ ప్రయాణికులతో వెళుతోంది. ప్రస్తుతం సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు 117 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న రైలు మనోహరాబాద్ వరకు 74 కిలోమీటర్లు అతి తక్కువ ప్రయాణికులతో, ఆ తర్వాత మనోహారాబాద్ నుంచి సికింద్రాబాద్‌వరకు 43 కిలోమీటర్లు రద్దీగా వెళుతోంది.
ఇదే మార్గంలో గజ్వేల్ వరకు 2022 జూన్ 27న రైల్వేశాఖ గూడ్స్ రైలు సేవలను దక్షిణ మధ్య రైల్వేశాఖ రేక్ పాయింట్ కోసం ప్రారంభించింది. దీని ద్వారా రైల్వేశాఖకు మంచి ఆదాయం కూడా సమకూరుతోంది.
స్పీడ్ పెరిగితేనే మెరుగు..
మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట మార్గంలో వేగం తక్కువగా ఉండటం వల్ల సమయం ఎక్కువగా పడుతుంది. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్లడానికి ప్రయాణికులు కొంత వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ లైన్ స్పీడ్ పెరిగి, ప్రయాణానికి సమయం తగ్గనుంది. దీని ద్వారా ప్రయాణికుల సంఖ్య కూడా పెరగుతుంది. కొత్తపల్లి వరకు లింకు పూర్తయితే ఇక భారీగా పుంజుకుంటుంది. – దక్షిణ మధ్య రైల్వే ఇంజినీర్ జనార్దన్
Comments
Please login to add a commentAdd a comment