Bhagiratha mission
-
సిద్ధమవుతున్న ‘మల్లన్నసాగర్ భగీరథ’
గజ్వేల్: ‘మల్లన్నసాగర్ భగీరథ పథకం’సిద్ధమవుతోంది. మార్చి నెలాఖరులోగా ఈ పథకం పనులను పూర్తి చేయడానికి సంబంధిత యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. సిద్దిపేట, జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు ఇక ఇక్కడి నుంచే మంచినీటి సరఫరా జరగనుంది. ప్రస్తుతం ఈ జిల్లాలకు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్లే పైప్‌లైన్ నుంచి నీటిని సరఫరా చేస్తుండగా, మార్చి తర్వాత దీనిని హైదరాబాద్‌కే పరిమితం చేసి.. ఈ పైప్‌లైన్‌కు సమాంతరంగా నిర్మిస్తున్న మల్లన్న సాగర్ భగీరథ కొత్త లైన్ ద్వారా మంచినీటి సరఫరా చేపట్టనున్నారు. ఈ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ శనివారం పర్యటించనున్నట్లు తెలుస్తోంది. కొరత లేకుండా మల్లన్న సాగర్ నుంచి నీరు.. హైదరాబాద్‌లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గోదావరి సుజలస్రవంతి పథకాన్ని పదేళ్ల క్రితం రూ.3,375 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి 10 టీఎంసీల నీటిని తరలించేందుకు 186 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఈ లైన్ ద్వారా 735 ఎంఎల్డీ (మిలి యన్ లీటర్స్ పర్ డే) నీటి సరఫరా జరుగుతోంది. ఇందులో సిద్దిపేట, జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు భగీరథ పథకం అవసరాల కోసం సుమారుగా 300 ఎంఎల్డీ నీటిని వాడుకుంటున్నారు. మిగతా నీరు హైదరాబాద్ అసరాలకు వెళ్తుంది. దీనివల్ల హైదరాబాద్‌కు వెళ్లే నీటిలో అప్పుడప్పుడు కొరత ఏర్పడుతోంది. అంతేకాకుండా నీరు తక్కువగా వచ్చినప్పుడు ఈ జిల్లాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలో గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ నీటిని మిషన్ భగీరథ కోసం వాడు కోవాలని నిర్ణయించారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోల్ వద్ద 540 ఎంఎల్డీ సామర్థ్యంతో చేపట్టిన డబ్ల్యూటీపీ పనులు పూర్తి కావొస్తున్నాయి. మార్చి నాటికి హైదరాబాద్ లైన్‌పై నీటిని తీసుకునే వాల్వులను మూసి వేయనున్నారు. సిద్దిపేట, జనగామ, యదాద్రి, సూర్యా పేట జిల్లాలకోసం మల్లన్నసాగర్ నుంచే లైన్లను నిర్మిస్తున్నారు. ఇబ్బంది లేకుండా నీటి సరఫరా.. మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం ద్వారా మొదటగా జనగామ జిల్లాకు నీటిని సరఫరా చేస్తారు. మల్లన్నసాగర్ నుంచి కొమురవెల్లి కమాన్ వద్ద గల ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా జనగామ జిల్లాకు తాగునీరు వెళ్లనుంది. ఇందుకోసం మల్లన్నసాగర్ నుంచి కొమురవెల్లి కమాన్ వరకు 6.9 కిలోమీటర్ల మేర ప్రత్యేక లైన్ నిర్మించారు. ప్రస్తుతం నీటిని తీసుకుంటున్న హైద రాబాద్ లైన్ వల్ల ఎప్పడైనా నీటి కొరత ఏర్పడితే తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడేవి. మార్చి తర్వాత అలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఇదే తరహాలో సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోనూ భగీరథ పథకానికి ప్రత్యేక వ్యవస్థను తీసు కురానున్నారు. స్మితా సబర్వాల్ పర్యటన సందర్భంగా మార్చి ఆఖరులోగా పనులు పూర్తి చేయడానికి దిశానిర్దేశం చేయనున్నారు. మార్చి నెలాఖరులో పనులు పూర్తిచేయడమే లక్ష్యం నాలుగు జిల్లాల తాగునీటి సరఫరాకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే ‘మల్లన్నసాగర్ భగీరథ పథకం’ఉద్దేశం. దీనికి సంబంధించి పనులు సాగుతున్నాయి. మార్చి నెలాఖరు వరకు పనులు పూర్తి చేస్తాం. – రాజయ్య, మిషన్ భగీరథ ఈఈ, గజ్వేల్ -
‘భగీరథ’ ప్రయత్నం ఫలించిందా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’ ద్వారా 2019 తర్వాత ఎండాకాలంలోనూ పల్లెల్లో తాగునీటి సమస్యలు లేకుండా చేశామని అధికారులు చెబుతు న్నారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్య మిషన్ భగీరథతో తీరిందని చెబు తున్నారు. ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలతో పాటు తాగునీటి నాణ్యత సరిగా లేని ఇతర ఆవాసాలన్నింటికీ శుద్ధిచేసిన తాగునీటిని తెలంగాణ అందిస్తోందని 2020 సెప్టెంబర్‌లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర జలశక్తి శాఖ కూడా ప్రకటించింది. అయితే ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, పరిశీలకులు మాత్రం ఈ పథకం అమల్లోకి వచ్చినా పూర్తిస్థాయి నీటి సరఫరా జరగడం లేదని, ఇంకా గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లపైనే ఆధారపడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మిషన్ భగీరథ అమలు తీరు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందు లపై ‘సాక్షి’ దృష్టి సారించింది. ఏమిటీ మిషన్ భగీరథ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని (ఔటర్ రింగ్ రోడ్ ఆవల) ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, సురక్షి తమైన, శుద్ధిచేసిన తాగునీటిని నల్లా ద్వారా సర ఫరా చేసే లక్ష్యంతో ఈ పథకం ప్రారంభించారు. కృష్ణా, గోదావరి నదులు, ప్రధాన రిజర్వాయర్లు మొదలైన ఉపరితల జల వనరుల నుండి శుద్ధిచేసిన తాగునీటిని అందించాల్సి ఉంది. గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ రోజుకు 100 లీటర్లు, మున్సిపాలిటీల్లో అయితే 135 లీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 150 లీటర్ల తాగునీరు సరఫరా లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ మేరకు 2015 చివర్లో మొదలుపెట్టిన ఈ పథకాన్ని 2019 కల్లా పూర్తి చేయగలిగామని అధికారులు వెల్లడించారు. ప్రజలు, పరిశీలకులేమంటున్నారు.. ► పైప్లైన్లకు మరమ్మతులు సకాలంలో జరగడం లేదు. లీకేజీల సమస్య ఎక్కువగా ఉంటోంది. ఈ రెండు సందర్భాల్లో ప్రజలకు కొన్నిరోజుల పాటు భగీరథ నీళ్లందడం లేదు. ► చాలా గ్రామాల్లో ఇళ్లకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో నల్లాల ద్వారా నీటి సరఫరా జరగడం లేదు. ► నేటికీ గ్రామాల్లో 2–3 ఆర్వో ప్లాంట్లు ఉంటున్నాయి. ఈ ప్లాంట్ల ద్వారా జరిగే నీటి అమ్మకాలు కూడా ఎక్కువే. ► మిషన్ భగీరథను ప్రారంభించిన గజ్వేల్‌లోనే యాభైకి పైగా ఆర్వో ప్లాంట్లు ఉన్నాయి. ఒక్కో ప్లాంటులో రోజూ సగటున 500 లీటర్లు అమ్ముతున్నారు. 24 గంటల్లోనే సమస్య పరిష్కారం ప్రతి గ్రామానికీ భగీరథ పైప్‌లైన్ చేరుకుంది. దాదాపుగా వందశాతం గ్రామాల్లోని ఇళ్లకు నల్లాల ద్వారా నీటి సరఫరా అవుతోంది. నీటి సరఫరాలో లేదా ఇతరత్రా ఏవైనా సమస్యలు తలెత్తితే 24 గంటల వ్యవధిలోనే సరిచేస్తున్నాం. లేనిపక్షంలో ఎప్పటిలోగా పరిష్కరిస్తామో చెబుతున్నాము. ఎండాకాలంలో కూడా నీటికొరత ఏర్పడకుండా చూస్తున్నాం. గతంలో షాద్‌నగర్‌లో భూగర్భ జలాలు శూన్యం. నీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు కరువు పీడిత ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని అందజేస్తున్నాం. శుద్ధిచేసిన నీటి కారణంగా గ్యాస్ట్రో ఎంటరైటిస్, ఇతర వ్యాధులు తగ్గిపోయాయి. – కృపాకర్‌రెడ్డి, ఈఎన్సీ, మిషన్ భగీరథ ఫిల్టర్ నీళ్ళు కొంటున్నాం.. నల్లా నీళ్ళు రావడం లేదు. నెల రోజుల క్రితం నల్లా బిగించారు. ఒకరోజు కొన్ని నీళ్ళు వచ్చినయి. గతంలో కృష్ణా జలాల ట్యాంకుల వద్ద నీళ్ళు తెచ్చుకొనే వాళ్ళం. ప్రస్తుతం ఈ ట్యాంకుల్లో నీళ్ళు ఉండటం లేదు. గ్రామా పంచాయతీ కనెక్షన్ ద్వారా నీళ్ళు మంచిగానే వస్తున్నాయి. తాగునీటి కోసం ఫిల్టర్ నీళ్ళు కొనుక్కుంటున్నం. – దోటి పద్మ,వావిళ్ళపల్లి గ్రామం నీటి సమస్య తీరింది.. మా గ్రామంలో రెండేళ్ల కిందటి వరకు తాగునీటికి ఇబ్బందులు పడ్డాం. కి.మీల దూరంలో ఉన్న గ్రామ పంచాయతీ ట్యాంకు వద్దకు పోయి నీటిని తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు మిషన్ భగీరథ నీరు వస్తుండటంతో తాగునీటి సమస్య తీరింది. రోజూ ఉదయం గంటన్నర సేపు నీళ్లొస్తున్నాయి. – చెన్నమ్మ, మంచాలకట్ట,పెంట్లవెల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా -
మొదట జనగామకే ‘మల్లన్న’
గజ్వేల్: ‘మల్లన్నసాగర్ భగీరథ పథకం’ సిద్ధమవుతోంది. రూ.1,100 కోట్లతో చేపడుతున్న ఈ పథకం ద్వారా జూన్ కల్లా జనగామ జిల్లాకు మంచినీటిని అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జనగామతో పాటు గ్రేటర్ హైదరాబాద్, సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి, మెదక్ జిల్లాలకూ మల్లన్నసాగర్ రిజర్వాయర్ నీరందించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ జిల్లాలకు ప్రస్తుతం ఏర్పడుతున్న నీటి కొరతను అధిగమించేందుకు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ వేసిన లైన్‌కు సమాంతరంగా మరో లైన్‌ను నిర్మించి జూన్‌లోపు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. నీటి కొరతను అధిగమించేందుకు.. జంటనగరాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పదేళ్ల క్రితం రూ.3,375 కోట్ల అంచనాతో గోదావరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టి పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి 10 టీఎంసీల నీటి తరలింపు లక్ష్యంగా 186 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఈ లైన్ ద్వారా నిత్యం 735 ఎంఎల్డీ నీటి సరఫరా జరుగుతుండగా సిద్దిపేట, జనగామ, యాదాద్రి, మేడ్చల్, మెదక్ జిల్లాల్లో అవసరాలకు సుమారుగా 300 ఎంఎల్‌డీలను పంపిణీ చేస్తున్నారు. మిగతా నీరు హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నారు. అయితే కొండపాక, ప్రజ్ఞాపూర్ వద్ద సిద్దిపేట, జనగామ జిల్లాల అవసరాల కోసం ఈ లైన్‌పై నీటిని ట్యాపింగ్ చేస్తుండటంతో హైదరాబాద్ నగరానికి నీటి కొరత ఏర్పడుతోంది. లైన్లో ఏదైనా సమస్య వస్తే జిల్లాలోని అన్ని ప్రాంతాల వారూ తాగునీటికి ఇబ్బంది పడేవారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు మల్లన్నసాగర్ భగీరథ పథకం ప్రారంభించారు. అంతా మల్లన్నసాగర్ నుంచే వాడుకునేలా.. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ తెలంగాణలోని పలు జిల్లాల్లో సాగుతో పాటు, తాగునీటికి ఏటా 10 టీఎంసీలు కేటాయించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రిజర్వాయర్‌లోని ఆఖరి టీఎంసీ నీటిని కూడా వాడుకునేలా డిజైన్ చేశారు. కొండపాక మండలం మం గోల్ వద్ద రాష్ట్రంలోనే అతి పెద్దదైన 540 ఎంఎల్డీ సామర్థ్యం గల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పను లు చేపట్టారు. జూన్‌లోపు హైదరాబాద్ లైన్‌పై ఉన్న ట్యాపింగ్‌లను మూసేసి మల్లన్నసాగర్ స్టోరేజీ నుంచే నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మల్లన్నసాగర్ నుంచి మొదటగా జనగామ జిల్లాకు నీటి సరఫరా జరగనుంది. నీటిని తరలించేందుకు కొమురవెల్లి కమాన్ వద్ద గల ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా 6.9 కిలోమీటర్ల మేర ప్రత్యేక లైన్ నిర్మించారు. -
కర్ణాటక కరుణించె
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ దౌత్యం ఫలించింది. కర్ణాటక ప్రభుత్వం కరుణించింది. భానుడి ప్రతాపానికి ప్రియదర్శిని జూరాలలో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి పడిపోయి.. తాగునీటి ప్రమాద ఘంటికలు మోగుతోన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ఒప్పుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర అధికారులతో చర్చించిన సీఎం కుమారస్వామి శుక్రవారం రాత్రి నారాయణపూర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆదివారం తెల్లవారుజాము వరకు నీరు జూరాల ప్రాజెక్టులో చేరనుంది. జూరాల నుంచి రామన్‌పాడు, బీమా, కోయిల్‌సాగర్, కేఎల్ఐ తదితర ప్రాజెక్టుల్లో నీరు చేరనుంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లావాసుల తాగునీటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు నెలకొన్నాయి. ఇదీలా ఉంటే కర్ణాటక విడుదల చేసే 2.5 టీఎంసీలలో ఒక టీఎంసీ నీరు మధ్యనే ఆవిరైపోతుందని, కేవలం 1.5 టీఎంసీ మాత్రమే జూరాలకు చేరుకుంటుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజూ 100క్యూసెక్కుల నీరు ఆవిరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 60శాతానికి పైగా గ్రామాలకు జూరాల ప్రాజెక్టు నుంచే తాగునీరు సరఫరా అవుతోంది. అయితే ఈ సారి భానుడు నిప్పులు చెరుగుతుం డడంతో ప్రతిరోజూ సుమారు వంద క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా తగ్గుతూ వచ్చింది. 9.66 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో 3 టీఎంసీల నీరు ఉంటే దాన్ని డెడ్‌స్టోరేజీగా పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం జలాశయంలో 1.93 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉంది. అంటే డెడ్‌స్టోరేజీ కంటే ఒక టీఎంసీకి పైగా నీళ్లు తక్కువగా ఉందన్న మాట. నీటి లభ్యత లేకపోవడంతో ప్రధాన గ్రిడ్ ద్వారా ఆవాసా ప్రాంతాలకు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు మొదలయ్యాయి. చాలా చోట్ల నీటి కోసం ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో జూరాలలో తగ్గుతోన్న నీటి మట్టంపై ఆందోళన చెందిన ఇరిగేషన్ అధికారులు సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీల నీటిని విడుదల చేసి.. పాలమూరు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చాలని గత నెలలోనే కర్ణాటక సీఎం కుమారస్వామికి లేఖరాశారు. లేఖపై స్పందించిన కర్ణాటక సీఎం అధికారులతో చర్చించి ప్రాజెక్టు నుంచి రెండున్నర టీఎంసీల నీటి విడుదలకు అంగీకారం తెలిపారు. జూరాలే కీలకం.. ప్రస్తుతం జూరాల వద్ద ఉన్న ప్రధాన గ్రిడ్ నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలోని 319 గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీరు ప్రతి రోజూ 50ఎంఎల్డీ సరఫరా అవుతోంది. ప్రస్తుతం నీటిమట్టం తగ్గిన నేపథ్యంలో అధికారులు అప్రోచ్ కెనాల్‌ను జేసీబీలతో సరి చేస్తూ నీరు సరఫరా చేస్తున్నారు. మరోవైపు జూరాల ఎడమ కాల్వ ద్వారా విడుదలయ్యే నీటిని వనపర్తిలో ఉన్న రామన్‌పాడు ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు. ప్రస్తుతం అక్కడి నుండి వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఉన్న 500 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే రామన్‌పాడులోనూ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. రానున్న రోజుల్లో ఆయా గ్రామాలకు తాగునీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కావడం ఆయా ప్రాంతాల్లో నెలకొననున్న నీటి ఎద్దడికి పరిష్కారం లభించింది. వీటితో పాటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించి కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో సుమారు 300 గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తారు. ఎవరిదీ పాపం? మూడు నెలల క్రితం వరకు జూరాలలో తాగునీటి అవసరాలకు సరిపడేంత నీటి లభ్యత ఉంది. తర్వాత పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా జలాశయంలో నీరు ఆవిరవుతూ వచ్చింది. దీంతో అధికారులు రబీ పంటకు క్రాప్ హాలిడే ప్రకటించారు. అయితే జూరాల, బీమా ప్రాజెక్టుల పరిధిలోని పెబ్బేరు, కొల్లాపూర్ ప్రాంతాల్లో ఖరీఫ్‌లో ఆలస్యంగా సాగు చేసిన వరి, వేరుశనగ పంటలు ఎండిపోతున్నాయంటూ ఓ ప్రజాప్రతినిధి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషికి లేఖరాశారు. దీనిపై స్పందించిన ఆయన నీటి విడుదలకు ఆదేశించారు. దీంతో జనవరి 6న సాగు కోసం జూరాల ఎడమ కాలువ నుంచి 0.7టీఎంసీల నీటిని తరలించారు. ఆ సమయంలో నీటిని తరలించకపోతే ఈ రోజు ఈ స్థాయిలో తాగునీటి కష్టాలు ఉండేవి కావని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదీలా ఉంటే ప్రతి సంవత్సరం జూరాల ప్రాజెక్టులో నీళ్లు అయిపోగోట్టుకోవడం, కర్ణాటకను అడుక్కోవడం నాలుగేళ్లుగా ఓ తంతుగా మారింది. తాగు, సాగునీటి అవసరాలకు సంబంధించి ముందుచూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని.. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు ముందుచూపుతో వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. -
గడువులోపు గగనమే..
కరీంనగర్‌కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి మంచినీరు సరఫరా చేసేం దుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్బన్ మిషన్ భగీరథ పథకం పనులు కరీంనగర్లో నత్తనడకన కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోనే మొదటిసారిగా 24 గంటలు నీరందించేందుకు కరీంనగర్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. నగరానికి సమీపంలో ఉన్న లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ)లో నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండడంతో ప్రయోగాత్మకంగా నిరంతరంగా నీటి సరఫరాకు చర్యలు చేపట్టింది. నగరానికి నిరంతరం నీరందించేందుకు కార్యాచరణ జరుగుతుండగా.. ఆశలన్నీ అర్బన్ మిషన్ భగీరథ మీదే ఉన్నాయి. ఈ పథకం పూర్తయితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుండడంతో ఎప్పుడెప్పుడా అని ప్రజలు వేచిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మిషన్ భగీరథ ద్వారానే నిరంతర నీటి సరఫరా చేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. కొత్తగా ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులు, పైపులైన్ కనెక్షన్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. గతేడాది నవంబర్లోనే పనులు పూర్తి చేయాల్సి ఉండగా తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం గడువు పెంచి మార్చి నెలాఖరులోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించింది. ప్రస్తుత పనులు కూడా ఆలస్యం అవుతుండడంతో గడువులోపు పూర్తవడం అనుమానమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.109 కోట్లతో పనులు... నగరంలో అర్బన్ మిషన్ భగీరథ పథకం కింద ప్రభుత్వం రూ.109.26 కోట్ల నిదులు మంజూరు చేసింది. అర్బన్ మిషన్ భగీరథతో పాటు స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు ఇక్కడ అమలులో ఉండడంతో 24 గంటల నీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 16 ఓవర్‌హెడ్ ట్యాంకులకు తోడు మరో 3 ట్యాంకులు మిషన్ భగీరథ పథకంలో నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం నగరంలో ఉన్న 43 వేల నల్లా కనెక్షన్లకు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుండగా, మిషన్ భగీరథ పనులు పూర్తయితే నిరంతర నీటి సరఫరా జరగనుంది. అన్ని డివిజన్లలో పనులు ప్రారంభించడంతో పైపులైన్ల నిర్మాణం కొనసాగుతోంది. పనులు ప్రారంభించినప్పుడు 18 నెలల కాల వ్యవధిని ఇచ్చారు. అంటే గతేడాది నవంబర్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించినప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక మార్చి చివరి వరకైనా పనులు పూర్తిచేసి ఏప్రిల్ నుంచైనా ఇంటింటికి నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెడుతున్నా పనులు ఊపందుకోకపోవడం గమనార్హం. పనులు జరుగుతున్న తీరు... అర్బన్ మిషన్ భగీరథ పైపులైన్ పనులు అన్ని డివిజన్లలో కొనసాగుతున్నాయి. 110 ఎంఎం డయా పైపులైన్ 147.43 కిలోమీటర్లు వేయాల్సి ఉండగా 85.21 కిలోమీటర్లు పూర్తయింది. 100 ఎంఎం డయా పైపులైన్ 40 కిలోమీటర్లుకు గాను 35 కిలోమీటర్లు, 150 ఎంఎం డయా పైపులైన్ 29.79 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా, 36.25 కిలోమీటర్లు చేపట్టారు. అలాగే 200 ఎంఎం, 250 ఎంఎం డయా పైపులైన్ 73.64 కిలోమీటర్లు వేయాల్సి ఉండగా 40.04 కిలోమీటర్ల మేర నిర్మించారు. మిగతా పైపులైన్ పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. స్లాబ్ లెవల్‌కు ఓవర్‌హెడ్ ట్యాంకులు... అర్బన్ మిషన్ భగీరథ ద్వారా నిర్మాణం చేపట్టిన మూడు ఓవర్‌హెడ్ ట్యాంకులు స్లాబ్ లెవల్‌కు చేరుకున్నాయి. 2033 సంవత్సరం కల్లా 4.03 లక్షల జనాభాకు సరిపడేలా 68.65 ఎంఎల్డీల సామర్థ్యంతో ఫిల్టర్‌బెడ్, 3000 కేఎల్ సామర్థ్యంతో శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. దీని పనులు 30 శాతం మేర పూర్తయ్యాయి. 800 కిలో లీటర్ల సామర్థ్యం గల సంపు, పంపుహౌస్‌ను ఫిల్టర్‌బెడ్ దగ్గర నిర్మిస్తున్నారు. 90 శాతం పనులు పూర్తిచేశారు. రాంనగర్లో 1300 కిలో లీటర్ల ట్యాంకు పనులు 50 శాతం మేర, హౌసింగ్‌బోర్డు కాలనీలో 2200 కిలో లీటర్ల సామర్థ్యంతో నిర్మా ణం చేస్తున్న ట్యాంకు పనులు 60 శాతం పూర్తయ్యాయి. ఈ పనులన్నీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. హౌసింగ్‌బోర్డు, రాంనగర్ రిజర్వాయర్ల పనులు జరుగుతుండగా, ఫిల్టర్‌బెడ్ దగ్గర ఉన్న రిజర్వాయర్ పూర్తయింది. సంపుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. గడువులోగా అనుమానమే... ప్రతిష్టాత్మకమైన భగీరథ పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టాక మిషన్ భగీరథ పనులను మార్చిలోగా పూర్తిచేసి ప్రజలకిచ్చిన వాగ్ధానం ప్రకారం ఏప్రిల్ నుంచి ఇంటింటికి తాగునీరు అందించాలని గడువు విధించింది. రిజర్వాయర్లు, సంపుల నిర్మాణం, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై దృష్టి కేంద్రీకరించింది. పైపులైన్ల అనుసంధానం పనులు సైతం ఆశించిన స్థాయిలో జరగకపోవడం వల్ల ఈ పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అధికాÆ ý‡ులను ఆదేశించింది. అయితే పైపులైన్లతో పాటు ట్యాంకుల నిర్మాణం అడ్డగోలుగా ఆలస్యమవుతుండడంతో గడువులోగా పనులు పూర్తవుతాయా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మార్చి టార్గెట్‌గా పనులు.. అర్బన్ మిషన్ భగీరథ పనులను ప్రభుత్వం ఇచ్చిన గడువు మార్చిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. పైపులైన్ల పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. మిగతా అన్ని నిర్మాణ పనులపై దృష్టి సారించి ఆ మేరకు పనులు జరిగేలా చూస్తున్నాం. శాతవాహన యూనివర్సిటీ ఆవరణలో జరుగుతున్న మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనుల్లో మరింత వేగం పెంచాలని కాంట్రాక్టర్లను ఆదేశించాం. పనులన్నీ గడువులోగా పూర్తి చేయడంపైనే దృష్టి సారించాం.– సంపత్‌రావు, డీఈఈ, ప్రజారోగ్యశాఖ -
వచ్చే మార్చి కల్లా ప్రతి ఇంటికి నల్లా: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్లో సోమవారం సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటిలో నల్లా బిగించి మంచినీరు సరఫరా చేయాలని ఆధికారులకు సూచించారు. వచ్చే ఏప్రిల్ నాటికి కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలనే తేడా లేకుండా రాష్ర్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పథకం ద్వారానే మంచినీళ్లు అందించేల చర్యలు తీసుకోవాలని ఆధికారులకు సూచించారు. మిషన్ భగీరథ పనులపై ప్రస్తుతం జరుగుతున్నపనుల వివరాలు వెల్లడించిన ఆధికారులు. రాష్ట్రంలో 23,968 ఆవాస ప్రాంతాలకు గాను, 23, 947 ఆవాస ప్రాంతాలకు ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందుతున్నాయని ఆధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని 95 శాతం ఇండ్లకు నల్లాలు బిగించి మంచినీరు అందిస్తున్నట్లు సీఎంకు నివేదించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, దళిత వాడలు, ఆదివాసీ గూడేలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలు అన్నింటికీ మిషన్ భగీరథ ద్వారానే శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్థికంగా భారమైనా సరే మిషన్ భగీరథ ద్వారానే మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు. వచ్చే జనవరి 10లోగా అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు చేరుకోవాలని సీఎం గడువు విధించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేయడం ఎంత ముఖ్యమో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడం కూడా అంతే ముఖ్యమన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టాలని అనుకున్న రోజు చాలా మందికి చాలా అనుమానాలుండేవి. ఈ కార్యక్రమం అవుతుందా? అనే సందేహాలుండేవి. కానీ అధికారులు, ఇంజనీర్లు ఎంతో కష్టపడి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, మిషన్ భగీరథ ఇ.ఎన్.సీ. కృపాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, జోగు రామన్న, గొంగిడి సునిత, రాజేందర్ రెడ్డి, కె.విద్యాసాగర్ రావు, భాస్కర్ రావు, తదితరులు హాజరయ్యారు. -
పల్లెల్లో ఫ్లోరైడ్ భూతం
బజార్హత్నూర్(బోథ్): ఫ్లోరైడ్ మహామ్మరి గిరి గ్రామాలను వణికిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకూ వ్యాధి ప్రబలుతూ భయాందోళకు గురి చేస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించి హెచ్చరించినా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ప్రత్యామ్నాయంగా కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన శుద్ధజల ప్లాంట్లు పనిచేయకుండా పోతున్నాయి. దీంతో సమస్య పెరుగుతుందే తప్పా తగ్గడం లేదు. ఫ్లోరైడ్‌తో పళ్లు రంగు మారుతున్నాయి. నల్లబారి వ్యాధి తీవ్రతను చూపుతున్నాయి. కొందరి పళ్లు గారలు పట్టడం, అరిగిపోవడం జరుగుతుంది. పుట్టిన పిల్లలకు ఎముకలు పెరగడం లేదు. కీళ్ల నొప్పులు, చిన్న దెబ్బకే ఎముకలు విరగడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమస్య ఏళ్ల తరబడి వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫ్లోరైడ్ ప్రభావానికి గురైన ఆ ఎనిమిది గ్రామాలు బజార్హత్నూర్ మండలంలోని చందునాయక్ తండా, మోర్కండి, ఏసాపూర్, గులాబ్‌తాండ, టెంబి, హర్కాయి, బోస్రా, భూతాయి(బి). వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వేలో పైన పేర్కొన్న ఎనిమిది గ్రామాల్లో ఫ్లోరైడ్ ఆనవాళ్లు అధికంగా ఉన్నట్లు తేలింది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వైద్య, ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆయా గ్రా మాల్లో బోర్లను సీజ్ చేశారు. సరైన పద్ధతిలో నీటి వసతిని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. పడకేసిన శుద్ధజల పథకం.. చందునాయక్ తండాను ఫ్లోరైడ్ బాధిత గ్రామంగా 2009లో గుర్తించారు. దీంతో గ్రామీణ నీటి పారుదల శాఖ(ఆర్డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో రూ.10లక్షలతో హడావిడిగా శుద్ధజల ప్లాంటును ఏర్పాటు చేశారు. కాని నిర్వహణ లోపంతో అది కాస్త పని చేయకుండా పోయింది. గ్రామానికి సమీపంలో ఫ్లోరైడ్ రహిత ప్రాంతంలో గల కడెం వాగు ఒడ్డున వేసిన బోరు నిరుపయోగంగా మారింది. బోరు నుంచి శుద్ధజల ప్లాంట్ వరకూ పైపులైన్ వేయలేదు. దీంతో బోరును ఇతరులు సాగు నీటికి వినియోగిస్తున్నారు. తండాలో మొత్తం 2800 మంది జనాభాకు 60 శాతం మంది ఫ్లోరైడ్ బారిన పడిన వారే కావడం ఆందోళనకరం. ఇక్కడ మూడేళ్ల పాప నుంచి ముసలి వరకూ పళ్ళు నల్లబారి పోయి ఉంటాయి. శుద్ధజల పథకం గురించి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గులాబ్ తండాలో స్వచ్ఛందంగా ప్లాంటు.. వంద శాతం గిరిజనులు గల గులాబ్ తండా గ్రామంలో ప్రజలు ఫ్లోరైడ్ బారిన పడుతున్నారు. ప్రభుత్వాలు స్పందించకపోవడంతో ఈ గ్రామంలోనే పుట్టి పెరిగిన నిజామబాద్ జిల్లా డిచ్‌పెల్లి డీఎస్పీ రాథోడ్ దేవిదాస్ స్వంతంగా ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం షెడ్డు నిర్మాణం జరిగింది. త్వరలో మిషనరీలు ఏర్పాటు చేయనున్నారు. అందని ‘భగీరథ’ నీరు.. మండలంలోని అన్ని గ్రామాలతో పాటు ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు సైతం మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదు. ఈ నీరు అందితే కొంత మేర ఫ్లోరైడ్ బారి నుంచి విముక్తి కలిగే అవకాశముంది. కాని ఇంకా అంతర్గత పైపులైన్ పనులు కూడా ప్రా రంభించలేదు. ట్యాంకుల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అంద డం వచ్చే ఏడాది కూడా అనుమానంగానే ఉంది. ఫ్లోరైడ్ బారి నుంచి కాపాడే మార్గం.. ప్రభుత్వ వైద్యుడు డా. హరీష్ తెలిపిన వివరాల ప్రకారం ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఉన్న గ్రామాల పరిధిలో బోరు బావుల నీటిని వాడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఫ్లోరైడ్ రహిత గ్రామాల నుంచి తాగు నీటిని సరఫరా చేయాలి. నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో నాగ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థులు నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూషన్(ఎన్ఈఈఆర్ఐ) నీరీ పద్ధతి ద్వారా ఫ్లోరైడ్ బాధితులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ఆ విధానం ఇక్కడ అమలు చేస్తే తప్పా ఫ్లోరైడ్ సమస్య తీరేలా లేదు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఆ దిశగా ఆలోచించి ఈ ఎనిమిది గ్రామాల ప్రజలను ఫ్లోరైడ్ బాధ నుంచి తప్పించాల్సిన అవసరముంది. తాగునీటికి దూరభారమవుతుంది.. గులాబ్ తండాలో తాగు, సాగు నీటిలో ఫ్లోరైడ్ ఆనవాళ్ళు ఉన్నాయి. గతంలోనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మూడు బోర్లను సీజ్ చేశారు. కాని వాటికి ప్రత్యామ్నయం చూపించలేదు. దీంతో ఇతర అవసరాలకు ఈ నీటినే వాడుతున్నాం. తాగడానికి గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలోని ఇంద్రనగర్ నుంచి కాలి నడకన ప్రతిరోజు తెచ్చుకుంటున్నాం. దీంతో దూరభారం తప్పడం లేదు. – రాథోడ్ అశోక్, గులాబ్‌తండా నీరీ పద్ధతి అమలు చేయాలి బజార్హత్నూర్ మండలంలో చందునాయక్ తండా, మోర్కండి, ఏసాపూర్, గులాబ్‌తాండ, టెంబి, హర్కాయి, బోస్రా, భూతాయి(బి) ఫ్లోరైడ్ బాధిత గ్రామాలుగా గుర్తించాం. ఈ గ్రామాల్లో చిన్న పిల్లలకు పాల పళ్ళ నుంచే ఫ్లోరైడ్ వ్యాపిస్తుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. నాగపూర్ ఎన్‌ఈఈఆర్‌ఐకు చెందిన విద్యార్థులు నీరీ పద్ధతి ద్వారా ఫ్లోరైడ్‌ను అరికట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారు. ఈ పద్ధతిలో ఫ్లోరైడ్ రహిత గ్రామల నుంచి నీటిని సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించాం. – డా.హరీష్, పీహెచ్సీ వైద్యుడు, బజార్హత్నూర్ -
కన్నీటి కష్టాలు
అచ్చంపేట రూరల్ : వేసవిలో తాగునీరు లేక గ్రామీణులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు సరిపడా తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నారు. బిందె నీటి కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లలోని నీరు ఎండిపోయింది. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో మరింత జఠిలమంది. అచ్చంపేట మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. డైరెక్ట్ పంపింగ్ ద్వారా.. అన్ని గ్రామాల్లో డైరెక్టు పంపింగ్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో తాగునీరు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో ప్రధానంగా బోర్లపైనే ఆధార పడి ఉన్నారు. కొన్ని చోట్ల లీకేజీలు ఉండడంతో తాగునీరు వృథాగా పోతుంది. పట్టించుకోని ప్రజాప్రతినిధులు పదవీకాలం ముగియనుండడంతో గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లోని ప్రజల దాహార్తిని తీర్చలేక పోతున్నారు. గతంలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేశామని, అప్పటి డబ్బు రాకపోవడంతో ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్రామాల్లోని ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. గ్రామాలకు చాలా దూరంగా ఉన్న వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. మిషన్ స్లో.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైపులైను పనులు గ్రామాలకు వచ్చినా ట్యాంకులు మాత్రం నేటికీ పూర్తికాలేదు. వివిధ కారణాలతో కొన్నింటికి పునాదులే పడలేదు. ఈ వేసవిలో తాగునీటి కష్టాలు తీరుతాయని ప్రజలు భావించినా అధికారుల అలసత్వంతో మిషన్ భగీరథ పనులు స్లోగానే సాగుతున్నాయి. మండలంలో 36 మిషన్ భగీరథ ట్యాంకులు పూర్తి చేయాల్సి ఉన్నా కేవలం 16 ట్యాంకులు మాత్రమే పూర్తి చేశారు. తీవ్ర తాగునీటి ఎద్దడి మండలంలోని రంగాపూర్‌లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉంది. ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. వేసవి కాలం వస్తే చాలు భయమేస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తాగునీటిని అందించాలి. -
‘భగీరథ’తో నీటి సమస్య పరిష్కారం
భూపాలపల్లి అర్బన్ : గోదావరి అమృత జలాలను తాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించిందని శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మిషన్ భగీరథలో భాగంగా భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలో ఆరు ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులకు శనివారం స్పీకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా తాగునీటిని శాశ్వత ప్రాతిపదికన అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మిషన్ భగీరథ పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే నీటిని అమృత జలాలుగా భావించాలని సూచించారు. వచ్చే ఎండాకాలం వరకు భూపాలపల్లి పట్టణంలో తాగునీటి కొరత సమస్యే ఉండదన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని పట్టణంలో మొత్తం 10 ట్యాంకులను నిర్మిస్తామని స్పష్టం చేశారు. రూ.63 కోట్లతో పట్టణంలోని బస్టాండ్, మునిసిపల్ కార్యాలయాల సమీపం, సుభాష్‌కాలనీ, జంగేడు, ఖాసీంపల్లి, పుల్లూరిరామయ్యపల్లి గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో చైర్పర్సన్ బండారి సంపూర్ణరవి, కమిషనర్ రవీందర్‌యాదవ్, కౌన్సిలర్లు జరీనాబేగం, హైమావతి, నిర్మల, గోనే భాస్కర్, వజ్రావని, బీవీ.చారి, రాకేష్, ఆలయ కమిటీ చైర్మన్ రాజయ్య, టీఆర్ఎస్ నాయకులు సాంబమూర్తి, సంపత్‌కుమార్, రవీందర్‌రెడ్డి, సమ్మయ్య, తిరుపతిరెడ్డి, శ్రీరాములు, మురళి, అందే సుధాకర్, అధికారులు రవీందర్‌నా«థ్ శ్రీనా«థ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మిషన్ భగీరథ పనులు ప్రారంభం
తాడూరు : మండల కేంద్రంలో ఇంటింటికి నల్లా కార్యక్రమంలో భాగంగా మిషన్ భగీరథ పనులను బుధవారం సర్పంచ్ యార సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటికి నల్లా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పనులను చేపట్టిందన్నారు. మండలంలో రూ.కోటి 30లక్షలతో 8.7 కిలోమీటర్ల పైపులైన్ పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. సిర్సవాడ, భల్లాన్‌పల్లి, గుంతకోడూరు, యాదిరెడ్డిపల్లి, పాపగల్ గ్రామాలలో పనులు పూర్తయ్యాయని అన్నారు. మండలంలో 12లక్షలతో పైపులైన్ పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మే నెల చివరి వరకు పనులను పూర్తి చేసి ఇంటింటికి నల్లా ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు యార రమేష్, నాయకులు కృష్ణయ్య, మశన్న, మల్లేష్, శంకర్, ఉప సర్పంచ్ శేఖర్, సురేష్, తదితరులు పాల్గొన్నారు. పలు గ్రామాల్లో అసంపూర్తిగా.. తెలకపల్లి : మండల కేంద్రంతోపాటు గౌరారం తదితర గ్రామాలలో మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. ఇంటింటికి నల్లా పేరుతో పైపులైన్ పనులు చేపట్టారు. వాటిని పూడ్చకుండా రోజుల తరబడి ఉంచుతున్నారని, దీంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని అన్నారు. పైపులైన్లు పూడ్చే సమయంలో నామమాత్రంగా పూడ్చి మట్టిని వదిలేయడంతో సీసీ రోడ్లపై మట్టి పేరుకుపోయి వాహనదారులకు ఇబ్బందికరంగా మారిందని, దీనివల్ల ప్రమాదాలకు కూడా గురవుతున్నామని అంటున్నారు. మిషన్ భగీరథ అధికారులు వెంటనే నాణ్యతగా పనులు చేయాలని కోరుతున్నారు. -
మార్చిలో భగీరథ
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలోని అన్ని గ్రామాలకుమార్చి మొదటివారంలో మిషన్ భగీరథ నీరు అందిస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దసరాలోగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయడం లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. మార్చి 11న పండగ వాతావరణంలా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ, డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణ ప్రగతి, భూరికార్డుల శుద్ధీకరణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథపై ప్రతి 15రోజులకోసారి సమీక్షిస్తున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో జనవరి 31లోగా అన్ని గ్రామాలకు బల్క్‌వాటర్ సరఫరా చేయాలని నిర్ణయించామని, ఈ మేరకు ఎందుకు గ్రామాలకు నీరు సరఫరా చేయడం లేదని మంత్రి మిషన్ భగీరథ ఇంజినీర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఇంకా 160 కిలోమీటర్ల పైపులైన్ వేయాల్సి ఉందని, ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని మంత్రి ఎస్ఈ అమరేంద్రను ప్రశ్నించారు. పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, మిషన్లను ఏర్పాటు చేసి 24 గంటలు పనులు చేయించాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. ఏజెన్సీలు పనులు వేగవంతంగా చేయకుంటే తమకు తెలపాలని, వారిపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని అన్నారు. నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యేలు సంబంధిత డీఈలు, ఏజెన్సీలతో సమీక్షించాలని ఆదేశించారు. 15రోజులకోసారి పనులను సమీక్షించాలని, వారంవారం పర్యవేక్షించాలని కలెక్టర్‌కు సూచించారు. పనుల్లో నాణ్యతప్రమాణాలు పాటించాలని ఏజెన్సీలను ఆదేశించారు. దసరాలోపు ‘డబుల్’ పూర్తి చేయాలి జిల్లాకు మంజూరైన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలన్నింటిని దసరా పండుగ లోపు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. జిల్లాకు 6,454 ఇళ్లకు మంజూరువచ్చిందన్నారు. ఒక గ్రామంలో ఒకేచోట కాకుండా భూమి లభ్యత ప్రకారం కాలనీలవారీగా 5 నుంచి10 ఇళ్లను మంజూరు చేయాలని అదేశించారు. ఎమ్మెల్యేలు నెలకోమారు పనుల ప్రగతిని సమీక్షించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఐరన్ తక్కువ ధరకు ఇప్పించే ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పండుగ వాతావరణంలో పాస్‌పుస్తకాల పంపిణీ మార్చి 11న రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. పట్టాదారు పాస్‌పుస్తకాలలో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలన్నారు. జిల్లాలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు మంజూరైన ప్రహరీలు, టాయిలెట్ల మరమ్మతు, అదనపు తరగతి గదుల భవన నిర్మాణాలను పూర్తి చేయాలని ఈఈ షఫీమియాను ఆదేశించారు. భవన నిర్మాణాలకు ఏమైనా భూసమస్య ఉంటే సంబంధిత తహసీల్దార్ పరిష్కరించి, హద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మ ణ్‌రావు, చొప్పదండి, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు బొడిగే శోభ, వొడితెల సతీష్‌కుమార్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రావీణ్య, మిషన్ భగీరథ ఎస్ఈ అమరేంద్ర, ఆర్అండ్బీ ఈఈ రాఘవాచారి, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు రాజాగౌడ్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యత నవ్వుల పాలు..
నాసిరకంగా మిషన్ భగీరథ పనులు బీటలు వారుతున్న పంప్‌హౌస్‌లు రూ.కోట్ల ప్రాజెక్టు పనులకు లోకల్ ఇసుక పుల్కల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ సైతం ప్రశంసించారు. అయితే ప్రాజెక్టు పనులను మాత్రం కాంట్రాక్టర్లు నాసిరకంగా చేపడుతున్నారు. కోట్ల విలువ చేసే భారీ ప్రాజెక్టును పర్యవేక్షించకపోవడంతో కాంట్రాక్టు పొందిన సంస్థలు స్థానికంగా లభించే ఇసుకను నిర్మాణ పనుల్లో వినియోగించడంతో పంప్‌హౌస్‌లకు పగుళ్లు వస్తున్నాయి. రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులను స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారులు స్మితా సబర్వల్, ప్రియాంకా వర్గీస్‌తో పాటు కలెక్టర్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు రెండుసార్లు పరిశీలించారు. అయితే వారి దృష్టి అటు వైపు పడకుండా కాంట్రాక్టర్లు ముందు జాగ్రత చర్యలు తీసుకున్నారు. గత నెల చివరి వారంలో మంత్రి హరీశ్‌రావు సింగూర్ వద్ద మిషన్ భగీరథ పనులను పరిశీలించేందుకు వచ్చారు. అయితే మెదక్, అందోల్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాలకు సరఫరా చేసే పంపింగ్ కేంద్రాల వైపు మంత్రిని తీసుకెళ్లారు. పక్కనే సింగూర్– జూక్కల్ , సింగూర్ బాన్సువాడ ప్రాజెక్టు పనులను మాత్రం ఆయన పరిశీలించలేదు. పుల్కల్ మండల పరిధిలోని సింగూర్, పెద్దారెడ్డిపేట గ్రామ శివారులో, సింగూర్ నుంచి మెదక్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గం పరిధిలోని గ్రామాలకు మంచినీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మెదక్ జిల్లాకు సరఫరా చేసే నీటి పథకం పనులను ఎల్ఎంటీ సంస్థ చేపట్టగా నిజామాబాద్ జిల్లాలకు చెందిన ప్రాజెక్టును మరో సంస్థ ద్వారా చేపడుతున్నారు. అయితే ఇక్కడ మాత్రం ఈ సంస్థ సబ్ కాంట్రాక్టుకు పనులు అప్పగించడంతో వారు టెండర్ సమయంలో చూపించిన మాదిరిగా కాకుండా స్థానికంగా లభించే ఇసుకతో పాటు కంకరను వినియోగిస్తున్నారు. దీంతో నిర్మాణ సమయంలోనే పగుళ్లు వస్తున్నాయి. పగుళ్లను గమనించి కాంట్రాక్టర్లు వెంటనే వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. పంప్‌హౌస్‌లలో సైతం మట్టితో కూడుకున్న కంకరను నింపడంతో ఎక్కువ రోజులు నాణ్యత ఉండే అవకాశం లేదని ఓ ఇంజరింగ్ అధికారి తెలిపారు. అంతా ప్రయివేటు ఉద్యోగులే.. మిషన్ భగీరథ పథకం కింద చేపట్టిన పనులను నాసిరకంగా నిర్మించాకుండా నాణ్యత ప్రమాణాలు పరిశీలించేందుకు గాను కాంట్రాక్టు పొందిన సంస్థకు సంబంధం లేకుండా నాణ్యతను పరిశీలించేందుకు పని ప్రదేశంలో ల్యాబ్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ అందరూ ప్రయివేటు ఉద్యోగులే పనిచేయడం వల్ల నాణ్యతను పట్టించుకున్న దాఖాలాలు లేవు. చౌటకూర్, ముదిమాణిక్యం ఫారెస్టు శివారు నుంచి తెచ్చిన ఇసుకలో మట్టి కలిసి ఉంటుంది. ఇసుకనే కాకుండా కంకరను సైతం ప్రభుత్వం గుర్తించిన వాటిని వినియోగించాలి. కాని ఇక్కడా మాత్రం నల్ల రంగు కంకరను వినియోగించి పనులు చేస్తున్నారు. దీనిపై వివరణ కోరేందుకు ఆర్డబ్ల్యూ ఆర్డబ్ల్యూఎస్ సర్కిల్ ఇంజనీర్ చక్రవర్తిని ప్రయత్నించగా అందుబాటులో లేరు. -
కళ్లు అదిరె.. కోమటిబండ మెరిసే...
ప్రధాని రాక కోసం భారీ ఏర్పాట్లు ఆకట్టుకునేలా పైలాన్ భగీరథ ప్రాముఖ్యతను తెలిపేలా ఫొటోఎగ్జిబిషన్ అణువణువూ చిత్రీకరించేలా సీసీ కెమెరాలు కట్టుదిట్టంగా భద్రతా చర్యలు మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం గజ్వేల్ మండలం కోమటిబండ ప్రాంతాన్ని ముస్తాబు చేసింది. ప్రధాని మనసు చూరగొనేలా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నారు. రిజర్వాయర్లు, పైలాన్, హెలీపాడ్లు, సభాస్థలి, భద్రతా చర్యలు, సీసీ కెమెరాలు, పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటు తదితర అంశాలకు వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. - గజ్వేల్ అత్యంత ఎత్తయిన గుట్ట.. కోమటిబండలో గల గుట్టపై ప్రస్తుతం ‘మిషన్ భగీరథ’ హెడ్ రెగ్యులటరీ నిర్మించారు. ఈ హెడ్ రెగ్యులేటరీపై ఒక జీఎల్‌బీఆర్, మరో రెండు ఓహెచ్‌బీఆర్ నిర్మాణం జరిగింది. వీటి సామర్థ్యం 1.45 కోట్ల లీటర్లు. నియోజకవర్గంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశం ఇది. ఇక్కడి నుంచి గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీతోపాటు మరో 59 గ్రామాలకు గ్రావిటీ (పారకం) ద్వారా నీటిని సరఫరా చేసేలా ఏర్పాట్లు జరిగాయి. మరో 190 గ్రామాలకు ఇక్కడున్న 120/33కేవీ సబ్‌స్టేషన్ ద్వారా వచ్చే విద్యుత్‌తో సరఫరా చేస్తారు. గుట్ట ఎత్తయిన ప్రదేశంలో ఉండటంతో 60 గ్రామాలకు నీటి సరఫరాకు సంబంధించి విద్యుత్ వినియోగం తప్పింది. పైలాన్.. మిషన్ భగీరథ హెడ్ రెగ్యులేటరీపై సుమారు రూ.కోటి వ్యయంతో పైలాన్ నిర్మిస్తున్నారు. 32 ఫీట్ల ఎత్తు, 40/40 ఫీట్ల వెడల్పుతో దీన్ని నిర్మిస్తున్నారు. లేత నీలి రంగు, గులాబీ రంగుల టైల్స్ అందంగా ముస్తాబు చేస్తున్నారు. పక్కనే గార్డెనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పైలాన్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ‘మిషన్ భగీరథ’ పథకం ప్రారంభ సూచికగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. పక్కనే ఉన్న పంప్‌హౌస్ స్విచ్ ఆన్ చేయగానే పైలాన్‌పై నీళ్ల ధార ఆవిష్కృతమవుతుంది. ఆ పక్కనే ప్రధాని నల్లాను సైతం ప్రారంభిస్తారు. ఫొటో ఎగ్జిబిషన్ హెడ్ రెగ్యులేటరీపై ఏర్పాటు చేయనున్న ఫొటో ఎగ్జిబిషన్ ప్రత్యేకతను సంతరించరించుకోనుంది. రాష్ట్రవ్యాప్తంగా ‘మిషన్ భగీరథ’ పథకం నిర్మిస్తున్న 26 గ్రిడ్లను ఈ ఫొటో ప్రదర్శన ద్వారా ప్రధానికి చూపెడతారు. అంతేకాకుండా ప్రధాని మోదీ వీక్షించేందుకు ఇక్కడ కొద్దిసేపు వీడియో ప్రదర్శనకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. హెడ్ రెగ్యులేటరీపై ప్రధాని 7 నుంచి 10నిమిషాలు మాత్రమే గడిపే అవకాశమున్నందున ఆ లోపు పైలాన్ ఆవిష్కరణ, పంప్‌హౌస్, నల్లా ప్రారంభంతోపాటు ఫొటో ప్రదర్శనను సైతం ఆలోగా పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. సీసీ కెమెరాలు.. ప్రధాని సభాస్థలిలో 3,500 మందికిపైగా పటిష్టభద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ప్రతి కదలికను పసిగట్టేందుకు 50కిపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని హెలీపాడ్ నుంచి దిగింది మొదలుకొని... సభ పూర్తయ్యే వరకూ ప్రతీ అంశం సీసీ కెమెరాలో బంధించేలా చర్యలు తీసుకుంటున్నారు. పార్కింగ్ కోసం 20 సెక్టార్లు.. పార్కింగ్‌కోసం 160 ఎకరాలు కేటాయించారు. 8 ఎకరాలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. 160 ఎకరాల్లో 20 పార్కింగ్ సెక్టార్లను ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా సెక్టార్లను కేటాయించారు. ఇక్కడికి 3 వేల ఆర్టీసీ బస్సుల్లో, మరో వెయ్యి ప్రైవేట్ బస్సుల్లో జనం తరలిరానున్నారు. వాయుసేనల ట్రయల్ రన్.. ప్రధాని మూడు ప్రత్యేక మిలిటరీ హెలీకాప్టర్లలో ఇక్కడికి చేరుకుంటారు. ఇందుకు సంబంధించి వాయుసేనలు హెలీపాడ్ల వద్ద ట్రయల్‌రన్ నిర్వహించాయి. ఎస్పీజీ బృందం పర్యవేక్షణలో ఈ ట్రయల్ రన్ సాగింది. అటవీ ప్రాంతంపై డేగ కన్ను.. ప్రధాని సభా స్థలి చుట్టూ వందల ఎకరాల్లో ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు. అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. మెటల్ డిటెక్టర్లు, ఇతర అధునాతన పరికరాల సాయంతో ఈ గాలింపు కొనసాగుతోంది.