రంగాపూర్ సమీపంలోని వ్యవసాయ బోరు నుంచి తాగునీటిని తీసుకొస్తున్న మహిళలు
అచ్చంపేట రూరల్ : వేసవిలో తాగునీరు లేక గ్రామీణులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు సరిపడా తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నారు. బిందె నీటి కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లలోని నీరు ఎండిపోయింది. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో మరింత జఠిలమంది. అచ్చంపేట మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.
డైరెక్ట్ పంపింగ్ ద్వారా..
అన్ని గ్రామాల్లో డైరెక్టు పంపింగ్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో తాగునీరు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో ప్రధానంగా బోర్లపైనే ఆధార పడి ఉన్నారు. కొన్ని చోట్ల లీకేజీలు ఉండడంతో తాగునీరు వృథాగా పోతుంది.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
పదవీకాలం ముగియనుండడంతో గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లోని ప్రజల దాహార్తిని తీర్చలేక పోతున్నారు. గతంలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేశామని, అప్పటి డబ్బు రాకపోవడంతో ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్రామాల్లోని ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. గ్రామాలకు చాలా దూరంగా ఉన్న వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.
మిషన్ స్లో..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైపులైను పనులు గ్రామాలకు వచ్చినా ట్యాంకులు మాత్రం నేటికీ పూర్తికాలేదు. వివిధ కారణాలతో కొన్నింటికి పునాదులే పడలేదు. ఈ వేసవిలో తాగునీటి కష్టాలు తీరుతాయని ప్రజలు భావించినా అధికారుల అలసత్వంతో మిషన్ భగీరథ పనులు స్లోగానే సాగుతున్నాయి. మండలంలో 36 మిషన్ భగీరథ ట్యాంకులు పూర్తి చేయాల్సి ఉన్నా కేవలం 16 ట్యాంకులు మాత్రమే పూర్తి చేశారు.
తీవ్ర తాగునీటి ఎద్దడి
మండలంలోని రంగాపూర్‌లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉంది. ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. వేసవి కాలం వస్తే చాలు భయమేస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తాగునీటిని అందించాలి.
Comments
Please login to add a commentAdd a comment