కళ్లు అదిరె.. కోమటిబండ మెరిసే... | Komatibanda shock glittering eyes .. ... | Sakshi
Sakshi News home page

కళ్లు అదిరె.. కోమటిబండ మెరిసే...

Published Fri, Aug 5 2016 10:38 PM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

కళ్లు అదిరె.. కోమటిబండ మెరిసే... - Sakshi

కళ్లు అదిరె.. కోమటిబండ మెరిసే...

  • ప్రధాని రాక కోసం భారీ ఏర్పాట్లు
  • ఆకట్టుకునేలా పైలాన్‌
  • భగీరథ ప్రాముఖ్యతను తెలిపేలా ఫొటోఎగ్జిబిషన్‌
  • అణువణువూ చిత్రీకరించేలా సీసీ కెమెరాలు
  • కట్టుదిట్టంగా భద్రతా చర్యలు
  • మిషన్‌ భగీరథ పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం గజ్వేల్‌ మండలం కోమటిబండ ప్రాంతాన్ని ముస్తాబు చేసింది. ప్రధాని మనసు చూరగొనేలా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నారు. రిజర్వాయర్లు, పైలాన్‌, హెలీపాడ్‌లు, సభాస్థలి, భద్రతా చర్యలు, సీసీ కెమెరాలు, పార్కింగ్‌ ప్రాంతాల ఏర్పాటు తదితర అంశాలకు వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
    - గజ్వేల్‌


    అత్యంత ఎత్తయిన గుట్ట..
    కోమటిబండలో గల గుట్టపై ప్రస్తుతం ‘మిషన్‌ భగీరథ’ హెడ్‌ రెగ్యులటరీ నిర్మించారు. ఈ హెడ్‌ రెగ్యులేటరీపై  ఒక జీఎల్‌బీఆర్‌, మరో రెండు ఓహెచ్‌బీఆర్‌ నిర్మాణం జరిగింది. వీటి సామర్థ్యం 1.45 కోట్ల లీటర్లు. నియోజకవర్గంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశం ఇది. ఇక్కడి నుంచి గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ నగర పంచాయతీతోపాటు మరో 59 గ్రామాలకు గ్రావిటీ (పారకం) ద్వారా నీటిని సరఫరా చేసేలా ఏర్పాట్లు జరిగాయి. మరో 190 గ్రామాలకు ఇక్కడున్న 120/33కేవీ సబ్‌స్టేషన్‌ ద్వారా వచ్చే విద్యుత్‌తో సరఫరా చేస్తారు. గుట్ట ఎత్తయిన ప్రదేశంలో ఉండటంతో 60 గ్రామాలకు నీటి సరఫరాకు సంబంధించి విద్యుత్‌ వినియోగం తప్పింది.

    పైలాన్..
    మిషన్‌ భగీరథ హెడ్‌ రెగ్యులేటరీపై సుమారు రూ.కోటి వ్యయంతో పైలాన్‌ నిర్మిస్తున్నారు. 32 ఫీట్ల ఎత్తు, 40/40 ఫీట్ల వెడల్పుతో దీన్ని నిర్మిస్తున్నారు. లేత నీలి రంగు, గులాబీ రంగుల టైల్స్‌ అందంగా ముస్తాబు చేస్తున్నారు. పక్కనే గార్డెనింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పైలాన్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ‘మిషన్‌ భగీరథ’ పథకం ప్రారంభ సూచికగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.  పక్కనే ఉన్న పంప్‌హౌస్‌ స్విచ్‌ ఆన్‌ చేయగానే పైలాన్‌పై నీళ్ల ధార ఆవిష్కృతమవుతుంది. ఆ పక్కనే ప్రధాని నల్లాను సైతం ప్రారంభిస్తారు.

    ఫొటో ఎగ్జిబిషన్
    హెడ్‌ రెగ్యులేటరీపై ఏర్పాటు చేయనున్న ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రత్యేకతను సంతరించరించుకోనుంది. రాష్ట్రవ్యాప్తంగా ‘మిషన్‌ భగీరథ’ పథకం నిర్మిస్తున్న 26 గ్రిడ్‌లను ఈ ఫొటో ప్రదర్శన ద్వారా ప్రధానికి చూపెడతారు. అంతేకాకుండా ప్రధాని మోదీ వీక్షించేందుకు ఇక్కడ కొద్దిసేపు వీడియో ప్రదర్శనకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. హెడ్‌ రెగ్యులేటరీపై ప్రధాని 7 నుంచి 10నిమిషాలు మాత్రమే గడిపే అవకాశమున్నందున ఆ లోపు పైలాన్‌ ఆవిష్కరణ, పంప్‌హౌస్‌, నల్లా ప్రారంభంతోపాటు ఫొటో ప్రదర్శనను సైతం ఆలోగా పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు.

    సీసీ కెమెరాలు..
    ప్రధాని సభాస్థలిలో 3,500 మందికిపైగా పటిష్టభద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ప్రతి కదలికను పసిగట్టేందుకు 50కిపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని హెలీపాడ్‌ నుంచి దిగింది మొదలుకొని... సభ పూర్తయ్యే వరకూ ప్రతీ అంశం సీసీ కెమెరాలో బంధించేలా చర్యలు తీసుకుంటున్నారు.

    పార్కింగ్‌ కోసం 20 సెక్టార్లు..
    పార్కింగ్‌కోసం 160 ఎకరాలు కేటాయించారు. 8 ఎకరాలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. 160 ఎకరాల్లో 20 పార్కింగ్‌ సెక్టార్లను ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా సెక్టార్లను కేటాయించారు. ఇక్కడికి 3 వేల ఆర్టీసీ బస్సుల్లో, మరో వెయ్యి ప్రైవేట్‌ బస్సుల్లో జనం తరలిరానున్నారు.

    వాయుసేనల ట్రయల్‌ రన్..
    ప్రధాని మూడు ప్రత్యేక మిలిటరీ హెలీకాప్టర్లలో ఇక్కడికి చేరుకుంటారు. ఇందుకు సంబంధించి వాయుసేనలు హెలీపాడ్ల వద్ద ట్రయల్‌రన్‌ నిర్వహించాయి. ఎస్పీజీ బృందం పర్యవేక్షణలో ఈ ట్రయల్‌ రన్‌ సాగింది.

    అటవీ ప్రాంతంపై డేగ కన్ను..
    ప్రధాని సభా స్థలి చుట్టూ వందల ఎకరాల్లో ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు. అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. మెటల్‌ డిటెక్టర్లు, ఇతర అధునాతన పరికరాల సాయంతో ఈ గాలింపు కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement