నాణ్యత నవ్వుల పాలు..
- నాసిరకంగా మిషన్ భగీరథ పనులు
- బీటలు వారుతున్న పంప్‌హౌస్‌లు
- రూ.కోట్ల ప్రాజెక్టు పనులకు లోకల్ ఇసుక
పుల్‌కల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ సైతం ప్రశంసించారు. అయితే ప్రాజెక్టు పనులను మాత్రం కాంట్రాక్టర్లు నాసిరకంగా చేపడుతున్నారు. కోట్ల విలువ చేసే భారీ ప్రాజెక్టును పర్యవేక్షించకపోవడంతో కాంట్రాక్టు పొందిన సంస్థలు స్థానికంగా లభించే ఇసుకను నిర్మాణ పనుల్లో వినియోగించడంతో పంప్‌హౌస్‌లకు పగుళ్లు వస్తున్నాయి.
రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులను స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారులు స్మితా సబర్వల్, ప్రియాంకా వర్గీస్‌తో పాటు కలెక్టర్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు రెండుసార్లు పరిశీలించారు. అయితే వారి దృష్టి అటు వైపు పడకుండా కాంట్రాక్టర్లు ముందు జాగ్రత చర్యలు తీసుకున్నారు. గత నెల చివరి వారంలో మంత్రి హరీశ్‌రావు సింగూర్ వద్ద మిషన్ భగీరథ పనులను పరిశీలించేందుకు వచ్చారు. అయితే మెదక్, అందోల్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాలకు సరఫరా చేసే పంపింగ్ కేంద్రాల వైపు మంత్రిని తీసుకెళ్లారు. పక్కనే సింగూర్– జూక్కల్ , సింగూర్ బాన్సువాడ ప్రాజెక్టు పనులను మాత్రం ఆయన పరిశీలించలేదు.
పుల్‌కల్ మండల పరిధిలోని సింగూర్, పెద్దారెడ్డిపేట గ్రామ శివారులో, సింగూర్ నుంచి మెదక్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గం పరిధిలోని గ్రామాలకు మంచినీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మెదక్ జిల్లాకు సరఫరా చేసే నీటి పథకం పనులను ఎల్‌ఎంటీ సంస్థ చేపట్టగా నిజామాబాద్ జిల్లాలకు చెందిన ప్రాజెక్టును మరో సంస్థ ద్వారా చేపడుతున్నారు. అయితే ఇక్కడ మాత్రం ఈ సంస్థ సబ్ కాంట్రాక్టుకు పనులు అప్పగించడంతో వారు టెండర్ సమయంలో చూపించిన మాదిరిగా కాకుండా స్థానికంగా లభించే ఇసుకతో పాటు కంకరను వినియోగిస్తున్నారు.
దీంతో నిర్మాణ సమయంలోనే పగుళ్లు వస్తున్నాయి. పగుళ్లను గమనించి కాంట్రాక్టర్లు వెంటనే వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. పంప్‌హౌస్‌లలో సైతం మట్టితో కూడుకున్న కంకరను నింపడంతో ఎక్కువ రోజులు నాణ్యత ఉండే అవకాశం లేదని ఓ ఇంజరింగ్ అధికారి తెలిపారు.
అంతా ప్రయివేటు ఉద్యోగులే..
మిషన్ భగీరథ పథకం కింద చేపట్టిన పనులను నాసిరకంగా నిర్మించాకుండా నాణ్యత ప్రమాణాలు పరిశీలించేందుకు గాను కాంట్రాక్టు పొందిన సంస్థకు సంబంధం లేకుండా నాణ్యతను పరిశీలించేందుకు పని ప్రదేశంలో ల్యాబ్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ అందరూ ప్రయివేటు ఉద్యోగులే పనిచేయడం వల్ల నాణ్యతను పట్టించుకున్న దాఖాలాలు లేవు.
చౌటకూర్, ముదిమాణిక్యం ఫారెస్టు శివారు నుంచి తెచ్చిన ఇసుకలో మట్టి కలిసి ఉంటుంది. ఇసుకనే కాకుండా కంకరను సైతం ప్రభుత్వం గుర్తించిన వాటిని వినియోగించాలి. కాని ఇక్కడా మాత్రం నల్ల రంగు కంకరను వినియోగించి పనులు చేస్తున్నారు. దీనిపై వివరణ కోరేందుకు ఆర్‌డబ్ల్యూ ఆర్‌డబ్ల్యూఎస్ సర్కిల్ ఇంజనీర్ చక్రవర్తిని ప్రయత్నించగా అందుబాటులో లేరు.