గడువులోపు గగనమే.. | Mission Bhagiratha Project Work In Karimnagar | Sakshi
Sakshi News home page

గడువులోపు గగనమే..

Published Thu, Jan 24 2019 10:02 AM | Last Updated on Thu, Jan 24 2019 10:02 AM

Mission Bhagiratha Project Work In Karimnagar - Sakshi

కరీంనగర్‌కార్పొరేషన్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి మంచినీరు సరఫరా చేసేం దుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్బన్‌ మిషన్‌ భగీరథ పథకం పనులు కరీంనగర్‌లో నత్తనడకన కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోనే మొదటిసారిగా 24 గంటలు నీరందించేందుకు కరీంనగర్‌ను పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. నగరానికి సమీపంలో ఉన్న లోయర్‌ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ)లో నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండడంతో ప్రయోగాత్మకంగా నిరంతరంగా నీటి సరఫరాకు చర్యలు చేపట్టింది. నగరానికి నిరంతరం నీరందించేందుకు కార్యాచరణ జరుగుతుండగా.. ఆశలన్నీ అర్బన్‌ మిషన్‌ భగీరథ మీదే ఉన్నాయి.

ఈ పథకం పూర్తయితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుండడంతో ఎప్పుడెప్పుడా అని ప్రజలు  వేచిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మిషన్‌ భగీరథ ద్వారానే నిరంతర నీటి సరఫరా చేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. కొత్తగా ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, సంపులు, పైపులైన్‌ కనెక్షన్లు, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. గతేడాది నవంబర్‌లోనే పనులు పూర్తి చేయాల్సి ఉండగా తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం గడువు పెంచి మార్చి నెలాఖరులోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించింది. ప్రస్తుత పనులు కూడా ఆలస్యం అవుతుండడంతో గడువులోపు పూర్తవడం అనుమానమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
రూ.109 కోట్లతో పనులు...
నగరంలో అర్బన్‌ మిషన్‌ భగీరథ పథకం కింద ప్రభుత్వం రూ.109.26 కోట్ల నిదులు మంజూరు చేసింది. అర్బన్‌ మిషన్‌ భగీరథతో పాటు స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు ఇక్కడ అమలులో ఉండడంతో 24 గంటల నీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 16 ఓవర్‌హెడ్‌ ట్యాంకులకు తోడు మరో 3 ట్యాంకులు మిషన్‌ భగీరథ పథకంలో నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం నగరంలో ఉన్న 43 వేల నల్లా కనెక్షన్లకు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుండగా, మిషన్‌ భగీరథ పనులు పూర్తయితే నిరంతర నీటి సరఫరా జరగనుంది. అన్ని డివిజన్లలో పనులు ప్రారంభించడంతో పైపులైన్ల నిర్మాణం కొనసాగుతోంది. పనులు ప్రారంభించినప్పుడు 18 నెలల కాల వ్యవధిని ఇచ్చారు. అంటే గతేడాది నవంబర్‌లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించినప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక మార్చి చివరి వరకైనా పనులు పూర్తిచేసి ఏప్రిల్‌ నుంచైనా ఇంటింటికి నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెడుతున్నా పనులు ఊపందుకోకపోవడం గమనార్హం.

పనులు జరుగుతున్న తీరు...
అర్బన్‌ మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులు అన్ని డివిజన్లలో కొనసాగుతున్నాయి. 110 ఎంఎం డయా పైపులైన్‌ 147.43 కిలోమీటర్లు వేయాల్సి ఉండగా 85.21 కిలోమీటర్లు పూర్తయింది. 100 ఎంఎం డయా పైపులైన్‌ 40 కిలోమీటర్లుకు గాను 35 కిలోమీటర్లు, 150 ఎంఎం డయా పైపులైన్‌ 29.79 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా, 36.25 కిలోమీటర్లు చేపట్టారు. అలాగే 200 ఎంఎం, 250 ఎంఎం డయా పైపులైన్‌ 73.64 కిలోమీటర్లు వేయాల్సి ఉండగా 40.04 కిలోమీటర్ల మేర నిర్మించారు. మిగతా పైపులైన్‌ పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి.

స్లాబ్‌ లెవల్‌కు ఓవర్‌హెడ్‌ ట్యాంకులు...
అర్బన్‌ మిషన్‌ భగీరథ ద్వారా నిర్మాణం చేపట్టిన మూడు ఓవర్‌హెడ్‌ ట్యాంకులు స్లాబ్‌ లెవల్‌కు చేరుకున్నాయి. 2033 సంవత్సరం కల్లా 4.03 లక్షల జనాభాకు సరిపడేలా 68.65 ఎంఎల్‌డీల సామర్థ్యంతో ఫిల్టర్‌బెడ్, 3000 కేఎల్‌ సామర్థ్యంతో శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మాస్టర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తున్నారు. దీని పనులు 30 శాతం మేర పూర్తయ్యాయి. 800 కిలో లీటర్ల సామర్థ్యం గల సంపు, పంపుహౌస్‌ను ఫిల్టర్‌బెడ్‌ దగ్గర నిర్మిస్తున్నారు. 90 శాతం పనులు పూర్తిచేశారు. రాంనగర్‌లో 1300 కిలో లీటర్ల ట్యాంకు పనులు 50 శాతం మేర, హౌసింగ్‌బోర్డు కాలనీలో 2200 కిలో లీటర్ల సామర్థ్యంతో నిర్మా ణం చేస్తున్న ట్యాంకు పనులు 60 శాతం పూర్తయ్యాయి. ఈ పనులన్నీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. హౌసింగ్‌బోర్డు, రాంనగర్‌ రిజర్వాయర్ల పనులు జరుగుతుండగా, ఫిల్టర్‌బెడ్‌ దగ్గర ఉన్న రిజర్వాయర్‌ పూర్తయింది. సంపుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

గడువులోగా అనుమానమే...
ప్రతిష్టాత్మకమైన భగీరథ పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారం చేపట్టాక మిషన్‌ భగీరథ పనులను మార్చిలోగా పూర్తిచేసి ప్రజలకిచ్చిన వాగ్ధానం ప్రకారం ఏప్రిల్‌ నుంచి ఇంటింటికి తాగునీరు అందించాలని గడువు విధించింది. రిజర్వాయర్లు, సంపుల నిర్మాణం, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులపై దృష్టి కేంద్రీకరించింది. పైపులైన్ల అనుసంధానం పనులు సైతం ఆశించిన స్థాయిలో జరగకపోవడం వల్ల ఈ పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అధికాÆ ý‡ులను ఆదేశించింది. అయితే పైపులైన్లతో పాటు ట్యాంకుల నిర్మాణం అడ్డగోలుగా ఆలస్యమవుతుండడంతో గడువులోగా పనులు పూర్తవుతాయా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

మార్చి టార్గెట్‌గా పనులు..
అర్బన్‌ మిషన్‌ భగీరథ పనులను ప్రభుత్వం ఇచ్చిన గడువు మార్చిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. పైపులైన్ల పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. మిగతా అన్ని నిర్మాణ పనులపై దృష్టి సారించి ఆ మేరకు పనులు జరిగేలా చూస్తున్నాం. శాతవాహన యూనివర్సిటీ ఆవరణలో జరుగుతున్న మాస్టర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పనుల్లో మరింత వేగం పెంచాలని కాంట్రాక్టర్లను ఆదేశించాం. పనులన్నీ గడువులోగా పూర్తి చేయడంపైనే దృష్టి సారించాం.– సంపత్‌రావు, డీఈఈ, ప్రజారోగ్యశాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement