కర్ణాటక కరుణించె | KCR Talk On Mission Bhagiratha | Sakshi
Sakshi News home page

కర్ణాటక కరుణించె

Published Sat, May 4 2019 7:49 AM | Last Updated on Sat, May 4 2019 7:49 AM

KCR Talk On Mission Bhagiratha - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ దౌత్యం ఫలించింది. కర్ణాటక ప్రభుత్వం కరుణించింది. భానుడి ప్రతాపానికి ప్రియదర్శిని జూరాలలో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి పడిపోయి.. తాగునీటి ప్రమాద ఘంటికలు మోగుతోన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ఒప్పుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర అధికారులతో చర్చించిన  సీఎం కుమారస్వామి శుక్రవారం రాత్రి నారాయణపూర్‌ జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు.

ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆదివారం తెల్లవారుజాము వరకు నీరు జూరాల ప్రాజెక్టులో చేరనుంది. జూరాల నుంచి రామన్‌పాడు, బీమా, కోయిల్‌సాగర్, కేఎల్‌ఐ తదితర ప్రాజెక్టుల్లో నీరు చేరనుంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లావాసుల తాగునీటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు నెలకొన్నాయి. ఇదీలా ఉంటే కర్ణాటక విడుదల చేసే 2.5 టీఎంసీలలో ఒక టీఎంసీ నీరు మధ్యనే ఆవిరైపోతుందని, కేవలం 1.5 టీఎంసీ మాత్రమే జూరాలకు చేరుకుంటుందని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు.
 
ప్రతిరోజూ 100క్యూసెక్కుల నీరు ఆవిరి  
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 60శాతానికి పైగా గ్రామాలకు జూరాల ప్రాజెక్టు నుంచే తాగునీరు సరఫరా అవుతోంది. అయితే ఈ సారి భానుడు నిప్పులు చెరుగుతుం డడంతో ప్రతిరోజూ సుమారు వంద క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా తగ్గుతూ వచ్చింది. 9.66 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో 3 టీఎంసీల నీరు ఉంటే దాన్ని డెడ్‌స్టోరేజీగా పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం జలాశయంలో 1.93 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉంది. అంటే డెడ్‌స్టోరేజీ కంటే ఒక టీఎంసీకి పైగా నీళ్లు తక్కువగా ఉందన్న మాట. నీటి లభ్యత లేకపోవడంతో ప్రధాన గ్రిడ్‌ ద్వారా ఆవాసా ప్రాంతాలకు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు మొదలయ్యాయి.

చాలా చోట్ల నీటి కోసం ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో జూరాలలో తగ్గుతోన్న నీటి మట్టంపై ఆందోళన చెందిన ఇరిగేషన్‌ అధికారులు సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం ఎగువన ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీల నీటిని విడుదల చేసి.. పాలమూరు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చాలని గత నెలలోనే కర్ణాటక సీఎం కుమారస్వామికి లేఖరాశారు. లేఖపై స్పందించిన కర్ణాటక సీఎం అధికారులతో చర్చించి ప్రాజెక్టు నుంచి రెండున్నర టీఎంసీల నీటి విడుదలకు అంగీకారం తెలిపారు.
 
జూరాలే కీలకం..  
ప్రస్తుతం జూరాల వద్ద ఉన్న ప్రధాన గ్రిడ్‌ నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలోని 319 గ్రామాలకు మిషన్‌ భగీరథ తాగునీరు ప్రతి రోజూ 50ఎంఎల్‌డీ సరఫరా అవుతోంది. ప్రస్తుతం నీటిమట్టం తగ్గిన నేపథ్యంలో అధికారులు అప్రోచ్‌ కెనాల్‌ను జేసీబీలతో సరి చేస్తూ నీరు సరఫరా చేస్తున్నారు. మరోవైపు జూరాల ఎడమ కాల్వ ద్వారా విడుదలయ్యే నీటిని వనపర్తిలో ఉన్న రామన్‌పాడు ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు. ప్రస్తుతం అక్కడి నుండి వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలో ఉన్న 500 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే రామన్‌పాడులోనూ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. రానున్న రోజుల్లో ఆయా గ్రామాలకు తాగునీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కావడం ఆయా ప్రాంతాల్లో నెలకొననున్న నీటి ఎద్దడికి పరిష్కారం లభించింది. వీటితో పాటు కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించి కల్వకుర్తి, కొల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలో సుమారు 300 గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తారు.         

ఎవరిదీ పాపం? 

మూడు నెలల క్రితం వరకు జూరాలలో తాగునీటి అవసరాలకు సరిపడేంత నీటి లభ్యత ఉంది. తర్వాత పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా జలాశయంలో నీరు ఆవిరవుతూ వచ్చింది. దీంతో అధికారులు రబీ పంటకు క్రాప్‌ హాలిడే ప్రకటించారు. అయితే జూరాల, బీమా ప్రాజెక్టుల పరిధిలోని పెబ్బేరు, కొల్లాపూర్‌ ప్రాంతాల్లో ఖరీఫ్‌లో ఆలస్యంగా సాగు చేసిన వరి, వేరుశనగ పంటలు ఎండిపోతున్నాయంటూ ఓ ప్రజాప్రతినిధి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషికి లేఖరాశారు. దీనిపై స్పందించిన ఆయన నీటి విడుదలకు ఆదేశించారు. దీంతో జనవరి 6న సాగు కోసం జూరాల ఎడమ కాలువ నుంచి  0.7టీఎంసీల నీటిని తరలించారు.

ఆ సమయంలో నీటిని తరలించకపోతే ఈ రోజు ఈ స్థాయిలో తాగునీటి కష్టాలు ఉండేవి కావని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదీలా ఉంటే ప్రతి సంవత్సరం జూరాల ప్రాజెక్టులో నీళ్లు అయిపోగోట్టుకోవడం, కర్ణాటకను అడుక్కోవడం నాలుగేళ్లుగా ఓ తంతుగా మారింది. తాగు, సాగునీటి అవసరాలకు సంబంధించి ముందుచూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని.. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు ముందుచూపుతో వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement