పునరావాసం త్వరగా పూర్తి చేయండి: కేసీఆర్‌ | Telangana CM KCR Review Meeting With Govrnment Officials | Sakshi
Sakshi News home page

పునరావాసం త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశం

Published Fri, May 3 2019 7:44 PM | Last Updated on Fri, May 3 2019 7:46 PM

Telangana CM KCR Review Meeting With Govrnment Officials On Mallanna Sagar Reserviour Expats - Sakshi

తెలంగాణ సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ భూనిర్వాసితుల పునరోపాధి, పునరావాస సాయం పంపిణీ కార్యక్రమం వందకు వంద శాతం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చే కార్యక్రమం పూర్తయిందని, మిగిలిన కొద్దిపాటి ప్రక్రియను కొద్ది రోజుల్లోనే పూర్తి చేసి, ఈ నెల 11వ తేదీలోగా హైకోర్టుకు నివేదిక పంపాలని సీఎం సూచించారు. పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో నిర్వహించే బాధ్యతలను సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు ముఖ్యమంత్రి అప్పగించారు.

‘లక్ష కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణలో 40 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందివ్వడానికి అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. అందులో భాగంగా 50 టిఎంసిల సామర్థ్యం కలిగిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నాం. ఇంత పెద్ద రిజర్వాయర్ నిర్మించే క్రమంలో కొద్ది మంది భూములు, ఇండ్లు కోల్పోతున్నారు. నిర్వాసితులు మెరుగైన పునరోపాధి, పునరావాసం పొందడానికి ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచే ప్యాకేజీని అందిస్తున్నది. రూ.800 కోట్లను మల్లన్న సాగర్ నిర్వాసితులకు పరిహారం, పునరావాస కార్యక్రమాల కోసమే ప్రభుత్వం ఖర్చు చేస్తున్నద’ని సీఎం చెప్పారు.

‘ప్రభుత్వం ఇంత చేసినా, కొద్ది మందికి సాయం అందించే విషయంలో జరిగిన జాప్యం వల్ల కోర్టులు తరచూ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది.మొత్తం ప్రక్రియలో కొద్ది పాటి పరిహారం ఇవ్వడమే మిగిలింది. దీనిని అలుసుగా తీసుకుని కొంత మంది వ్యక్తులు, ప్రగతి నిరోధక శక్తులు ప్రాజెక్టునే ఆపడానికి కుట్రలు చేస్తున్నారు. పరిహారం పంపిణీ ప్రక్రియలో మిగిలిన కొంచెం పనిని కూడా త్వరగా పూర్తి చేసి, చిల్లర పంచాయితీని వెంటనే ముగించాల’ని సీఎం వ్యాఖ్యానించారు. 

సింగారం, రాంపూర్ గ్రామాల్లో 800 మంది నిర్వాసితులకు చెక్కుల ద్వారా పరిహారం పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమయింది. మిగతా గ్రామాల్లో ప్రత్యేకాధికారుల సమక్షంలో శనివారం నుంచి చెక్కుల పంపిణీ జరుగుతుంది. ఎవరైనా చెక్కులు తీసుకోవడానికి విముఖత చూపితే, వారి అభిప్రాయాన్ని వీడియో తీయాలని అధికారులు నిర్ణయించారు.

నిర్వాసితులకు ప్రభుత్వం అందిస్తున్న సాయం

1. కేంద్ర చట్టం ఒక్కో ఇంటికి రూ.1.25 లక్షల వ్యయమయ్యే 60 గజాల స్థలంలో ఇందిరా ఆవాస్ యోజన ఇల్లు మంజూరు చేయాలని చెబుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మల్లన్న సాగర్ నిర్వాసితులకు అంతకన్నా నాలుగు రెట్లు ఎక్కువగా, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఒక్కో ఇంటికోసం రూ.5.04 లక్షల విలువైన 560 అడుగుల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తున్నది. ఈ ఇండ్లను కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాకుండా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎడ్యుకేషన్ హబ్ పక్కన 460 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వమే నిర్మించి ఇస్తున్నది. ఇల్లు వద్దు అనుకునే వారికి 250 గజాల ఇంటి స్థలం, రూ.5.04 లక్షల నగదు అందిస్తున్నది. 

2. ప్రస్తుతం ఉన్న ముంపు గ్రామంలోని ఇంటి స్థలానికి గజం రూ. 1600 చొప్పున లెక్క గట్టి పరిహారం చెల్లిస్తున్నది.

3. కోల్పోయిన ఇంటికి కూడా శాస్త్రీయంగా లెక్కగట్టి పరిహారం చెల్లిస్తున్నది.

4.ఒక్కో కుటుంబానికి రూ.7.50 లక్షల పునరావాస ప్యాకేజీ అదనంగా అందిస్తున్నది. 

5. 18 సంవత్సరాలు దాటిన అవివాహితులకు కూడా రూ.5 లక్షల పునరావాస సాయం, 250 గజాల ఇంటి స్థలం ఇస్తున్నది.
 
6. పునరావాస ప్యాకేజి కింద ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇంటికి ఆర్డీఓ సంతకంతో తహసీల్దార్ పట్టా జారీ చేస్తారు. అవసరమైన పక్షంలో ఈ ఇంటిని అమ్ముకోవడానికి, బహుమతిగా కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి అనుకూలంగా ఈ పట్టాలుంటాయి. మల్లన్న సాగర్ నిర్వాసితులకు ప్రభుత్వం అందిస్తున్న పునరోపాధి, పునరావాస కార్యక్రమం కింద గరిష్టంగా దాదాపు కోటి రూపాయల వరకు సాయం అందుతున్నది. ఒక్కో కుటుంబానికి అందే మొత్తం: రూ. 7.50 లక్షలు, ఇద్దరు పెద్ద పిల్లలుంటే అందే మొత్తం: రూ.10 లక్షలు, కుటుంబానికి, పెద్ద పిల్లలకు కలిపి వచ్చేవి మూడు ప్లాట్లు (750 గజాలు): రూ.75 లక్షలు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement