సాక్షి, సిద్దిపేట: సాధారణంగా నదికి అనుసంధానంగా జలాశయాలు నిర్మిస్తారని, కానీ నది లేనిచోట దేశంలోనే అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్‌ను నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను బుధవారం సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ సందర్బంగా మంగళవారం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మల్లన్నసాగర్ ద్వారా తెలంగాణలోని ఏ ప్రాంతానికైనా నీటిని తీసుకెళ్లవచ్చని, రానున్న 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని తానే ఇంజనీర్‌గా సీఎం ఈ రిజర్వాయర్ రూపకల్పన చేశారని చెప్పారు.
తక్కువ ముంపుతో మల్లన్నసాగర్ జలాశయం నిర్మాణం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిర్వాసితులకు గజ్వేల్ పట్టణం సమీపంలో ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మాణం చేసి ఇళ్లను అందించామని తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని, కానీ బీజేపీ నేతలు మాత్రం మతాల మధ్య చిచ్చుపెట్టి రక్తాన్ని పారించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చేతనైతే తెలంగాణకు రావాల్సిన హక్కులపై ఢిల్లీలో బీజేపీ నాయకులు నిలదీయాలని హితవు పలికారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డిలకు దమ్ముంటే తెలంగాణలోని ప్రాజెక్టులకు జాతీయ హోదాను తీసుకురావాలని హరీశ్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అతిపెద్ద జలాశయం మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. బుధవారం సీఎం కేసీఆర్ తుక్కాపూర్ వేదికగా ప్రారంభించి దీనిని జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే నీటి నిల్వ సామర్థ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు సీఎం చేతుల మీదుగా నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
సీఎం పర్యటన ఇలా..
► హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ తుక్కాపూర్‌కు చేరుకుంటారు.
► సొరంగ మార్గం ద్వారా భూగర్భంలో ఏర్పాటు చేసిన పంప్‌హౌస్ వద్దకు వెళ్లి మోటార్లను ఆన్ చేస్తారు.
► అనంతరం జలాశయంలో గోదావరి జలాలకు శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు.
► తర్వాత జిల్లాకు చెందిన నాలుగు వేల మంది ప్రజా ప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశమవుతారు.
Comments
Please login to add a commentAdd a comment