t harish rao
-
సఫలం.. సంక్షేమం.. సామరస్యం.. మా 8 ఏళ్ల పాలన సారాంశమిదే!
సాక్షి, హైదరాబాద్: ‘విదేశాల నుంచి నల్లధనం తేవడంలో ఫెయిల్.. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేయడంలో ఫెయిల్.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలివ్వడంలో ఫెయిల్.. పెద్ద నోట్ల రద్దు ఫెయిల్.. రైతు ఆదాయం రెట్టింపు చేయడంలో ఫెయిల్.. చిన్న పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలకు) రుణాలివ్వడంలో ఫెయిల్.. అర్హులకు ఇండ్లు కట్టించడంలో ఫెయిల్.. మేకిన్ ఇండియా ఫెయిల్.. పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు ఫెయిల్.. గంగానది ప్రక్షాళన ఫెయిల్.. నదుల అనుసంధానం ఫెయిల్.. బుల్లెట్ రైలు ఫెయిల్.. హర్‌ఘర్‌కో జల్ ఫెయిల్.. ఫెయిల్.. ఫెయిల్... ఫెయిల్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఎనిమిదేళ్ల పాలన సారాంశం అన్నింటా వైఫల్యం, విషం, విద్వేషం. కానీ తెలంగాణలో మా ఎనిమిదేళ్ల పాలనా సారాంశం మాత్రం.. సఫలం, సంక్షేమం, సామరస్యం..’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. పచ్చని పంటలు పండాలనేది టీఆర్ఎస్ సిద్ధాంతమైతే, మతం పిచ్చి మంటలు రగిలించాలనేది బీజేపీ సిద్ధాంతమని విమర్శించారు. గోదావరి, కృష్ణా జలాలు పారించాలనేది టీఆర్ఎస్ అభిమతమైతే, తలలు పగిలి రక్తాలు పారించాలనేది బీజేపీ అభిమతమని దుయ్యబట్టారు. మంగళవారం శాసనసభలో ‘ఎఫ్ఆర్బీఎం చట్టం అమలులో కేంద్రం ద్వంద్వ వైఖరి–రాష్ట్ర ప్రగతిపై ప్రభావం’ అనే అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. బలమైన కేంద్రం, బలహీన రాష్ట్రాలు బీజేపీ ఉద్దేశం ‘బలమైన కేంద్రం, బలహీన రాష్ట్రాలు ఉండాలనేది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఉద్దేశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే అప్పులను సమీక్షించేందుకు ఉన్నతస్థాయిలో అంతర ప్రభుత్వ కమిటీ వేయాలని 15వ ఆర్థిక సంఘం సూచిస్తే అలాంటి కమిటీని ఏర్పాటు చేయకుండానే ఎఫ్ఆర్బీఎం చట్టానికి సవరణలు తెచ్చే ప్రయత్నం కేంద్రం చేసింది. తాను తీసుకునే అప్పులను రికవరీలో పెట్టకుండా రాష్ట్రాలు తీసుకునే అప్పులను మాత్రం రికవరీలో పెట్టి పరిమితులు విధించడం, వాటిని గతంలో తీసుకున్న అప్పులకు కూడా వర్తింపజేయడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనం. నీతి ఏదైనా కేంద్రానికి, రాష్ట్రాలకు ఒకే విధంగా ఉండాలి. అలా కాకుండా కోతల విషయంలో రాష్ట్రాలకు, తీసుకునే విషయంలో కేంద్రానికి నిబంధనలు వర్తింపజేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ఎఫ్ఆర్బీఎం పేరుతో కోతలు పెట్టారు. అలాంటప్పుడు బడ్జెట్ అంచనాలే తలకిందులవుతాయి. రాష్ట్రాలతో చర్చించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగదు..’ అని హరీశ్ పేర్కొన్నారు. ప్రతిపైసా మూలధన వ్యయం కిందే ఖర్చు చేస్తున్నాం ‘గతంలో దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు ఆర్థిక సంఘం సిఫారసులను తు.చ. తప్పకుండా అమలు చేశాయి. కానీ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15వ ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రతో, కక్షతో తెలంగాణకు రావాల్సిన నిధులను నిలిపివేసింది. పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32–42 శాతానికి పెంచినప్పుడు నిజమేనని నమ్మాం. కానీ వాస్తవంగా ఇస్తోంది 29.6 శాతమే. ఒకవేళ 42 శాతం చొప్పున ఇస్తే రూ.33,712 కోట్లు అదనంగా రావాల్సి ఉంది. పన్నుల్లో వాటా అయితే రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో కేంద్రం సెస్సుల రూపంలో వసూలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2017–18లో రూ.81,282 కోట్లు, 2018–19లో రూ.1.58 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం కోసం బడ్జెట్ వెలుపలి అప్పులు చేసింది. దాన్ని కాగ్ కూడా తప్పు పట్టింది. తెలంగాణ మాత్రం ప్రతి పైసా మూలధన వ్యయం కిందే ఖర్చు చేస్తోంది. గ్యాస్ సిలిండర్లపై ఫొటోలు పెట్టుకోండి ఎఫ్ఆర్బీఎంని మించి రూ.6 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత కేంద్రానికే దక్కుతుంది. కేంద్ర ప్రభుత్వ అప్పు రూ.1,52,17,910 కోట్లు. దేశ జనాభాతో లెక్కిస్తే తలసరి అప్పు రూ.1,25,679 ఉంది. అదే రాష్ట్రం చేసిన రూ.3,29,980 కోట్లకు రాష్ట్ర జనాభాను లెక్కగడితే రూ.94,272 మాత్రమే. దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది. రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ రూ.1,200 అయ్యింది. ప్రతి ఇంటికీ వెళ్లే గ్యాస్ సిలిండర్లపై మీ ఫోటోలు పెట్టుకోండి..’ అని హరీశ్ ఎద్దేవా చేశారు. ఆర్థిక అంశాల్లో తెలంగాణ చాంపియన్ ‘ఆర్థిక అంశాల్లో తెలంగాణ చాంపియన్‌గా నిలుస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అప్పులతో పాటు రాష్ట్రంలో ఆదాయమూ పెరిగింది. 2015–16 నుంచి 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో సొంత పన్నుల రాబడిలో తెలంగాణ సగటున 11.5 శాతం వృద్ధి రేటు నమోదు చేసి దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. 2014లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4 శాతం అయితే, ఇప్పుడు 4.9 శాతం. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమయినా అప్పులు తీసుకోవాల్సిందే. తెలంగాణ స్థూల ఉత్పత్తిలో అప్పు కేవలం 23.5 శాతం మాత్రమే. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.3,65,797 కోట్లు చెల్లిస్తే, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది రూ.1,96,448 కోట్లే. తెలంగాణనే కేంద్రానికి రూ.1,69,349 కోట్లు ఇచ్చింది. కేంద్రంతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలను తెలంగాణ సాదుతోంది. మేము సంపదను పెంచి పేదలకు పంచాం. కేంద్రం మాత్రం గద్దలకు పంచుతోంది. కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తోంది. నిధులిచ్చి ఉంటే రూ.లక్ష కోట్ల అప్పులు తగ్గేవి తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను కేంద్రం ఇచ్చి ఉంటే రాష్ట్రం అప్పులు రూ.లక్ష కోట్లు తగ్గేవి. ఎఫ్ఆర్బీఎం పరిమితి తగ్గింపు వల్ల రూ.17,033 కోట్లు, విద్యుత్ సంస్కరణల పేరిట 5 శాతం కింద రూ.6,104 కోట్లు, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రూ.6,268 కోట్లు, 14వ ఆర్థిక సంఘం కింద రూ.817 కోట్లు, పన్నుల్లో 42 శాతం వాటా కింద రూ.33,712 కోట్లు, ఏపీ నుంచి విద్యుత్ బకాయిల కింద రూ.17,828 కోట్లు, 2014–15లో పొరపాటున ఏపీకి జమచేసిన రూ.495 కోట్లు, ప్రత్యేక సహాయ గ్రాంట్ల కింద రూ.1,350 కోట్లు, నీతి ఆయోగ్ సిఫారసు మేరకు మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, కాకతీయకు రూ.5వేల కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది..’ అని మంత్రి తెలిపారు. బీజేపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో మాట్లాడి ఆ నిధులిప్పించాలని కోరారు. అలా చేస్తే దండేసి దండం పెడతామని, సభలోనే కృతజ్ఞతలు చెపుతామని అన్నారు. ఇదీ చదవండి: ఆనాటి తారకరాముడి డైలాగ్‌తో అదరగొట్టిన కేటీఆర్.. అసెంబ్లీలో చప్పట్ల మోత! -
ప్రతి ముగ్గురిలో ఒకరికి కొలెస్ట్రాల్..
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. వంద మందిలో 33 మంది అనారోగ్యంతో ఉన్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ–హెల్త్ ప్రొఫైల్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోనే మొదటిసారిగా సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రయోగా త్మకంగా చేపట్టిన ఈ–హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధమవుతున్నాయి. ఆరోగ్య సర్వేలు ఇంటింటా సాగుతూ ముగింపు దశ (96%)కు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మార్చి 5న మంత్రి కె.తారక రామారావు, ములు గులో మంత్రి టి.హరీశ్‌రావు పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇంటింటా సర్వేలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 203 ఆరోగ్య కార్యకర్తల బృందాలు ఇంటింటా సర్వేలు చేస్తున్నాయి. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ సుమారు 30 రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తు న్నారు. ఇప్పటికి 4,05,988 మందికి టెస్టులు పూర్తయ్యా యి. బ్లడ్‌గ్రూప్, రక్తహీనత, కిడ్నీ, షుగర్, కాల్షియం, కొలెస్ట్రాల్, కాలేయం, ఇతర పరీక్షలను సిరిసిల్లలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరి ఎత్తు, బరువు వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ రూపంలో భద్రపరుస్తున్నారు. ఈ సమాచారంతో ఆధార్ కార్డు నంబరు, మొబైల్ నంబరుతో అనుసంధానం చేసి పేరు, పుట్టిన తేదీ, యూనిక్ కోడ్, ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ వంటి వివరాలు కార్డులో పొందుపరుస్తు న్నారు. యూనిక్ బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే.. చాలు సదరు వ్యక్తి సమగ్ర సమాచారం కళ్ల ముందు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేయడమే ఈ–హెల్త్ ప్రొఫైల్ లక్ష్యం. ఆధునిక పరిజ్ఞానంతో పరీక్షలు టీ–డయాగ్నోస్టిక్ సెంటర్లోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నమూనాలను విశ్లేషిస్తున్నారు. రోజుకు సగటున ఆరు వేల రక్త నమూనాలను పరీక్షిస్తూ.. ఆ వివరాలను కంప్యూటర్లో నమోదు చేస్తున్నారు. ఈ మూడు నెలల్లో ఒకరోజు గరిష్టంగా 14,690 రక్తపరీక్షలు చేయగా.. ఇప్పుడు సగటున 400 నుంచి 600 శాంపిళ్లు పరీక్షిస్తు న్నారు. ఇప్పటివరకు పూర్తయిన పరీక్షల్లో ఎక్కువ మందిలో కొలెస్ట్రాల్ సమస్య బయట పడగా, ఆ తర్వాత స్థానంలో కాల్షియం సమస్య ఉంది. థైరాయిడ్ సమ స్యతో 17,001 మంది, కాలేయ సమస్యతో 15,839 మంది, మూత్రపిం డాల సమస్యతో 14,267 మంది, మధుమేహంతో 10,186 మంది ఉన్నట్టు గుర్తించారు. -
ఏ హోదాలో ‘డిక్లరేషన్’ ఇచ్చారు?
సిద్దిపేట అర్బన్: కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను రాహుల్‌గాంధీ ఏ హోదాలో ప్రకటించారో అర్థం కావడం లేదని, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో హామీలు అమలవుతున్నాయా అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆదివారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు మెజార్టీ ఇచ్చి.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా వాటిని నిలబెట్టుకోలేని అసమర్థుడైన రాహుల్.. టీఆర్ఎస్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబు చెప్పులు మోసిన వారిని పార్టీలో పెట్టుకొని.. తెలంగాణ గడ్డపై.. తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ పార్టీపై పోరాడలేని అసమర్థ పార్టీగా కాంగ్రెస్ మారిపోయిందని విమర్శించారు. బీజేపీ నాయకులకు నిజం మాట్లాడితే తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్లుందని, అందుకే అబద్ధమే మాట్లాడుతుంటారని ఆరోపించారు. పాలమూరు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అబద్ధాల పురాణం మరోసారి చదివిపోయారని.. బీజేపీ మంత్రులు, నాయకులకు మధ్య ఉన్న సమన్వయ లోపం బయటపడిందని అన్నారు. ఎవరు వస్తారో రండి.. ‘కాళేశ్వరంతో ఒక్క ఎకరానికీ నీరు రాలేదని, ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పిన మాటలన్నీ అబద్ధాలే. మేమే ఖర్చులు భరించి జేపీ నడ్డాను రాష్ట్రమంతా తిప్పుతాం. 33 జిల్లాల్లో 20 జిల్లాల ప్రజల సాగు, తాగు నీటి అవసరాలను కాళేశ్వరం తీరుస్తోంది. ఎవరు వస్తారో రండి.. నిజానిజాలు తేల్చడానికి సిద్ధంగా ఉన్నాం. నేను చెప్పను.. మా సిద్దిపేట రైతులే చెబుతారు. మీ రాష్ట్ర నాయకులు అక్కసుతో రాసిచ్చిన స్క్రిప్టును చదివి అభాసుపాలు కావడం కన్నా గ్రామాల్లో పర్యటించి నిజాలు తెలుసుకొని మాట్లాడితే ఢిల్లీ నాయకులకు గౌరవంగా ఉంటుంది. కేంద్ర మంత్రి గడ్కరీ కాళేశ్వరం ద్వారా రాష్ట్రం సస్యశ్యామలం అవుతోందని, దేశానికి గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణ మారిందని ప్రశంసిస్తే నడ్డా అడ్డదిడ్డంగా మాట్లాడారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్.. కాళేశ్వరంలో అవినీతి, అక్రమాలు జరగలేదని పార్లమెంట్లో చెప్పారు. ఇది బీజేపీ నేతలు గుర్తు తెచ్చుకోవాలి. కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నామని అంటున్నారు. ఇంతకంటే అధ్వానమైన ఆత్మవంచన మరొకటి లేదు. నిధులు ఇవ్వకపోగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన అప్పులను ఆపుతూ, ఆర్బీఐని ప్రభావితం చేస్తూ రాష్ట్ర ప్రగతిని కేంద్రం అడ్డుకుంటోంది. అధికారంలోకి రాగానే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేస్తామని పాలమూరులో 2014 ఎన్నికల సభలో మోదీ చెప్పారు. మరి ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలి’అని హరీశ్ ప్రశ్నించారు. -
అచ్చేదిన్ కాదు..చచ్చేదిన్ తెస్తున్నరు
సాక్షి, హైదరాబాద్: అచ్చేదిన్ తెస్తామన్న ప్రధాని మోదీ సర్కారు దేశ ప్రజలకు చచ్చే దిన్ తెస్తోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటున్న బీజేపీ సర్కారు.. ప్రజల బతుకు దుర్భరంగా మార్చిందని మండిపడ్డారు. టీం ఇండియాలో టీం, థీమ్ లేదని.. అంతా రాజకీయ గేమ్ అని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వానిది వైఫ ల్యాల చరిత్ర అయితే తెలంగాణ ప్రభుత్వానిది సాఫల్యాల చరిత్ర అన్నారు. పార్టీ ప్లీనరీలో ‘రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపంలో వసూలు చేయడం మానుకోవాలి. డివిజిబుల్ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలి’ అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి బలపరిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రాలు ఆర్థి కంగా బలహీనంగా ఉండాలి.. రాష్ట్రాలకు అధికారాలు తగ్గించాలన్నదే బీజేపీ సిద్ధాంతమని ధ్వజ మెత్తారు. కేంద్రం సెస్‌ల రూపంలో వసూలు చేసే మొత్తాన్ని డివిజిబుల్ పూల్ లోకి తేవాలని డిమాండ్ చేశారు. ఏడేళ్లలో కేంద్రానికి రూ. 24 లక్షల కోట్లు ‘దేశంలో పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్ర ప్రజల హక్కుగా కేంద్రం పంచాలి. కానీ పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పంచాల్సి వస్తుందని సెస్‌ల రూపంలో పెద్ద ఎత్తున కేంద్రం డబ్బులు వసూలు చేస్తోంది’ అని మంత్రి అన్నారు. రాష్ట్రానికి 41%ఇవ్వాల్సిన చోట 29.6 శాతమే ఇస్తోందన్నారు. మరో 11.4% సెస్‌ల రూపంలో దొడ్డి దారిన సమకూర్చుకుంటోందని విమర్శిం చా రు. 14, 15వ ఆర్థిక సంఘాలు కూడా రాష్ట్రాలకు 41% వాటా ఇవ్వాలని సూచించాయని గుర్తు చేశా రు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో సెస్‌ల రూపంలో రూ.24 లక్షల కోట్లను సమకూర్చుకుం దని, ఇందులో రాష్ట్రానికి రూ. 54వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. కేంద్రానికి ఏ రూపంలో డబ్బులు వచ్చినా రాష్ట్రాలకు 41 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల రుణ పరిమితిపై కేంద్రం ఆంక్షలు విధిస్తోందని విమర్శించారు. కొత్తవి తెస్తామని ఉన్నవి అమ్ముతున్నారు ఏడేళ్లలో దేశ ఆర్థిక వృద్ధి రేటు పడిపోయిందని.. నాడు 8% ఉంటే ఇప్పుడు 5.7%కు చేరిందని హరీశ్ చెప్పారు. కొత్త పరిశ్రమలు తెస్తామన్న బీజేపీ సర్కారు.. ఉన్న పరిశ్రమలను అమ్ముకుం టోందన్నారు. బీజేపీ ప్రభుత్వం అమ్మిన ప్రభుత్వ రంగ సంస్థల విలువ రూ. 3.5 లక్షల కోట్లని వివరించారు. బీజేపీ అధికారంలోకి రాక ముందు నిరుద్యోగం 4.7% ఉంటే ఏడేళ్ల పాలనలో 7.11 శాతానికి పెరిగిందన్నారు. బీజేపీ హయాంలో రైతుల ఆదాయం పెరగక పోగా ఖర్చులు పెరిగా యని విమర్శించారు. సంపద పెంచి పేదలకు పంచడం టీఆర్ఎస్ విధానం కాగా.. పేదలను దంచాలి పెద్దలకు పెంచాలన్నది బీజేపీ నినాదమన్నారు. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా
అప్డేట్స్ ►తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. ఈనెల 15 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అన్ని అంశాలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని బీఏసీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి(మార్చి 9) వాయిదా పడ్డాయి. సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ►రాష్ట్రంలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఏడాది కొత్తగా మరో ఎనిమిది జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. నూతన కాలేజీల ఏర్పాటుకు 2022-23 వార్షిక బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ►తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగాన్ని 2 గంటల పాటు చదివి వినిపించారు. ఉదయం 11:30 గంటలకు హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగా, మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రసంగాన్ని ముగించారు. ►బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులపై సస్పెన్షన్ వేటు ► తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకూ బీజేపీ సభ్యుల సస్పెన్షన్ ►బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతుండటంతో సస్పెండ్ చేయాలని మంత్రి తలసాని తీర్మానం.. ఆమోదించిన స్పీకర్ పోచారం. ►తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యులు సస్పెన్షన్ ► గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో బీజేపీ సభ్యులు ఆందోళన ►తెలంగాణ పురిటి దశలో ఉన్నప్పుడే కేంద్రం దాడి మొదలైంది: హరీష్‌రావు ►ఫెడరల్ స్ఫూర్తిని కేంద్రం దెబ్బతీస్తుంది: హరీష్‌రావు ►ఆర్థిక సంఘం సూచనలను కేంద్రం పట్టించుకోవడం లేదు: హరీష్‌రావు ►తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థికమంత్రి హరీష్‌రావు ప్రసంగిస్తున్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టే క్రమంలో ముందుగా హరీష్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలో కరెంట్ కోతలు, ఆకలి చావులు ఇప్పుడు లేవన్నారు. రాష్ట్ర పునఃనిర్మాణ బాధ్యతను సీఎం కేసీఆర్ తన భుజాలపై వేసుకున్నారన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభం కావడం గమనార్హం. ► బీజేపీ నుంచి గెలిచిన తర్వాత తొలిసారి అసెంబ్లీకి వస్తున్న ఈటల రాజేందర్.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ► తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యేలు నల్లకండువాలతో నిరసన వ్యక్తం చేశారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసన సభలో మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్ అనంతరం తెలంగాణ బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగంతో పాటు నిరుద్యోగ సమస్య, ధాన్యం కొనుగోలు, డబుల్ బెడ్రూమ్ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని విపక్షాలు పేర్కొన్నాయి. -
రాజ్‌భవన్‌కు కాషాయం రంగు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌కు కాషాయం రంగు పులుముతూ రాజకీయాలను అంటగడుతోందంటూ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు బీజేపీపై మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని బీజేపీయే నగ్నంగా బయటపెడుతోందని దుయ్యబట్టారు. ఆయన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గవర్నర్‌ను అవమానిస్తోంది బీజేపీనే. గవర్నర్‌కు ఏదైనా క్లారిఫికేషన్ అవసరమైతే సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, అసెంబ్లీ కార్యాలయంతో మాట్లాడతారు. రాజ్‌భవన్‌కు రాజకీయాలు అంటగట్టి గవర్నర్ వ్యవస్థను దిగజారుస్తూ అవమానిస్తున్న బీజేపీపై కేసులు నమోదు చేయాలి. ఈ నెల 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని స్పీకర్ నోటిఫై చేశారు. శాసనసభకు ఇమ్యూన్ పవర్ ఉంటుంది, అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవు అనే అవగాహన కూడా బీజేపీ నేతలకు లేదు. ఈఎస్ఎల్ నరసింహన్‌తోపాటు ప్రస్తుత గవర్నర్ తమిళిసై సహా ఎవరు గవర్నర్‌గా ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవిస్తూ, అనేక అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదని నిపుణులు చెప్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్ కానందునే బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేదనే విషయాన్ని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలుసుకోవాలి’ అని హరీశ్‌రావు చెప్పారు. వెలగని దీపం బీజేపీ గవర్నర్ మహిళ అయినందునే బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించడం లేదంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను హరీశ్‌రావు కొట్టిపారేశారు. గతంలో మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన వెంటనే గుజరాత్ గవర్నర్ కమలా బేణివాల్‌ను డిస్మిస్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని అక్కడి గవర్నర్ ఎందుకు అవమానిస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో తమ పార్టీకి బలం లేకున్నా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అధికారం కోసం బీజేపీ గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు శాంతి, సామరస్యం, అభివృద్ధితోపాటు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ దేశానికి వెలుగు చూపే కాగడా అయితే బీజేపీ మాత్రం తెలంగాణలో ఎన్నడూ వెలగని దీపమని అన్నారు. అది రాజ్యాంగంలో లేదు: మంత్రి వేముల తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు హుందాగా జరుగుతున్నా బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గత సమావేశాలు ప్రొరోగ్ కాకుండా గవర్నర్‌ను ఆహ్వానిస్తే తప్పుచేసినట్లు అవుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి్దని గవర్నర్ ప్రసంగం ద్వారా తెలియచేయాలని తమకూ ఉంటుందని, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం సాంకేతికపరమైన అంశం మాత్రమేనన్నారు. శాసనసభ ప్రొరోగ్ కాకపోవడంతో 1971, 2013, 2019లోనూ ఇదే రీతిలో సమావేశాలు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. 2004లో పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం కూడా రాష్ట్రపతి ప్రసంగం లేకుండానే జరిగిందని, దీనిపై రాందాస్ అథవాలే సుప్రీంకోర్టుకు వెళ్లినా కొట్టేసిందన్నారు. బీజేపీ రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని, ఆ పార్టీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. సమా వేశంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
నదిలేని చోటుకు... ‘సాగరమే’ వచ్చింది!
సాక్షి, సిద్దిపేట: సాధారణంగా నదికి అనుసంధానంగా జలాశయాలు నిర్మిస్తారని, కానీ నది లేనిచోట దేశంలోనే అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్‌ను నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను బుధవారం సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ సందర్బంగా మంగళవారం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మల్లన్నసాగర్ ద్వారా తెలంగాణలోని ఏ ప్రాంతానికైనా నీటిని తీసుకెళ్లవచ్చని, రానున్న 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని తానే ఇంజనీర్‌గా సీఎం ఈ రిజర్వాయర్ రూపకల్పన చేశారని చెప్పారు. తక్కువ ముంపుతో మల్లన్నసాగర్ జలాశయం నిర్మాణం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిర్వాసితులకు గజ్వేల్ పట్టణం సమీపంలో ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణం చేసి ఇళ్లను అందించామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని, కానీ బీజేపీ నేతలు మాత్రం మతాల మధ్య చిచ్చుపెట్టి రక్తాన్ని పారించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చేతనైతే తెలంగాణకు రావాల్సిన హక్కులపై ఢిల్లీలో బీజేపీ నాయకులు నిలదీయాలని హితవు పలికారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డిలకు దమ్ముంటే తెలంగాణలోని ప్రాజెక్టులకు జాతీయ హోదాను తీసుకురావాలని హరీశ్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అతిపెద్ద జలాశయం మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. బుధవారం సీఎం కేసీఆర్ తుక్కాపూర్ వేదికగా ప్రారంభించి దీనిని జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే నీటి నిల్వ సామర్థ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు సీఎం చేతుల మీదుగా నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన ఇలా.. ► హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ తుక్కాపూర్‌కు చేరుకుంటారు. ► సొరంగ మార్గం ద్వారా భూగర్భంలో ఏర్పాటు చేసిన పంప్‌హౌస్ వద్దకు వెళ్లి మోటార్లను ఆన్ చేస్తారు. ► అనంతరం జలాశయంలో గోదావరి జలాలకు శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. ► తర్వాత జిల్లాకు చెందిన నాలుగు వేల మంది ప్రజా ప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశమవుతారు. -
నిలోఫర్‌ను 1,800 పడకల ఆస్పత్రిగా మారుస్తాం: మంత్రి హరీశ్
నాంపల్లి (హైదరాబాద్): ఆరోగ్యరంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శమని ఆర్థిక, వైద్య శాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్లో దేశ సగటు కన్నా ముందంజ లో ఉన్నామని చెప్పారు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది అందించిన సేవలు విశేషమని అభినందించారు. నిలోఫర్‌ను 1,800 పడకల ఆస్పత్రిగా మారుస్తామని హామీఇచ్చారు. శనివారం నిలోఫర్ ఆస్పత్రిలో వంద పడకల ఐసీయూ వార్డును ప్రారంభించిన అనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్టైనర్ సంయుక్తంగా కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.18 కోట్లు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎలాంటి పరికరాలున్నాయో సీఎం కూడా అవే పరికరాలను అందజేసినట్లు హరీశ్ తెలిపారు. ‘హైదరాబాద్ నలువైపులా నాలుగు మెడికల్ టవర్స్ తెచ్చి కార్పొరేట్ వైద్యం అందించాలని సీఎం నిర్ణయించారు. మెడికల్ కాలేజీల సంఖ్య కూడా పెంచుతాం. రాష్ట్రం ఏర్పడిన అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్యను 5 నుంచి 21కి పెంచాం’అని వివరించారు. కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేం దుకు రాష్ట్రప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని, ఇందుకు రూ.133 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. చిన్న పిల్లల కోసం 5 వేల పడకలు సిద్ధం చేశామని హరీశ్ పేర్కొన్నారు. -
100% టీకాలే లక్ష్యం: మంత్రి హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ నూరు శాతం జరిగేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామా లు, మండలాలవారీగా లక్ష్యాలను ఖరారు చేసి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నా రు. ఆర్థికమంత్రి హరీశ్ తాజాగా వైద్య, ఆరోగ్య శాఖ అదనపు బాధ్యతలను చేపట్టిన నేపథ్యంలో శనివారం బీఆర్కేఆర్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వాక్సినేషన్‌తోపాటు కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, ఆరోగ్యశ్రీ కింద అందుతున్న సేవల తీరుతెన్నులను అడిగి తెలుసుకొని జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్వోలు, డీసీహెచ్లకు పలు ఆదేశాలిచ్చారు. ఇతర శాఖల సహకారం తీసుకోండి... వాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖతోపాటు ఇతర శాఖల సహకారాన్ని తీసుకోవాలని హరీశ్ ఉన్నతాధికారులకు సూచించారు. ప్రతి వారం వ్యాక్సినేషన్లో సాధించిన లక్ష్యాలను సమీక్షించాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. రాష్టంలో 18 ఏళ్లు దాటిన వారు 2.77 కోట్ల మంది ఉండగా 2.35 కోట్ల మందికి మొదటి, 1.08 కోట్లమందికి రెండు డోసులు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. మరో 18.66 లక్షలమంది రెండో డోస్ వేసుకొనేందుకు కేంద్రాలకు రావాల్సి ఉందన్నారు. డిసెంబర్‌లోగా కొత్త వైద్య కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 8 వైద్య కళాశాలల భవనాలను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని కలెక్టర్లను హరీశ్ ఆదేశిం చారు. కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల పడకల సామర్థ్యాలను పెంచాలని, విద్యార్థుల వసతికి అనువైన హాస్టల్ భవనాలను గుర్తించాలన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలికవసతుల కల్పన, ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆసుపత్రుల తనిఖీలు.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 946 రకాల వైద్య సేవలు అందిస్తుండగా, కేంద్ర పథకమైన ఆయుష్మాన్ భారత్ కింద 646 రకాల వైద్య సేవలను చేర్చినట్లు మంత్రి హరీశ్ తెలిపారు. వైద్యానికి మరో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాల సేవలను ప్రజలకు విస్తృతంగా అందించాలన్నారు. ఇకపై పీహెచ్సీ మొదలు మెడికల్ కాలేజీ వరకు అన్నిం టినీ తనిఖీ చేస్తామని, ఆశా వర్కర్ నుంచి హాస్పిటల్ సూపరింటెండెంట్ వరకు అందరి పనితీరు ఆధారంగా పోస్టింగ్‌లు, ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీపీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి, ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు. -
కాంపిటేటివ్ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు గుడ్‌న్యూస్!
దేశవ్యాప్తంగా అన్ని పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధుల కోసం IIT-IIM ALUMNI సహకారంతో 'కాల్కస్ ఇండియా' యాప్‌ను రూపొందించిన కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ వారు, ఆ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా "వన్ పాస్.. ఆల్ఎగ్జాంస్" అనే పరిమిత కాలపు అఫర్ ద్వారా 'calcusindia' అనే కూపన్ ను ప్రకటించారు. ఈ కూపన్ ను తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ టి హరీష్ రావు గారు ఈ రోజు విడుదల చేశారు. ఈ ఆఫర్ వినియోగించుకోదలచిన వారు పేమెంట్ చేసేటప్పుడు 'calcusindia' అనే కూపన్ ను అప్లై చేయటం ద్వారా ఈ 99 రూపాయల ఆఫర్ ను పొందగలుగుతారు. ఈ ప్రీమియం ప్యాకేజీ ఆఫర్ తీసుకోవటం ద్వారా విద్యార్ధులు యాప్ లో ఉన్న పాఠశాల స్థాయి నుంచి సీవిల్ ఎంట్రన్స్ వరకు మొత్తం 1354 కాటగిరీల నుంచి 46000కు పైగా టెస్టులను 6 నెలల పాటు పూర్తి ఉచితంగా సాధన చేయవచ్చు. నాణ్యమైన విద్యను పేద, మద్య తరగతివర్గాల వారికి కూడా అందుబాటులో ఉండేలా ఈ ఆఫర్ ప్రకటించిన సంస్థ ఫౌండర్ వాణీకుమారిని మంత్రి హరీష్ రావు అభినందించారు. అందరికీ విద్య.. అందుబాటు ధరలో పలురకాల కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్ధులకు అన్ని రకాల పరీక్షలను అతితక్కువ ధరలో ఒకేచోట ప్రాక్టీస్ చేసుకునే సదుపాయం కల్పించాలనే సదుద్దేశ్యంతో ఈ విధమైన ఆఫర్ ప్రకటించిన భారత దేశపు ఏకైక సంస్థ కాల్కస్ఇండియా. గూగుల్ ప్లే స్టోర్ నుంచి "కాల్కస్ ఇండియా" యాప్ ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకున్న వారు కొన్ని ఉచిత పరీక్షలను ప్రాక్టీస్ చేసి నచ్చిన వారు ప్రీమియం ప్యాకేజీకి సభ్యత్వం చేసుకోవచ్చును. మరిన్ని వివరాలకు calcusindia.com పోర్టల్ ను సందర్శించవచ్చు. -
అధైర్యపడకండి.. అండగా ఉంటా
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): కష్టాల్లో ఉన్న పేద కుటుంబానికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అండగా నిలిచారు. ‘శ్మశానమే ఆవాసం’శీర్షికతో శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి చలించిన మంత్రి వెంటనే స్పందించారు. సిద్దిపేటలో కరోనా కారణంగా ఇంటి పెద్ద శ్రీనివాస్ (51)ను కోల్పోయి అద్దె ఇంటి యజమాని వెళ్లగొట్టడంతో గూడు లేక శ్మశాన వాటికలో నివాసం ఉంటున్న పేద కుటుంబానికి బాసటగా నిలిచారు. మృతుడి భార్య సుజాత, కుమారుడు రుషిత్ (16), కూతురు దక్షిత (13) వద్దకు అర్బన్ తహసీల్దార్ విజయ్, కౌన్సిలర్ దీప్తి నాగరాజులను పంపించారు. ఫోన్లో బాధితులతో మాట్లాడి అధైర్యపడొద్దని.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాధితుల వివరాలను తెలుసుకుని శాశ్వత నివాసం కోసం నర్సాపూర్ శివారులోని డబుల్ బెడ్రూం ఇళ్లలో ఒక ఇంటిని తక్షణ సాయం కింద కేటాయించారు. మరోవైపు మంత్రి ఆదేశాల మేరకు తహసీల్దార్ విజయ్, బాధిత కుటుంబానికి శనివారం సాయం త్రం భోజన ఏర్పాట్లు చేసి నిత్యావసర సరుకులను అందించారు. అంతేకాక అవసరాలకోసం రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు. అనంతరం తహసీల్దార్ విజయ్ బాధిత కుటుంబాన్ని డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్దకు తీసుకెళ్లారు. మంత్రి ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరాం ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూం ఇంటికి సంబంధించిన తాళాలను వారికి అప్పగించారు. తమకు భోజనం పెట్టి, ఆర్థిక సహాయం చేయడం తో పాటు నిలువ నీడ కోసం డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చి అండగా నిలిచిన మంత్రి హరీశ్‌రావుకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబం పేర్కొంది. -
Telangana: ఆర్టీసీ సిబ్బందికీ వ్యాక్సినేషన్..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారికి శనివారం టీకాల పంపిణీ ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్స్‌గా ఉన్నవారికి యుద్ధ ప్రాతిపదికన కోవిడ్ టీకాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆయా రంగాలను గుర్తించి క్రవారం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కానీ ఈ జాబితాలో ఆర్టీసీని చేర్చకపోవటంతో, శుక్రవారం వివిధ టీకా కేంద్రాలకు వెళ్లిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను అనుమతించలేదు. తక్కువ మంది ప్రయాణికులను తరలించే ఆటో డ్రైవర్లను గుర్తించి, ఎక్కువ మంది ప్రయాణికుల మధ్య ప్రమాదకరంగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను గుర్తించకపోవటాన్ని ప్రస్తావిస్తూ శనివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ‘ఆటో డ్రైవర్లకిచ్చే.. ఆర్టీసీ డ్రైవర్లను మరిచే’శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. వెంటనే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కూడా టీకాలు వేయాలని, మూడు రోజుల్లో వారందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు చకచకా ఏర్పాట్లు చేసి, శనివారం మధ్యాహ్నం నుంచి టీకాల పంపిణీ ప్రారంభించారు. మొదటి రోజు ఒక్క హైదరాబాద్‌లోనే పంపిణీ చేయగా, ఆదివారం నుంచి జిల్లాల్లో కూడా ప్రారంభిస్తున్నారు. మొదటి రోజు 2,600 మందికి నగరంలోని 15 కేంద్రాల్లో టీకాలు పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నగరాల్లో, ఉదయం 8 గంటల నుంచి ఒంటి గంట వరకు జిల్లాల్లో టీకాల పంపిణీ ఉంటుందని సమాచారం. మంత్రి హరీశ్‌రావు వెంటనే స్పందించి టీకాల పంపిణీ ప్రారంభించినందుకు కార్మిక సంఘాల నేతలు రాజిరెడ్డి, తిరుపతి, కమాల్‌రెడ్డి, నరేందర్, హన్మంతు, శ్రీనివాసరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల కుటుంబసభ్యులకు కూడా టీకాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
Telangana: సూపర్ స్ప్రెడర్లకు 28 నుంచి టీకాలు
సాక్షి, హైదరాబాద్: వృత్తి, వ్యాపారాల రీత్యా నిత్యం ప్రజల మధ్య ఉంటూ కోవిడ్ వ్యాప్తికి కారణమవుతున్న వారిని సూపర్స్ప్రెడర్లుగా పరిగణిస్తూ వారందరికీ టీకాలు వేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. కోవిడ్ నియంత్రణ, లాక్డౌన్ అమలు తీరుపై సోమవారం సమీక్ష సందర్భంగా సూపర్ స్ప్రెడర్స్‌కు వ్యాక్సిన్ అంశాన్ని పరిశీలించాలని హరీశ్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యం లో మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో హరీశ్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమావేశమై సూపర్ స్ప్రెడర్ల గుర్తింపు, ఇతర ఏర్పాట్లపై చర్చించారు. ప్రస్తుతమున్న వ్యాక్సిన్ నిల్వల ఆధారంగా.. ఈ నెల 28న హైదరాబాద్‌లోని ఆటోడ్రైవర్లతో వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సూపర్స్ప్రె డర్స్ దాదాపు 30 లక్షల మంది వరకు ఉంటారని అంచనా వేశారు. వీరిలో 18 ఏళ్లు నిండిన వారం దరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని నిర్ణయిం చారు. రాష్ట్రంలో లాక్డౌన్ ఉన్నా నిత్యావసరాల కోసం 4 గంటలపాటు వెసులుబాటు కల్పించారు. ఈ సమయంలో ప్రజానీకం విపరీతంగా చేపలు, మాంసం, కిరాణా దుకాణాలకు వెళ్తుండటంతో కరోనా సోకుతోంది. అక్కడ పనిచేసే సిబ్బంది, వ్యాపారుల్లో ఏమాత్రం లక్షణాలున్నా.. అది వచ్చే ప్రజలకు సులభంగా అంటుకునే అవకాశం ఉంది. దీంతో ముందుగా ఈ సూపర్ స్ప్రెడర్స్‌కు టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావే శంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్య దర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, పురపాలక శాఖ కమిషనర్ ఎన్.సత్యనారాయణ, రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు, ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. డీలర్లు, గుమాస్తాలు, పెట్రోలి యం, ఎల్పీజీ డీలర్లు, సిబ్బందికి కోవిడ్ టీకాలు వేసేందుకు ఈ నెల 28 నుంచి 31 వరకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు పౌరసరఫ రాల శాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్లకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిం చాలన్నారు. ఇందుకు ముందుగానే లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. సూపర్ స్ప్రెడర్స్ అంటే.. వృత్తి, వ్యాపారాల రీత్యా ప్రజల మధ్య ఉంటూ కోవిడ్ వ్యాప్తికి కార ణమవుతారని భావిస్తున్న వారిని సూపర్ స్ప్రెడర్లుగా పరిగణిస్తారు. సూపర్ స్ప్రెడర్స్ వీరే... ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సిబ్బంది, రేషన్ డీలర్లు, పెట్రోల్ పంపుల సిబ్బంది, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లలోని విక్రేతలు, పండ్లు, కూరగాయలు, పూల మార్కెట్లు, కిరాణా షాపులు, మద్యం దుకాణాలు, మాంసాహార మార్కెట్ల వ్యాపారులు, సెలూన్లలో పనిచేసే సిబ్బంది. 30,00,000 రాష్ట్రవ్యాప్తంగా ఈ సూపర్ స్ప్రెడర్స్ దాదాపు 30 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. వీరందరికీ ఉచితంగానే టీకాలు వేయనున్నారు. -
టీఆర్ఎస్ కేడర్ కట్టడికి కమిటీ.. రంగంలోకి మంత్రి హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఏకాకిని చేయడం లక్ష్యంగా సాగుతున్న పరిణామాల్లో మరింత వేడి పెరిగింది. ఇప్పటికే ఈటల అనుకూల, ప్రతికూల వర్గాలుగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో కేడర్ చీలిపోయింది. ప్రతికూల వర్గం నేతలు తాము పార్టీ వెంటే ఉంటామని ప్రకటనలు చేస్తుండగా, అనుకూల నేతలు ఈటల రాజేందర్ వెంట నడుస్తామని తేల్చి చెబుతున్నారు. మంగళవారం నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గంలో మకాం వేయాలని ఈటల నిర్ణయించారు. దీంతో రాజకీయ విమర్శలు ఊపందుకోవడంతో పాటు, అనుకూల ప్రతికూల వర్గాల నడుమ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పార్టీ కేడర్‌పై పట్టు సాధించేందుకు అటు టీఆర్ఎస్, ఇటు ఈటల పావులు కదుపుతుండటంతో హుజూరాబాద్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కేడర్‌పై పట్టు కోసం కమిటీ ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్ నియోజకవర్గ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి టీఆర్ఎస్ కేడర్‌పై పట్టు బిగిస్తున్నారు. దీంతో ఈటల, గంగుల పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటుండటంతో కరీంనగర్ జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి ఈటల రాజీనామా చేసినా కేడర్ చెక్కు చెదరకుండా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయిలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, కరీంనగర్ జిల్లా స్థాయిలో గంగుల కమలాకర్.. పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయనున్నారు. వీరితో పాటు క్షేత్ర స్థాయిలో మరో నలుగురు ముఖ్య నేతలకు కూడా హుజూరాబాద్ బాధ్యతలు అప్పగించారు. క్షేత్ర స్థాయి కేడర్‌తో మంతనాలు.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, మండలాలకు నలుగురు ముఖ్య నేతలను ఇన్చార్జిలుగా నియమించారు. హుజూరాబాద్‌లో కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, ఇల్లంతకుంట, జమ్మికుంట మండలాల్లో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఇన్‌చార్జీలుగా పనిచేస్తారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు వీణవంక, కిమ్స్ రవీందర్‌రావుకు కమలాపూర్ మండల బాధ్యతలు అప్పగించారు. తమకు అప్పగించిన మండలాలు, మున్సిపాలిటీల్లో పార్టీ కేడర్‌తో పాటు, స్థానిక సంస్థల ప్రతినిధులు, సర్పంచ్‌లు పార్టీ వెంట నడిచేలా వీరు చూడాల్సి ఉంటుంది. గంగుల, ఈటల నడుమ మాటల యుద్ధం ఇటీవలి వరకు మంత్రివర్గంలో సహచరులుగా ఉన్న గంగుల కమలాకర్, ఈటల రాజేందర్ నడుమ మాటల యుద్ధం ముదురుతోంది. ఈటల హైదరాబాద్‌లో ఓసీ.. హుజూరాబాద్‌లో బీసీ అని విమర్శిస్తూ.. ఆయన భూ కబ్జాలు చేశారంటూ గంగుల ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ వ్యాపారంలో అక్రమాలపై గంగులను ఉద్దేశించి ఈటల మంగళవారం విమర్శలు గుప్పించారు. మరోవైపు ఒకరినొకరు తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
అస్తమించిన పోరుబిడ్డ
సాక్షి, సిద్దిపేట/దుబ్బాక/దుబ్బాక టౌన్: మా లింగన్న అని ఆప్యాయంగా పిలుచుకునే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక శాసన సభ్యులు సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ వార్త ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు రాష్ట్ర నలుమూలల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నాయకులు, లింగన్న అభిమానులు చిట్టాపూర్ చేరుకున్నారు. ఉద యాన్నే హైదరాబాద్ నుంచి చిట్టాపూర్‌కు పార్థివదే హాన్ని తీసుకవచ్చి అభిమానుల కడ సారి చూపు కోసం ఉంచారు. అప్పటికే కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవీస్లు కోవిడ్ నేపథ్యంలో ఎవ్వరూ ఇబ్బందులకు పడకుండా ఏర్పాట్లు చేశారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు తమ ప్రియతమ నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి మరణించాడనే వార్త వినగానే ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఒక వైపు కోవిడ్ భయం ఉన్నప్పటికీ వేలాది మంది చిట్టాపూర్ చేరుకొని తమ నాయకుడిని కడసారిగా చూసి నివాళి అర్పించారు. ఉదయం7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఇంటి వద్దనే ఉంచిన పోలిపేట మృతదేహానికి తర్వాత కూడవెల్లి వాగు సమీపంలోని ఆయన సొంత భూమిలో దహన సంస్కారాలు నిర్వహించారు. అంతిమయాత్రలో ప్రముఖులు అంతిమయాత్రలో కొద్ది దూరం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిలు ముందు పాడె మోయగా.. వెనక బంధువులు పాడెను పట్టారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై పార్థివదేహాన్ని ఉంచి ఊరేగింపుగా తరలించారు. ఇలా చిట్టాపూర్ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన సోలిపేట అంతిమ యాత్ర సిద్దిపేట – మెదక్ ప్రధాన రహదారి మీదుగా.. కూడవెల్లి వాగు సమీపంలోని స్మృతీ వనానికి తరలించారు. అంతిమ సంస్కారాలు నిర్వహించిన కుమారుడు సోలిపేట అంతిమ సంస్కారాలు చిట్టాపూర్ గ్రామం కూడవల్లి వాగు సమీపంలో హిందూ ధర్మ సిద్ధాంతం ప్రకారం నిర్వహించారు. ఆయన కుమారుడు సతీష్‌రెడ్డి తలకొరివి పెట్టి చితికి నిప్పంటించారు. సోలిపేటకు ప్రముఖుల నివాళి సోలిపేట పార్థివదేహంపై సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. హాజరైన వారిలో రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కల్వకంట్ల తారక రామారావు, ఈటెల రాజేందర్, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్‌లు ఉన్నారు. అదేవిధంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి శుభాష్‌రెడ్డి, బోడెపూడి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పద్మాదేవేంద్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్, జోగురామన్న, పెద్ది సుదర్శన్‌రెడ్డి, హన్మంత్ షిండే, రాష్ట్ర సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిద్దిరెడ్డి, సీఎం ఓఎస్డి దేశపతి శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ వేలేటి రోజాశర్మ, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవీస్ హాజరై నివాళి అర్పించారు. అన్నీ తానై.. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రి హరీశ్‌రావు అన్నీ తానై దగ్గరుండి నడిపించారు. మంత్రి హరీశ్‌రావుకు మొదటి నుంచి ఎమ్మెల్యే రామలింగారెడ్డి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు మంత్రి హరీశ్‌రావు వెళ్లి ఆయన ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్నారు. గురువారం రామలింగారెడ్డి మరణించడంతో ఆయన మృతదేహం స్వగ్రామం చిట్టాపూర్ చేరుకోగానే ఉదయం 7 గంటలకే మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో వచ్చి రామలింగారెడ్డి పార్థివదేహాన్ని చూసి కంటతడిపెట్టారు. ఎమ్మెల్యే సతీమణి సుజాత, కుమారుడు సతీష్‌రెడ్డిని ఓదార్చారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్‌లకు అన్ని వివరించారు. అంత్యక్రియలకు స్వయంగా మంత్రి దగ్గరుండి కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో చర్చిస్తూ ఏర్పాట్లు చేయించారు. అంత్యక్రియల సందర్భంగా హరీశ్‌రావు పాడె మోసి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకంటూ కంట తడిపెట్టుకున్నారు. -
అంగన్వాడీ ఆయా మృతి.. హరీశ్‌రావు దిగ్భ్రాంతి
గజ్వేల్: తన జీవితంలో వెలుగొస్తుందని ఎదురు చూసిన ఆమె ఆశ.. ఆడియాసగానే మిగిలింది. చివరకు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఆపరేషన్‌లో కాళ్లు, చేతులు కోల్పోయి జీవచ్ఛవంలా మారిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్ పెరగడంతో తుదిశ్వాస విడిచింది. దౌల్తాబాద్ మండలం దొమ్మాటకు చెందిన అంగన్వాడీ ఆయా కళావతి విషాధాంతమిది. దౌల్తాబాద్ మండలం దొమ్మాటకు చెందిన అంగన్వాడీ ఆయా కరికె కళావతి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబరాల్లో అపశృతి చోటు చేసుకొని విద్యుత్‌షాక్‌తో తీవ్రగాయాల పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్న కళావతిని హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించగా.. సరైన వైద్యం అందించలేమని చేతులెత్తేయడంతో తిరిగి గజ్వేల్‌కు తీసుకొచ్చారు. 20 రోజులుగా ఆమె గజ్వేల్‌లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కళావతి దయనీయ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు ఈనెల 7న స్వయంగా ఆసుపత్రిని సందర్శించి కళావతి పరిస్థితిని పరిశీలించి చలించిపోయారు. తక్షణ సాయం కింద రూ. 50 వేలు అందించడమే గాకుండా ఆమెను కాపాడడానికి అవసరమైన శస్త్ర చికిత్సలు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేష్‌ను ఆదేశించారు. ఈ క్రమంలోనే కళావతి విద్యుత్‌షాక్‌కు గురైన చేతులు, కాళ్లలో రక్త ప్రసరణ అగిపోవడమే గాకుండా ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది. దీని వల్ల ప్రాణానికే ప్రమాదమని గుర్తించిన వైద్యులు ఈనెల 10న శస్త్ర చికిత్స చేశారు. ఈ సందర్భంగా మోకాళ్ల కింది వరకు రెండు కాళ్లను, మోచేతి కిందికి ఎడమ చేయిని, మోచితిపైకి కుడి చేయిని తొలగించారు. అయినా తన జీవితంలో వెలుగొస్తుందనే ఆశతో ఆమె ఎదురు చూస్తూ వచ్చింది. ఆపరేషన్ తర్వాత కూడా ఇన్ఫెక్షన్ తగ్గకపోవడంతో బుధవారం మధ్యాహ్నం 2:15 గంటల ప్రాంతంలో కళావతి తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ మహేష్ తెలిపారు. కాగా కళావతి విషాధ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతురాలు కుటుంబీకులకు సానుభూతిని ప్రకటించారు. ఇదిలా ఉంటే జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి రాంగోపాల్‌రెడ్డి అక్కడికి చేరుకొని మృతురాలి కుటుంబీకులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున రూ. 50 వేల సాయాన్ని అందజేశారు. కళావతి కుటుంబాన్ని ఆదుకుంటాం.. సిద్దిపేటజోన్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కళావతి బుధవారం మృతి చెందడం పట్ల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల ప్రగాడ సంతాపాన్ని తెలియచేస్తు కళావతి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అదుకుంటామని భరోసా ఇచ్చారు. గత 20 రోజులుగా ఇటిన్సీవ్ కేర్ యూనిట్లో శాస్ర చికిత్సలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ కళావతి మృతి చెందడం కలచివేసిందన్నారు. ఆమె కుటుంబానికి ఇన్స్‌రెన్స్ బీమాను అందించడంతో పాటు అండగా ఉంటామని సృష్టం చేశారు. -
మానవత్వం చాటుకున్న బాలవ్వ..
గజ్వేల్: కరోనా నేపథ్యంలో మన సంస్కృతి గొప్పదనం ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. మంగళవారం గజ్వేల్‌లోని ఐవోసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి వేద బ్రాహ్మణులకు నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ పూర్వకాలం నుంచి దేశంలో చేతులు జోడించి నమస్కారం చేసే పద్ధతి అమలులో ఉందని, అదే విధంగా ఆరోగ్య పరిరక్షణకు యోగాలో అనేక రకాలైన పద్ధతులు పూర్వకాలం నుంచి పాటిస్తూ వస్తున్నామని తెలిపారు. కరోనా మున్నెన్నడూ లేని పరిస్థితులను సృష్టించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాలు మూతపడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. వేద బ్రాహ్మణులకు అండగా నిలవాలనే సంకల్పంతో నిత్యావసరాల పంపిణీకి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వీపీజే ఫౌండేషన్, శ్రేయోభిలాషుల సహకారంతో జరిగిన కార్యక్రమంలో “గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ యాదవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ అమరావతి, జెడ్పీటీసీ సభ్యుడు మల్లేశం, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్‌చైర్మన్ జకియొద్దీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్ఎస్వీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, టీఆర్ఎస్ గజ్వేల్ మండలశాఖ అధ్యక్షుడు బెండ మధు, గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, “గడా’ ప్రత్యేక వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. దాతలు ముందుకు రావాలి : మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటజోన్: కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు దృష్ట్యా ప్రభుత్వానికి చేయూతగా దాతలు ముందుకు వస్తున్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని మంత్రి నివాసంలో తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్‌కు చెందిన ఎన్నారైలు పంపించిన చెక్కును స్థానిక కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్, ఏలూరి సతీష్‌లు రూ. లక్ష చెక్కును మంత్రికి అందించారు. కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు ప్రమోద్, అంతటిగౌడ్, ప్రదాన కార్యదర్శి రంగుల సుధాకర్‌గౌడ్, ఫౌండర్ గంప వేణుగోపాల్, ప్రనీత్రెడ్డి, రంగు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్‌కు మరో స్ప్రే యంత్రం... పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. మంగళవారం సిద్దిపేట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన రూ.12 లక్షల విలువైన స్ప్రే మిషన్‌ను ఆయన ప్రారంభించారు. పట్టణంలోని అన్ని విధులల్లో స్ప్రే మిషన్‌తో పారిశుధ్యం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సెన్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ సహాయ నిధికి విరాళాలు... కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రభుత్వానికి చేయూతగా నిలిచేందుకు టీహెచ్ఆర్ సేన చింతమడక గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని మంత్రి నివాసంలో రూ. 22,616లను మంత్రికి అందించారు. మానవత్వం చాటుకున్న మహిళ.. అలాగే చింతమడక గ్రామానికి చెందిన చాకలి బాలవ్వ అనే మహిళ తన రజక వృత్తి నిర్వహించగా వచ్చిన రూ.3వేలను ప్రభుత్వానికి అందించి చేయూతగా నిలిచింది. కరోనా కట్టడి ప్రజల సహకారంతోనే సాధ్యం కొండపాక(గజ్వేల్): కరోనా వైరస్ కట్టడి ప్రజల సహకారంతోనే సాధ్యపడుతుందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మండల పరిదిలోని వెలికట్ట గ్రామ శివారులో ఉన్న బాలాజీ జిన్నింగ్ మిల్లులో పని చేస్తున్న 200 మంది వలస కూలీలకు, గ్రామ ఆటో డ్రైవర్లకు అమరనాథ్ నిత్యాన్నధాన సేవా సమితీ ఆధ్వర్యంలోమంగళవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నందిని శ్రీనివాస్, రైతు బంధు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్, మండల కన్వీనర్ రాగల్ల దుర్గయ్య, అమరనాథ్ సేవా సమితి ప్రతినిధులు చీకోటి మధుసూదన్, కాశీనాథ్, నందిని శ్రీనివాస్, అయిత కరుణాకర్, అనిల్, శ్రీనివాస్, భాస్కర్, వెంకటేశం, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. -
పరిమితికి లోబడే అప్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అప్పులు కేంద్ర నిబంధనల పరిమితికి లోబడే ఉన్నాయని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడే రాష్ట్రం అప్పులు చేసిందని, ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి ఇటీవల పార్లమెంట్లో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారని తెలిపారు. రాష్ట్ర జీఎస్డీపీని దృష్టిలో పెట్టుకుంటే 25 శాతం వరకు అప్పులు తీసుకునే అవకాశమున్నా, రాష్ట్రం మాత్రం 21.3 శాతమే అప్పులు చేసిందన్నారు. దేశంలో 24 రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎంకు మించి అప్పులు చేశాయని, అప్పుల్లో రాష్ట్రం దిగువ నుంచి ఆరో స్థానంలో ఉందని వెల్లడించారు. శుక్రవారం శాసన మండలిలో బడ్జెట్‌పై చర్చకు హరీశ్ సమాధానమిచ్చారు. బడ్జెట్ ప్రజలకు ఆశాజనకంగా ఉంటే, ప్రతిపక్షాలకు మాత్రం నిరాశాజనకంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అంతర్గత వనరులను పెంపొందించుకుంటూ, దుబారాను తగ్గిస్తామన్నారు. ముఖ్యంగా ఇసుక అమ్మకాలు, దిల్ భూములు, హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహాలను అమ్మడం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటామన్నారు. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలి: టి.జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఉద్యోగులకు పీఆర్సీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో తక్షణమే 27 శాతం ఐఆర్ ప్రకటించాలి. కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీల్లో కొత్త రేషన్ దుకాణాలను మంజూరు చేయాలి. రూ.50 వేల రుణా లు తీసుకున్న రైతులకు రెండు విడతలుగా రుణమాఫీ చేయాలి. రేషన్ ద్వారా చక్కెర, పామాయిల్ పంపిణీ చేయాలి’అని కోరారు. ఉపాధ్యాయుల అరెస్ట్‌లకు నిరసనగా నర్సిరెడ్డి వాకౌట్.. అనంతరం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల పీఆర్సీ ప్రకటించకపోవడం విచారకరమన్నారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఉపాధ్యాయుల అరెస్ట్‌లపై మంత్రి ప్రకటన చేయాలని కోరారు. ప్రకటన చేయనందుకు నిరసనగా ఆయన మండలి నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు సైతం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలని కోరారు. రూ.9,033 కోట్లు రావాలి... కేంద్రం నుంచి కోతలే తప్ప వచ్చిన నిధులేమీ లేవని, ఫిబ్రవరి నెలకు సంబంధించి జీఎస్టీ బకాయిలు రూ.9,033 కోట్లు రావాలని, 14వ ఆర్థిక సంఘం నిధులు సైతం రూ.395 కోట్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 1.50 లక్షల ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చామని, ఇందులో 1.23 లక్షలను భర్తీ చేశామని, ఇవన్నీ రెగ్యులర్ ఉద్యోగాలేనని స్పష్టం చేశారు. మరో 27వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఉద్యోగులకు పీఆర్సీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. మండల, జిల్లా పరిషత్‌లకు సైతం గ్రామపంచాయతీల తరహాలో నిధులు కేటాయిస్తామన్నారు. ఇప్పటికే నిర్మాణం మొదలు పెట్టిన 2.72 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తూనే కొత్తగా మరో లక్ష ఇళ్లను లబ్ధిదారుల సొంత స్థలాల్లో కట్టించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. -
ఇంటింటికీ వెళ్లి.. తలుపు తట్టిన మంత్రి
సాక్షి, సిద్దిపేట : ఇంటింటికీ వెళ్లి తడి,పొడి చెత్త విభజనపై ఆరా తీస్తూ, మున్సిపల్ ఉద్దేశ్యాన్ని, లక్ష్యాన్ని వివరిస్తూ బల్దియాకు సహకరించాలని సూచిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం రెండో రోజు సిద్దిపేటలో పారిశుధ్య సిబ్బంది తరహాలో ప్రజల్లో చైతన్యం కోసం కృషి చేశారు. స్థానిక 1వ వార్డులోని బారాయిమామ్, ఎల్లమ్మ దేవాలయం, రాంనగర్, తదితర ప్రాంతాల్లో సుమారు రెండు గంటలపాటు మార్నింగ్ వాక్ చేపట్టారు. కొన్ని చోట్ల నివాసగృహాల తలుపులు మూసి ఉండడంతో తలుపు కొట్టి మరీ ఇంటి యజమానులకు అవగాహన కల్పించారు. వార్డులో పర్యటిస్తున్న క్రమంలో మహిళలతో ఇంటింటి చెత్త సేకరణ ప్రక్రియ, మున్సిపల్ సిబ్బంది పనితీరు, పారిశుధ్య వాహనాల వేళలు గురించి ఆరా తీశారు. కొన్ని చోట్ల మురుగు కాలువల్లో చెత్త చెదారం, ఖాళీ బహిరంగా ప్రదేశాల్లో సమీప నివాసగృహాల చెత్త కుప్పలను చూసిన మంత్రి సంబంధిత గృహాల మహిళలను పిలిచి స్వచ్ఛతపై అవగాహన కల్పించడంతో పాటు మన ఆరోగ్యంతో పాటు కాలనీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని సున్నితంగా సూచించారు. పలుచోట్ల కాలనీ ప్రజలు పలు సమస్యలను మంత్రి దృష్టి తీసుకురాగా వెంటనే ఉన్న చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిలకు సిఫారస్ చేసి పరిష్కారించాలని ఆదేశించారు. రాంనగర్ చౌరస్తా నుంచి ఎల్లమ్మ దేవాలయం వరకు హరీశ్‌రావు కాలినడకన వార్డు బాట çపట్టారు. మార్గ మధ్యలో మురికి కాలువలను పరిశీలించారు. విద్యుత్ తీగలను సరి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఖాళీ స్థలాలను శుభ్రం చేయాలని సంబంధిత çస్థలాల యాజమానులకు సూచించారు. జకీర్... గజ్వేల్‌లో కూడా చేయాలి.. సిద్దిపేటలో వారంలో ఐదు రోజులు తడి, రెండు రోజలు పొడి చెత్తను సేకరిస్తున్నాం. ముందుగా ప్రజలకు తడి పొడి చెత్త వేరు చేసే విధానాన్ని వివరిస్తున్నాం. నేను, మా కౌన్సిలర్లు, అధికారులు గల్లీలో ఇళ్లు ఇళ్లు తిరిగి చెప్పుతున్నాం. మీరు కూడా గజ్వేల్‌లో ఇదే తరహాలో వార్డులో తిరగండి. ప్రజలను చైతన్యం చేయండి. స్వచ్ఛ గజ్వేల్ సాధనకు కృíషి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో గజ్వేల్ మున్సిపల్ పాలకవర్గానికి సూచించారు. 1 వార్డులో పర్యటిస్తున్న క్రమంలో కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీర్‌తో పాటు కౌన్సిలర్లు వచ్చారు. వారికి కొంత దూరం వరకు తనవెంట పర్యటనలో తీసుకెళ్లి తడి పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని చూపించారు. పారిశుధ్య సిబ్బంది తరహాలో క్లాస్... స్థానిక 1వ వార్డులోని పలు కాలనీల్లోని ప్రజలు పారిశుధ్య వాహనానికి చెత్తను అందించడానికి రావడం, వాహనం వెంటే ఉన్న మంత్రి హరీశ్‌రావు మహిళల వద్ద నుంచి చెత్త డబ్బాలను తీసుకుని పరిశీలించారు. మున్సిపల్ ఆదేశాలకు అనుగుణంగా వారంలో ఐదు రోజులు తడి చెత్త సేకరణ నేపథ్యంలో మంగళవారం మంత్రి పర్యటన సందర్భంగా మహిళలు తెచ్చిన తడి చెత్తను క్షుణ్ణంగా పరిశీలించారు. కొందరు మహిళలు తెచి్చన చెత్త బుట్టల్లో ప్లాస్టిక్ కవర్లు ఇతరాత్ర ఉండడం పట్ల వాటిని స్వయంగా మంత్రి హరీశ్‌రావు చేతికి గ్లౌజ్ ధరించి దగ్గరుండి వేరు చేసి చూపించారు. ప్రతి రోజూ తడి చెత్తను మాత్రమే ఇవ్వాలని మహిళలకు హితవు పలికారు. ఆయన రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, వెంట అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరాం, కౌన్సిలర్లు బర్ల మల్లిఖార్జున్, స్వప్న బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
బెంగళూరు తరహాలో ప్లాంట్
సాక్షి, సిద్దిపేట: పట్టణాల్లో పెరుగుతోన్న చెత్త సమస్యను తీర్చేందుకు బెంగళూరు తరహాలో సేంద్రియ ఎరువుల తయారీ ప్లాంట్లను సిద్దిపేటలో ఏర్పాటు చేయనున్నారు. వ్యర్థం.. వేరుచేసి చూస్తే పర మార్థం ఉంటుందనే ఆలోచనతో సిద్దిపేట ఎమ్మెల్యే, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ వినూ త్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛ పట్టణాలుగా రూపొందిన బెంగళూరు, పుణే వంటి పట్టణాలకు సిద్దిపేట వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులను పంపించి ఆయా ప్రాంతాల్లో ఉన్న విధానాన్ని ఇక్కడ అమ లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వచ్ఛ సిద్దిపేట చేయాల నే ఆలోచనతో మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో బెంగళూరు తరహాలో సేంద్రియ ఎరువుల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు ముందస్తుగా తడి, పొడి చెత్తను వేరు చేసే విధానంపై నాలుగు రోజులుగా హెచ్ఎస్ఆర్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శాంతితో కలసి ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. తడి, పొడి చెత్తలు వేరు చేసేందుకు డబ్బాలు పంపిణీ చేశారు. బెంగళూరు తరహాలో ప్లాంట్స్ బెంగళూరు వంటి పట్టణాల్లో పారిశుధ్య సమస్యను పరిష్కరించిన హెచ్ఎస్ఆర్ సామాజిక సేవా సంస్థ పనితీరును సిద్దిపేట జిల్లాలో అమలు చేయనున్నారు. బెంగళూరులోని హుజూర్ సర్జాపూర్ రోడ్డులోని 1.50 లక్షల మంది జనాభా ఉన్న కాలనీలో ఈ విధానంలో ఎక్కడి చెత్తను అక్కడే.. ఆయా కాలనీల్లోనే సేంద్రియ ఎరువులుగా మార్చడంలో హెచ్ఎస్ఆర్ సంస్థ సఫలీకృతమైంది. అలా తయారు చేసిన ఎరువును స్థానికంగా ఇళ్లలో, రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు వేస్తారు. పొడిచెత్తను రీసైక్లింగ్‌కు పంపిస్తారు. పరిశుభ్రమైన సిద్దిపేట లక్ష్యం ప్రజల్లో అవగాహన లేక తడి, పొడి చెత్తను విచ్చలవిడిగా పారేస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఇప్పటికే సిద్దిపేటలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. తడి చెత్తతో బెంగళూరులో సేంద్రియ ఎరువులు తయారీ చేసిన విధానం బాగుంది. ఈ విధానం సిద్దిపేటలో అమలకు శ్రీకారం చుట్టామన్నారు. -
రుణమాఫీకి ప్రభుత్వం సమాయత్తం
సాక్షి, ఖమ్మం : పంట రుణాల మాఫీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ.లక్ష పంట రుణాన్ని మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.లక్ష పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. 2014 ఎన్నికల్లో కూడా ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష పంట రుణాలను నాలుగు విడతలుగా 2017 నాటికి ప్రభుత్వం మాఫీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూడా పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. (ఇది ప్రగతిశీల బడ్జెట్ ) గత రుణమాఫీ ప్రక్రియను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత రుణమాఫీని పటిష్టంగా అమలు చేసేందుకు విధి విధానాలను, మార్గ దర్శకాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ ప్రక్రియలో ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంత ఉంటుందనే అంచనాలను కూడా పరిశీలిస్తున్నారు. అందుకోసం ప్రాథమికంగా జిల్లాలవారీగా రైతులు 2018, డిసెంబర్ 1వ తేదీ నాటికి తీసుకున్న పంట రుణాల బకాయిల వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్లకు వివరాలు సేకరించి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో బ్యాంకు కంట్రోల్ కార్యాలయాలు జిల్లా బ్యాంకులకు పంట రుణ బకాయిల సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. (తెలంగాణ రైతులకు శుభవార్త) ఇదే అంశాన్ని ఖమ్మం జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్‌రావు కూడా జిల్లాలోని బ్యాంక్‌లను రైతుల పంట రుణ బకాయిల వివరాల నివేదికలను అందించాలని కోరారు. జిల్లాలో పంట రుణాలు అందించిన బ్యాంకుల్లో ప్రధానంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ)తో పాటు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఆంధ్రాబ్యాంక్(ఏబీ)తో పాటు పలు బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల నుంచి రూ.లక్ష లోపు పంట రుణ బకాయిలు కలిగిన వివరాలను సేకరిస్తున్నారు. (లక్షా 82 వేల కోట్ల తెలంగాణ బడ్జెట్) రుణం పొందిన రైతులు 2.63 లక్షలు జిల్లాలో మొత్తం రైతులు 2.92 లక్షల మంది ఉన్నారు. అయితే, వారిలో 2,63,434 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వీరంతా ప్రభుత్వం నిర్ణయించిన 2018 డిసెంబర్ నాటికి రూ.2,324 కోట్ల వరకు పంట రుణాలు తీసుకున్నారు. 2014లో ప్రకటించిన రుణమాఫీ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.59 లక్షల మంది రైతులు రుణ మాఫీకి అర్హత సాధించారు. ఈ మొత్తం రైతులకు రూ.1,636 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతలుగా నాలుగేళ్లలో మాఫీ చేసింది. ఈ లెక్కల ప్రకారం ఖమ్మం జిల్లాలో 2.28 లక్షల మంది రైతులుండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1.31 లక్షల మంది వరకు రైతులు ఉన్నారు. గత రుణమాఫీలో ఒక రైతు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే మాఫీ వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే, గత రుణమాఫీ ప్రక్రియలో జిల్లాలో దాదాపు 17 వేల మంది అర్హులైన రైతులకు సుమారు రూ.84 కోట్లు మాఫీ వర్తించలేదు. గత రుణమాఫీ ప్రక్రియను మండల స్థాయిలో తహసీల్దార్లు, మండల అధికారులు, బ్యాంకర్లు ఓ బృందంగా ఏర్పడి జాబితాలను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఈ వ్యవహారంలో చోటు చేసుకున్న తప్పిందంతో అర్హులైన రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి పలుసార్లు వెళ్లింది. అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఇలాంటి తప్పిదాలకు తావు లేకుండా రుణమాఫీ ప్రక్రియ జరగాలని రైతులు కోరుకుంటున్నారు. మార్గదర్శకాలు వెలువడితే జాబితా సిద్ధం ప్రభుత్వం రుణమాఫీకి మార్గదర్శకాలను తయారు చేసి వెలువరిస్తే అర్హులైన రైతుల జాబితాలను తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. మార్గదర్శకాల ఆధారంగా రూపొందించిన రైతుల రుణమాఫీ మొత్తాలను ఆయా రైతుల ఖాతాల ఆధారంగా ప్రభుత్వం బ్యాంకులకు జమ చేసే అవకాశం ఉంది. వివరాలు సేకరించే పనిలో ఉన్నాం 2018 డిసెంబర్ 1వ తేదీ నాటికి పంట రుణాల బకాయిల వివరాలను బ్యాంకుల వారీగా సేకరించే ప్రక్రియను ప్రారంభించాం. మూడు, నాలుగు రోజుల్లో పంట రుణ బకాయిల వివరాలు బ్యాంకుల నుంచి అందే అవకాశం ఉంది. ఆ వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తాం. చింతా చంద్రశేఖర్‌రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఖమ్మం -
మహా నగర ప్రాజెక్టులపై ప్రభావం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కొనసాగిస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులపై తాజా బడ్జెట్ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. ఓఆర్ఆర్ జైకా రుణం, ఓఆర్ఆర్ బీఓటీ అన్యూటీ పేమెంట్ల కింద గతంలో పెండింగ్‌లో ఉన్న వాటితో కలుపుకొని రూ.1687 కోట్లు కేటాయించాలని హెచ్ఎండీఏ ప్రతిపాదనలిస్తే కేవలం రూ.20 లక్షలు మాత్రమే కేటాయించింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిరాశపరచడంతో హెచ్ఎండీఏ అధికారులకు ఏమీ చేయాలో పాలుపోవడం లేదు. 2020–21 సంవత్సరంలో ఓఆర్ఆర్ జైకా రుణం కింద కాంట్రాక్టర్లకు రూ.20 కోట్లు, బీఓటీ అన్యూటీ పేమెంట్ల కింద రూ.331.38 కోట్లు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.20 లక్షలు మాత్రమే కేటాయించడంతో ఈ ఏడాదికి మొత్తం చెల్లించాల్సిన రూ.351.38 కోట్లలో రూ.351.18 కోట్లు హెచ్ఎండీ సొంత నిధులను సమకూర్చుకోవాల్సి ఉంది. హెచ్ఎండీఏకు ఆదాయం సమకూరే ఓఆర్ఆర్ టోల్ ఫీజు ఆదాయంతో పాటు ఎల్ఆర్ఎస్ నిధులు, బిల్డింగ్, లేఅవుట్ పర్మిషన్ల రూపంలో వచ్చే రెవెన్యూతో సరిపెట్టుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత ఆదేశాలివ్వడంతో కాస్త ఊరటనిచ్చే అంశం. ఇప్పటికే హెచ్ఎండీఏకు ఎల్ఆర్ఎస్ రూపంలో సమకూరిన రూ.1100 కోట్లలో రూ.800 కోట్లతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టారు. వీటిలో చాలావరకు సగంలోనే ఉండటంతో మరిన్ని నిధుల అవసరముంది. అభివృద్ధి ప్రాజెక్టులకు కష్టకాలమేనా..? అంతర్జాతీయ స్థాయి హంగులతో నగరంపై పడుతున్న ట్రాఫిక్‌ను తగ్గించే క్రమంలో నిర్మించాలనుకున్నా మియాపూర్‌లోని ఇంటర్సిటీ బస్ టెర్మినల్ (ఐసీబీటీ) ఇప్పటికీ మొదలుకాలేదు. పెద్దఅంబర్‌పేటలో ఐసీబీటీ, శంషాబాద్‌లో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు, . శంషాబాద్, మనోహరబాద్, పటాన్చెరు, శామీర్‌పేటలోనూ లాజిస్టిక్ హబ్‌లను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన రూ.200 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇవి కూడా పట్టాలెక్కడం కష్టంగానే కనిపిస్తోంది. మినీ పట్టణాలకు సైతం.. 2008లో మాస్టర్ ప్లాన్ గ్రోత్ కారిడార్ ప్రకారం దాదాపు 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఓఆర్ఆర్ చుట్టూ ఇరువైపులా దాదాపు 764 కిలోమీటర్ల మేర వందలాది గ్రిడ్ రోడ్లను అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు లక్ష ఎకరాలు అవసరముంటుంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు ఇలా దాదాపు 30 వేల ఎకరాలు పోనుంది. దాదాపు పది వేల ఎకరాలు ప్లాటింగ్ చేసిన భూములున్నాయి. వీటిని కూడా ఏం చేసేందుకు వీలులేదు. మిగిలుతున్నది 60 వేల ఎకరాలే. ఈ లెక్కన చూసుకున్నా 60వేల ఎకరాల్లో గ్రిడ్ రోడ్లు అభివృద్ధి చేస్తే నగర శివారు ప్రాంతాలు మినీ పట్టణాలుగా ప్రగతివైపు అడుగులు పడటం ఖాయం. కానీ భూసేకరణ కష్టమని, వేల కోట్ల ఖర్చవుతుందని ఆ వైపే ఎవరూ చూడటం లేదు. తాజా బడ్జెట్ పరిస్థితి చూశాక హెచ్‌ఎండీఏపైనే భారం పడటంతో మినీ పట్టణాల పరిస్థితి కష్టమే కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
తెలంగాణ రైతులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రూ.25వేల లోపు ఉన్న రుణాలను ఈ నెలలోనే మాఫీ చేస్తామని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2020-21ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదివారం శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రూ. 25 వేల రూపాయల లోపు ఉన్న రుణాలు ఉన్న రైతులు...5 లక్షల 83 వేల 916 మంది ఉన్నారని తెలిపారు. వీరి రుణాలను ఒకే దఫా కింద మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. (చదండి : తెలంగాణ బడ్జెట్ 2020-21 హైలైట్స్) ఈ నెలలోనే రూ.25వేల లోపు ఉన్న రుణాలు మాఫీ చేయడానికి రూ.1,198 కోట్లు విడుదల చేయబోతున్నామని తెలిపారు. ఈ రుణమాఫి మొత్తాన్ని చెక్కుల రూపంలో ఎమ్మెల్యేలు రైతులకు అందిస్తామని చెప్పారు. 25 వేల నుంచి లక్ష లోపు ఉన్న రుణాలను మొత్తం రూ. 24 వేల 738 కోట్లు ఉన్నాయన్నారు. నాలుగు విడతలుగా ఎమ్మెల్యేలు చెక్కుల రూపంలో అందించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది రైతు రుణమాఫీ కోసం రూ. 6 వేల 225 కోట్లను ప్రతిపాదించామన్నారు. ఎంత ఖర్చైనా కందులను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు
పాపన్నపేట(మెదక్)/మెదక్ మున్సిపాలిటీ: కాంగ్రెస్ .. గల్లీలో లేదు. ఢిల్లీలో లేదు.. అలాంటి పార్టీకి ఓటేస్తే పనికి రాకుండా పోతుంది’అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన మెదక్ జిల్లా పాపన్నపేటలో నిర్వహించిన రోడ్‌షోలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి పాల్గొన్నారు. మెదక్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ఉన్న రైతు ఆత్మహత్యలు ఇప్పుడున్నాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పార్టీలో లీడర్లు ఎక్కువ.. కార్యకర్తలు తక్కువ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో అవినీతి పేరుకు పోయిందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పథకాలను అటు మోదీ.. ఇటు చంద్రబాబు, మరోవైపు మమతా బెనర్జీ కాపీ కొడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు రెండు కళ్ల లాంటివని పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి దాకా మనమే ఉన్నామని, ఢిల్లీలో కాంగ్రెస్‌పార్టీ వచ్చేది లేదు.. సచ్చేది లేదని అన్నారు. రాహుల్ గాంధీ ప్రచారానికి వస్తే సభల్లో కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయన్నారు. బీజేపీ పువ్వు వాసన అసలే లేదన్నారు. ఈ కార్యక్రమాల్లో కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీఎంయూ గౌరవాధ్యక్ష పదవికి హరీశ్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: టీఎంయూ(తెలంగాణ మజ్దూర్ యూనియన్) గౌరవాధ్యక్ష పదవికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వద్థామరెడ్డికి పంపారు. అధికార కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం వల్ల ఆర్టీసీ కార్మిక సంఘం కార్యక్రమాల్లో భాగస్వామ్యం సాధ్యపడటం లేదని లేఖలో పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి నిరంతరం తన సహకారం ఉంటుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. హఠాత్తుగా ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. -
మీ మధ్య ఉండటం నా అదృష్టం: హరీశ్
సాక్షి, సిద్దిపేట: ‘పధ్నాలుగు ఏళ్లుగా నూతన సంవత్సర వేడుకలను మీ మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉంది. అది నా అదృష్టం’అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గమంతా తన కుటుంబమని, ఏ వేడుకైనా ప్రజల మధ్య జరుపుకోవడమే తనకు ఆనందమని ఆయన పేర్కొన్నారు. తనకు ఇటువంటి అవకాశాన్ని కల్పిస్తున్న నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతగా వారి రుణం తీర్చుకుంటానని అన్నారు. సోమవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆయన సిద్దిపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ కళాశాల విద్యార్థులతో కలసి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. అనంతరం ఉద్వేగంగా మాట్లాడుతూ ఇటువంటి సందర్భాలను గర్వంగా భావిస్తానని అన్నారు. నియోజకవర్గ ప్రజల అవసరాలు తీర్చేందుకు తాను ఏ సమయంలోనైనా, ఎప్పుడైనా సిద్ధంగా ఉంటానన్నారు. తనకు శాసనసభ్యునిగా వచ్చే వేతనం రూ.2 లక్షలు మీకే ఇచ్చేస్తానని, ఆ సొమ్ముతో మంచి లైబ్రరీ ఏర్పాటు చేసుకుని, దానిని సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. మీరంతా ఉన్నత స్థాయికి ఎదిగితేనే మీ తల్లిదండ్రులతో పాటు తానూ సంతోష పడతానని, అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణగా భావిస్తానని విద్యార్థులనుద్దేశించి హరీశ్ అన్నారు. విద్యార్థులు చిన్ననాడే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలని, తెలంగాణ బిడ్డలంటే గర్వపడే స్థాయికి చేరుకోవాలని ఉద్బోధించారు. కొత్త సంవత్సరంలో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. -
లక్ష్యం నెరవేరేనా
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ ఉద్యమ కేంద్రంగా పేరు తెచ్చుకున్న సిద్దిపేట నియోజకవర్గం మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు వేదికైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కీలక నేతగా, కష్టాల్లో ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించిన మంత్రి హరీశ్‌రావు మంగళవారం వెలువడనున్న శాసనభ ఎన్నికల ఫలితాల్లో అరుదైన రికార్డులు సొంతం చేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. మేన మామ, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నుంచి వారసత్వంగా స్వీకరించిన సిద్దిపేట నియోజకవర్గ బాధ్యతలను హరీశ్ విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఈ ఎన్నికల్లో హరీశ్‌రావు గెలుపు నల్లేరు మీద నడకేనని అంటున్నారు. కాకపోతే పార్టీ శ్రేణులతోపాటు హరీశ్‌రావు ఆశ పెట్టుకున్న లక్ష మెజారిటీ, డబుల్ హ్యాట్రిక్‌పైనే అందరి దృష్టి నెలకొంది. అదే జరిగితే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన అభ్యర్థిగా రికార్డు సృష్టిస్తారు. దాంతోపాటు ఇప్పటి వరకు తాను గెలిచిన ఐదుసార్లూ ప్రత్యర్థికి డిపాజిట్ కూడా దక్కకుండా చేసిన ఘనత కూడా హరీశ్‌రావుకు దక్కనుంది. దీంతో మంగళవారం వెలువడనున్న ఫలితాలపై హరీశ్ అనుచరులు, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. నాలుగుసార్లు ప్రత్యర్థికి డిపాజిట్ గల్లంతు సిద్దిపేట నియోజకవర్గం నుంచి 2004లో మామ కేసీ ఆర్ రాజీనామాతో ఉప ఎన్నికల్లో పోటీలోకి దిగిన హరీశ్‌రావు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పట్నుంచి ప్రతి ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తూనే ఉన్నారు. 2004 ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి, మాజీ మం త్రి ముత్యంరెడ్డిపై 24,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికల్లో మరో సారి ప్రత్యర్థి బైరి అంజయ్యపై 58,935 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో అంజయ్యకు 17,335 ఓట్లు మాత్రమే రాగా.. డిపాజిట్ కూడా దక్కలేదు. 2009 సాధారణ ఎన్నికల్లో హరీశ్‌రావుకు 85,843 ఓట్లు రాగా తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి బైరి అం జయ్యకు కేవలం 21,166 ఓట్లు వచ్చాయి. దీంతో హరీశ్ 64,677 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి కూడా ప్రత్యర్థికి డిపాజిట్ దక్కలేదు. 2010 ఉప ఎన్నికల్లో హరీశ్‌రావుకు 1,08,779 ఓట్లు రాగా ప్రత్యర్థి తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌కు కేవలం 12,921 ఓట్లు వచ్చాయి. దీంతో హరీశ్ 95,858 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన 2014 సాధారణ ఎన్నికల్లో హరీశ్‌రావుకు 1,08,699 ఓట్లు రాగా ప్రత్యర్థి తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌కు 15,371 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మరోసారి హరీశ్‌రావుకు 93,328 ఓట్ల ఆధిక్యత వచ్చింది. అయితే గడిచిన రెండు ఎన్నికల్లో 90 వేలు మెజారిటీ సాధించిన హరీశ్‌రావు.. ఈసారి ఎలాగైనా తన మెజారిటీని లక్ష దాటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగినట్లుగానే కార్యకర్తలు, అనుచరులు తీవ్రంగా కష్టపడ్డారు. దాంతోపాటు పోలింగ్ శాతం పెరిగితేనే మెజారిటీ పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని గుర్తించి విస్తృతంగా ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సారి ఎలాగైనా లక్ష మెజారిటీ సాధించడం ఖాయమని టీఆర్ఎస్ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. -
కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు గోవిందా: టి.హరీశ్‌రావు
సాక్షి, కామారెడ్డి/గాంధారి: ‘కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక పోతుండే. మోటార్లు కాలడం, ట్రాన్స్ఫార్మర్లు పేలడంతో మరమ్మతులకు వేలకు వేలు ఖర్చయ్యేది. ఎరువులు, విత్తనాల కోసం గంటలు, రోజుల తరబడి లైన్ల నిలబడాల్సి వచ్చేది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా దొరికేది కాదు. అలాంటి కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే మనకు మళ్లీ కష్టాలు తప్పవు’ అని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎల్లారెడ్డి అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డికి మద్దతుగా ఆయన శనివారం గాంధారి మండల కేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి గద్దెనెక్కాలన్న యావే తప్ప రైతుల కష్టాలు పట్టవని, ఇందుకు గత పరిపాలనే నిదర్శనమన్నారు. అధికార యావే తప్ప ప్రజల కోసమో, రాష్ట్రం కోసమే ఆలోచించిన పాపానపోరని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంటు, ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి, చెరువుల మరమ్మతులు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, కావలసినంత ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడం, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయడం వంటివి ఎన్నో చేపట్టిందన్నారు. పదేండ్ల కాంగ్రెస్ పాలనను, నాలుగేండ్ల టీఆర్ఎస్ పాలనను బేరీజు వేసుకుని ఓట్లు వేయాలని హరీశ్ ఓటర్లను కోరారు. కాంగ్రెస్ వస్తే కరెంటు లేకుండా పోతుందని, విత్తనాల కోసం వరుసలు కట్టాల్సిందేనని పేర్కొన్నారు. 24 గంటల కరెంటు ఉండాలంటే టీఆర్ఎస్ రావాలని, దొంగరాత్రి కరెంటు రావాలంటే కూటమిని కోరుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటి వరకు 70–80 శాతం పనులు పూర్తయ్యాయని, ఏడాదిన్నర, రెండేళ్లలో పనులు పూర్తయి గాంధారికి, ఎల్లారెడ్డికి నీళ్లు వస్తాయన్నారు. కేసీఆర్‌ను దీవించండి, కాలేశ్వరం నీళ్లు తెచ్చి మీ రుణం తీర్చుకుంటానని హరీష్‌రావ్ పేర్కొన్నారు. కాళేశ్వరం నీళ్లొస్తే వలసలు పోయినోళ్లంతా ఊళ్లకు తిరిగి వస్తారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపడానికి చంద్రబాబు నాయుడు ఎన్నో కుట్రలు పన్నుతున్నాడని, ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు కాళేశ్వరాన్ని ఆపుతాడని హరీశ్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కాళ్లు అడ్డం పెడుతున్న చంద్రబాబును తెలంగాణ నుంచి తరిమి వేయాలన్నారు. ప్రాజెక్టులను అడ్డుకున్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ నేతలు అమరుల త్యాగాలను హేళన చేశారని ఆరోపించారు. డ్వాక్రా గ్రూపులను మరింత బలోపేతం చేస్తామని, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని తెలిపారు. అటవీ భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలిచ్చి వారికి రైతుబంధు అందిస్తామన్నారు. డిసెంబర్ 11 తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టి మెనిఫెస్టోలో పెట్టిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పారు. గాంధారిని దత్తత తీసుకుంటా.. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి పోరాడిన రవీందర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే ఆయన హోదా పెరుగుతదని చెప్పిన మంత్రి హరీశ్‌రావు.. గాంధారి మండలాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. గాంధారిలో ప్రధాన రోడ్డు అభివృద్ధికి కావాలసిన నిధులు మంజూరు చేయించి అభివృద్ది చేస్తానన్నారు. కాలేవాడి, దర్మరావుపేట, మోతె, అమర్లబండ రిజర్వాయర్లను నిర్మిస్తామని, లింగంపేట వాగుపై చెక్‌డ్యాంలు, ముదెల్లి వాగుమీద చెక్‌డ్యాంలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పోచారం ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.160 కోట్లతో ప్రతిపాదనలు చేశామని, దాని బాధ్యత తీసుకుని పూర్తి చేస్తానన్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి, ఆయన సతీమణి మంజులారెడ్డి, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, నాయకులు తానాజీరావ్, సత్యంరావ్, ముకుంద్‌రావ్, సంపత్‌గౌడ్, బద్యానాయక్, ఆకుల ప్రకాశ్, రాజేశ్వర్రావ్, శివాజీరావు తదితరులు పాల్గొన్నారు. కిష్టయ్య ఆత్మ క్షోభిస్తుంది తెలంగాణ ద్రోహులకు ఓటు వేస్తే పోలీసు కిష్ట య్య ఆత్మ క్షోభిస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నా రు. జిల్లాకు చెందిన పోలీసు కిష్టయ్య ప్రత్యేక రాష్ట్రం కోసం ఇదే రోజు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన గుర్తు చేశా రు. పోలీసు కిష్టయ్య వర్ధంతి సందర్భంగా మంత్రి ఘనంగా నివాళులర్పించారు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డుకోవడం వల్లనే ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగా లు చేశారన్నారు. అమరవీరుల త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్రమని, కూటమికి ఓటు వేస్తే తెలంగాణ ద్రోహులకే ఓటు వేశారని అమరుల ఆత్మలు క్షోభిస్తాయని తెలిపారు. -
ప్రజాకూటమి కాదు.. దగా కూటమి
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయని కాంగ్రెస్, టీడీపీలది ప్రజా కూటమి కాదని, దగాకూటమి అని మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు విఫలమయ్యాడని నిర్ధారించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు టీడీపీతో కలిసి పనిచేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చని కాంగ్రెస్ తీరుపై, చంద్రబాబుతో పొత్తుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు గురువారం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై ఆయన ఏమన్నారంటే... ‘కాంగ్రెస్, ప్రజా కూటమి మేనిఫెస్టోలు విడుదల చేశాయి. 2004లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన మెజారిటీ హామీలను అమలు చేయలేదు. 2009లో మేనిఫెస్టోలో పెట్టిన తొమ్మిది అంశాలలో ఏ ఒక్కదాన్నీ అమలు చేయలేదు. అలాగే 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికీ నెరవేర్చలేదు. మేనిఫెస్టోలు అమలు చేయని కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటై మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నాయి. ఓట్లు అడిగే ముందు అప్పటి మేనిఫెస్టోలోని హామీలను ఎందుకు నెరవేర్చలేదో ప్రజలకు వివరించాలి. చెంపలు వేసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఏపీలో చంద్రబాబు చెల్లని రూపాయి అని అక్కడి కాంగ్రెస్ పార్టీ చార్జిషీట్ వేసింది. అక్కడ పనికిరాని చంద్రబాబు తెలంగాణలో ఎలా పనికొస్తారో రాహుల్‌గాంధీ చెప్పాలి. అన్నిరకాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మరిచిపోయిన చంద్రబాబును పక్కన పెట్టుకుని రాహుల్ ఇక్కడ రుణమాఫీ అంటే ఎవరు నమ్ముతారు? చంద్రబాబు 600 హామీలు ఇస్తే వాటిలో పది శాతం కూడా అమలు చేయలేదు. హైదరాబాద్‌లో ప్రచారం చేస్తున్న చంద్రబాబు ఏపీలో ఇచ్చిన హామీల వైఫల్యంపై సమాధానం చెప్పాలి. చంద్రబాబుకు విశ్వసనీయత లేదు. కాంగ్రెస్ అంటే ప్రజల్లో విశ్వాసం లేదు. తెలంగాణ చైతన్యం ఉన్న ప్రాంతం. ఇలాంటి మోసాలను సహించదు. తెలంగాణ ప్రజల్లో విశ్వసనీయత ఉన్న నాయకుడు కేసీఆర్. చావు నోట్లోకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీఆర్. తెలంగాణ ప్రజలు దగా కూటమిని తిరస్కరిస్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ మాట తప్పదు, మడమ తిప్పదు. ఒకటిరెండు తప్ప అన్ని హామీలను అమలు చేసిన టీఆర్ఎస్ను ప్రజలు విశ్వసిస్తారు. తప్పుడు మాటలను సవరించుకోవాలి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మాట్లా డారు. ప్రాణహిత– చేవెళ్లపై అబద్ధాలు చెబుతున్నారు. తప్పుడు మాటలను ఇప్పటికైనా సవరించుకోవాలి. ప్రాణహిత–చేవెళ్ల చేపట్టినప్పు డు ఆయకట్టు 16 లక్షల ఎకరాలు, నిల్వ సామ ర్థ్యం 11 టీఎంసీలు. ఇప్పుడు ఆయకట్టు 37 లక్షల ఎకరాలు, నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు. డీజిల్, సిమెంట్, అన్ని నిర్మాణ ఖర్చులు పెరిగాయి. అందుకే అంచనా వ్యయం పెరిగింది. అసలు పనులేమీ చేయకుండానే అంచనాలు పెంచింది కాంగ్రెస్ వాళ్లే. 2007లో ప్రాజెక్టు నిర్మాణం కోసం ఉత్తర్వులు ఇచ్చినప్పుడు రూ.17,875 కోట్లు ఉన్న అంచనా వ్యయం 2010లోనే రూ.40 వేల కోట్లకు చేరింది. అప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు డబ్బు మెక్కా రా? కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు, పాలమూరు ప్రాజెక్టు వద్దని ఏపీ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేశారు. మీరు ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులు కడతామంటే ప్రజలు ఎలా నమ్ముతారు? గద్దర్ పరిస్థితి దారుణం... ప్రజాగాయకుడిగా, ఉద్యమ నేతగా గద్దర్‌పై మనందరికీ గౌరవం ఉంది. కడుపులో బుల్లెట్ ఉందని ఎప్పుడూ చెబుతుంటారు. ఆ బుల్లెట్‌ను దించిన చంద్రబాబు కడుపులో గద్దర్ తలపెట్టడం చూస్తే బాధనిపించింది. గద్దర్ ఆ స్థాయి, గౌరవం కోల్పోయారు. దీన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోదు. ఈ ఘటనతో తనపై ఉన్న గౌరవాన్ని గద్దర్ పోగొట్టుకున్నారు. సాగరహారం ఫొటో వేస్తారా? తెలంగాణ ఉద్యమాన్ని లాఠీచార్జీలు, బుల్లెట్లతో అణచివేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో పుస్తకంలో సాగరహారం ఫొటో వేసుకుంది. ఆ ఫొటోలో టీఆర్ఎస్ జెండాలు కనిపిస్తాయని బ్లాక్ అండ్ వైట్‌లో వేశారు. మిలియన్ మార్చ్, సాగరహారం కార్యక్రమాలకు కాంగ్రెస్ అనుమతి ఇవ్వకుంటే టీఆర్ఎస్ పోరాడింది. దీంట్లో పాల్గొన్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఉద్యమకారుడు గుడి రాజిరెడ్డి గాయపడి చనిపోయారు. ఆ ఫొటో వేసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నవంబర్ 29.. దీక్ష దివస్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మలుపు తిప్పిన దినం నవంబర్ 29. తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షను ప్రారంభించిన ఈ రోజును ప్రజలు చిరస్థ్ధాయిగా గుర్తు పెట్టుకుంటారు. దీక్ష దివస్‌గా జరుపుకుంటారు. అమరవీరులకు నా నివాళులు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ఉద్యమంతో అప్పటి పరిస్థితులలో ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ ఇచ్చేదే. అది చారిత్రక సిగ్గుచేటు... గోదావరి జలాలపై ఏపీ సీఎం చంద్రబాబు చిలుకపలుకులు పలుకుతున్నారు. రెండు రాష్ట్రాలు గోదావరి జలాలను వినియోగించుకోవాలని చెబుతున్నానని ఖమ్మం సభలో అన్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఎందుకు లేఖలు రాశారు. మార్చి 2017లో కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు లేఖ రాయలేదంటే నేను ముక్కు నేలకు రాస్తా. ఈ సవాలుకు చంద్రబాబు సిద్ధమేనా? ఏపీలో హామీలను అమలు చేయని చంద్రబాబును ఓడించాలని అక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలు కలిసి ఖమ్మంలో నిర్వహించిన సభ చారిత్రకమని చంద్రబాబు అనడం సిగ్గుచేటు. అదొక చారిత్రక వైఫల్యం. చంద్రబాబు అవసరం కోసం ఏ ఎండకు ఆ గొడుగు పడతారు. గుజరాత్ అల్లర్లప్పుడు నరేంద్రమోదీని మతతత్వవాది అని, జైల్లో పెట్టాలని విమర్శించారు. 2014 ఎన్నికలప్పుడు మహబూబ్‌నగర్ సభలోనూ మోదీతో కలిసినప్పుడు చారిత్రక సభ అన్నారు. ఇప్పుడు రాహుల్‌గాంధీతో కలిసి అదే మాట చెబుతున్నారు. అది చారిత్రక సభ కాదు చారిత్రక సిగ్గుచేటు సభ. నీ అవసరం కోసం కలిసిన సభ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడలేదని చంద్రబాబు అనడం కన్నా పెద్ద జోక్ మరొకటి ఉండదు. చంద్రబాబుకు ఉన్నన్ని నాలుకలు, తలలు దేశంలోనే మరే రాజకీయ నాయకుడికి లేవు. కేసీఆర్‌కు రాజకీయ జన్మనిచ్చింది టీడీపీ అని బాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు రాజకీయ జన్మ ఇచ్చిన కాంగ్రెస్‌కు, పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. దేశం అవసరాల కోసం బాబు కాంగ్రెస్‌తో కలవలేదు.. ఆయన అవసరాల కోసమే కలిశారు. చంద్రబాబును మించిన వెన్నుపోటుదారు ఎవరూలేరు. మైదానంలో దిగని బ్యాట్స్‌మన్ కోదండరాం... టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మొదట పౌరహక్కుల నేత. అలాంటి వ్యక్తి.. హక్కులను కాలరాసిన, రైతులను కాల్చి చంపిన చంద్రబాబుతో కలిశారు. ఓట్ల కోసం ఇంత దిగజారుతారా? చంద్రబాబు హయాంలో జరిగినన్ని ఎంకౌంట ర్లు ఎప్పుడూ జరగలేదు. తెలంగాణవ్యా ప్తంగా ఎన్‌కౌంటర్‌ను ప్రవేశపెట్టిన చంద్రబాబుతో కోదండరాం కలవడం హక్కుల ఉద్యమకారులను కలచివేస్తోంది. మేధా వులు, విద్యావంతులు బాధపడుతున్నా రు. సీఎం కేసీఆర్ ఇంజూర్డ్(గాయాలైన) బ్యాట్స్‌మన్ అని కోదండరాం అన్నారు. ఎన్నికలో పోటీ చేయని కోదండరాం.. మై దానంలో దిగని బ్యాట్స్‌మన్. కేసీఆర్ ఇం జూర్డ్ బ్యాట్స్‌మన్ కాదు ఇరగదీసే బ్యాట్స్‌మన్. డిసెంబర్ 11న ఈ విషయం కోదండరాంకు తెలుస్తుంది. ఆ రోజు కేసీఆర్ విజయాల ఫోర్లు, సిక్స్‌లు కొడుతుంటే కోదండరాం చప్పట్లు కొట్టాల్సిందే. -
పార్టీలో ఆయనే ట్రబుల్ షూటర్
తన్నీరు హరీష్‌రావు. తెలంగాణ రాజకీయాల్లో ఆయన గురించి తెలియనివారుండరు. పార్టీలో ఆయనను అందరూ ట్రబుల్ షూటర్ గా పిలుస్తారు. తండ్రి తన్నీరు సత్యనారాయణరావు వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగి. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి స్వగ్రామం. పాలిటెక్నిక్ డిప్లమో చదివేందుకు హైదరాబాద్ వచ్చారు. మేనమామ కేసీఆర్ ఇంట్లోనే ఉండేవారు. ఆయనకు రాజకీయ కార్యకలాపాల్లో చేయూతనందించేవారు. వ్యక్తిగత సహాయకుడిగా ఉంటూ నమ్మకాన్ని, అభిమానాన్ని సంపాదించుకున్నారు. అదే సమయంలో తన మిత్రులతో కలిసి చిట్‌ఫండ్స్, హోటల్ వ్యాపారాల్లోనూ భాగస్వామిగా ఉండేవారు. కష్టపడేతత్వమే ఆయన బలం ప్రజలు ఏమాలోచిస్తున్నారు, వారి ఆశలకనుగుణంగా మనమేం చేయొచ్చు, ఆ క్రమంలో ఏ అడుగువేయాలి, దానికి ఉపయోగపడే శక్తిసామర్థ్యాలు ఎవరి దగ్గర ఉన్నాయని అంచనా వేయడంలో హరీష్‌రావు దిట్ట. పనిపై అంచనా వచ్చిన తర్వాత లక్ష్యం చేరడానికి రేయింబవళ్లు కష్టపడేతత్వం ఆయనను విజేతగా నిలిపింది. అనుకున్న పని పూర్తయ్యేవరకు ఎన్ని గంటలైనా, ఎంత మందితోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా విసుగు, విరామం లేకుండా డీల్ చేయగలగడం హరీష్‌రావు ప్రధానబలం. ట్రబుల్ షూటర్. మన మాటలు వింటూనే మరో విషయం గురించి మనసులో ప్రణాళిక రచించడం ఆయన ప్రత్యేకత. కొత్త విషయం చెబుతున్నపుడు ఆసక్తిగా వినడం, తెలియని విషయాలపై అవగాహన పెంచుకోవడం ఆయనకు అలవాటు. రాజకీయ నాయకుడికి ప్రధానంగా ఉండాల్సిన అర్హత ప్రసంగం. 16 మంది శాసనసభ్యులు రాజీనామా చేసిన సందర్భంగా శాసనసభల్లో హరీష్‌రావు చేసిన ప్రసంగం గురించి కేసీఆర్ మాట్లాడుతూ హరీష్ ప్రసంగం నన్నే ముగ్ధుడ్ని చేసింది. తెలంగాణకు జరిగిన అన్యాయం, కాంగ్రెస్ చేసిన మోసం ప్రజలకూ అర్ధమైంది అని పొగిడారు. అద్భుతమైన వక్తగా పేరుగాంచిన కేసీఆర్ అందించిన ప్రశంస హరీష్ ప్రతిభకు నిదర్శనం. విమర్శలూ ఉన్నాయి.. అవసరం తీరిన తర్యాత హరీష్‌రావు ఎవరినీ పట్టించుకోరని పార్టీ నాయకులు, ఆయన సన్నిహితులు చెబుతుంటారు . అవసరమున్నప్పుడు ఎన్నిసార్లయినా ఫోన్లు చేస్తారని, అయితే ఆయన సాయం కోసం ఫోన్లు చేస్తే స్పందించరన్న విమర్శ సన్నిహితుల నుంచే వినిపిస్తుంది. కేసీఆర్ రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ చాలా చురుకైన పాత్రను నిర్వహించారు. 1999 ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు మంత్రి పదవి రానపుడు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో తన వ్యాపారాల విస్తరణపైనే హరీష్‌రావు దృష్టి కేంద్రికరించారని టీఆర్ఎస్ ముఖ్యులు చెప్పుకుంటారు. హరీష్‌రావు పార్టీలోని కొందరితో కలిసి సొంత గ్రూపును కాపాడుకుంటుంటారన్న మాట కూడా వినిపిస్తుంటుంది. హరీష్‌లో అందుకు తగిన శక్తిసామర్థ్యాలున్నాయని కూడా పార్టీ నాయకులు అంగీకరిస్తారు. మనో సిద్దిపేట కేసీఆర్ రాజకీయ ప్రస్థానానికి ఆలంబనగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గమే హరీషరావుకు వేదికైంది. సిద్దిపేట నియోజకవర్గానికి మూడుసార్లు ఉప ఎన్నికలు జరిగితే ఒకసారి కేసీఆర్, రెండుసార్లు హరీష్‌రావు ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో పోటీ చేసినపుడు కేసీఆర్ కంటే హరీషరావుకు ఎక్కువ మెజారిటీ వచ్చింది. 2004లో కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. సిద్దిపేటకు కేసీఆర్ రాజీనామా చేసి హరీష్‌రావును మంత్రిగా చేసి సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ తరువాత ఉప ఎన్నికల్లో కూడా హరీష్‌రావుకే అధిక మెజారిటీ వచ్చింది. ప్రస్తుత ఎన్నికల గురించి ఎవరు లెక్కలేసుకున్నా టీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు అంటే సిద్ధపేట అనే చెబుతారు. నేపథ్యం : జననం : జూన్ 3,1972 పుట్టిన స్థలం : కరీంనగర్ జిల్లా, బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామం తల్లిదండ్రులు : లక్ష్మీబాయ్, సత్యనారాయణరావు కుటుంబం : భార్య శ్రీనితారావు, కుమారుడు ఆర్చిస్మన్, కుమార్తె వైష్ణవి చదువు : కరీంనగర్ వాణినికేతన్ పాఠశాలలో ప్రాథమిక విద్య, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (బీఏ) రాజకీయ నేపధ్యం : ► సిద్ధిపేట నియోజకవర్గం నుంచి వరుసగా (2004, 2008, 2010 ఉప ఎన్నికల్లో 2009, 2014 సాధారణ ఎన్నికల్లో) ఎన్నిక. ► తెలంగాణ తొలి నీటి పారుదల శాఖ మంత్రి గా పనిచేశారు ► వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో యువజన శాఖ మంత్రిగా పనిచేశారు - కె అఖిల్ -
తెలంగాణపై బీద అరుపులు.. ఏపీపై సానుభూతి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మేడ్చల్ సభలో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆ స్క్రిప్టు కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిచ్చినట్లుంది. చంద్రబాబు మేడ్చల్ సభను మాత్రమే స్పాన్సర్ చేశారనుకున్నాం. కానీ విచిత్రంగా ఆమె ప్రసంగం కూడా చంద్రబాబు రాసి చ్చిన స్క్రిప్ట్ అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కూటమి తరఫున ఎవరు పోటీ చేయాలో నిర్ణయించింది చంద్రబాబే. ఇప్పుడు ఎన్నికల ఖర్చు కు డబ్బులు ఇస్తున్నదీ ఆయనే’ అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలం గాణ నడి గడ్డ మీద ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారంటేనే తెలంగాణపట్ల సోనియా గాంధీకి ఉన్న ఉద్దేశమేమిటో స్పష్టమవుతోందని విమర్శించా రు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన హరీశ్‌రావు శనివారం అడ్డాకులలో విలేకరులతో మాట్లాడారు. మేడ్చల్ బహిరంగ సభలో సోనియా తెలంగాణపై బీద అరుపులు, ఏడుపులు ప్రదర్శించడం తప్ప ఎన్నికల్లో గెలిపిస్తే చేయబోయే కార్యాచరణ ఏదీ ప్రకటించలేదని విమ ర్శించారు. పైగా ఏపీ మీద సానుభూతి కురిపించడం చూస్తే తెలంగాణలో సమావేశం పెట్టి ఏపీకి హామీలు ఇచ్చినట్లు కనిపిస్తోందని, ఇవన్నీ గమనిస్తే ఎన్నికలు, బహిరంగ సభను స్పాన్సర్ చేసిన బాబుకు కాంగ్రెస్ గులాం అయినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలేమయ్యాయి? ‘ఏపీతో సరిసమానంగా తెలంగాణకు పారిశ్రామిక నిర్మాణంలో రాయితీలు ఇస్తామని పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి ప్రకటించారు. ఆ విషయాన్ని మీరు గడచిన ఎన్నికల్లో రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలోనూ చెప్పారు. మరి ఈరోజు వాటిని ఎందుకు చెప్పలేకపోయారు. తెలంగాణలో కొత్త పరిశ్రమలు రావు... అందరూ తీసుకెళ్లి ఏపీలో వాటిని పెట్టాలని చెబుతున్నారా? తెలంగాణలో నిరుద్యోగం పెరగాలి... ఉద్యోగ అవకాశాలు రావొద్దు.. తెలంగాణకు ఆదాయం పడిపోవాలి... పరిశ్రమలు రావొద్దనే కదా మీరు చెప్పింది. మీ వ్యాఖ్యలు యువకుల భవిష్యత్తును అంధకారం చేసేలా ఉన్నాయి. ఆనాడు విభజన బిల్లులో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు తప్ప.. తెలంగాణకు మొండి చెయ్యి చూపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే అభ్యంతరం లేదు.. ఆ రోజు ప్రధాని చెప్పిన విధంగా తెలంగాణకు కూడా పారిశ్రామిక రాయితీలు సమానంగా ఇవ్వండని అడిగితే మీరు ఏమీ మాట్లాడటం లేదు. హైకోర్టు విభజన, రైల్వే కోచ్ ఫ్యాక్టరీల విషయమై పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని నిలదీస్తుంటే.. కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? ఐటీఐఆర్, ముస్లిం, ఎస్టీల రిజర్వేషన్ల విషయంలో ఎందుకు మద్దతు ఇవ్వలేదు? కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల జాతీయ హోదా కోసం టీఆర్ఎస్ చేసిన ఆందోళనలకు కాం గ్రెస్ ఎందుకు స్పందించలేదు? అదే ఏపీకి ప్రత్యేక హోదా కోసం మాత్రం చంద్రబాబు సూచన మేరకు పార్లమెంటును స్తంభింప చేయడం వెనుక మర్మం ఏమిటి?’అని సోనియాను హరీశ్‌రావు నిలదీశారు. దుఃఖం ఎందుకు వస్తోంది? ‘తెలంగాణలో అధికారం లేనందుకా.. లేదా తిరిగి అధికారంలోకి రాలేమనే అర్థమైనందుకు దుఃఖిస్తున్నారా?’అని హరీశ్‌రావు సోనియా గాంధీని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ వంటి మంచి నాయకుడు కాంగ్రెస్‌లో లేనందుకు ఈరోజు సోనియా దుఃఖ పడుతున్నట్లుందని ఎద్దేవా చేశారు. అంతకు మించి సోనియా గాంధీ ఎందుకు బాధపడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ‘నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే ఆమె గర్వపడాలి. దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నందుకు సంతోషపడాలి, గర్వపడాలి. కానీ ఆమె అధికారంలో లేనందుకు, ఇక ముందు రానందుకు ఆందోళనలో దుఃఖం వస్తున్నట్లుంది. రైతు బంధు, రైతు భీమా పథకాలు దేశంలోనే విప్లవాత్మకమైన పథకాలు. ఆఖరికి స్వామినాథన్ సైతం కేసీఆర్‌ను మెచ్చుకుని అవార్డు ఇచ్చారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని కలగలిపి తెలంగాణను కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంత బాగా అభివృద్ధి చేస్తున్న నాయకుడిని చూసి గర్వపడాల్సింది పోయి.. దుఃఖపడటంలో అర్థం లేదు. మీరంటే మాకు గౌరవం ఉంది. కానీ దుఃఖం వస్తోందంటూ ప్రజలను చిన్న బుచ్చే ప్రయత్నం చేస్తున్నారు’ అని హరీశ్‌రావు అన్నారు. బాబు సంతకం పెట్టిస్తారా? ‘నాలుగు పార్టీలు కలసి ఎన్నికల మేని ఫెస్టోకు సంబంధించి కామన్ మినిమమ్ పోగ్రాం (సీఎంపీ) పెడతామంటున్నారు కదా. అధికారంలోకి వస్తే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కడతామని సీఎంపీలో చేరుస్తారా? దాని మీద చంద్రబాబు సంతకం తీసుకుంటారా? ఈ ప్రాజె క్టు కడితే అభ్యంతరం లేదని బాబు నోటి నుంచి చెప్పిస్తారా? అలా చేసిన తర్వాతే పాలమూరు ప్రజల ఓట్లు అడగాలి’ అని హరీశ్ డిమాండ్ చేశారు. కేవలం 8 నెలల్లో పూర్తి చేసిన తుమ్మిళ్ల ప్రాజెక్టును కూడా అడ్డుకోవడానికి బాబు శతవిధాలా ప్రయత్నిం చారన్నారు. ఉమ్మడి ఏపీలో ఆర్డీఎస్ ను ఎండబెట్టి.. నీళ్లన్నీ కేసీ కెనాల్ ద్వారా తీసుకుపోయారని ఆరోపించారు. తుమ్మిళ్ల విషయంలో బాబు రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకోవడానికి బాబు చేయని యత్నం లేదన్నారు. ఆయన ఎన్ని కొర్రీలు పెట్టినా, అపెక్స్ కమిటీలో కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినా కేసీఆర్ బల్లగుద్ది మరీ ప్రాజెక్టును కట్టి తీరుతామని స్పష్టం చేశారని హరీశ్ గుర్తుచేశారు. -
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆగమే
జోగిపేట(అందోల్): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయని, ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జోగిపేటలోని డాకూరు శివారులో సీఎం సభా వేదిక ఏర్పాట్లకు సంబంధించి స్థల పరిశీలన చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈనెల 28న జోగిపేటలో జరిగే సీఎం బహిరంగసభకు అందోలు నియోజకవర్గ ప్రజలంతా స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సింగూరు ప్రాజెక్టు నుంచి మూడు పంటలకు నీరందించగలిగామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సంవత్సరాలు అధికారంలో ఉన్నా సేద్యానికి నీరందించలేదని గుర్తు చేశారు. అందోలు నియోజకవర్గంలో నిశ్శిబ్ద విప్లవం రాబోతోందని, ఇప్పటి వరకు నిర్వహించిన సభలన్నీ విజయవంతం అయ్యాయన్నారు. అందోలులో క్రాంతికిరణ్ విజయం తథ్యమన్నారు. ఉమ్మడి జిల్లాలో పది స్థానాలు గెలుపొందడం ఖాయమన్నారు. డిప్యూటీ సీఎం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినా రైతులు ఎరువు బస్తాలు, విత్తనాల కోసం గంటల తరబడి రోడ్డు మీద బారులు తీరి నిలబడాల్సి వచ్చిందని హరీశ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్‌కిట్, రైతు బీమా పథకాలన్నీ రద్దవుతాయన్నారు. మహిళా గ్రూపులకు రూ.1,650 కోట్లు వడ్డీ లేని రుణాలు అందజేశామన్నారు. రైతులు పండించిన పంటలను మహిళలే కొనేలా ప్రభుత్వం ప్రోత్సహించిందన్నారు. హెలిపాడ్ కోసం స్థలం ఎంపిక చేసి నాయకులతో పాటు డీఎస్పీ శ్రీధర్‌రెడ్డికి సూచనలు చేశారు. ఆయన వెంట జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, డీసీసీబీ మాజీ ఉపాధ్యాక్షుడు పి.జైపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ నాగభూషణం, మాజీ చైర్మన్ పి.నారాయణ, రాష్ట్ర తెలంగాణ జాగృతి కార్యదర్శి భిక్షపతి, పట్టణ అధ్యక్షుడు సీహెచ్ వెంకటేశం, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు లింగాగౌడ్, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ వర్కల అశోక్, జిల్లా నాయకులు ముద్దాయిపేట విజయ్‌కుమార్, ఆత్మగౌరవ కమిటీ చైర్మన్ డి. వీరభద్రారావు, నాయకులు రవీంద్రగౌడ్, ఖాజాపాష, తెలంగాణ జాగృతి నాయకులు ఫైజల్ అహ్మద్, నాగరాజు తదితరులు ఉన్నారు. ఖేడ్‌లో సభా స్థలి పరిశీలన నారాయణఖేడ్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఈనెల 28న నారాయణఖేడ్‌కు రానున్న నేపథ్యంలో సభావేదిక స్థలాన్ని మంత్రి టి.హరీశ్‌రావు శుక్రవారం పరిశీలించారు. ఎంపీ బీబీ పాటిల్, ఖేడ్, అందోల్ టీఆర్ఎస్ అభ్యర్థులు భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్‌తో కలిసి పట్టణంలోని రహమాన్ గార్డెన్ ఫంక్షన్‌హాల్ ఆవరణలో సభావేదికకోసం స్థలాన్ని పరిశీలించారు. గత ఉప ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సభావేదిక స్థలంలోనే ఈమారు కూడా ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేశారు. హెలిప్యాడ్, సభావేదిక ఏర్పాట్లపై నాయకులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ఉన్నారు. -
త్వరలో రైలు కూత: హరీశ్‌రావు
మెదక్ మున్సిపాలిటీ: వలస వాద పార్టీలతో పొత్తు పెట్టుకున్న లైన్‌లైని కూటమి ప్రజలకేం చేస్తుందని, ప్రజలకోసం పనిచేస్తున్న పద్మాదేవేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. బుధవారం మెదక్ పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పద్మాదేవేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్ సహకారంతో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారన్నారు. ఇందిరాగాంధీ మొదలుకొని ఎందరో హామీలిచ్చినా మెదక్ జిల్లా కేంద్రంగా ఏర్పడలేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పద్మాదేవేందర్‌రెడ్డి కృషితో జిల్లా ఏర్పాటు కలను నెరవేర్చుకున్నామన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటుతో ఆగిపోలేదని, పద్మాదేవేందర్‌రెడ్డి నాయత్వంలో జిల్లాకు రైల్వేలైన్ కూడా పూర్తి కానుందన్నారు. రెండు, మూడు నెలల్లో మెదక్‌కు రైలు కూత వినిపించబోతుందన్నారు. అలాగే మెదక్‌కు ఇటీవలే రింగురోడ్డు మంజూరైందని, చేగుంట నుంచి మెదక్‌కు వచ్చే పూర్తిగా గుంతలమయంగా ఉండేదని, ప్రస్తుతం ఆ రోడ్డుపై వస్తుంటే ఏయిర్‌పోర్టులో రన్‌వే మీద వెళ్తున్నట్లుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక చెక్‌డ్యాం కూడా నిర్మించలేదని, 21వేల ఎకరాలకు నీరందించాల్సిన ఘనపురం ఆనకట్ట కాంగ్రెస్ హయాంలో 10వేలకు పడిపోయిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వంద కోట్లతో ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు, కాల్వల మరమ్మతులు చేపట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్, టీడీపీల హయాంలో ఘనపురం ఆనకట్ట నీళ్లు కావాలంటే పాపన్నపేట రైతులు పత్రాలు పట్టుకొని హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. కాని టీఆర్ఎస్ హయాంలో పద్మాదేవేందర్‌రెడ్డి ఒక ఫోన్‌చేస్తే సీఎం కేసీఆర్ స్పందించి రెండు పంటలకు నీటి విడుదల చేయించారన్నారు. రూ.2కోట్లతో మెదక్‌లో రైతు బజార్, స్థానిక పిట్లం చెరువులో రూ.9కోట్లతో మినీ ట్యాంకుబండ్ నిర్మించడం జరుగుతుందన్నారు. పాపన్నపేట రైతులు మాకు మార్కెట్ యార్డు కావాలి...జోగిపేట, మెదక్‌కు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని పద్మాదేవేందర్‌రెడ్డి కోరగానే రూ.3కోట్లతో మార్కెట్ యార్డు గోదాములు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆరవై యేళ్ల పాలనలో ఏడుపాయల దుర్గమ్మకు కేవలం పట్టు వస్త్రాలను మొక్కుబడిగా సమర్పించారే తప్ప రాష్ట్రప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఏడుపాయల అభివృద్ధికి ప్రతియేడు కోటి రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 50శాతం పనులు పూర్తయ్యాయన్నారు. పద్మాదేవేందర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు రామాయంపేటను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంతోపాటు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. మెదక్‌కు మహిళా డిగ్రీ కళాశాల సా«ధించిన పద్మాదేవేందర్‌రెడ్డిదేనన్నారు. చరిత్రలో ఎన్నడులేని విధంగా మెజార్టీతో పద్మాదేవేందర్‌రెడ్డి గెలుస్తుందన్నారు. మహా కూటమి మాయ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పద్మాదేవేందర్‌రెడ్డినే గెలిపించాలని ప్రజలను కోరారు. -
ఉన్నది ఒకటే జీవితం
సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి. చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా పరిచయం కానున్న సినిమా ‘ఒకటే లైఫ్’. ‘హ్యాండిల్ విత్ కేర్’ అనేది ఉప శీర్షిక. శృతియుగల్ కథానాయికగా నటించారు. ఎమ్.వెంకట్ దర్శకత్వంలో నారాయణ్ రామ్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను తెలంగాణ భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు విడుదల చేసి మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. పాటలు బాగున్నాయి. అనుభవం ఉన్న దర్శకునిలా వెంకట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిట్ సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు.‘‘హారీష్రావుగారు మా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో రిలీజ్ అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘ఈ టెక్నాలజీ యుగంలో హ్యూమన్ రిలేషన్స్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు వెంకట్. సుమన్, నల్ల వేణు, జబర్దస్త్ రామ్, బాబి, రిషి తదితరులు నటించిన ఈ సినిమాకు అమ్రీష్ సంగీతం అందించారు. -
కాంగ్రెస్ నేతలు పరిగలు ఏరుకోవాల్సిందే
సాక్షి, సిద్దిపేట: ‘సీఎం కేసీఆర్ స్వయానా రైతు బిడ్డ. అందుకోసమే రైతును రాజుగా చూడాలని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం వర్షాకాలానికి ముందుగా ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి సహాయం అందిస్తోంది. దీంతో రైతులు ఎరువులు, విత్తనాల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసే దుస్థితి తప్పింది. ఇంత మంచి పని చేసిన కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు సమర్థి స్తున్నారు. ప్రతిచోట బ్రహ్మరథం పడుతున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు వచ్చే ఎన్నికల్లో పరిగలు ఏరుకోవడం మినహా.. చేసేది ఏమీ లేదు’అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం సిద్దిపేట నియోజకవర్గం రంగధాంపల్లి, గజ్వేల్ నియోజకవర్గం బూరుగుపల్లిలో రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు పథకంతో ప్రజలు గ్రామగ్రామాన పండగ జరుపుకుంటున్నారని, సాగుకు ముందే సహాయం అందడంతో రైతు లు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభు త్వం మద్దతు ధర, నిరంతర విద్యుత్, పెట్టుబడి సహాయం అందించడంతో పాటు సాగునీరిచ్చేందుకు కష్టపడుతోందని చెప్పారు. -
యాసంగికి ‘అనంతగిరి’ నీళ్లు
ఇల్లంతకుంట (మానకొండూర్): వచ్చే యాసం గికి అనంతగిరి రిజర్వాయర్ నీళ్లు అందిస్తామని నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం– 10వ ప్యాకేజీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరిలో 3.5 టీఎంసీల రిజర్వాయర్, ఆనకట్ట పనులతోపాటు, తిప్పాపూర్ వద్ద టన్నెల్ నిర్మాణం, సర్జుఫుల్‌లో విద్యుత్ మోటార్ల బిగింపు పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనంతగిరి రిజర్వాయర్ నుంచి పంట కాల్వల ద్వారా 30 వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని చెప్పారు. రెండేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రికార్డుస్థాయిలో చేపట్టామని, పంప్‌హౌస్‌లు, బ్యారేజీల నిర్మాణం వేగవంతంగా సాగుతోందన్నారు. లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోబోతున్నామని మంత్రి చెప్పారు. మరో 25 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు పూర్తి చేస్తే అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. అనంతగిరి రిజర్వాయర్‌లో భాగమైన నాన్ ఓవర్ ఫుల్ స్పిల్ వే 3 లక్షల పైచిలుకు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేశామన్నారు. మరో 14 వేల క్యూబిక్ మీటర్ల పనులు వారంలోగా పూర్తవుతాయని చెప్పారు. 400 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ జాప్యంపై మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, 46 కిలోమీటర్ల దూరం నుంచి నిర్మిస్తున్న విద్యుత్ టవర్ల పనులను వర్షకాలం ప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాలని హరీశ్ సూచించారు. తిప్పాపూర్ సర్జుఫుల్‌లో నాలుగు మోటార్ల బిగింపు పనులు ఏకకాలంలో చేపట్టామని, సర్జుఫుల్‌లో గేట్ల నిర్మాణాలను మరో 45–50 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. అనంతగిరి నిర్వాసితులు కోరుకున్న విధంగా ప్యాకేజీ వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. -
ఎరువుల డీలర్లకు సహకారం: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ఎరువులు, విత్తన డీలర్లకు పూర్తి సహకారం అందిస్తామని మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు హామీనిచ్చారు. విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల డీలర్ల సంఘం (స్పెడ్) రాష్ట్ర అధ్యక్షుడు కె.పృథ్వీ బుధవారం మంత్రి హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిశారు. నూతనంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన పృథ్వీకి అభినందనలు తెలుపుతూ, రైతుల కోసం డీలర్ల సంఘం పనిచేయాలని మంత్రి సూచించారు. తమ సంఘం గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యవహరిస్తారని పృథ్వీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
నాన్చుడో.. తేల్చుడో..!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నానుతున్న వివాదాలపై ఏడాదిన్నర తర్వాత కేంద్ర జల వనరుల శాఖ గురువారం ఢిల్లీలో నిర్వహిస్తున్న సంయుక్త సమావేశం కీలకంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం నీటి వాటాలు, వినియోగం, ప్రాజెక్టుల పరిధి, కొత్త ప్రాజెక్టులు, గోదావరి నుంచి కృష్ణాకు తరలించే నీటితో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాల అంశాలన్నీ అపరిష్కృతంగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీలో అయినా కేంద్రం స్పష్టతనిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. వ్యూహంపై మంత్రి హరీశ్ దిశానిర్దేశం.. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్రప్రసాద్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో గురువారం ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుంది. తెలంగాణ తరఫున సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులతో పాటు ఏపీ అధికారులు హాజరవుతున్నారు. కృష్ణా, గోదావరిలో తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన వాటాపై గట్టిగా పోరాడాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం జలసౌథలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీశ్ సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ చేసే ప్రతిపాదనలను ఎలా తిప్పికొట్టాలన్న అంశంపై సమీక్షించారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాలు, తలెత్తే సమస్యలపై అధ్యయనం చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. పట్టిసీమ, పోలవరం నిర్మాణంతో తెలంగాణకు దక్కే 90 టీఎంసీలకై గట్టిగా వాదించాలని, రెండు రాష్ట్రాలకు కృష్ణాలో కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 575 టీఎంసీలు కేటాయించి రాష్ట్రానికి న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరాలని ఆదేశించారు. ఆర్డీఎస్ వాటాలు, టెలీమెట్రీ స్టేషన్ల సత్వర ఏర్పాటుపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఈఎన్సీలు మురళీధర్‌రావు, నాగేందర్రావు, సీఈ సునీల్ పాల్గొన్నారు. ఏఐబీపీ ప్రాజెక్టులపైనా సమీక్ష.. ఇక గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ అధ్యక్షతన జరగనున్న ఏఐబీపీ ప్రాజెక్టుల సదస్సులో మంత్రి హరీశ్‌రావు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏఐబీపీ ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై మంత్రి హరీశ్ సమీక్షించారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా ప్రాధాన్యంగా పూర్తిచేయాల్సిన ప్రాజెక్టుల జాబితాలో తెలంగాణాలోని 11 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రూ.659 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో దేవాదుల ప్రాజెక్టు కిందే రూ.460 కోట్ల పెండింగ్ నిధులు రావాల్సి ఉంది. ఈ నిధుల విడుదలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇక ఈ ప్రాజెక్టులకు క్యాడ్ వామ్ కింద రూ.వెయ్యి కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. వీటిపై మంత్రి సమీక్షించారు. -
కాళేశ్వరం ప్రాజెక్టు ఓ రికార్డు
సాక్షి, సిద్దిపేట: గోదావరి జలాలను తెలంగాణలోని బీడు భూములకు మళ్లించేందుకు నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు యుద్ధంగా భావించి చేపడుతున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్‌లో నిర్మిస్తున్న రంగనాయక సాగర్ రిజర్వాయర్ పనులను, సొరంగ మార్గంలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. టన్నెల్ ద్వారా సొరంగం తొలియడం, కాల్వల నిర్మాణ పనులను మంత్రి నేరుగా చూశారు. భూ అంతర్భాగంలో నిర్మించే కాల్వలు, సర్జిబుల్ సంప్ నిర్మాణాలు, అక్కడి నుంచి రిజర్వాయర్లకు నీరు మళ్లించడం మొదలైన అంశాలపై నీటిపారుదల శాఖ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ పైభాగానికి సగటున 100 మీటర్ల లోతులో భూమిని తొలిచి సొరంగ మార్గం ద్వారా కాల్వల నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇలాంటి పనులు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా చేపట్టలేదని ఇది ఒక రికార్డుగా మంత్రి అభివర్ణించారు. ప్రతీ పాయింట్ వద్ద మూడు షిఫ్టుల పని జరుగుతుందని, ప్రతిచోట షిఫ్టుకు 2 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి వివరించారు. 95 శాతానికి పైగా టన్నెల్ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. జూలై చివరి నాటికి సిద్దిపేటకు.. అనంతరం దశలవారీగా తెలంగాణలో సగభాగానికి గోదావరి జలాలు పారిస్తామన్నారు. నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ మాట్లాడుతూ.. రూ.80 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు 49.15 కిలోమీటర్లు సొరంగ మార్గంలో ఇప్పటి వరకు 46 కిలోమీటర్ల పని జరిగిందని చెప్పారు. మిడ్‌మానేరు నుంచి 32 కిలోమీటర్ల సొరంగ మార్గం కాలువ పనులకు గాను ఇప్పటి వరకు 31 కిలోమీటర్ల పని పూర్తి చేసి ఫినిషింగ్ వర్క్ జరుగుతోందని వివరించారు. ఇందుకోసం ఇప్పటి వరకు రూ.22 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. జూలై చివరి నాటికి ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు గోదావరి నీటిని పారిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు 600 మీటర్ల ఎత్తుకు గోదావరి జలాలు తీసుకెళ్లేందుకు అధునాతన పరిజ్ఞానంతో పంప్‌హౌస్‌లు, మోటార్లు బిగిస్తున్నామని, వీటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఆయన వివరించారు. -
కాంగ్రెస్‌ను పాతరేద్దాం - మంత్రి
సాక్షి, మెదక్ : అభివృద్ధి పనులను అడుగడుగునా అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని పాతరేద్దామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మెదక్- మక్త భూపతిపూర్ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. అంతేకాక ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూ కేంద్రం ప్రారంభోత్సవం, ఇటీవల నియమించిన గ్రంథాలయ సంస్థ పాలక మండలి సభ్యుల ప్రమాణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన అంటేనే కరెంట్ కోతలు, మంచినీళ్ల బాధలు తప్ప రాష్ట్ర ప్రజలకు వారు చేసిందేమీ లేదని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత 24 గంటల పాటు ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభం, మిషన భగీరథ, కాకతీయ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు పెట్టుబడికి ఏడాదికి రూ. 8 వేలు అందిస్తుంటే.. కాంగ్రెస్ అడ్డుపడుతోందని ఆయన విమర్శించారు. అందుకే ఆ పార్టీని భూస్థాపితం చేసేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యతిరేకి అయిన సీపీఎంతో జేఏసీ చైర్మన్ కోదండరాం చెట్టాపట్టాలు వేసుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. విపక్షాల పంచన చేరి కోదండరాం వేస్తున్న ఎత్తుగడలు ఫలించవని మంత్రి చెప్పారు. -
30 ఏళ్లు.. 87 టీఎంసీలు
► ‘మిషన్ భగీరథ’ అవసరాలపై అంచనాలు సిద్ధం సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’కు అవసరమయ్యే నీటి లెక్కలు సిద్ధమయ్యాయి. రాబోయే 30 ఏళ్ల అవసరాలపై ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 2018 జనవరి నాటికి సుమారు 60 టీఎంసీల నీరు అవసరమవుతుందని, 2050 నాటికి అది 87.64 టీఎంసీలకు చేరుతుందని లెక్కలేసింది. నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి తాగునీటికి 10 శాతం నీటిని వాడుకోవాలనే నిర్ణయానికి అనుగుణంగా ఈ అంచనాలను తయారు చేసింది. ఏ నది బేసిన్ నుంచి ఎంత నీరు తీసుకోవాలి, ప్రాజెక్టుల నుంచి ఎంత తీసుకోవాలన్న అంశాలపై నీటిపారుదల శాఖ, తాగునీటి విభాగం అధికారులతో కలసి ఈ కార్యాచరణ రూపొందించారు. గత అంచనా కన్నా భారీగా పెరుగుదల వాస్తవానికి మిషన్ భగీరథకు కృష్ణా, గోదావరి బేసిన్లలోని 26 సెగ్మెంట్లకు నీరందించేందుకు ప్రాజెక్టుల నుంచి మొత్తం 39.19 టీఎంసీల నీటిని వాడుకోవాలని ప్రభుత్వం మొదట నిర్ణయించింది. కృష్ణా బేసిన్లో 19.59 టీఎంసీలు, గోదావరి నుంచి 19.67 టీఎంసీలు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయితే పెరుగుతున్న రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ఈ కేటాయింపుల్లో మార్పులు చేసింది. ఈ ఏడాది మొదట్లో నీటి అవసరాలపై అంచనాలు వేసిన అధికారులు వాటిని సవరించారు. 2018 నాటికి 41.31 టీఎంసీలు, 2033 నాటికి 50.6 టీఎంసీలు, 2048 నాటికి 60.75 టీఎంసీల అవసరం ఉంటుందని లెక్కకట్టారు. అయితే వచ్చే 30 ఏళ్ల అవసరాలపై అంచనాలు సిద్ధం చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నుంచి 10 శాతం నీటిని తీసుకోవాలని సూచించారు. దీంతో మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో సమావేశాలు నిర్వహించిన నీటిపారుదల, తాగునీటి విభాగం అధికారులు నీటి అవసరాల ప్రణాళికలు సిద్ధం చేశాయి. రెండు బేసిన్ల పరిధిలోని 37 ప్రాజెక్టుల నుంచి 2018 నాటికే 59.17 టీఎంసీలు తీసుకోవాలని, ప్రతి ఐదేళ్లకు 5 టీఎంసీల మేర పెరిగినా 2050 నాటికి 87.64 టీఎంసీలు అవసరం ఉంటుందని లెక్కలేశాయి. ఇందులో గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నుంచే అధిక కేటాయింపులు ఉండేలా చూసుకున్నాయి. 2018లో ఈ బేసిన్ ప్రాజెక్టుల నుంచి 32.17 టీఎంసీలు తీసుకోనుండగా.. కృష్ణా బేసిన్ నుంచి 23.08 టీఎంసీలు తీసుకోనున్నారు. ఈ లెక్కన 2050 నాటికి గోదావరి నుంచి 54.50 టీఎంసీలు తీసుకోనుండగా.. కృష్ణా బేసిన్ నుంచి 33.11 టీఎంసీల మేర తీసుకోనున్నారు. ఈ నీటిని తీసుకునేందుకు 37 ప్రాజెక్టుల కనీస మట్టాన్ని (ఎండీడీఎల్) కూడా నీటిపారుదల శాఖ నిర్ధారించింది. మార్చిన ఎండీడీఎల్లకు అనుగుణంగా ప్రాజెక్టుల ఆపరేషన్ మాన్యువల్‌లో మార్పులు చేసి ప్రభుత్వానికి అందించింది. నీటి అవసరాల అంచనా ఇలా.. (టీఎంసీల్లో) ఏడాది నీటి అవసరం 2018 59.17 2023 66.16 2028 69.56 2033 72.65 2038 76.98 2043 81.20 2048 85.34 2050 87.64 ► వచ్చే జనవరి నాటికి నీటి అవసరం60టీఎంసీలు ►2028 నాటికి నీటి అవసరం69టీఎంసీలు ►ప్రాజెక్టుల నుంచి తాగునీటికి..10% -
తల్లీ కొడుకు అదృశ్యమయ్యారు!
కీసర: భర్తతో గొడవపడి ఇంట్లోంచి పదకొండేళ్ల కొడుకుతో వెళ్లిన ఓ మహిళ కనిపించకుండాపోయారు. సీఐ గురువారెడ్డి కథనం ప్రకారం.. కీసర మండల కేంద్రానికి చెందిన చాకలి పోచయ్య, పద్మ(30) దంపతులు తమ కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు శివరాం(11) ఉన్నాడు. ఇదిలా ఉండగా, గత ఆదివారం కుటుంబ కలహాల నేపథ్యంలో పోచయ్య, పద్మ దంపతులు గొడవపడ్డారు. దీంతో మనోవేదనకు గురైన పద్మ తన కొడుకు శివరాంను తీసుకొని ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆమె కోసం కుటుంబసభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో శనివారం సాయంత్రం పోచయ్య కీసర ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు మిస్సింగ్ కేసుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి తెలిపారు. -
కాలినడకన వెళ్లి మొక్కు చెల్లించుకున్న మంత్రి!
సాక్షి, తిరుమల: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు శనివారం కాలినడకన తిరుమలకొండకు వచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆయన శనివారం తిరుమలేశుడి సన్నిధికి చేరుకున్నారు. సతీమణి శ్రీనితతో కలసి అలిపిరి మెట్లమార్గంలో నడిచివచ్చారు. రాత్రి 8.30 గంటలకు తిరుమలకొండకు చేరుకున్న ఆయన వెంకన్న స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించనున్నారు. కాగా, తెలంగాణకు చెందిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కుటుంబసభ్యులతో కలసి రోడ్డుమార్గంలో తిరుమలకు చేరుకున్నారు. వీరికి టీటీడీ రిసెప్షన్ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఓఎస్డీ లక్ష్మీనారాయణయాదవ్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికి బస ఏర్పాట్లుచేశారు. ఆదివారం ఉదయం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. -
'విజయవాడ వెళ్లిపోవాలి.. లేదా టీడీపీ వీడాలి'
నిజామాబాద్ : రాజకీయ లబ్ది కోసమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు ఆరోపించారు. గురువారం నిజామాబాద్‌లో హరీష్‌రావు విలేకర్లతో మాట్లాడుతూ... టీటీడీపీ నేతలు విజయవాడ వెళ్లిపోవాలి... లేదా టీడీపీని వీడాలని సూచించారు. ఏపీ కాంగ్రెస్ నేతలు చెరువు పనుల పేరుతో... కాంట్రాక్టుల జేబులు నింపారని విమర్శించారు. -
'అనవసర రాద్ధాంతం చేస్తున్నారు'
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఆ పార్టీ నాయకులు పెదవి కూడా విప్పలేదని ఆరోపించారు. భావితరాలకు నీరు ఇవ్వాలని తాము ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ అనవసర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రంగారెడ్డి జిల్లాలో 24 వేల ఎకరాలు అవసరమయితే 24 ఎకరాలు కూడా సేకరించలేదని ఆరోపించారు. లైడార్ సర్వే తర్వాత ప్రాజెక్టుపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఖర్చు చేసింది కేవలం రూ. 26 కోట్లు అని తెలిపారు. తక్కుల లిఫ్టుల సాయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హరీశ్ రావు హామీయిచ్చారు. -
తరుముకొస్తున్న ఖరీఫ్ లక్ష్యం!
* జూన్ నాటికి ప్రాజెక్టుల కింద కొత్త ఆయకట్టు * లక్ష్యం 6.26 లక్షల ఎకరాలు * క్షేత్ర స్థాయి ఇబ్బందులతో అధికారుల ఉక్కిరిబిక్కిరి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కింద పెట్టుకున్న కొత్త ఆయకట్టు లక్ష్యానికి ఓవైపు గడువు ముంచుకొస్తుంటే మరోవైపు ముందుకు కదలని పనులు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. ప్రాజెక్టుల పనులపై సమీక్షలు నిర్వహిస్తున్న నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు పనుల వేగిరానికి చర్యలు తీసుకుంటున్నా క్షేత్రస్థాయిలో భూసేకరణ, రైల్వే, రహదారుల క్రాసింగ్, సహాయ పునరావాస సమస్యలు ఈ ఏడాది జూన్ నాటికి నిర్ధారించుకున్న 6 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యానికి అడ్డుగా నిలుస్తున్నాయి. ఖర్చు ఘనం.. ఆయకట్టు గగనం.. ప్రాజెక్టుల పనులు చివరి దశలో ఉన్న ఏడు ప్రాజెక్టులను పూర్తిచేయడంతోపాటు మరో ఎనిమిది ప్రాజెక్టుల కింద పాక్షికంగానైనా సాగునీటిని ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల జాబితాలో కోయిల్‌సాగర్, గొల్లవాగు, రాలివాగు, నీల్వాయి వంటి మధ్యతరహా ప్రాజెక్టులకు రూ. వెయ్యి కోట్ల అంచనా వ్యయాన్ని నిర్ణయించగా ఇందులో ఇప్పటికే రూ. 900 కోట్ల మేర ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టుల కింద 85 వేల ఎకరాల మేర ఆయకట్టును జూన్ నాటికి ఇవ్వాల్సి ఉంది. ఇక పాక్షికంగానైనా నీటిని ఇవ్వాల్సిన వాటిలో మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, నల్లగొండలోని ఏఎమ్మార్పీ, వరంగల్‌లోని దేవాదుల, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండలకు సాగునీటిని ఇచ్చే ఎస్సారెస్పీ-2, వరద కాలువ, కరీంనగర్‌లోని ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టులున్నాయి. వీటి కింద మొత్తంగా 30 లక్షల ఎకరాల ఆయకట్టును తేవాల్సి ఉండగా ఇంతవరకు రూ. 27 వేల కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇప్పటివరకు 5.88 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వగా ఈ ఏడాది మరో 5.41 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని సంకల్పించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ప్రాజెక్టుల కింద నీటిని ఇవ్వడానికి అవకాశం ఉన్నా ప్రస్తుతం అక్కడ ప్రాజెక్టుల నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. సమస్యలు అధిగమిస్తేనే ఫలితం వర్షాకాలం మొదలవడానికి కేవలం మరో 20 రోజుల గడువే ఉంది. ఈలోగా ప్రధాన పనులను పూర్తి చేస్తేనే జూలై, ఆగస్టు నాటికైనా ఖరీఫ్‌కు సాగునీటినిచ్చే అవకాశం ఉంది. లక్ష్యం గడువు సమీపిస్తున్న తరుణంలో అప్రమత్తమైన నీటిపారుదలశాఖ... ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న భూసేకరణ సమస్యలు, ఆర్అండ్ఆర్ సమస్యలు, రైల్వే, రహదారుల క్రాసింగ్‌లపై దృష్టి పెట్టింది. వీటిపై నిత్యం అధికారులతో సమీక్షిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఈ సమస్యను అధిగమించడం అంత సులువేం కాదు. దీనికితోడు ఎస్కలేషన్ చార్జీలను పెంచాలన్న కాంట్రాక్టర్ల డిమాండ్‌పై ప్రభుత్వం త్వరగా తేలిస్తేనే వారు పనులను వేగిరం చేసే అవకాశాలున్నాయి. అయితే అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు నాటికైనా కనీసం 3 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరిస్తామని చెబుతున్నారు. -
త్వరలో 800 ఇంజినీర్ల నియామకం
మెదక్: రాష్ట్రంలో మున్సిపల్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్టు రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఇందుకుగాను 800 మంది మున్సిపల్ ఇంజినీర్లను త్వరలో నియమించనున్నట్టు చెప్పారు. ఆదివారం సాయంత్రం మెదక్ ఖిల్లాపై మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఇప్పటివరకు నాలుగు జిల్లాలకు ఒక మున్సిపల్ ఎస్ఈ ఉండేవారని, ఇకముందు రెండు జిల్లాలకు ఒక ఎస్ఈని నియమిస్తామన్నారు. జిల్లాకో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌ను నియమిస్తామని చెప్పారు. పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దడానికి పారిశుద్ధ్యంపై ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వావ్ పద్ధతి కింద ఐటీసీ సౌజన్యంతో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయనున్నట్టు తెలిపారు. ఇకనుంచి మున్సిపాలిటీల్లో చెత్తకుండీల పద్ధతి ఉండబోదన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరిస్తారని తెలిపారు. పొడి చెత్త ద్వారా పేపర్ వంటి ఉప ఉత్పత్తులు తయారు చేసే అవకాశం ఉందన్నారు. తడి చెత్తను ఎరువులకు వినియోగిస్తామని చెప్పారు. బీడీ కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వలేం.. చేగుంట: బీడీ కార్మికులందరికీ పింఛన్లు అందించలేమని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. దివారం మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో 10 శాతం ఉండి, పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులందరికీ పింఛన్లు అందిస్తామన్నారు. ప్రస్తుతం అర్హుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, వారందరికీ జీవనభృతి చెల్లిస్తామన్నారు. -
పవిత్ర యజ్ఞంలా చెరువుల పునరుద్ధరణ
మిషన్ కాకతీయపై ‘సాక్షి’తో నీటి పారుదల మంత్రి హరీశ్ చెరువుల పునరుద్ధరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని పవిత్ర యజ్ఞంలా నిర్వహిస్తామని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. మిషన్ కాకతీయ ప్రాజెక్టు పై నీటిపారుదల మంత్రి హరీష్‌రావు ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని పవిత్ర యజ్ఞంలా నిర్వహిస్తామని నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గతంలో మాదిరిగా ఎలాంటి అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకోకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. ఈ పనులను పరిశీలించేందుకు ఇప్పటికే జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించినట్లు చెప్పారు. ఇకపై తాను కూడా ప్రతిరోజూ జిల్లాల్లో పర్యటించి పనులను పర్యవేక్షిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం (నేడు) మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లాలోని సదాశివనగర్ మండలంలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయ ప్రాజెక్టుపై నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. చెరువు పనుల పురోగతి, లక్ష్యాలను వివరించారు. కాకతీయుల కాలం నాటి వైభవం మళ్లీ చెరువులకు వచ్చేలా, గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ముందు కు సాగుతామని, దీనికి అందరి భాగస్వామ్యం కావాలని కోరారు. గత బడ్జెట్లో మిషన్ కాకతీయకు రూ. 2 వేల కోట్లు కేటాయించగా ఈసారి అదే స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేశామని, నాబార్డ్, ట్రిపుల్ ఆర్ నిధులు భారీగా వస్తాయని భావిస్తున్నామని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... పూర్తి ఆయకట్టు లక్ష్యంగా.. గోదావరి, కృష్ణా జలాలకు సంబంధించి రాష్ట్ర వాటా కింద 262 టీఎంసీల మేర కేటాయింపులు ఉన్నప్పటికీ వినియోగం మాత్రం 100 టీఎంసీలు దాటడం లేదు. దీంతో చిన్న నీటి వనరుల కింద ఉన్న ఆయకట్టు లక్ష్యం 25 లక్షల ఎకరాల్లో సగాన్ని కూడా అందుకోవడం లేదు. ఈ దృష్ట్యానే 46 వేల చెరువుల పునరుద్ధరణతో పూర్తి నీటి వినియోగం, ఆయకట్టు లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు వేసుకున్నాం. ఈ ఏడాది 9,573 చెరువులను పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకోగా 7,140 చెరువుల అంచనాలు పూర్తి చేశాం. 5,330 చెరువులు పరిపాలనా అనుమతులు పొందాయి. 2,210 చెరువులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది. అతి తక్కువ వ్యవధిలో ఇన్ని వేల చెరువులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం గతంలో ఎన్నడూ లేదు. దీంతో పాటే ఉపాధి కోసం వలస వెళ్లినప్రజలు సొంతూరుకు తిరిగి వచ్చేలా, అడుగంటిన భూగర్భ జలాలను కాపాడేలా, బోర్లు, బావుల కింద మరింత ఎక్కువ భూమిని సాగులోకి తెచ్చేలా మిషన్ కాకతీయతో సమగ్రాభివృద్ధిని సాధించేందుకు కృషి చేస్తాం. గ్రామాల ఉమ్మడి ప్రయోజనాలే ముఖ్యం.. చాలా చెరువుల శిఖం భూములు కబ్జాకు గురైన విషయం తెలిసిందే. పట్టణాల్లో చెరువులదీ ఇదే పరిస్థితి. హుడా, జీహెచ్ఎంసీల్లోనూ ఇదే తంతు సాగింది. దీన్ని గుర్తించి రెవెన్యూ శాఖ సహకారాన్ని తీసుకున్నాం. శిఖం పట్టాదారులతో వచ్చే సమస్యలను అధిగమించేందుకు కలెక్టర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారికి తగు ఆదేశాలిచ్చాం. ఒక వ్యక్తి కంటే గ్రామాల ఉమ్మడి ప్రయోజనాలే మా ప్రభుత్వానికి ముఖ్యం. ఆ విధంగానే వ్యవహరిస్తూ కబ్జాదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. -
కరెంటివ్వని బాబు కాలెట్ల పెడతడు?: హరీశ్
సిద్దిపేట: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు కరెంట్ ఇవ్వడంలో ఏపీ సీఎం చంద్రబాబు కుట్రపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. అలాంటి వ్యక్తి నేడు తెలంగాణలో పర్యటించాలని భావించడం అర్థరహితమని పేర్కొన్నారు. కరెంట్ ఇవ్వని బాబు కాలెట్ల పెడతాడంటూ మండిపడ్డారు. ఆది వారం మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పంటలు ఎండిపోతాయనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం నీటి విడుదలకు చొరవ చూపిందన్నారు. కానీ చంద్రబాబు కుట్రతో తెలంగాణకు విద్యుత్ కోతలు ఏర్పడేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అలాంటి బాబును ఈ ప్రాంత ప్రజలు ఆదరించబోరన్నారు. త్వరలో ఆ పార్టీ దుకాణం ఖాళీ కానుందన్నారు. చంద్రబాబు వైఖరితో హైదరాబాద్‌లో ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమన్నారు. త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. -
లిఖిత పూర్వకంగా కోరితేనే..
ఏపీకి కృష్ణా నీటి విడుదలపై మంత్రి హరీశ్ సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ లేని హక్కులకోసం ఆశపడుతోం దని, తెలంగాణే తమకు అన్యాయం చేస్తోందన్న అపోహ సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బచావత్ అవార్డు మేరకు జరిపిన కేటాయింపులకు మించి నీటిని వాడేసుకొని... ఇప్పుడు ఉన్న నీటిని ఇస్తావా.. చస్తావా? అన్న ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చివరిదశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు ఎన్ని నీళ్లు కావాలో లిఖితపూర్వకంగా ప్రతిపాదన ఇస్తే సహృదయంతో పరిశీలిస్తామని... ఆ నీటిని తర్వాతి ఏడాదిలో సర్దుబాటు చేసుకుందామని హరీశ్ సూచించారు. అంతే తప్ప సాగర్ గేట్ల వద్ద ధర్నాలు, డ్రామాలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. డ్యామ్ గేట్లు పగలగొడతామంటూ కొం దరు ఏపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సచివాలయంలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణా జలాల్లో ఇప్పటివరకు ఉన్న కేటాయింపులు, వినియోగంపై ఆయన స్పష్టత ఇచ్చారు. అదనంగా వాడుకుంది ఏపీనే.. ‘‘ప్రస్తుతం లభ్యతగా ఉన్న 63 టీఎంసీల్లో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 8 టీఎంసీలు, కుడి కాలువ కింద 5, ఎడమ కాలువ కింద 8 టీఎంసీలు, ఏఎంఆర్పీకి 2 నుంచి 3 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 3 టీఎంసీలు కలిపి మొత్తంగా 25 టీఎంసీల తాగునీటి అవసరాలున్నాయి. మిగతా సుమారు 40 టీఎంసీల నీటిని మొత్తంగా ఏపీ తమకే కావాలంటోంది. వాటాలు, లెక్కలు ఏవీ లేకుండా ఉన్న నీరంతా మాకే కావాలంటే తెలంగాణ రైతులు ఏం కావాలి..?’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. బచావత్ అవార్డు తీర్పును ప్రస్తావిస్తూ ‘‘బచావత్ ట్రిబ్యునల్ ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయించింది. ఈ నీటిని తెలంగాణలో ఎక్కడైనా వాడుకోవచ్చని తెలిపింది. అసలు 41.60 శాతం వాటా తెలంగాణకు, 58.40 శాతం వాటా ఆంధ్రాకు దక్కాలి. ఈ న్యాయసూత్రం ఆధారంగా నీటి లెక్కలను తేల్చుదాం. లేదంటే ఈ ఏడాది కృష్ణా బేసిన్లో మొత్తంగా లభించిన నీటిలో తెలంగాణకు 229.9 టీఎంసీలు, ఏపీకి 322.611 టీఎంసీలు దక్కాలి. ఈ సూత్రాల మేరకైనా నడుచుకోవాలి. నిజానికి ఏపీ ఇప్పటికే తన వాటాను మించి 365.75 టీఎంసీలను వాడుకుంది. అంటే 43.13 టీఎంసీలు అదనంగా వాడుకుంది. తెలంగాణ మాత్రం తన వాటాలో కేవలం 140.4 టీఎంసీలనే వినియోగించుకుంది. ఈ లెక్కన మరో 89.5 టీఎంసీలు వాడుకునే హక్కు ఉంది. అలాంటప్పుడు సాగర్‌లో లభ్యతగా ఉన్న నీటిని మొత్తం తమకే కేటాయించాలని ఏపీ కోరడం సమంజసం కాదు..’’ అని హరీశ్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకెళతారని తెలిపారు. ప్రస్తుతమున్న నీటిలో ఎన్ని టీఎంసీలు కావాలో ఏపీ లిఖితపూర్వకంగా కోరితే... వాటిని సర్దుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి చెప్పారు. సాగర్ గేట్ల వద్ద ధర్నాలు, డ్రామాలు తీవ్రమైన అంశమని, డ్యామ్ గేట్లు పగలగొడతామన్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్యామ్ పగలకొడతామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. -
'కృష్ణా డెల్లాకు నీరు విడుదల నిలిపివేత'
హైదరాబాద్ : కృష్ణా డెల్టాకు నీటి విడుదల నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రబీ పంటకు సాగర్ కుడి కాల్వ కింద నీటిని విడుదల చేయలేమని ఆ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఇప్పటికే కేటాయించిన దాని కంటే అదనంగా నీటిని ఏపీ ప్రభుత్వం వినియోగించుకుందని తెలిపారు. 44 టీఎంసీల నీటిని అదనంగా వాడుకున్నారని...అందువల్ల సాగర్‌లో నీటి మట్టం తగ్గిందని హరీష్‌రావు వెల్లడించారు. -
రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపాలి: హరీష్‌రావు
హైదరాబాద్, న్యూస్‌లైన్: రేపటి తెలంగాణ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ కలిసి రైతు కుటుంబాల్లో ఆత్మ విశ్వాసం నింపేందుకు కృషి చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు కోరారు. ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8 పురస్కరించుకొని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో గురువారం కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్, రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల పోరాట వేదిక, రైతుస్వరాజ్య వేదిక తదితర 13 సంఘాల ఆధ్వర్యంలో రైతుల ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళల, పిల్లల హక్కుల ధర్నా కార్యక్రమం గురువారం జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎడ్మ కిష్టారెడ్డి, ప్రొఫెసర్ కేఆర్ చౌదరి, ప్రొఫెసర్ రమా మేల్కోటే, సీపీఎం రైతు సంఘం అధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, సీపీఐ రైతు సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ, ప్రముఖ సంపాదకులు కె. రామచంద్రమూర్తి, ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య, మానవహక్కుల వేదిక కన్వీనర్ జీవన్‌కుమార్, వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు హాజరై రైతు ఆత్మహత్య కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. హరీష్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు బాధ్యతలను విస్మరించి, వ్యవసాయాన్ని పట్టించుకోకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. పరిశ్రమలు దివాళా తీస్తే ఆదుకునే ప్రభుత్వాలు రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ 1995 నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో అందించాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్య కుటుంబంలోని మహిళలకు ఫించన్ రూ. 200 నుంచి రూ. 2 వేలకు, ఎక్స్‌గ్రేషియాను రూ. లక్ష నుంచి రూ 5 లక్షలకు పెంచాలన్నారు. రైతు ఆత్మహత్యల నివారణకు రాజకీయ పార్టీల విధాన ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేఆర్ చౌదరి మాట్లాడుతూ ఈ కుటుంబాలకు బ్యాంకు, సహకార సొసైటీ రుణాలను మాఫీ చేయాలనీ, అంత్యోదయ పథకం వర్తింప చేయాలని, వీరి ఆరోగ్యం, పిల్లల చదువులను ప్రభుత్వమే భరించాలని, ప్రభుత్వం భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. -
టి. బిల్లు విమానంలో కాకుండా ఎడ్లబండిలో తీసుకు వస్తారా?
-
తెలంగాణ సీఎం హరీష్!
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతుండడంలో ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పార్టీల్లో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. టీఆర్ఎస్ పార్టీ తరపున హరీష్‌రావు పేరు వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నుంచి జైపాల్ రెడ్డి, జానారెడ్డి, సర్వే సత్యనారాయణ, మర్రి శశిధర్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. ఇక తెలంగాణ వస్తే తానే సీఎం అవుతానని టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ఇప్పటికే ప్రకటించుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి దళితుడినే తొలి సీఎం చేస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు పునరుద్ఘాటించారు. కొత్త రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానే తప్పా సీఎం పదవి తీసుకోనని ఆయన చాలాసార్లు స్పష్టం చేశారు. తాజాగా హరీష్ పేరు తెరపైకి రావడం టీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ తన కుమారుడు, కుమార్తెలను ప్రోత్సహిస్తూ మేనల్లుడైన హరీష్‌ను దూరం పెడుతున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్రానికి హరీష్‌రావు ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందని వరంగల్ జిల్లాకు చెందిన మహిళా నేత ఒకరు మంగళవారం నాడు వ్యాఖ్యానించారు. హరీష్ సీఎం అయితేనే తమ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం మహిళా నేత ఎన్. సువర్ణకుమారి అన్నారు. తమ పార్టీలో కోహినూర్ వజ్రంగా హరీష్‌ను టీఆర్ఎస్ నేత రెహముల్లా ఖాన్ వర్ణించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ జరుగుతుండగానే సీఎం పదవిపై అన్ని పార్టీల్లోనూ ఆశావహులు బయటపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ ముందునుంచి చెబుతుండడంతో టీఆర్ఎస్ పార్టీలో ఎవరూ బయటపడలేదు. సీఎం రేసులో ఉన్నామని చెప్పడానికి ఎవరూ సాహించలేదు. అయితే కార్యకర్తలు హరీష్ పేరు తెరపైకి తేవడంతో కేసీఆర్ ఎలా స్పందిస్తారనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. -
సీఎం సొంత జిల్లాకు రూ.5,800 కోట్లు: హరీష్‌రావు
సిద్దిపేట: ప్రజాధనంతో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాల్లో సీఎం విద్వేష పూరిత ప్రసంగాలతో రాజకీయం చేయడం ఏమిటని కిరణ్కుమార్రెడ్డిపైటీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లా సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోతే తెలంగాణకే నష్టమంటూ విశాఖ జిల్లాలో జరిగిన రచ్చబండలో సీఎం వ్యాఖ్యానించడం దొంగే.. దొంగ దొంగ.. అన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. పదవిపై వ్యామోహం లేదనే భావన ప్రజల్లో కలిగించేందుకు ప్రయాస పడేకన్నా...సీఎం సీటును వదలుకొని సీమాంధ్రలో కార్యక్రమాలు పెట్టుకోవాలని కిరణ్‌కు ఆయన హితవు పలికారు. విభజన జరుగుతోన్న దశలోనూ తెలంగాణకు మరింత నష్టం కలిగించేలా సీఎం అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించేలా దుమ్ముగూడెం ప్రాజెక్టుకు టెండర్లు పిలుస్తున్నారని ప్రస్తావించారు. తద్వారా తెలంగాణ రైతుల నోట్లో దుమ్ము కొడుతున్నారన్నారు. తన సొంత జిల్లా చిత్తూరుకు రూ.5,800 కోట్లు కేటాయించుకున్నారని, రెండో మెడికల్ కాలేజీ పెట్టుకుంటున్నారని, ఉన్నత విద్యా మండలి కౌన్సిల్ చైర్మన్ పదవిని, ఆర్‌అండ్‌బీలో ఈఎన్సీ పోస్టునూ తన జిల్లా వాసులకే ఇచ్చుకున్నారని హరీష్ ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను విచ్చలవిడిగా బదిలీ చేస్తున్నారని విమర్శించారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తామంటున్న సీమాంధ్రకు చెందిన దళిత, గిరిజన మంత్రులు కొండ్రు మురళి, బాలరాజులను సీఎం అవమానిస్తున్నారని అన్నారు. గవర్నర్, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆయన్ను సీఎం పదవి నుంచి తక్షణం తప్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. -
జేడబ్ల్యూటీ యాడ్ ఏజెన్సీతో సీఎం తమ్ముడికి సంబంధం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకల ప్రకటనల కోసం కిరణ్ ప్రభుత్వం కోట్లాది రూపాయిలు వృధాగా ఖర్చు చేస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్ రావు ఆరోపించారు. ఆదివారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడుతూ... అవతరణ వేడుకల కోసం ప్రభుత్వం రూ. 45 కోట్లు కేటాయించాలనుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆ వేడుకలకు అంత మొత్తంలో నిధులెందుకు కేటాయిస్తున్నారని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రకటనల కోసం కేటాయించిన నిధులను అకాల వర్షాల వల్ల నష్ట పోయిన రైతులకు కేటాయించాలని హరీష్ రావు ప్రభుత్వానికి సూచించారు. కిరణ్ కిమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతులు చేపట్టిన నాటి నుంచి జేడబ్ల్యూటీ యాడ్ ఏజెన్సీకి వందల కోట్ల రూపాయిలు కేటాయించారని హరీష్‌రావు ఆరోపించారు. ఆ సంస్థకు సీఎం తమ్ముడికి ఉన్న సంబంధమేంటో గవర్నర్‌తో విచారణ జరిపిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని హరీష్ రావు వ్యాఖ్యానించారు. అకాల వర్షాలతో నల్గొండ జిల్లా తీవ్రంగా నష్టపోయిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ.హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని వేల ఎకరాల పత్తి, వరి పంట నీట మునిగిందని చెప్పారు. అలాగే ఇళ్లు కూలిపోయాయన్నారు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వన్ని మరోసారి డిమాండ్ చేశారు. అలాగే ఎకరాకు రూ. 10 వేలు చొప్పున రైతులకు ఆర్థిక సాయం ప్రకటించాలని ప్రభుత్వానికి హరీష్ రావు సూచించారు. -
పాలమూరుకు అడుగడుగునా అన్యాయం
అచ్చంపేట, న్యూస్‌లైన్: సీమాంధ్రుల పాలనలో వెనకబడిన పాలమూరు జిల్లాకు అడుగడుగునా అన్యాయం జరిగిందని టీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత టి.హరీశ్వర్‌రావు అన్నారు. ఆర్డీఎస్ కింద జిల్లాలో 82 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, 30వేలకు మించి అందడం లేదన్నారు. 2012లో కరువు ఏర్పడితే ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని 64 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి రూ.640 కోట్లు ఇచ్చి, పాలమూరు జిల్లాలో కేవం ఐదు మండలాలను మాత్రమే గుర్తించి రూ.40 కోట్లు ఇచ్చిందని వివరించారు. సోమవారం సాయంత్రం అంగిరేకుల శేఖరయ్య ఫంక్షన్హాల్లో జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్వర్‌రావు మాట్లాడు తూ.. సీమాంధ్రుల పాలనలో తెలంగాణ ప్రజలకు ఆకలిచావులు, వలసలు, ఆత్మహత్యలు, దోపిడీయే మిగిలిందన్నారు. ఈ ప్రాంతభూములు, ప్రాజెక్టులను కబ్జాచేశారని ఆరోపించారు. సీమాం ధ్రులు తెలంగాణను దొరికినకాడికి దోచుకున్నారని, ఇంకా ఉన్న వనరులను దోచుకునేందుకు సమైక్యపాట పడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ విషయంలో అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేశారు. తెలంగాణకు అనుకూలమని చెప్పిన అన్ని రాజ కీయ పార్టీలు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చెప్పడంతో వారి నిజస్వరూపం బయటపడిందన్నారు. అ మరులు కలలు గన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుం దని, ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీ రు, కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య, ఇల్లు నిర్మించుకునే వారికి రూ.2లక్షలు, వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు రూ.వెయ్యి పింఛన్లు, ఆకలి, ఆత్మహత్యలు లేని పచ్చని తెలగాణ లక్ష్యంగా నిర్మాణం జరుగుతుందన్నారు. తెలంగాణలో గులాబీ జెండాకు తప్ప మరే జెండాలకు స్థానం లేదన్నారు. ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపాలని కార్యకర్తలను కోరారు. నాలుగు నెలల తర్వాత ఏర్పడేది మన ప్రభుత్వమేనని కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవ చేయాలని కోరారు. తెలంగాణ కోసం జైకొట్టిన శ్రీనివాస్‌గౌడ్, బాలరాజు యాదవ్‌లపై సీమాంధ్రులు దాడులుచేసి దాదాగిరీ చేశారని, తామెక్కడైనా చేశామా? అని హరీశ్వర్‌రావు ప్రశ్నించారు. ఏం చేశారని సంబరాలు: ఎంపీ మందా జగన్నాథం జిల్లా మంత్రి డీకే అరుణ, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలంగాణ ఉద్యమంలో ఏనాడైనా పాల్గొన్నారా? అని నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం ప్రశ్నించారు. ఉద్యమం చేసి తెలంగాణ కోసం పోరాటం చేసిన వారు సంబరాలు జరుపుకోవాలి తప్ప మీలాంటి వారు కాదన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజాఉద్యమంలోకి వచ్చి సంబరాలు జరుపుకోవాలని హితవుపలికారు. 2014 ఎన్నికల్లో ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు రాజీనామాలు చేసిన తరువాతే ఉద్యమ పరిస్థితులను గమనించి సోనియాగాంధీ తెలంగాణ ప్రకటన చేశారని తెలిపారు. తెలంగాణలో ఉన్న వనరులను దోచుకునేందుకే సమైక్యపాట పాడుతున్నారని విమర్శించారు. శ్రీశైలం నుంచి తెలుగుగంగా, పోతిరెడ్డిపాడుకు నీటిని తరలించకపోయారు తప్ప పక్కనే ఉన్న కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ప్రాంతాలకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ఎంజీఎల్‌ఐ ద్వారా కనీసం ఒక ఎకరాకు కూడా సాగునీరు అందించలేకపోయారని విమర్శించారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విఠల్‌రావు ఆర్యా, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గువ్వల బాలరాజు, జి.సుదర్శన్, అర్జున్‌రావు, కట్టా గోపాల్‌రెడ్డి, బాలయ్య చంద్రమోహన్, చీమర్ల మధుసూదన్‌రెడ్డి, పల్కపల్లి, మర్రిపల్లి, పెనిమళ్ల సర్పంచ్‌లు నర్సింహ్మగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మీరేగా నిర్ణయం తీసుకోవాలన్నది?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలంటూ ప్రధానికి లేఖ రాసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీరా నిర్ణయం తీసుకున్న తర్వాత తొందరపడి తీసుకున్నారని ఎలా అంటారని టీఆర్ఎస్ పార్టీ మండిపడింది. ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకుడు టి.హరీష్‌రావు, ఎమ్మెల్యేలు ఏనుగు రవీంద్రరెడ్డి, గంగుల కమలాకర్, పలువురు పార్టీ నేతలు మంగళవారం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘అసలు తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ఐదేళ్ల కిత్రమే ఐదుగురితో కమిటీ వేసింది మీరు కాదా? 2009 ఎన్నికలకు ముందు తెలంగాణకు అనుకూల ప్రకటన చేయలేదా? టీడీపీ ఎన్నికలలో మేనిఫెస్టోలోనూ తెలంగాణ అంశం చేర్చలేదా? కేసీఆర్ అమరణ దీక్షకు దిగినప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం మీరు పెడతారా, నన్ను పెట్టమంటారా అని ప్రభుత్వాన్ని అడిగింది మీరు కాదా? ఇన్ని జరిగాక తెలంగాణపై నిర్ణయం జరిగితే దాన్ని ప్రశ్నించడానికి నోరెలా వచ్చింది’ అంటూ చంద్ర బాబు వైఖరిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుది అధికారం కోసం ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మనస్తత్వం అని దుయ్యబట్టారు. రాత్రికి రాత్రికి మాట మార్చే, సిద్ధాంతాలు మార్చుకునే వ్యక్తి దేశంలోనే చంద్రబాబుకు మించిన వారుండరని అన్నారు. చంద్రబాబు మాటలు చూశాక టీడీపీ ఇన్నాళ్లు తెలంగాణ అంశంపై డ్రామాలాడిందన్న విషయం స్పష్టమైందని, ఇక తేల్చుకోవాల్సింది టీ- టీడీపీ నేతలేనన్నారు. మంత్రుల భార్యల తీరుపై టీఆర్ఎస్ మండిపాటు రాష్ట్రం సమైక్యంగా ఉంచాలంటూ గవర్నర్ వద్దకు వెళ్లి వినతిపత్రం ఇచ్చిన సీమాంధ్ర ప్రాంత మంత్రుల భార్యలు... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ అనేక మంది బలిదానాలు చేసుకున్నప్పుడు ఎందుకు స్పందించలేదని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక యాదయ్య, మరొక శ్రీకాంతాచారి కాల్చుకుని చనిపోతున్నప్పుడు కన్నతల్లుల బాధలు తెలిసిన సాటి మహిళలుగా ‘అలాంటి ఆత్మహత్యలను ఆపండి’ అని వాళ్లు తమ భర్తలను కోరి ఉంటే తామూ సంతోషించేవాళ్లమని చెప్పారు.