సాక్షి, సిద్దిపేట: తెలంగాణ ఉద్యమ కేంద్రంగా పేరు తెచ్చుకున్న సిద్దిపేట నియోజకవర్గం మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు వేదికైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కీలక నేతగా, కష్టాల్లో ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించిన మంత్రి హరీశ్‌రావు మంగళవారం వెలువడనున్న శాసనభ ఎన్నికల ఫలితాల్లో అరుదైన రికార్డులు సొంతం చేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.
మేన మామ, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నుంచి వారసత్వంగా స్వీకరించిన సిద్దిపేట నియోజకవర్గ బాధ్యతలను హరీశ్ విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఈ ఎన్నికల్లో హరీశ్‌రావు గెలుపు నల్లేరు మీద నడకేనని అంటున్నారు. కాకపోతే పార్టీ శ్రేణులతోపాటు హరీశ్‌రావు ఆశ పెట్టుకున్న లక్ష మెజారిటీ, డబుల్ హ్యాట్రిక్‌పైనే అందరి దృష్టి నెలకొంది. అదే జరిగితే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన అభ్యర్థిగా రికార్డు సృష్టిస్తారు. దాంతోపాటు ఇప్పటి వరకు తాను గెలిచిన ఐదుసార్లూ ప్రత్యర్థికి డిపాజిట్ కూడా దక్కకుండా చేసిన ఘనత కూడా హరీశ్‌రావుకు దక్కనుంది. దీంతో మంగళవారం వెలువడనున్న ఫలితాలపై హరీశ్ అనుచరులు, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
నాలుగుసార్లు ప్రత్యర్థికి డిపాజిట్ గల్లంతు
సిద్దిపేట నియోజకవర్గం నుంచి 2004లో మామ కేసీ ఆర్ రాజీనామాతో ఉప ఎన్నికల్లో పోటీలోకి దిగిన హరీశ్‌రావు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పట్నుంచి ప్రతి ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తూనే ఉన్నారు. 2004 ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి, మాజీ మం త్రి ముత్యంరెడ్డిపై 24,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికల్లో మరో సారి ప్రత్యర్థి బైరి అంజయ్యపై 58,935 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో అంజయ్యకు 17,335 ఓట్లు మాత్రమే రాగా.. డిపాజిట్ కూడా దక్కలేదు.
2009 సాధారణ ఎన్నికల్లో హరీశ్‌రావుకు 85,843 ఓట్లు రాగా తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి బైరి అం జయ్యకు కేవలం 21,166 ఓట్లు వచ్చాయి. దీంతో హరీశ్ 64,677 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి కూడా ప్రత్యర్థికి డిపాజిట్ దక్కలేదు. 2010 ఉప ఎన్నికల్లో హరీశ్‌రావుకు 1,08,779 ఓట్లు రాగా ప్రత్యర్థి తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌కు కేవలం 12,921 ఓట్లు వచ్చాయి. దీంతో హరీశ్ 95,858 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన 2014 సాధారణ ఎన్నికల్లో హరీశ్‌రావుకు 1,08,699 ఓట్లు రాగా ప్రత్యర్థి తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌కు 15,371 ఓట్లు మాత్రమే వచ్చాయి.
దీంతో మరోసారి హరీశ్‌రావుకు 93,328 ఓట్ల ఆధిక్యత వచ్చింది. అయితే గడిచిన రెండు ఎన్నికల్లో 90 వేలు మెజారిటీ సాధించిన హరీశ్‌రావు.. ఈసారి ఎలాగైనా తన మెజారిటీని లక్ష దాటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగినట్లుగానే కార్యకర్తలు, అనుచరులు తీవ్రంగా కష్టపడ్డారు. దాంతోపాటు పోలింగ్ శాతం పెరిగితేనే మెజారిటీ పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని గుర్తించి విస్తృతంగా ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సారి ఎలాగైనా లక్ష మెజారిటీ సాధించడం ఖాయమని టీఆర్‌ఎస్ శ్రేణులు ధీమాతో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment