సాక్షి, హైదరాబాద్: వృత్తి, వ్యాపారాల రీత్యా నిత్యం ప్రజల మధ్య ఉంటూ కోవిడ్ వ్యాప్తికి కారణమవుతున్న వారిని సూపర్‌స్ప్రెడర్లుగా పరిగణిస్తూ వారందరికీ టీకాలు వేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. కోవిడ్ నియంత్రణ, లాక్‌డౌన్ అమలు తీరుపై సోమవారం సమీక్ష సందర్భంగా సూపర్ స్ప్రెడర్స్‌కు వ్యాక్సిన్ అంశాన్ని పరిశీలించాలని హరీశ్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యం లో మంగళవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో హరీశ్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమావేశమై సూపర్ స్ప్రెడర్ల గుర్తింపు, ఇతర ఏర్పాట్లపై చర్చించారు.
ప్రస్తుతమున్న వ్యాక్సిన్ నిల్వల ఆధారంగా.. ఈ నెల 28న హైదరాబాద్‌లోని ఆటోడ్రైవర్లతో వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సూపర్‌స్ప్రె డర్స్ దాదాపు 30 లక్షల మంది వరకు ఉంటారని అంచనా వేశారు. వీరిలో 18 ఏళ్లు నిండిన వారం దరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని నిర్ణయిం చారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ ఉన్నా నిత్యావసరాల కోసం 4 గంటలపాటు వెసులుబాటు కల్పించారు. ఈ సమయంలో ప్రజానీకం విపరీతంగా చేపలు, మాంసం, కిరాణా దుకాణాలకు వెళ్తుండటంతో కరోనా సోకుతోంది. అక్కడ పనిచేసే సిబ్బంది, వ్యాపారుల్లో ఏమాత్రం లక్షణాలున్నా.. అది వచ్చే ప్రజలకు సులభంగా అంటుకునే అవకాశం ఉంది. దీంతో ముందుగా ఈ సూపర్ స్ప్రెడర్స్‌కు టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సమావే శంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్య దర్శి రిజ్వీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, పురపాలక శాఖ కమిషనర్ ఎన్.సత్యనారాయణ, రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్‌ఎం రావు, ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. డీలర్లు, గుమాస్తాలు, పెట్రోలి యం, ఎల్పీజీ డీలర్లు, సిబ్బందికి కోవిడ్ టీకాలు వేసేందుకు ఈ నెల 28 నుంచి 31 వరకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు పౌరసరఫ రాల శాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్లకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిం చాలన్నారు. ఇందుకు ముందుగానే లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు.
సూపర్ స్ప్రెడర్స్ అంటే..
వృత్తి, వ్యాపారాల రీత్యా ప్రజల మధ్య ఉంటూ కోవిడ్ వ్యాప్తికి కార ణమవుతారని భావిస్తున్న వారిని సూపర్ స్ప్రెడర్లుగా పరిగణిస్తారు.
సూపర్ స్ప్రెడర్స్ వీరే...
ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సిబ్బంది, రేషన్ డీలర్లు, పెట్రోల్ పంపుల సిబ్బంది, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లలోని విక్రేతలు, పండ్లు, కూరగాయలు, పూల మార్కెట్లు, కిరాణా షాపులు, మద్యం దుకాణాలు, మాంసాహార మార్కెట్ల వ్యాపారులు, సెలూన్లలో పనిచేసే సిబ్బంది.
30,00,000
రాష్ట్రవ్యాప్తంగా ఈ సూపర్ స్ప్రెడర్స్ దాదాపు 30 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. వీరందరికీ ఉచితంగానే టీకాలు వేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment