
జేడబ్ల్యూటీ యాడ్ ఏజెన్సీతో సీఎం తమ్ముడికి సంబంధం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకల ప్రకటనల కోసం కిరణ్ ప్రభుత్వం కోట్లాది రూపాయిలు వృధాగా ఖర్చు చేస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్ రావు ఆరోపించారు. ఆదివారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడుతూ... అవతరణ వేడుకల కోసం ప్రభుత్వం రూ. 45 కోట్లు కేటాయించాలనుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆ వేడుకలకు అంత మొత్తంలో నిధులెందుకు కేటాయిస్తున్నారని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రకటనల కోసం కేటాయించిన నిధులను అకాల వర్షాల వల్ల నష్ట పోయిన రైతులకు కేటాయించాలని హరీష్ రావు ప్రభుత్వానికి సూచించారు.
కిరణ్ కిమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతులు చేపట్టిన నాటి నుంచి జేడబ్ల్యూటీ యాడ్ ఏజెన్సీకి వందల కోట్ల రూపాయిలు కేటాయించారని హరీష్రావు ఆరోపించారు. ఆ సంస్థకు సీఎం తమ్ముడికి ఉన్న సంబంధమేంటో గవర్నర్తో విచారణ జరిపిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని హరీష్ రావు వ్యాఖ్యానించారు. అకాల వర్షాలతో నల్గొండ జిల్లా తీవ్రంగా నష్టపోయిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ.హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలోని వేల ఎకరాల పత్తి, వరి పంట నీట మునిగిందని చెప్పారు. అలాగే ఇళ్లు కూలిపోయాయన్నారు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వన్ని మరోసారి డిమాండ్ చేశారు. అలాగే ఎకరాకు రూ. 10 వేలు చొప్పున రైతులకు ఆర్థిక సాయం ప్రకటించాలని ప్రభుత్వానికి హరీష్ రావు సూచించారు.