గత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మంజూరు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సూచించే 4,263 పనులకు కేటాయింపు
ఇప్పటికే పనులు కొనసాగుతున్న ప్రాంతాల్లో తనిఖీలు
ఉపయోగం లేకుంటే నిధులు విడుదల బంద్
జిల్లా కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన సుమారు రూ.400 కోట్ల విలువైన పనులను నామినేషన్‌పై ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సూచించిన పనులను వారి అనుయాయులకు వీటిని కేటాయించనున్నారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో తనకు నచ్చిన ఎమ్మెల్యేలు సూచించిన 21,727 పనులకు విచక్షణాధికారంతో ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి నిధులు మంజూరు చేశారు. ఇందులో 10,864 పనులు పూర్తి కాగా మరో 6,600 పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. గతంలో మంజూరై ఇంకా ప్రారంభించని 4,263 పనులను రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
వీటికి సంబంధించి కలెక్టర్ల దగ్గర పీడీ ఖాతాల్లో సుమారు రూ.400 కోట్ల నిధులున్నాయి. రద్దు చేసిన వాటి స్థానంలో టీడీపీ ఎమ్మెల్యేలు సూచించిన పనులకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఈ నేపథ్యంలో 4,263 పనులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రణాళికా శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కొనసాగుతున్న 6,600 పనులను తనిఖీలు చేయాలని, వీటితో ప్రయోజనం లేకుంటే నిధుల విడుదలను నిలిపివేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను తన గుప్పిట్లో ఉంచుకునేందుకు ప్రజా ధనాన్ని ఎరగా వేస్తూ ప్రత్యేక అభివృద్ధి నిధిని బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. తనకు నచ్చిన ఎమ్మెల్యేలు అడిగిన పనులను మంజూరు చేశారు. ఆ ఎమ్మెల్యేలు తమవారికి వీటిని నామినేషన్లపై కట్టబెట్టారు. ప్రస్తుత బడ్జెట్‌లో ఇలాంటి నిధిని ఏర్పాటు చేయకున్నా గత సీఎం మంజూరు చేసిన పనులు ప్రారంభం కాకుంటే వాటిని రద్దు చేసి అధికారి పార్టీ ఎమ్మెల్యేలు సూచించిన పనులకు నిధులు విడుదల చేయనున్నారు.
రూ.400 కోట్ల పాత పనులు రద్దు
Published Mon, Oct 6 2014 1:07 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement