గుంటూరు: ‘బంగారుతల్లి’కి ఎంతో కష్టమొచ్చింది. పుట్టిన ఆడబిడ్డకు ప్రభుత్వం తనవంతు సాయం అందిస్తామంటూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గత ఏడాది మే 1న బంగారుతల్లి పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. నెలలు గడిచినా వారి ఖాతాల్లో నగదు జమకావడం లేదు. దీంతో లబ్ధిదారులు సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. కానీ పథకం అమలు అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణంగా దరఖాస్తు పెట్టిన 21 రోజులకు నిధులు మంజూరు చేయాల్సి ఉంది. కాని నెలలు గడుస్తున్నా దరఖాస్తులు చేసుకున్నవారి ఖాతాల్లో నగదు జమ కావటం లేదు. మండలంలో గత ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు 324 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటి వరకు 94 మందికి మాత్రమే నిధులు జమైనట్లు చెబుతున్నారు.
ఒక్కో ఆడపిల్లకు రూ. 2,016 వేలు
ఈ పథ కానికి దరఖాస్తు చేసుకున్నవారికి వారి ఖాతాల్లో రూ. 2500 జమ చేస్తారు. అనంతరం బిడ్డ మొదటి, రెండో సంవత్సరానికిగాను ఏడాది రూ. రెండు వేలు, మూడు నుంచి ఐదేళ్లకుగాను ఏడాదికి రూ. 1500లు, ఆరు నుంచి 10 ఏళ్ల వరకు ఏడాదికి రూ. రెండు వేలు, 11 నుంచి 13వ సంవత్సరం వరకు ఏడాదికి రూ. 2500లు, 14 నుంచి 15వ సంవత్సరం వరకు ఏడాదికి రూ. మూడు వేలు, 16 నుంచి 17 వ సంవత్సరం వరకు ఏడాదికి రూ. 3,500లు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఇంటర్ పూర్తికాగానే ఒకేసారి రూ. 50 వేలు అందజేస్తారు. 18 నుంచి 21 సంవత్సరాలకుగాను ఏడాదికి రూ. నాలుగు వేలు చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. ఒక్కో ఆడపిల్లకు రూ. 2.16 లక్షల చొప్పున సాయం అందజేస్తుంది. అయితే పథకం ఆరంభంలో ఉన్న చొరవ అమలులో లేకపోవడంతో తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకం అమలు చేయనప్పుడు దరఖాస్తులు తీసుకోకుండా ఉన్నా సరిపోతుందని మహిళలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దరఖాస్తులకు విముక్తి కలిగించి పథకం పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు తల్లులు కోరుతున్నారు.
‘బంగారుతల్లి’కి ఎంత కష్టం!
Published Fri, Aug 15 2014 1:10 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement