హమ్మయ్య.. ఆయన కనిపించారు!
ఉమ్మడి రాష్ట్రానికి ఆయన చిట్టచివరి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కానీ రాష్ట్ర విభజన నిర్ణయం అయిపోయి, ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం ఒక్కసారిగా ఉన్నట్టుండి మాయమైపోయారు. ఆయనే.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. జై సమైక్యాంధ్ర పార్టీ అనే పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించి, ఒక్క సీటు కూడా గెలుచుకోలేక చతికిలబడిన తర్వాత.. కిరణ్ ఏమైపోయారో చాలా కాలం పాటు ఎవరికీ తెలియలేదు. ఈ మధ్య కాలంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరతారన్న కథనాలు కూడా వినిపించాయి. కానీ ఎవరేమనుకున్నా.. కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఎవరికీ దర్శనభాగ్యం కల్పించలేదు.
అయితే ఇన్నాళ్ల తర్వాత ఉన్నట్టుండి హైదరాబాద్లో జరిగిన ఓ పుస్తక పరిచయం కార్యక్రమంలో కిరణ్ దర్శనమిచ్చారు. శేఖర్ గుప్తా అనే పాత్రికేయుడు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ఆయన స్వయంగా వచ్చారు. తనకంటే చురుగ్గా, ప్రస్తుతం క్రియాశీలకంగా చాలామంది నాయకులు ఉన్నారని, వాళ్లలో ఎవరినైనా ఎంచుకోవాలని చెప్పినా.. శేఖర్ గుప్తా తననే పిలిచారని కిరణ్ అన్నారు. ఏదైనా గానీ, ఆ పేరు చెప్పి కిరణ్ కుమార్ రెడ్డిని చూశామని చాలామంది రాజకీయ పండితులు అన్నారు.
ఇక ఈ సందర్భాన్ని కూడా కిరణ్ చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఒకటి రెండు మాటలు చెప్పారు. బీజేపీ కురువృద్ధ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయిని కూడా ప్రస్తావించారు. విలేకరులు అడిగితే మాత్రం.. గుంభనంగా నవ్వి ఊరుకున్నారు తప్ప తన రాజకీయ రంగ పునఃప్రవేశం గురించి ఒక్కమాట కూడా చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు అన్నీ అవే తెలుస్తాయన్నారు.