అధిష్టానం శాసించింది.. వీళ్లు పాటించారు
ఢిల్లీ ఆదేశాలకు అనుగుణంగానే కిరణ్ ‘తిరస్కరణ తీర్మానం’
సోనియా ఆదేశాలతో రాష్ట్ర నేతలతో దిగ్విజయ్ మంతనాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీర్మానం పెట్టటం కాంగ్రెస్ అధిష్టానం ఎత్తుగడల్లో భాగమేనని ఆ పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు. శాసనసభ స్పీకర్‌కు ఇబ్బంది కలిగించని రీతిలో.. తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే తమకు అనుకూలంగా అన్వయించుకునే రీతిలో రూపొందించిన ఈ నోట్ రూపకల్పనలో పూర్తిగా హైకమాండ్ పాత్ర ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
ఆ వర్గాలు చెప్పిన సమాచారం మేరకు... రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీ నుంచి ఏ విధంగా తెప్పించుకోవాలి? ఈ విషయంలో తెలంగాణ, సీమాంధ్ర నేతలను ఏ విధంగా సంతృప్తి పరచాలి? అనే విషయంపై హైకమాండ్ పెద్దలు గత రెండు రోజులుగా సుదీర్ఘంగా కసరత్తు చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేరుగా జోక్యం చేసుకుని.. శాసనసభ స్పీకర్‌కు ఇబ్బందికర పరిస్థితులు కలగని రీతిలో తెలంగాణ బిల్లును కేంద్రానికి పంపేలా చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను ఆదేశించారు. రంగంలోకి దిగిన దిగ్విజయ్ బుధవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి కె.జానారెడ్డి తదితరులకు ఫోన్లు చేశారు. వారితో మంతనాలు జరిపిన అనంతరం అసెంబ్లీలో చివరి రోజు అనుసరించాల్సిన వ్యూహంలో సభలో జరగాల్సిన వ్యవహారాన్ని ఖరారు చేశారు. పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు సభలో ఎలా ముగింపు పలకాలో నిర్దేశించటమే కాకుండా.. అది పూర్తయిన తర్వాత సీమాంధ్ర నేతలను సంతృప్తి పరచటానికి రెండో అంకంగా విభజన బిల్లును తిప్పిపంపాలన్న సీఎం ఇచ్చిన నోటీసును పరిగణనలోకి తీసుకునే విధంగా వ్యూహం రూపొందించారు.
ఆ మేరకు మూజువాణి ఓటుతో ఆమోదం పొందే విషయంలో అంతా ఓకే అన్నారు. శాసనసభ వాయిదా పడిన అనంతరం విభజన బిల్లు అభిప్రాయాలు మాత్రమే రాష్ట్రపతికి వెళతాయని, విభజనకు వ్యతిరేకంగా సభ ఆమోదించిన తీర్మానం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతుందనే విషయాన్ని శాసనసభ వర్గాల ద్వారా వెల్లడించాలని సూచించారు. అదే సమయంలో సభలో గొడవలు, గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు ఏం చేయాలనే అంశంపై ఇరు ప్రాంతాల నేతలకు దిశానిర్దేశం చేశారు. దిగ్విజయ్‌సింగ్ సూచనల మేరకు గురువారం ఉదయం తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు విడివిడిగా సమావేశమయ్యారు.
టీ-సభ్యులతో మంతనాలు...
తొలుత తెలంగాణ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి చాంబర్లో సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. స్పీకర్‌కు ఇబ్బంది కలగకుండా, ఘర్షణ చోటు చేసుకోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చారు. బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించే సమయంలోనూ అడ్డుకోవద్దని, అదే సమయంలో తెలంగాణ ఎమ్మెల్యేలెవరూ దాడులకు పాల్పడకుండా నియంత్రించాలనే భావనకు వచ్చిన నేతలు ఇతర పార్టీల నేతలకూ రమ్మని సమాచారం పంపారు.
ఈ నేపథ్యంలో ఎంఐఎం, సీపీఎం మినహా తెలంగాణకు అనుకూలమైన అన్ని పార్టీల తెలంగాణ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమయ్యారు. అసెంబ్లీలో విభజన బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసే అవకాశాలున్నాయని అప్పటికే సమాచారం రావటంతో కొందరు నేతలు సభ జరగనీయకుండా అడ్డుకుందామని ప్రతిపాదించా రు. కొందరు యువనేతలైతే అవసరమైతే దాడులకూ వెనుకాడొద్దని ఆగ్రహంతో ఊగిపోయారు.
ఆ సమయంలో జానారెడ్డి జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. విభజన విషయంలో అసెంబ్లీ అభిప్రాయాలతో సంబంధం లేకుండా కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉందని చెప్పారు. ఫిబ్రవరిలోనే పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందటం, తెలంగాణ ఏర్పడటం ఖాయమన్నారు. ఈ సమయంలో అసెంబ్లీలో ఘర్షణ వాతావరణం సృష్టించి, దాడులకు పాల్పడితే అభాసుపాలవుతామని పేర్కొన్నారు. దీనిని సాకుగా చూపి విభజన ప్రక్రియను అడ్డుకునే ప్రమాదమూ లేకపోలేదన్నారు. హైకమాండ్ విభజనకు దృఢ నిశ్చయంతో ఉన్నందున సంయమనం పాటిద్దామని సూచించారు. ఓటింగ్‌కు ప్రతిపాదిస్తే అడ్డుకుందామని ప్రతిపాదించటంతో అందరూ సానుకూలత వ్యక్తం చేశారు.
సీమాంధ్ర సభ్యుల వ్యూహరచన...
సీమాంధ్ర మంత్రులంతా గురువారం ఉదయం తొలుత రఘువీరారెడ్డి చాంబర్‌లో సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించారు. అనంతరం సీమాంధ్రలోని ఇతర పార్టీల ఎమ్మెల్యేలకూ రమ్మని సమాచారం పంపారు. సీమాంధ్రలోని అన్ని పార్టీలకు చెందిన సుమారు 130 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. విభజన బిల్లును వ్యతిరేకిస్తూ సీఎం ప్రతిపాదించిన తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించేందుకు అంతా సిద్ధమైందని చెప్పారు. ఈ ప్రక్రియ సాఫీగా సాగేలా చూడటంతో పాటు ఈ తతంగాన్ని స్పీకర్ ముగించే వరకు ఆయనకు రక్షణగా నిలవాలని సూచించారు.
అందుకోసం ఆయన సభలో మహిళలు ముందు వరుసలో ఉండాలని, ఆ తరువాత రెండు వరుసల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో మూడంచెల రక్షణ గోడగా నిలబడాలని పేర్కొన్నారు. తద్వారా తెలంగాణ నేతలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లకుండా అడ్డుకోవాలని సూచించారు. ఆయా పార్టీల నేతలూ అందుకు అంగీకరించటంతో సభ ప్రారంభమైన వెంటనే అదే వ్యూహాన్ని అమలు చేశారు. అసెంబ్లీ వాయిదా పడిన తరువాత ముఖ్యమంత్రి కిరణ్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సహా ముఖ్య నేతలందరితో ఫోన్లో మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చను ముగించి పంపిస్తున్నామని ఆయన వారితో పేర్కొన్నట్లు చెప్తున్నారు. తాము రూపొందించిన వ్యూహం అనుకున్నది అనుకున్నట్లుగానే అమలు కావటంతో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిసింది.