సాక్షి, అమరావతి, న్యూఢిల్లీ : జై సమైక్యాంధ్ర పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకున్న పరిణామాలు రాష్ట్రానికి చెందిన ఆ పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామరూపాల్లేకుండా చేయడంలో తన వంతు దోహదం చేసిన కిరణ్‌ను తిరిగి చేర్పించుకోవడం వల్ల పార్టీకి ఒరిగేదేమీ ఉండదని చెబుతున్నారు. గడిచిన ఎన్నికల్లో పార్టీ నామరూపాల్లేకుండా పోయినప్పటికీ పార్టీలోనే కొనసాగుతున్న పలువురు సీనియర్లకు అధిష్టానం చర్య మింగుడుపడటం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతారని గతంలో వార్తలొచ్చాయి. ఆ తరుణంలోనే కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరిపోయారు. సోదరుడు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో కిరణ్ చేరిక కూడా ఖాయమైందని అధికార పార్టీ నేతలు భావించారు. అయితే ఏడాది కాలంగా తెర వెనుక ఏం జరిగిందో కానీ, ఉన్నట్టుండి ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరడం ఇరు పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ లేదని ఆ పార్టీ నేతలంతా అంగీకరిస్తున్నారు. ఎందుకంటే గతంలో పదవులిచ్చిన కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ పేరుతో 2014 ఎన్నికల బరిలో దిగినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ దారుణ ఓటమిని చవిచూసింది. అసెంబ్లీ, లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో నోటాకు లభించినన్ని ఓట్లు కూడా ఆ పార్టీకి లభించలేదు. దాంతో తన సత్తా ఏమిటో గ్రహించిన కిరణ్ గడిచిన నాలుగేళ్లుగా ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చీఫ్ విప్‌గా, స్పీకర్‌గా, ముఖ్యమంత్రిగా పదవులు కట్టబెట్టినప్పటికీ రాష్ట్ర విభజన సమయంలో ఆ పార్టీని తిట్టనితిట్టు తిట్టకుండా దూషించి మరీ కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. రాష్ట్రానికి కాంగ్రెస్ ద్రోహం చేసిందని పార్టీపైనా నేతలపైనా నిప్పులు చెరిగారు. అన్ని పదవులు అనుభవించి ఆ తర్వాత పార్టీనే దూషించిన కిరణ్‌కు రాజకీయంగా ఆయన బలమేంటో కూడా గడిచిన ఎన్నికల్లోనే తేలిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కనీసం చిత్తూరు జిల్లాలోని ఆయన సొంత నియోజకవర్గంలో కూడా అదనపు ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. రాజకీయంగా తెరమరుగై ఇంట్లో కూర్చున్న కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికెళ్లి మరీ రమ్మంటూ పార్టీలో చేర్పించుకోవడం అర్థం లేని చర్యగా ఆయన పేర్కొన్నారు.
అధికార తెలుగుదేశం పార్టీలో సోదరుడిని చేర్పించి ఆయన కూడా చేరుతారని ప్రచారం జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేర్చుకోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా, ఆ సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు సభలో కాంగ్రెస్‌కు అండగా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా కాపాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2014 లో ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన చంద్రబాబు గడిచిన నాలుగేళ్లలో ఏ ఒక్కసారి కూడా కిరణ్ ప్రభుత్వ పనితీరును గానీ కిరణ్‌పైన గానీ విమర్శలు చేయలేదు. కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య ప్రభుత్వాలపై విమర్శలు చేయకుండా చంద్రబాబు నిత్యం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం అందరికీ తెలిసిందే.
రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు మరింత దయనీయంగా తయారైందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో బలం లేని నాయకుడిని చేర్చుకోవడమంటే మరెవరి ప్రయోజనాల కోసమో పనిచేస్తున్నామన్న అనుమానాలు తలెత్తుతున్నాయని ఏపీసీసీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. విడదీయడం ద్వారా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, అందువల్ల శాసనసభకు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని 2014లో రాజీనామాకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ వల్లే సాధ్యమని ఇప్పుడంటున్నారు. విభజన చట్టంలోని హామీలు నెరవేరకపోగా గడిచిన నాలుగేళ్లుగా మౌనముద్ర దాల్చి ఇప్పుడు అది కూడా అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటున్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో యువతీ యువకులు రోడ్ల మీద కొచ్చి నినదించినప్పుడు సైలెంట్‌గా ఉన్న కిరణ్ ఎన్నికల ఏడాదిలో తిరిగి కాంగ్రెస్‌లో చేరడం వంటి పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని ఆ నాయకుడు విశ్లేషించారు.
రోశయ్య రాజీనామా అనంతరం 2010 నవంబర్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన నెల రోజులకు ఆయన జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన జై సమైక్యాంధ్ర పార్టీకి కనీసం నోటాకు పడినన్ని ఓట్లు కూడా పడలేదు. ఆ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ చాలా దారుణ ఓటమిని చవి చూసింది. దాంతో ఆ ఫలితాల రోజు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ తెర మీదకు రాలేదు. గడిచిన నాలుగేళ్లుగా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే, మధ్యలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్న వార్తలొచ్చాయి. వారి మధ్య కొందరు నేతలు మధ్యవర్తిత్వం జరిపినట్టు కూడా వార్తలొచ్చాయి. ఆ వార్తలను ఇరు పక్షాలు తోసిపుచ్చలేదు. ఆ తర్వాత పరిణామాల్లోనే కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. దాంతో టీడీపీతో సంబంధాలు నెరుపుతున్న విషయం రూఢీ అయింది.
ఈ నాలుగేళ్ల రాజకీయ పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీపై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఏర్పడిందన్న విషయం అనేక సందర్భాల్లో బయటపడింది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రజల అంచనాల మేరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమాత్రం పని చేయకపోవడం, అవినీతి పెరిగిపోవడం, అద్భుత రాజధాని నిర్మిస్తామని గ్రాఫిక్స్‌తో మాయా చేస్తూ చూపించిన పంచ రంగుల ప్రపంచం ఉత్తుత్తిదే అని తేలిపోవడం, అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగకపోవడం వంటి అనేక అంశాల్లో టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు తీవ్రమయ్యాయి. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా సాధన విషయంలో మాట మార్చిన విధానం చంద్రబాబుపై సొంత పార్టీలోనే నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడటం వంటి అనేక పరిణామాలు జరిగాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని భావించిన కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం వెనుక అంతర్గత ఉభయ ప్రయోజనాలు ఉన్నాయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment