
జోగిపేట(అందోల్): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయని, ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జోగిపేటలోని డాకూరు శివారులో సీఎం సభా వేదిక ఏర్పాట్లకు సంబంధించి స్థల పరిశీలన చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈనెల 28న జోగిపేటలో జరిగే సీఎం బహిరంగసభకు అందోలు నియోజకవర్గ ప్రజలంతా స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సింగూరు ప్రాజెక్టు నుంచి మూడు పంటలకు నీరందించగలిగామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సంవత్సరాలు అధికారంలో ఉన్నా సేద్యానికి నీరందించలేదని గుర్తు చేశారు.
అందోలు నియోజకవర్గంలో నిశ్శిబ్ద విప్లవం రాబోతోందని, ఇప్పటి వరకు నిర్వహించిన సభలన్నీ విజయవంతం అయ్యాయన్నారు. అందోలులో క్రాంతికిరణ్ విజయం తథ్యమన్నారు. ఉమ్మడి జిల్లాలో పది స్థానాలు గెలుపొందడం ఖాయమన్నారు. డిప్యూటీ సీఎం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినా రైతులు ఎరువు బస్తాలు, విత్తనాల కోసం గంటల తరబడి రోడ్డు మీద బారులు తీరి నిలబడాల్సి వచ్చిందని హరీశ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్‌కిట్, రైతు బీమా పథకాలన్నీ రద్దవుతాయన్నారు. మహిళా గ్రూపులకు రూ.1,650 కోట్లు వడ్డీ లేని రుణాలు అందజేశామన్నారు. రైతులు పండించిన పంటలను మహిళలే కొనేలా ప్రభుత్వం ప్రోత్సహించిందన్నారు.
హెలిపాడ్ కోసం స్థలం ఎంపిక చేసి నాయకులతో పాటు డీఎస్పీ శ్రీధర్‌రెడ్డికి సూచనలు చేశారు. ఆయన వెంట జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, డీసీసీబీ మాజీ ఉపాధ్యాక్షుడు పి.జైపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ నాగభూషణం, మాజీ చైర్మన్ పి.నారాయణ, రాష్ట్ర తెలంగాణ జాగృతి కార్యదర్శి భిక్షపతి, పట్టణ అధ్యక్షుడు సీహెచ్ వెంకటేశం, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు లింగాగౌడ్, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ వర్కల అశోక్, జిల్లా నాయకులు ముద్దాయిపేట విజయ్‌కుమార్, ఆత్మగౌరవ కమిటీ చైర్మన్ డి. వీరభద్రారావు, నాయకులు రవీంద్రగౌడ్, ఖాజాపాష, తెలంగాణ జాగృతి నాయకులు ఫైజల్ అహ్మద్, నాగరాజు తదితరులు ఉన్నారు.
ఖేడ్‌లో సభా స్థలి పరిశీలన
నారాయణఖేడ్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఈనెల 28న నారాయణఖేడ్‌కు రానున్న నేపథ్యంలో సభావేదిక స్థలాన్ని మంత్రి టి.హరీశ్‌రావు శుక్రవారం పరిశీలించారు. ఎంపీ బీబీ పాటిల్, ఖేడ్, అందోల్ టీఆర్‌ఎస్ అభ్యర్థులు భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్‌తో కలిసి పట్టణంలోని రహమాన్ గార్డెన్ ఫంక్షన్‌హాల్ ఆవరణలో సభావేదికకోసం స్థలాన్ని పరిశీలించారు. గత ఉప ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సభావేదిక స్థలంలోనే ఈమారు కూడా ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేశారు. హెలిప్యాడ్, సభావేదిక ఏర్పాట్లపై నాయకులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment