ఎన్నికల ప్రచారానికి మిగిలింది 2 రోజులే..
ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. నేడు, రేపటితో ప్రచారానికి తెరపడనుంది. గెలుపు ఓటములకు ఈ రెండు రోజు లు కీలకం కానున్నాయి. ఈ సమయంలో అభ్యర్థులు చురుకుగా ఓటర్లను కలుస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలను చుట్టేశారు. ఈ కొద్ది సమయంలో ముఖ్యమైన సంఘాల నాయకులను కలుస్తూ.. వారికి హామీలను గుప్పిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్లతో రోడ్‌షోలను ఏర్పాటు చేయాలని అభ్యర్థులు భావిస్తున్నారు. నిమిషం కూడా వృథా చేయకుండా అభ్యర్థులు షెడ్యూల్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు.
సాక్షి, మెదక్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బుధవారంతో తెరపడనుంది. కీలక ప్రచారానికి ఇంకా రెండురోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈనెల 5వ తేదీ సాయంత్రం 5గంటలతో ప్రచార గడువు ముగియనుంది. ఈరెండు రోజులు ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా ఓటర్లను కలిసేలా ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. పట్టణాలు, పల్లెల్లో ఇంటింటి ప్రచారాలు, సభలు నిర్వహించిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పుడు రోడ్‌షోలపై దృష్టి పెట్టారు. ఈనెల 7వ తేదీ శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల తేదీ సమీపిస్తున్నందున అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
మెదక్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రచారంలో అందరికంటేముందున్నారు. దాదాపుగా నియోకజవర్గం అంతటా ఇప్పటికే ఇంటింటి ప్రచారం పూర్తి చేశారు. రెండో విడతలో మిగిలిపోయిన గ్రామాల్లో ఈ రెండు రోజులు ప్రచారం చేసేలా షెడ్యూల్‌ను సిద్ధం చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్‌లో ప్రచారసభలో పాల్గొన్నారు. మంత్రి హరీశ్‌రావు ఇది వరకే టీఆర్‌ఎస్ ప్రచారంలో పాల్గొన్నారు. కాగా మంగళ, బుధవారాల్లో మెదక్‌లో మంత్రి హరీశ్‌రావు రోడ్‌షో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. ముఖ్యంగా యువకులు, మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పద్మాదేవేందర్‌రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో సైతం ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది. మదన్‌రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. నర్సాపూర్ నియోకజవర్గంలో కూడా సీఎం కేసీఆర్ బహిరంగసభ ముగిసింది. మంత్రి హరీశ్‌రావు ఈ నియోకజవర్గంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. నర్సాపూర్‌లో టీఆర్‌ఎస్ విజయం కోసం మంత్రి హరీశ్‌రావు పావులు కదుపుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి పార్టీ ముఖ్యనాయకులతో కలిసి ప్రచారం సాగిస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందితే నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు హామీలు ఇస్తున్నారు. కుల సంఘాల పెద్దలను కలిసి మద్దతు కోరుతున్నారు.
కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం
మెదక్, నర్సాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉపేందర్‌రెడ్డి, సునీతారెడ్డిలు అలుపెరగకుండా ప్రచారం చేస్తున్నారు. అన్నివర్గాల ప్రజలను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రచారానికి ఇంకా రెండురోజులు మిగిలి ఉండటంతో రోడ్‌షోలపై ఫోకస్ పెట్టారు. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతారెడ్డి నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. సునీతారెడ్డి మలివిడత ప్రచారం దాదాపుగా పూర్తి కావొచ్చింది. రాబోయే రెండురోజుల్లో మిగిలి గ్రామాల్లో ప్రచారంపై దృష్టి సారించారు. సునీతారెడ్డి ప్రత్యక్షంగా ఓటర్లను కలుస్తూ వారి మద్దతు కోరుతున్నారు.
తాను గెలిస్తే చేపట్టబోయే పనుల గురించి ఓటర్లకు వివరిస్తున్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే వైఫల్యాలను ఓటర్లకు వివరించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రచారానికి ఇంకా రెండురోజులు ఉండటంతో అన్నివర్గాల ప్రజల మద్దతు కూడగట్టేలా పావులు కదుపుతున్నారు. మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉపేందర్‌రెడ్డి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అర్ధరాత్రి వరకు ఓటర్లను ప్రభావితం చేసే ముఖ్య వ్యక్తులను కలిసి మద్దతు కూడగడుతున్నారు.
పాపన్నపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, నిజాంపేట మండలాల్లో ఉపేందర్‌రెడ్డి ప్రచారం పూర్తి కావచ్చింది. మెదక్ మండలం, పట్టణంలో మరోమారు ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. విజయం కోసం ఉపేందర్‌రెడ్డి సర్వశక్తులు ఓడ్డుతున్నారు. కాగా కాంగ్రెస్ నుంచి స్టార్ క్యాంపెయినర్లు ఎవరు ప్రచారానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
తనదైన శైలిలో ‘ఆకుల’ ప్రచారం
ఊహించని రీతిలో మెదక్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల రాజయ్య ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి రోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది వరకే నియోజకవర్గంలో మొదటి విడత ప్రచారం పూర్తి చేసిన ఆయన రెండో విడత ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ రెండు రోజులు మెదక్ మున్సిపాలిటీ, మెదక్ మండలం, పాపన్నపేట మండలాల్లో చివర విడతగా ప్రచారం చేయనున్నారు.
ప్రచారంలో భాగంగా చివరి రోజున స్టార్ క్యాంపెయినర్‌ను తీసుకువచ్చేందుకు ఆకుల రాజయ్య సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రచారంలో భాగంగా ఆలకు రాజయ్య బీసీ ఓటర్లు, మహిళా, యువత ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నర్సాపూర్ నియోకజవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపీ సైతం ప్రచారం ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే ఇతర పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగానే ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రధాన పార్టీలకు ధీటుగా వీరి ప్రచారం సాగడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment