ప్రతిపక్ష అభ్యర్థులకు మన ముచ్చట్లు ఎలా తెలుస్తున్నయంటవ్?
ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థులు వారి నీడను కూడా నమ్మడం లేదు. రాత్రి మాట్లాడుకున్నది పొద్దున్నే బయటకు వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. పలువురు నేతలు కోవర్టులుగా మారి కొంప ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలస నాయకులే సమాచారాన్ని చేరవేస్తున్నారని అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఎవరికి ఏ విషయం చెప్పాలో తెలియక అయోమయంలో పడుతున్నారు. డబ్బు, మద్యంలాంటి ముఖ్యమైన విషయాలు అత్యంత సన్నిహితులు, పాత కార్యకర్తలతోనే పంచుకుంటున్నారు. అనుమానం వచ్చిన వారిని వెంటనే పక్కన పెడుతున్నారు. ఈ నాలుగు రోజులు ఇంకా ఎన్ని తిప్పలు పడాలో..
సాక్షి, మెదక్: ప్రధాన రాజకీయ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులను కోవర్టుల గుబులు వెంటాడుతోంది. తమ వెన్నంటే ఉంటూ ఎన్నికల ఎత్తుగడలను డబ్బుల కోసం ఎదుటి పార్టీలకు చేరవేస్తున్న కోవర్టులను ఎలా ఎదుర్కొవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఎన్నికల వ్యూహాలను చేరవేస్తున్న కోవర్టులను పసిగట్టి వారి పనిబట్టే పనిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఎన్నికలకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రత్యర్థులకు ధీటుగా అనుసరించే వ్యూహాలు, ఎత్తుగడలు విజయాన్ని కట్టబెడతాయి.
దీంతో మెదక్, నర్సాపూర్ నియోకజవర్గాల్లోని ప్రధాన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపు కోసం ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత్యర్థులకు అందనిరీతిలో పావులు కదుపుతున్నారు. అయితే ఈ ప్లాన్‌లు ఎదుటి పార్టీ అభ్యర్థులకు తెలుస్తుండటంతో ఏమి చేయాలో తెలియక అయోమయంలో పడుతున్నారు. తమ వెన్నంటి ఉన్న కార్యకర్తలు(కోవర్టు) రహాస్యంగా సమాచారాన్ని లీక్‌చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
ఆపరేషన్ ఆకర్‡్షలో భాగంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు పరస్పరం ఎదుటి పార్టీలోని అసంతృప్త నేతలకు గాలం వేసి తమ పార్టీలోకి చేర్చుకున్నారు. ఇలా వలస వచ్చిన ముఖ్య నేతలే కోవర్టులుగా మారి సొంత పార్టీకి చేరవేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థులు డబ్బులు పంపిణీ, ఎత్తుగడల విషయంలో గోప్యతను పాటిస్తున్నారు. డుబ్బులు ఎక్కడి నుంచి వచ్చేది ఎక్కడికి చేరవేస్తున్నది అన్న సమాచారం అతి కొంతమందితోనే పంచుకుంటున్నారు.
అలాగే నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసే కుల పెద్దలు, ఇతర ముఖ్యులను ఎమ్మెల్యే అభ్యర్థులు రాత్రివేళల్లో రహస్యంగా కలుస్తూ వారి మద్దతు కూడగడుతున్నారు. అలాగే ఎన్నికల్లో గెలుపుకోసం ప్రత్యర్థులకు ఎదురుదెబ్బకొట్టేలా వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారు. తమ వ్యూహాలను రహాస్యంగా ఎదుటిపార్టీలకు చేరవేస్తున్న కోవర్టులను పసిగట్టి అనుమానం వచ్చిన వారిని దూరంగా పెడుతున్నారు. ఫోన్ సంభాషణల విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
మెదక్ నియోజకవర్గంలో..
మెదక్ నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీ ఎమ్మె ల్యే అభ్యర్థికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ప్రత్యర్థి పార్టీకి తెలుస్తుండటంతో ఆ పార్టీ నాయకులు ఖంగుతిన్నారు. ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఎప్పుడు ఎవరిని కలుస్తున్నారనే సమాచారాన్ని వెంట ఉన్న ఓ నాయకుడు ఎదుటిపార్టీ నేతలతో పంచుకుంటున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆ నేతను దూరంగా పెట్టారు. నర్సాపూర్ నియోజకవర్గంలో సైతం ఇదే పరిస్థితి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు పోటాపోటీగా వలసలను ప్రోత్సహించాయి. ఇరు పార్టీలో ఇలా చేరిన ముఖ్యనాయకుల్లో కొంత మంది కోవర్టులుగా మారినట్లు గుర్తించారు. దీంతో కోవర్టుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment