భర్తతో గొడవపడి ఇంట్లోంచి పదకొండేళ్ల కొడుకుతో వెళ్లిన ఓ మహిళ కనిపించకుండాపోయారు.
కీసర: భర్తతో గొడవపడి ఇంట్లోంచి పదకొండేళ్ల కొడుకుతో వెళ్లిన ఓ మహిళ కనిపించకుండాపోయారు. సీఐ గురువారెడ్డి కథనం ప్రకారం.. కీసర మండల కేంద్రానికి చెందిన చాకలి పోచయ్య, పద్మ(30) దంపతులు తమ కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు శివరాం(11) ఉన్నాడు. ఇదిలా ఉండగా, గత ఆదివారం కుటుంబ కలహాల నేపథ్యంలో పోచయ్య, పద్మ దంపతులు గొడవపడ్డారు.
దీంతో మనోవేదనకు గురైన పద్మ తన కొడుకు శివరాంను తీసుకొని ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆమె కోసం కుటుంబసభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో శనివారం సాయంత్రం పోచయ్య కీసర ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు మిస్సింగ్ కేసుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి తెలిపారు.