మంత్రి హరీశ్ ఆదేశాల మేరకు బాధితులకు డబుల్ బెడ్ రూం ఇంటిని అప్పగిస్తున్న తహసీల్దార్ విజయ్
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): కష్టాల్లో ఉన్న పేద కుటుంబానికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అండగా నిలిచారు. ‘శ్మశానమే ఆవాసం’శీర్షికతో శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి చలించిన మంత్రి వెంటనే స్పందించారు. సిద్దిపేటలో కరోనా కారణంగా ఇంటి పెద్ద శ్రీనివాస్ (51)ను కోల్పోయి అద్దె ఇంటి యజమాని వెళ్లగొట్టడంతో గూడు లేక శ్మశాన వాటికలో నివాసం ఉంటున్న పేద కుటుంబానికి బాసటగా నిలిచారు. మృతుడి భార్య సుజాత, కుమారుడు రుషిత్ (16), కూతురు దక్షిత (13) వద్దకు అర్బన్ తహసీల్దార్ విజయ్, కౌన్సిలర్ దీప్తి నాగరాజులను పంపించారు.
ఫోన్‌లో బాధితులతో మాట్లాడి అధైర్యపడొద్దని.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాధితుల వివరాలను తెలుసుకుని శాశ్వత నివాసం కోసం నర్సాపూర్ శివారులోని డబుల్ బెడ్‌రూం ఇళ్లలో ఒక ఇంటిని తక్షణ సాయం కింద కేటాయించారు. మరోవైపు మంత్రి ఆదేశాల మేరకు తహసీల్దార్ విజయ్, బాధిత కుటుంబానికి శనివారం సాయం త్రం భోజన ఏర్పాట్లు చేసి నిత్యావసర సరుకులను అందించారు. అంతేకాక అవసరాలకోసం రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు.
అనంతరం తహసీల్దార్ విజయ్ బాధిత కుటుంబాన్ని డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్దకు తీసుకెళ్లారు. మంత్రి ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరాం ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూం ఇంటికి సంబంధించిన తాళాలను వారికి అప్పగించారు. తమకు భోజనం పెట్టి, ఆర్థిక సహాయం చేయడం తో పాటు నిలువ నీడ కోసం డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చి అండగా నిలిచిన మంత్రి హరీశ్‌రావుకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment