సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయని కాంగ్రెస్, టీడీపీలది ప్రజా కూటమి కాదని, దగాకూటమి అని మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు విఫలమయ్యాడని నిర్ధారించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు టీడీపీతో కలిసి పనిచేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చని కాంగ్రెస్ తీరుపై, చంద్రబాబుతో పొత్తుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు గురువారం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై ఆయన ఏమన్నారంటే... ‘కాంగ్రెస్, ప్రజా కూటమి మేనిఫెస్టోలు విడుదల చేశాయి. 2004లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన మెజారిటీ హామీలను అమలు చేయలేదు. 2009లో మేనిఫెస్టోలో పెట్టిన తొమ్మిది అంశాలలో ఏ ఒక్కదాన్నీ అమలు చేయలేదు. అలాగే 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికీ నెరవేర్చలేదు. మేనిఫెస్టోలు అమలు చేయని కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటై మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నాయి. ఓట్లు అడిగే ముందు అప్పటి మేనిఫెస్టోలోని హామీలను ఎందుకు నెరవేర్చలేదో ప్రజలకు వివరించాలి. చెంపలు వేసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఏపీలో చంద్రబాబు చెల్లని రూపాయి అని అక్కడి కాంగ్రెస్ పార్టీ చార్జిషీట్ వేసింది. అక్కడ పనికిరాని చంద్రబాబు తెలంగాణలో ఎలా పనికొస్తారో రాహుల్‌గాంధీ చెప్పాలి. అన్నిరకాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మరిచిపోయిన చంద్రబాబును పక్కన పెట్టుకుని రాహుల్ ఇక్కడ రుణమాఫీ అంటే ఎవరు నమ్ముతారు? చంద్రబాబు 600 హామీలు ఇస్తే వాటిలో పది శాతం కూడా అమలు చేయలేదు.
హైదరాబాద్‌లో ప్రచారం చేస్తున్న చంద్రబాబు ఏపీలో ఇచ్చిన హామీల వైఫల్యంపై సమాధానం చెప్పాలి. చంద్రబాబుకు విశ్వసనీయత లేదు. కాంగ్రెస్ అంటే ప్రజల్లో విశ్వాసం లేదు. తెలంగాణ చైతన్యం ఉన్న ప్రాంతం. ఇలాంటి మోసాలను సహించదు. తెలంగాణ ప్రజల్లో విశ్వసనీయత ఉన్న నాయకుడు కేసీఆర్. చావు నోట్లోకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీఆర్. తెలంగాణ ప్రజలు దగా కూటమిని తిరస్కరిస్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్ మాట తప్పదు, మడమ తిప్పదు. ఒకటిరెండు తప్ప అన్ని హామీలను అమలు చేసిన టీఆర్‌ఎస్‌ను ప్రజలు విశ్వసిస్తారు.
తప్పుడు మాటలను సవరించుకోవాలి
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మాట్లా డారు. ప్రాణహిత– చేవెళ్లపై అబద్ధాలు చెబుతున్నారు. తప్పుడు మాటలను ఇప్పటికైనా సవరించుకోవాలి. ప్రాణహిత–చేవెళ్ల చేపట్టినప్పు డు ఆయకట్టు 16 లక్షల ఎకరాలు, నిల్వ సామ ర్థ్యం 11 టీఎంసీలు. ఇప్పుడు ఆయకట్టు 37 లక్షల ఎకరాలు, నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు. డీజిల్, సిమెంట్, అన్ని నిర్మాణ ఖర్చులు పెరిగాయి. అందుకే అంచనా వ్యయం పెరిగింది. అసలు పనులేమీ చేయకుండానే అంచనాలు పెంచింది కాంగ్రెస్ వాళ్లే. 2007లో ప్రాజెక్టు నిర్మాణం కోసం ఉత్తర్వులు ఇచ్చినప్పుడు రూ.17,875 కోట్లు ఉన్న అంచనా వ్యయం 2010లోనే రూ.40 వేల కోట్లకు చేరింది. అప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు డబ్బు మెక్కా రా? కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు, పాలమూరు ప్రాజెక్టు వద్దని ఏపీ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేశారు. మీరు ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులు కడతామంటే ప్రజలు ఎలా నమ్ముతారు?
గద్దర్ పరిస్థితి దారుణం...
ప్రజాగాయకుడిగా, ఉద్యమ నేతగా గద్దర్‌పై మనందరికీ గౌరవం ఉంది. కడుపులో బుల్లెట్ ఉందని ఎప్పుడూ చెబుతుంటారు. ఆ బుల్లెట్‌ను దించిన చంద్రబాబు కడుపులో గద్దర్ తలపెట్టడం చూస్తే బాధనిపించింది. గద్దర్ ఆ స్థాయి, గౌరవం కోల్పోయారు. దీన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోదు. ఈ ఘటనతో తనపై ఉన్న గౌరవాన్ని గద్దర్ పోగొట్టుకున్నారు.
సాగరహారం ఫొటో వేస్తారా?
తెలంగాణ ఉద్యమాన్ని లాఠీచార్జీలు, బుల్లెట్లతో అణచివేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో పుస్తకంలో సాగరహారం ఫొటో వేసుకుంది. ఆ ఫొటోలో టీఆర్‌ఎస్ జెండాలు కనిపిస్తాయని బ్లాక్ అండ్ వైట్‌లో వేశారు. మిలియన్ మార్చ్, సాగరహారం కార్యక్రమాలకు కాంగ్రెస్ అనుమతి ఇవ్వకుంటే టీఆర్‌ఎస్ పోరాడింది. దీంట్లో పాల్గొన్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఉద్యమకారుడు గుడి రాజిరెడ్డి గాయపడి చనిపోయారు. ఆ ఫొటో వేసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
నవంబర్ 29.. దీక్ష దివస్
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మలుపు తిప్పిన దినం నవంబర్ 29. తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షను ప్రారంభించిన ఈ రోజును ప్రజలు చిరస్థ్ధాయిగా గుర్తు పెట్టుకుంటారు. దీక్ష దివస్‌గా జరుపుకుంటారు. అమరవీరులకు నా నివాళులు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ఉద్యమంతో అప్పటి పరిస్థితులలో ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ ఇచ్చేదే.
అది చారిత్రక సిగ్గుచేటు...
గోదావరి జలాలపై ఏపీ సీఎం చంద్రబాబు చిలుకపలుకులు పలుకుతున్నారు. రెండు రాష్ట్రాలు గోదావరి జలాలను వినియోగించుకోవాలని చెబుతున్నానని ఖమ్మం సభలో అన్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఎందుకు లేఖలు రాశారు. మార్చి 2017లో కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు లేఖ రాయలేదంటే నేను ముక్కు నేలకు రాస్తా. ఈ సవాలుకు చంద్రబాబు సిద్ధమేనా? ఏపీలో హామీలను అమలు చేయని చంద్రబాబును ఓడించాలని అక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలు కలిసి ఖమ్మంలో నిర్వహించిన సభ చారిత్రకమని చంద్రబాబు అనడం సిగ్గుచేటు. అదొక చారిత్రక వైఫల్యం. చంద్రబాబు అవసరం కోసం ఏ ఎండకు ఆ గొడుగు పడతారు. గుజరాత్ అల్లర్లప్పుడు నరేంద్రమోదీని మతతత్వవాది అని, జైల్లో పెట్టాలని విమర్శించారు.
2014 ఎన్నికలప్పుడు మహబూబ్‌నగర్ సభలోనూ మోదీతో కలిసినప్పుడు చారిత్రక సభ అన్నారు. ఇప్పుడు రాహుల్‌గాంధీతో కలిసి అదే మాట చెబుతున్నారు. అది చారిత్రక సభ కాదు చారిత్రక సిగ్గుచేటు సభ. నీ అవసరం కోసం కలిసిన సభ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడలేదని చంద్రబాబు అనడం కన్నా పెద్ద జోక్ మరొకటి ఉండదు. చంద్రబాబుకు ఉన్నన్ని నాలుకలు, తలలు దేశంలోనే మరే రాజకీయ నాయకుడికి లేవు. కేసీఆర్‌కు రాజకీయ జన్మనిచ్చింది టీడీపీ అని బాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు రాజకీయ జన్మ ఇచ్చిన కాంగ్రెస్‌కు, పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. దేశం అవసరాల కోసం బాబు కాంగ్రెస్‌తో కలవలేదు.. ఆయన అవసరాల కోసమే కలిశారు. చంద్రబాబును మించిన వెన్నుపోటుదారు ఎవరూలేరు.
మైదానంలో దిగని బ్యాట్స్‌మన్ కోదండరాం...
టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మొదట పౌరహక్కుల నేత. అలాంటి వ్యక్తి.. హక్కులను కాలరాసిన, రైతులను కాల్చి చంపిన చంద్రబాబుతో కలిశారు. ఓట్ల కోసం ఇంత దిగజారుతారా? చంద్రబాబు హయాంలో జరిగినన్ని ఎంకౌంట ర్లు ఎప్పుడూ జరగలేదు. తెలంగాణవ్యా ప్తంగా ఎన్‌కౌంటర్‌ను ప్రవేశపెట్టిన చంద్రబాబుతో కోదండరాం కలవడం హక్కుల ఉద్యమకారులను కలచివేస్తోంది. మేధా వులు, విద్యావంతులు బాధపడుతున్నా రు. సీఎం కేసీఆర్ ఇంజూర్డ్(గాయాలైన) బ్యాట్స్‌మన్ అని కోదండరాం అన్నారు. ఎన్నికలో పోటీ చేయని కోదండరాం.. మై దానంలో దిగని బ్యాట్స్‌మన్. కేసీఆర్ ఇం జూర్డ్ బ్యాట్స్‌మన్ కాదు ఇరగదీసే బ్యాట్స్‌మన్. డిసెంబర్ 11న ఈ విషయం కోదండరాంకు తెలుస్తుంది. ఆ రోజు కేసీఆర్ విజయాల ఫోర్లు, సిక్స్‌లు కొడుతుంటే కోదండరాం చప్పట్లు కొట్టాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment