సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఏకాకిని చేయడం లక్ష్యంగా సాగుతున్న పరిణామాల్లో మరింత వేడి పెరిగింది. ఇప్పటికే ఈటల అనుకూల, ప్రతికూల వర్గాలుగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో కేడర్ చీలిపోయింది. ప్రతికూల వర్గం నేతలు తాము పార్టీ వెంటే ఉంటామని ప్రకటనలు చేస్తుండగా, అనుకూల నేతలు ఈటల రాజేందర్ వెంట నడుస్తామని తేల్చి చెబుతున్నారు. మంగళవారం నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గంలో మకాం వేయాలని ఈటల నిర్ణయించారు. దీంతో రాజకీయ విమర్శలు ఊపందుకోవడంతో పాటు, అనుకూల ప్రతికూల వర్గాల నడుమ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పార్టీ కేడర్‌పై పట్టు సాధించేందుకు అటు టీఆర్‌ఎస్, ఇటు ఈటల పావులు కదుపుతుండటంతో హుజూరాబాద్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.
కేడర్‌పై పట్టు కోసం కమిటీ
ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్ నియోజకవర్గ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి టీఆర్‌ఎస్ కేడర్‌పై పట్టు బిగిస్తున్నారు. దీంతో ఈటల, గంగుల పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటుండటంతో కరీంనగర్ జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి ఈటల రాజీనామా చేసినా కేడర్ చెక్కు చెదరకుండా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయిలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, కరీంనగర్ జిల్లా స్థాయిలో గంగుల కమలాకర్.. పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయనున్నారు. వీరితో పాటు క్షేత్ర స్థాయిలో మరో నలుగురు ముఖ్య నేతలకు కూడా హుజూరాబాద్ బాధ్యతలు అప్పగించారు.
క్షేత్ర స్థాయి కేడర్‌తో మంతనాలు..
హుజూరాబాద్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, మండలాలకు నలుగురు ముఖ్య నేతలను ఇన్‌చార్జిలుగా నియమించారు. హుజూరాబాద్‌లో కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, ఇల్లంతకుంట, జమ్మికుంట మండలాల్లో శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఇన్‌చార్జీలుగా పనిచేస్తారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు వీణవంక, కిమ్స్ రవీందర్‌రావుకు కమలాపూర్ మండల బాధ్యతలు అప్పగించారు. తమకు అప్పగించిన మండలాలు, మున్సిపాలిటీల్లో పార్టీ కేడర్‌తో పాటు, స్థానిక సంస్థల ప్రతినిధులు, సర్పంచ్‌లు పార్టీ వెంట నడిచేలా వీరు చూడాల్సి ఉంటుంది.
గంగుల, ఈటల నడుమ మాటల యుద్ధం
ఇటీవలి వరకు మంత్రివర్గంలో సహచరులుగా ఉన్న గంగుల కమలాకర్, ఈటల రాజేందర్ నడుమ మాటల యుద్ధం ముదురుతోంది. ఈటల హైదరాబాద్‌లో ఓసీ.. హుజూరాబాద్‌లో బీసీ అని విమర్శిస్తూ.. ఆయన భూ కబ్జాలు చేశారంటూ గంగుల ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ వ్యాపారంలో అక్రమాలపై గంగులను ఉద్దేశించి ఈటల మంగళవారం విమర్శలు గుప్పించారు. మరోవైపు ఒకరినొకరు తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు.
టీఆర్‌ఎస్ కేడర్ కట్టడికి కమిటీ.. రంగంలోకి మంత్రి హరీశ్ రావు
Published Wed, May 19 2021 4:05 AM | Last Updated on Wed, May 19 2021 5:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment