మంత్రి హరీశ్‌రావు రోడ్‌షోకు హాజరైన టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజలు
సాక్షి, కామారెడ్డి/గాంధారి: ‘కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక పోతుండే. మోటార్లు కాలడం, ట్రాన్స్‌ఫార్మర్లు పేలడంతో మరమ్మతులకు వేలకు వేలు ఖర్చయ్యేది. ఎరువులు, విత్తనాల కోసం గంటలు, రోజుల తరబడి లైన్ల నిలబడాల్సి వచ్చేది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా దొరికేది కాదు. అలాంటి కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే మనకు మళ్లీ కష్టాలు తప్పవు’ అని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఎల్లారెడ్డి అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డికి మద్దతుగా ఆయన శనివారం గాంధారి మండల కేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి గద్దెనెక్కాలన్న యావే తప్ప రైతుల కష్టాలు పట్టవని, ఇందుకు గత పరిపాలనే నిదర్శనమన్నారు. అధికార యావే తప్ప ప్రజల కోసమో, రాష్ట్రం కోసమే ఆలోచించిన పాపానపోరని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంటు, ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి, చెరువుల మరమ్మతులు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, కావలసినంత ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడం, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయడం వంటివి ఎన్నో చేపట్టిందన్నారు.
పదేండ్ల కాంగ్రెస్ పాలనను, నాలుగేండ్ల టీఆర్‌ఎస్ పాలనను బేరీజు వేసుకుని ఓట్లు వేయాలని హరీశ్ ఓటర్లను కోరారు. కాంగ్రెస్ వస్తే కరెంటు లేకుండా పోతుందని, విత్తనాల కోసం వరుసలు కట్టాల్సిందేనని పేర్కొన్నారు. 24 గంటల కరెంటు ఉండాలంటే టీఆర్‌ఎస్ రావాలని, దొంగరాత్రి కరెంటు రావాలంటే కూటమిని కోరుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటి వరకు 70–80 శాతం పనులు పూర్తయ్యాయని, ఏడాదిన్నర, రెండేళ్లలో పనులు పూర్తయి గాంధారికి, ఎల్లారెడ్డికి నీళ్లు వస్తాయన్నారు. కేసీఆర్‌ను దీవించండి, కాలేశ్వరం నీళ్లు తెచ్చి మీ రుణం తీర్చుకుంటానని హరీష్‌రావ్ పేర్కొన్నారు. కాళేశ్వరం నీళ్లొస్తే వలసలు పోయినోళ్లంతా ఊళ్లకు తిరిగి వస్తారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును ఆపడానికి చంద్రబాబు నాయుడు ఎన్నో కుట్రలు పన్నుతున్నాడని, ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు కాళేశ్వరాన్ని ఆపుతాడని హరీశ్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కాళ్లు అడ్డం పెడుతున్న చంద్రబాబును తెలంగాణ నుంచి తరిమి వేయాలన్నారు. ప్రాజెక్టులను అడ్డుకున్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ నేతలు అమరుల త్యాగాలను హేళన చేశారని ఆరోపించారు. డ్వాక్రా గ్రూపులను మరింత బలోపేతం చేస్తామని, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని తెలిపారు. అటవీ భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలిచ్చి వారికి రైతుబంధు అందిస్తామన్నారు. డిసెంబర్ 11 తరువాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టి మెనిఫెస్టోలో పెట్టిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పారు.
గాంధారిని దత్తత తీసుకుంటా..
తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి పోరాడిన రవీందర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే ఆయన హోదా పెరుగుతదని చెప్పిన మంత్రి హరీశ్‌రావు.. గాంధారి మండలాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. గాంధారిలో ప్రధాన రోడ్డు అభివృద్ధికి కావాలసిన నిధులు మంజూరు చేయించి అభివృద్ది చేస్తానన్నారు. కాలేవాడి, దర్మరావుపేట, మోతె, అమర్లబండ రిజర్వాయర్లను నిర్మిస్తామని, లింగంపేట వాగుపై చెక్‌డ్యాంలు, ముదెల్లి వాగుమీద చెక్‌డ్యాంలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పోచారం ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.160 కోట్లతో ప్రతిపాదనలు చేశామని, దాని బాధ్యత తీసుకుని పూర్తి చేస్తానన్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి, ఆయన సతీమణి మంజులారెడ్డి, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, నాయకులు తానాజీరావ్, సత్యంరావ్, ముకుంద్‌రావ్, సంపత్‌గౌడ్, బద్యానాయక్, ఆకుల ప్రకాశ్, రాజేశ్వర్‌రావ్, శివాజీరావు తదితరులు పాల్గొన్నారు.
కిష్టయ్య ఆత్మ క్షోభిస్తుంది
తెలంగాణ ద్రోహులకు ఓటు వేస్తే పోలీసు కిష్ట య్య ఆత్మ క్షోభిస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నా రు. జిల్లాకు చెందిన పోలీసు కిష్టయ్య ప్రత్యేక రాష్ట్రం కోసం ఇదే రోజు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన గుర్తు చేశా రు. పోలీసు కిష్టయ్య వర్ధంతి సందర్భంగా మంత్రి ఘనంగా నివాళులర్పించారు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డుకోవడం వల్లనే ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగా లు చేశారన్నారు. అమరవీరుల త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్రమని, కూటమికి ఓటు వేస్తే తెలంగాణ ద్రోహులకే ఓటు వేశారని అమరుల ఆత్మలు క్షోభిస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment