
పవిత్ర యజ్ఞంలా చెరువుల పునరుద్ధరణ
మిషన్ కాకతీయపై ‘సాక్షి’తో నీటి పారుదల మంత్రి హరీశ్
చెరువుల పునరుద్ధరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని పవిత్ర యజ్ఞంలా నిర్వహిస్తామని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. మిషన్ కాకతీయ ప్రాజెక్టు పై నీటిపారుదల మంత్రి హరీష్‌రావు ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని పవిత్ర యజ్ఞంలా నిర్వహిస్తామని నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గతంలో మాదిరిగా ఎలాంటి అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకోకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. ఈ పనులను పరిశీలించేందుకు ఇప్పటికే జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించినట్లు చెప్పారు. ఇకపై తాను కూడా ప్రతిరోజూ జిల్లాల్లో పర్యటించి పనులను పర్యవేక్షిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం (నేడు) మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లాలోని సదాశివనగర్ మండలంలో ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయ ప్రాజెక్టుపై నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. చెరువు పనుల పురోగతి, లక్ష్యాలను వివరించారు. కాకతీయుల కాలం నాటి వైభవం మళ్లీ చెరువులకు వచ్చేలా, గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ముందు కు సాగుతామని, దీనికి అందరి భాగస్వామ్యం కావాలని కోరారు. గత బడ్జెట్‌లో మిషన్ కాకతీయకు రూ. 2 వేల కోట్లు కేటాయించగా ఈసారి అదే స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేశామని, నాబార్డ్, ట్రిపుల్ ఆర్ నిధులు భారీగా వస్తాయని భావిస్తున్నామని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
పూర్తి ఆయకట్టు లక్ష్యంగా..
గోదావరి, కృష్ణా జలాలకు సంబంధించి రాష్ట్ర వాటా కింద 262 టీఎంసీల మేర కేటాయింపులు ఉన్నప్పటికీ వినియోగం మాత్రం 100 టీఎంసీలు దాటడం లేదు. దీంతో చిన్న నీటి వనరుల కింద ఉన్న ఆయకట్టు లక్ష్యం 25 లక్షల ఎకరాల్లో సగాన్ని కూడా అందుకోవడం లేదు. ఈ దృష్ట్యానే 46 వేల చెరువుల పునరుద్ధరణతో పూర్తి నీటి వినియోగం, ఆయకట్టు లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు వేసుకున్నాం. ఈ ఏడాది 9,573 చెరువులను పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకోగా 7,140 చెరువుల అంచనాలు పూర్తి చేశాం. 5,330 చెరువులు పరిపాలనా అనుమతులు పొందాయి. 2,210 చెరువులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది. అతి తక్కువ వ్యవధిలో ఇన్ని వేల చెరువులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం గతంలో ఎన్నడూ లేదు. దీంతో పాటే ఉపాధి కోసం వలస వెళ్లినప్రజలు సొంతూరుకు తిరిగి వచ్చేలా, అడుగంటిన భూగర్భ జలాలను కాపాడేలా, బోర్లు, బావుల కింద మరింత ఎక్కువ భూమిని సాగులోకి తెచ్చేలా మిషన్ కాకతీయతో సమగ్రాభివృద్ధిని సాధించేందుకు కృషి చేస్తాం.
గ్రామాల ఉమ్మడి ప్రయోజనాలే ముఖ్యం..
చాలా చెరువుల శిఖం భూములు కబ్జాకు గురైన విషయం తెలిసిందే. పట్టణాల్లో చెరువులదీ ఇదే పరిస్థితి. హుడా, జీహెచ్‌ఎంసీల్లోనూ ఇదే తంతు సాగింది. దీన్ని గుర్తించి రెవెన్యూ శాఖ సహకారాన్ని తీసుకున్నాం. శిఖం పట్టాదారులతో వచ్చే సమస్యలను అధిగమించేందుకు కలెక్టర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారికి తగు ఆదేశాలిచ్చాం. ఒక వ్యక్తి కంటే గ్రామాల ఉమ్మడి ప్రయోజనాలే మా ప్రభుత్వానికి ముఖ్యం. ఆ విధంగానే వ్యవహరిస్తూ కబ్జాదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలిచ్చాం.