గాలానికి చిక్కి బయటకు వచ్చిన ఓ మృతదేహం
చెరువులో గాలించగా మరో రెండు మృతదేహాలు లభ్యం
మేడ్చల్ జిల్లా కొల్తూర్‌లో విషాదంశామీర్‌పేట్: ఆటలో భాగంగా మట్టి గణపతిని చేసిన ముగ్గురు పిల్లలు.. ఆ ప్రతిమను నిమజ్జనం చేయడానికి ప్రయత్నిస్తూ చెరువులో పడి మృతి చెందారు. మేడ్చల్ జిల్లా కొల్తూర్‌లో శుక్రవారం ఈ విషాదకర ఘటన జరిగింది. చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తుల గాలానికి ఓ మృతదేహం చిక్కడంతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్న బాలేకర్ మణి హర్ష (14), సలేంద్రి హర్షవర్ధన్‌న్(13), ఈరబోయిన మనోజ్ (10) స్నేహితులు.
దసరా సెలవుల నేపథ్యంలో వీరు శుక్రవారం మట్టి గణపయ్యను చేసి పూజలు చేస్తూ ఆడుకున్నారు. నిమజ్జనం కోసం చెరువు వద్దకు తీసుకెళ్లారు. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయారు. చెరువు వద్ద కొందరు వ్యక్తులు చేపల కోసం నీటిలో గాలాలు వేశారు. ఓ వ్యక్తి గాలానికి ఏదో తగిలినట్లు అనిపించడంతో పైకి లాగగా.. మనోజ్ మృతదేహం కనిపించింది. దీంతో వారు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు.
గజ ఈతగాళ్లతో చెరువులో గాలించగా.. మిగతా ఇద్దరి మృతదేహాలు లభించాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జీనోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment